హాకీకి ఆక్సిజన్ కావాలి!

Sun,March 19, 2017 12:39 AM

నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, హాకీని జాతీయ క్రీడ అనడంలో నిజం కూడా అంతే ఉంది. ఎన్నో దశాబ్దాల క్రితం వరుసబెట్టి ఒలింపిక్ స్వర్ణాలు గెలిచిన చరిత్ర నెమరువేసుకుంటూ, గురుదత్ సినిమాలో లాగ వఖ్త్నే కియా క్యా హసీఁ సితమ్.. రహేన తుమ్, హమ్ రహేన హమ్ అని పాడుకోవాల్సిందే. క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, టెన్నిస్ లాంటి క్రీడలు మన సోకాల్డ్ జాతీయ క్రీడను దాటుకుని జోరుగా ముందుకు దూసుకుపోతున్నాయి. అమెరికాలో కూడా అక్కడి జాతీయ క్రీడ బేస్బాల్ కన్నా బాస్కెట్‌బాల్, అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడలకు ఇప్పుడు జనాదరణ పెరిగింది. అయినా కూడా బేస్‌బాల్ లీగ్స్‌కు కూడా తగినంత పాపులారిటీ ఉండనే ఉంది. కానీ మన దేశంలో మాత్రం హాకీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారైంది.
sandeep-hockey
1928 నుంచి 1960 వరకు హాకీకి స్వర్ణయుగం అని చెప్పొచ్చు. అప్పుడు మనమే ప్రపంచంలో నంబర్ వన్. తరువాత కూడా కొన్ని విజయాలు లేకపోలేదు. 1975లో హాకీ ప్రపంచ కప్ కూడా గెలిచాం. కానీ అప్పటికి టెలివిజన్ లేదు, ఉన్నా మెట్రో నగరాలకే పరిమితం. 1982 నుంచి టీవీలో లైవ్ టెలికాస్ట్ మొదలయ్యాక మాత్రం హాకీలో చెప్పుకోదగ్గ విజయాలు లేకుండాపోయాయి. అసలు డ్యామేజీ అక్కడే జరిగింది. మరో వైపు క్రికెట్ ప్రపంచ కప్ విజయం సరిగ్గా టెలివిజన్ జాతీయ ప్రసారాలు మొదలైన రోజుల్లోనే మనకు రావడం ఆ క్రీడకు బోనస్ అయింది. క్రికెట్‌తో రేసులో హాకీ దారుణంగా వెనుకబడిపోయింది. ఇప్పుడైతే ఆ దూరం కొన్ని యోజనాలకు పెరిగిపోయింది. కొన్ని ఉదాహరణలు ప్రస్తావిస్తే హాకీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో అర్థమవుతుంది.

-క్రితం ఏడాది పాకిస్థాన్ జట్టును మూడు మ్యాచ్‌లల్లో మన హాకీ వీరులు ఓడించారు. ఆ విషయం ఎవరికైనా తెలుసా? ఎవరైనా ఆ మ్యాచ్‌లు చూశారా? సోషల్ మీడియాలో కనీసం ఓ కంగ్రాట్స్ పారేశారా? అబ్బే, అలాంటి ప్రమాదాలేవీ జరుగలేదు. అదే క్రికెట్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే రోడ్ల మీద కర్ఫ్యూ పెట్టినట్టే ఉంటుంది. మన వాళ్ళు గెలిస్తే పటాకుల మోత మోగుతుంది.. స్వీట్లు పంచుకుని సెలెబ్రేట్ చేసుకుంటాం.

-ఇప్పుడే కాదు, గతంలోనూ అంతే. పంజాబ్ దా పుత్తర్ బిషన్ సింగ్ బేడీకి హాకీ అంటే వల్లమాలిన ప్రేమ. ఒకసారి తాము టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న నగరంలోనే భారత హాకీ జట్టు ఒక చిన్న హోటల్లో బస చేయడం చూశాడు. హాకీ ఆటగాళ్ళను తమ ఫైవ్ స్టార్ హోటల్‌కు ఆహ్వానించి సొంత ఖర్చుతో మంచి భోజనం పెట్టి పంపించాడు ఆ

-తొంభై దశకంలో మన హైదరాబాద్‌లోనే ఈ తేడా స్పష్టంగా కనిపించేది. భారత హాకీ జట్టు కెప్టెన్ ఎన్. ముకేశ్ కుమార్ మాత్రం స్కూటర్ సవారీ చేస్తుంటే, క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ హోండా ఎకార్డ్ లాంటి ఖరీదైన కార్లలో తిరుగుతుండేవాడు.
-పంజాబ్ రాష్ట్రం హాకీకి పురిటిగడ్డ అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒకప్పుడు హాకీ జట్టులో సగం మంది పగ్డీ పంజాబీలే దర్శనమిచ్చేవారు. పంజాబ్‌లలోని సంసార్పూర్ అనే గ్రామం ఒకప్పుడు 14 మంది హాకీ ఒలింపియన్లను అందించింది. ఇప్పుడు ఆ గ్రామంలో పిల్లలు క్రికెట్ ఆడుతూ కనిపిస్తున్నారంట.

-సందీప్ సింగ్ పరిస్థితి మరీ ఘోరం. 2006లో భారత జట్టులో చేరడానికి అతను రైల్లో వస్తుంటే (హాకీ ప్లేయర్‌లు రైల్లోనే ప్రయాణిస్తారు) ప్రమాదవశాత్తూ ఒక బులెట్ అతని వెన్నులోంచి దూసుకుపోయింది. రెండేళ్ళపాటు అతను వీల్ చెయిర్‌కే పరిమితమయ్యాడు. సొంత ఖర్చులతోనే వైద్యం చేయించుకోవాల్సివచ్చింది. బోరు బావిలో పడిన ప్రిన్స్ లాంటి పిల్లలకు కూడా అందరూ సాయపడతారు, కానీ తనకు ఎలాంటి ఆర్థిక సహాయం లభించలేదని వాపోయాడతను. అయినా పట్టుదలగా మళ్ళీ భారత జట్టులోకొచ్చి బ్రహ్మాండంగా రాణించాడు. అతని మీద ఒక బయోపిక్ తీస్తున్నట్టు చిత్రాంగద సింగ్ అనే బాలీవుడ్ నటి 2014లోనే ప్రకటించింది. కానీ ఇంకా ఆ సినిమా వెలుగు చూడలేదు. బహుశా హాకీ ప్లేయర్ మీద సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్లు మొహం చాటేశారేమో.

-మొత్తం మీద మన హాకీ ప్రస్తుతం ఐసీయూలో ఉందంటే తప్పులేదేమో. హాకీ లీగ్స్ కూడా అవసరమైన ఆక్సిజన్ అందించలేకపోయాయి. అంతరించిపోతున్న జంతుజాతుల్ని రక్షించుకోడానికి ఆపరేషన్ టైగర్ లాంటివి చేపట్టినట్టే ఆపరేషన్ హాకీ బచావో ప్రారంభించాలి, తప్పదు.
-2011లో మన హాకీ టీమ్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటి సంగతి. పోకిరీలో బ్రహ్మానందం అర్థ రూపాయి బిచ్చం వేసి పండుగ చేస్కో అన్నట్టు, ట్రోఫీ గెలిచిన ఆటగాళ్ళకు హాకీ సమాఖ్య వారు తలా 25 వేల రూపాయల బహుమతి ప్రకటించారు. ఆ పాతిక వేలతో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ లాంటి ఏం పండుగ చేసుకోవాలో అర్థం కాక ఆటగాళ్ళు నో అనేశారు. అదే క్రికెటర్లు మామూలు విజయం సాధించినా కోట్ల రూపాయల నజరానాలు దక్కుతాయి.

c-venkatesh-షారుఖ్ ఖాన్ తాను హాకీ ప్లేయర్‌నని అంటాడు. చక్ దే ఇండియా సినిమా తీసి హాకీపై బోలెడు ప్రేమ ఒలకబోశాడు. వో క్యా హై, హమారీ హాకీమే ఛక్కే నహీ హొతే అని క్రికెట్‌ను విమర్శిస్తూ కొన్ని పంచ్ డైలాగులు చెప్పి చప్పట్లు కొట్టించుకున్నాడు. కానీ వ్యాపారం దగ్గరికొచ్చే సరికి క్రికెట్‌నే ఎంచుకుని ఐపీఎల్‌ల్లో పెట్టుబడి పెట్టాడు.

1023
Tags

More News

మరిన్ని వార్తలు...