స్వేచ్ఛనిచ్చిన ప్రేమ!


Sun,September 2, 2018 01:27 AM

LIOVE
అంతులేని ఆనందంతో నా మనసు ఉప్పొంగిపోయింది. నా హృదయం ప్రేమతో కూడిన ఊపిరిలూదుతూ లవ్ లవ్ అని కొట్టుకున్నది. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అతణ్ని హగ్ చేసుకున్నాను. అతడు నాపై ప్రేమను కనబర్చాడు. అన్ని సంవత్సరాలు ఒకేచోట.. ఒకే రకమైన మనుషులతో కలిసి ఉండటం.. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటం వల్ల నాకు అతనితో ఏర్పడిన కొద్దిపాటి పరిచయం ఇష్టంగా మారింది.

నాన్న పరువు సమస్యగా భావించాడు. నేనెంత కష్టపడుతున్నానో తెలుసా మీకు? అసలేమనుకుంటున్నారు? ఎవరి పరువు తీయడానికి? అంటూ విరుచుకు డ్డాడు. దీంతో నాకు ఇంకాస్త కోపం పెరిగింది. ఎన్నడూ లేనిది.. ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను మాత్రం ఇలా ప్రపంచంతో సంబంధం లేకుండా బతకలేను. చావనైనా చస్తానుగానీ ఇక ఓపిక పట్టేది లేదు అని అరిచాను.

వారం రోజులైంది. పరువు కోసం నన్ను ఇంట్లోనే నిర్బంధంగా ఉంచాలో.. నా మనసును అర్థం చేసుకొని వదిలేయాలో అర్థంకాక అమ్మ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఆ మరుసటి రోజు తిరుకు ఫోన్ చేసి.. బాబూ.. నేను శశివాళ్ల అమ్మను మాట్లాడుతున్నాను. ఇక్కడ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. వచ్చి అమ్మాయిని తీసుకెళ్లు. మిగతా విషయాలు నేను చూసుకుంటా అన్నదట.

మాది హైదరాబాద్. పదో తరగతి వరకు మెహిదీపట్నంలో చదువుకున్నాను. తర్వాత చదువు ఆపేయమన్నారు. నేను ఏడుస్తూ ఇంట్లోనే ఉండటం చూడలేక అతి కష్టం మీద ఇంటర్ వరకూ చదివించారు. డిగ్రీ చదువుతానంటే అస్సలు ఒప్పుకోలేదు. పెద్దవాళ్ల మాటను కాదనలేక సైలెంట్‌గా ఉండిపోయాను. నేనొక్కదాన్నే కాదు.. నా కంటే ముందు ఇద్దరు అక్కలదీ ఇదే పరిస్థితి. టెన్త్‌క్లాస్ అయిపోగానే వారి చదువు ఆగిపోయింది. మాకొక తమ్ముడు. వాడూ ఇంటర్ దాకా చదివి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. తమ్ముడి పేరు సురేందర్. ఒక రకంగా మా కుటుంబానికి వాడే ఆధారం. నాన్న ఏదో గ్యాస్ కంపెనీలో జాబ్ చేసేవాడు. కానీ జీతం చాలా తక్కువ. మేం ముగ్గురు ఆడపిల్లలం కావడంతో మా పెండ్లిళ్లు ఎలా చేయాలన్న ధ్యాసే తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. అమ్మ ఇంటి దగ్గరే ఉంటూ కుట్టు మిషన్ ద్వారా బట్టలు కుట్టేది. ఏదో ఒక రకంగా పెద్దక్క పెండ్లి చేశారు. మా బావగారు ఓ మెడికల్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఇక ఇంట్లో నేను చిన్నక్క ఉండేవాళ్లం. పొద్దున లేచినప్పట్నుంచి రాత్రి పడుకోబోయే దాక మాది రోజూ రొటీన్ లైఫ్. ఒక రకంగా తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అన్నట్టే ఉండేది. ఒక ఫ్రెండ్‌ను కలిసేది లేదు.. చుట్టాన్ని కలిసేది లేదు. ఫంక్షన్‌కు వెళ్లేది లేదు.. పది మందిలో తిరిగేది లేదు. క్లియర్‌గా చెప్పాలంటే పరమ బోరింగ్ లైఫ్ మాది. అక్కకు నేను.. నాకు అక్క తోడుగా నిలుస్తూ ఏదో కాలం వెల్లదీసేవాళ్లం. మా ఇద్దరికీ తోడుగా ఓ చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. టీవీలో వచ్చే కార్యక్రమాలు.. సీరియల్స్ చూస్తూ గడిపేవాళ్లం. టీవీ గనుక లేకపోతే..

వాటిలో వచ్చే సీరియల్స్ గనుక లేకపోతే మాకు ఆ మాత్రం సరదాలు కూడా ఉండకపోవునేమో అనిపించేది. ఎప్పుడో ఒకసారి అక్కవాళ్ల ఇంట్లో.. మా మామయ్య వాళ్లింట్లో ఏదైనా ఫంక్షనో.. పండుగో ఉంటే అమ్మానాన్న వెళ్లేవారు. ఏ రాత్రికో వచ్చేవారు. దొరికిందే అవకాశంగా పొరుగింట్లోకి వెళ్లి ముచ్చట్లు పెడుతూ సాంత్వన పొందేవాళ్లం. ఒకసారి మా పొరుగింట్లోకి చుట్టాలు వచ్చారు. పెద్దక్కకు కొడుకు పుట్టడంతో అమ్మవాళ్లు అక్కడికి వెళ్లారు. రాత్రికి అక్కడే ఉండాల్సి రావడందతో వాళ్లు ఇంటికి రాలేదు. తమ్ముడికి నైట్ డ్యూటీ కావడంతో వాడూ రాలేదు. దీంతో పక్కింటి శ్వేత, రాణి మా ఇంట్లోనే ఉన్నారు ఆ రాత్రికి. చుట్టాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎట్లాగూ మా ఇంట్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి శ్వేత, రాణితో పాటు వాళ్ల చుట్టాలబ్బాయిలు తిరుమల్, విఘ్నేష్ కూడా వచ్చారు. రాత్రి పొద్దుపోయేదాక అంత్యాక్షరీ వంటి ఆటలు ఆడుకున్నాం. తిరు, విఘ్నేష్ పరిచయం అయ్యారు. నాకు తెలిసి అబ్బాయిలతో అంత క్లోజ్‌గా మాట్లాడటం అదే ఫస్ట్ అనుకుంటా. ఎందుకో ఏమోగానీ.. వాళ్లతో మాట్లాడితే కొత్తగా అనిపించింది. తిరు అయితే నాకు తెగ నచ్చేశాడు. అతడు నా గురించి ఏం అర్థం చేసుకున్నాడోగానీ నాపై ప్రేమను కనబర్చాడు. అన్ని సంవత్సరాలు ఒకేచోట.. ఒకే రకమైన మనుషులతో కలిసి ఉండటం.. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటం వల్ల నాకు అతనితో ఏర్పడిన కొద్దిపాటి పరిచయం ఇష్టంగా మారింది. తిరు వెళ్లిపోయినా కూడా అతని గురించే నా మనసు ఆలోచించింది.

ఓ వారం రోజుల దాకా ఇవే ఆలోచనలు. తర్వాత నా లైఫ్ మళ్లీ కామన్ అయిపోయింది. ఒక్కోసారి నాకు పిచ్చెక్కిపోయేది. కనీసం ఏదైనా కోర్స్ అన్నా చేసి ఉద్యోగమేదైనా చేస్తే కొంత రిలీఫ్‌గా ఉంటుంది.. చదివిన చదువుకు అర్థమన్నా ఉంటుందనుకుంటే ఆ అవకాశమూ లేదు. సరే ఎవరికైనా పెళ్లి చేసేస్తే అక్కడన్నా పోయి హాయిగా ఉందామనుకుంటే.. నా పెండ్లి కావాలంటే ముందు మా అక్క పెండ్లి కావాలి. తర్వాత నా పెండ్లి కోసం ఎంతో కొంత డబ్బు కూడ బెట్టుకోవావాలి. అబ్బబ్బ.. ఇవన్నీ తలుచుకుంటే నాకు బుర్ర బద్దలయ్యేది. ఇంట్లో నిర్బంధించినట్టే ఉండేది మాకు. నా మీద నాకే కోపం వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కువసేపు టీవీ చూసినా.. బయట అరుగుమీద కూర్చున్నా నాన్న అనుమానంగా చూసేవారు. పాపం.. ఆయన పరిస్థితి చూసి కూడా ఆయన తీరును తప్పుబట్టలేం కదా అనిపించేది. ఆయనకూ వేరే ప్రపంచమేదీ తెలియదు. డ్యూటీ చేయాలి. డబ్బు కూడబెట్టాలి. మాకు పెండ్లిళ్లు చేయాలి. ఇదే తపిస్తుండేవారు. అమ్మనేమో ఆ రోజుల్లోనే పదో తరగతి వరకు చదివింది. లోక జ్ఞానం చాలా ఉంది. ఆమెకున్న తెలివికి ఏదైనా మంచి అవకాశం వస్తే మా జీవితాలన్నీ వేరేలా ఉండేవి. కానీ మమ్మల్ని విడిచిపెట్టి ఉండలేక.. నిర్బంధం లాంటి జీవితానికే అలవాటు పడి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అమ్మది. ఈ కాలం అమ్మాయిల అవసరాలేంటో.. కోరికలేంటో అమ్మకు బాగా తెలుసు. కానీ ఏమీ చేయలేదు.

నెల రోజుల తర్వాత పక్కింటి చుట్టాలబ్బాయి తిరు మళ్లీ వచ్చాడు. నాకు ప్రాణం వచ్చినంత పనైంది. బయటకెళ్లి మాట్లాడుదాం అంటే నాన్న ఇంట్లోనే ఉన్నాడు. చూస్తే తిడతాడు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఆ అబ్బాయి నేరుగా మా ఇంట్లోకి వచ్చాడు. వాళ్లక్క పెండ్లి ఉన్నదట పెండ్లిపత్రికలు ఇవ్వడానికి వచ్చాడట. ఇంట్లోకి రాగానే నాన్న.. ఎవరూ? అన్నాడు. తిరు ఏం చెప్తాడో ఏమో.. నా పేరు ఎక్కడ చెప్తాడో ఏమో అని భయమేసింది. కానీ అతడు తెలివిగా.. పక్కింటివాళ్ల చుట్టాలబ్బాయిని అంకుల్. మా అక్క పెండ్లి ఉంది. మీకూ ఇచ్చిరమ్మన్నది ఆంటీ అన్నాడు. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాన్నేను. నాన్నకు టైమ్ కావడంతో అతడు వెళ్లిపోయాడు. అమ్మ ఆ అబ్బాయిని ఇంట్లోకి స్వాగతించి చాలాసేపు మాట్లాడింది. నేనూ అతడితో చనువుగా మాట్లాడటం చూసింది. ఎంతైనా మా అమ్మ ఇంటెలిజెంట్ కదా? తిరు పట్ల నాకున్న ఇష్టాన్ని కనిపెట్టేసింది. బయటకు వెళ్లిపోయింది. తిరూ.. ఐదు నిమిషాలు వెయిట్ చెయ్.. టీ పెట్టుకొని వస్తా అని చెప్పి టీ పెట్టుకొని వచ్చాను. అక్క అటువైపుగా వచ్చి తనేదో అర్థం చేసుకొని వెళ్లిపోయింది. నేను.. అతడు చాలాసేపు మాట్లాడుకున్నాం. నాలోని ఇష్టాన్ని వ్యక్త పరచాలనిపించింది. కానీ అమ్మాయిని కదా. అలా చెప్తే బాగుండదేమో అనిపించి సైలెంట్ అయ్యాను. కానీ తిరు షాక్ ఇచ్చాడు. నేను ఖాళీ ఇష్టాన్నే వ్యక్త పరుద్దాం అనుకున్నాను. కానీ అతడు ఏకంగా ప్రేమనే వ్యక్త పరిచాడు. చూడు.. శశి. నేను చాలా ఓపెన్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నా మనసెందుకో నిన్నే కోరుతున్నది. నీతో పరిచయం చాలా తక్కువే అయినా.. మనం మాట్లాడుకున్నది కొద్దిగానే అయినా నీ ప్రేమను కోరుతుంది.

ఐ లవ్ యూ శశీ. నీకు ఇష్టమే అయితే నేను కచ్చితంగా పెండ్లి చేసుకుంటా అన్నాడు. ఎప్పుడైతే తిరు నన్ను పెండ్లి చేసుకుంటా అన్నాడో అప్పుడు నా కళ్లు కాంతిపుంజాల్లెక్క మెరిసిపోయాయి. నాలో వచ్చిన వింత మార్పులు నన్నే ఆశ్చర్యానికి గురిచేశాయి. నాకు పెండ్లవుతుందా? అని రకరకాలుగా ఆలోచిస్తూ ఆనందంతో నా ఆలోచనలు హద్దులు దాటిపోయాయి. వీలైనప్పుడల్లా మాట్లాడమని నాకో ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు తిరు. అమ్మ విషయం ఆరా తీసింది. ఆ అబ్బాయి నీకోసం వచ్చాడా? పెండ్లి పత్రికలు ఇవ్వడానికా? అని ప్రశ్నించింది. నా బాధలేమి ఉన్నా అమ్మతోనే చెప్పుకుంటా కాబట్టి.. విషయం దాచిపెట్టకుండా అమ్మకు చెప్పేశాను. తానే ఇలా నిర్బంధం మధ్యలో బతుకుతున్నది. కనీసం మాకైనా కొంచెం స్వేచ్ఛ ఉండాలన్నది అమ్మ ఆలోచన. అర్థం చేసుకొని.. సరే నీ ఇష్టం అన్నది. అక్క చెప్పిందో.. ఎలా తెలిసిందో తెలియదుగానీ విషయం నాన్నకు తెలిసిపోయింది. నాన్న మనసు నొచ్చుకున్నది. అమ్మ మనసు నొచ్చుకున్నది. తనకంటే చిన్నదాన్ని కావడం వల్ల పరిస్థితులను.. తనను ఏమాత్రం అర్థం చేసుకోలేక ప్రవర్తిస్తున్నానని అక్క నాతో మాట్లాడటం మానేసింది. మరింత అంధకారమైపోయింది నా జీవితం. మూడ్రోజులు చూశాను. ఏమాత్రం మార్పు లేదు. రెండు ఆప్షన్లు పెట్టుకున్నాను. ఒకటి చనిపోవడం.. రెండు తిరుకు ఫోన్ చేసి విషయం చెప్పడం. మొదటి ఆప్షన్ ఎంచుకుంటే.. నా గురించి అమ్మానాన్న పడిన కష్టం వృథా అవుతుంది. చనిపోతే వాళ్లకు మరింత డ్యామేజ్ అవుతుందే తప్ప ఏమీ ఉండదు అని అనుకున్నాను. తిరుకు ఫోన్‌చేసి విషయం చెప్పాను. సాయంత్రానికల్లా అతడు వచ్చేశాడు. నాన్నతో ధైర్యంగా ప్రేమ విషయం.. పెండ్లి విషయం అడిగాడు. గుర్రుగా ఉన్న నాన్న.. మేం పేదోళ్లమే అయుండొచ్చు. కానీ పరువు తప్పినవాళ్లమైతే కాదు. నేను నా బిడ్డ పెండ్లి చేయలేను అనే కదా నువ్వు ఏదో సాయం చేస్తున్నట్లు నటిస్తూ నా బిడ్డను పెండ్లి చేసుకుందామనుకుంటున్నావ్. ఇది చాలా తప్పు. నాకు కనిపించకు అన్నాడు.

నేను.. నాన్నా.. అతడిని ఏమనొద్దు. తప్పు నాది. నేను అతడినే పెండ్లి చేసుకుంటా. మీతో కాకుంటే చెప్పండి.. మేం బయటకు వెళ్లి పెండ్లి చేసుకుంటాం అన్నాను. నాకు ఆ ధైర్యమెక్కడిదో అర్థం కాలేదు. అమ్మానాన్న ఫీలవుతారని తెలిసి కూడా ఏం చేయాలో అర్థంకాక ఎడాపెడా అనేశాను. నాన్నకు కోపం పెరిగిపోయి నన్ను లాక్కెళ్లి గదిలో పెట్టి తాళం వేశాడు. వారం రోజులైంది. నేను కనీసం నీళ్లు కూడా తాగడం లేదు. పరువు కోసం నన్ను ఇంట్లోనే నిర్బంధంగా ఉంచాలో.. నా మనసును అర్థం చేసుకొని వదిలేయాలో అర్థంకాక అమ్మ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఆ మరుసటి రోజు తిరుకు ఫోన్ చేసి.. బాబూ.. నేను శశివాళ్ల అమ్మను మాట్లాడుతున్నాను. ఇక్కడ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. వచ్చి అమ్మాయిని తీసుకెళ్లు. మిగతా విషయాలు నేను చూసుకుంటా అన్నదట.
సాయంత్రం సమయానికి తిరు వచ్చేసి నన్ను తీసుకెళ్లాడు. అన్నీ అతడే చూసుకున్నాడు. నాకేవీ తెలియవు. స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడటం తప్ప వేరే విషయాలేవీ నా మనసుకు ఎక్కలేదు. రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. నా పెండ్లి తర్వాత నాన్నతో ఇప్పటికీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అమ్మతో రోజూ మాట్లాడుతా. తన కంటే ముందు పెండ్లి చేసుకున్నాననీ.. ఇంట్లో నుంచి నాన్నను ఎదురించి వెళ్లిపోయాననీ చిన్నక్క నాతో మాట్లాడటం లేదు. పెద్దక్క రోజూ ఫోన్ చేస్తుంది. తమ్ముడికి.. చిన్నక్కకు కూడా పెండ్లిళ్లు అయిపోయాయి. ఇప్పుడు అమ్మానాన్న.. ఇంటివద్దే ఉంటున్నారు. మేమేమో.. చిలుకూరు సమీపంలోని హిమాయత్‌సాగర్ దగ్గర ఫ్లాట్ కొనుక్కొని ఉంటున్నాం. జీవితం హ్యాపీగా ఉంది. ఇలా ఉండటానికి కారణం మాత్రం నా ప్రేమనే. అదే నాకు స్వేచ్ఛనిచ్చింది. లేకపోతే ఆ చీకటి గదిలో ఉంటూ.. ప్రపంచంతో సంబంధం లేకుండా పిచ్చిదాన్నైపోయేదాన్ని. ఇప్పుడు నేను గెలవాల్సింది నేను మోసం చేసిన ఇద్దరి మనసుల్ని.. ఒక్కరు నాన్న.. ఇంకొక్కరు చిన్నక్క. నాన్నా.. అక్కా.. నేను ప్రతీది నా స్వార్థం కోసమే చేశాను. మిమ్ములను అర్థం చేసుకోలేదు. కానీ మిమ్ములను అర్థం చేసుకొని ఉండి ఉంటే నేను వేరేలా ఉండేదాన్ని. ఒక్కసారి ఆలోచించండీ.. నా స్వార్థం వెనకాల ఉన్న స్వేచ్ఛను గ్రహించండి.
మీ ప్రియమైన శశీ.!

926
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles