హరహర మహాదేవ.. ఓం నమ: శివాయ!


Sun,February 11, 2018 01:47 AM

మహాశివరాత్రి రోజున.. హరహర మహాదేవ.. శంబోశంకరా అనే నామస్మరణ మిన్నంటుతుంది.. మూర్తి రూపంలోని శంకరుడిని కొందరు పూజిస్తే మరికొందరు లింగరూపములో ఉన్న పరమశివుడిని పూజిస్తారు.. కాకపోతే లింగరూపమే ప్రధానంగా భావించే సంఖ్య ఎక్కువ... లింగంలో జ్యోతి స్వరూపం ఉంటుందనే నమ్మకం.. కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు.. దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలను.. ఈ జంటకమ్మలో వీక్షించండి.. ఆ జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి.. ఆ లింగ ప్రాశస్త్యం ఏంటో తెలుసుకోండి..
lingam

somnath

-సౌమ్య పలుస

సోమనాథ జ్యోతిర్లింగం

గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో సోమనాథ ఆలయం ఉంది. చంద్రునిచే ఈ లింగం ప్రతిష్ఠించబడిందని స్థల పురాణం. దీనికి ప్రభాస క్షేత్రం అనే పేరు కూడా ఉంది. ఈ దేవాలయం అనేకమార్లు విదేశీయుల దండయాత్రలకు గురైంది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేపట్టి ఆ ఆలయ పవిత్రతను కాపాడుతున్నారు. కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ జ్యోతిర్లింగ రూపునిగా పార్వతీదేవీ సమేతంగా వెలిసి భక్తులను కరుణిస్తున్నాడు.

Mahakaleshwar-Jyotirlinga

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం

మధ్యప్రదేశ్‌లోని అతి పురాతన నగరమైన ఉజ్జయినిలో ఉన్నది. స్వయం భూలింగ రూపంలో మహా కాళేశ్వర దేవాలయం రుద్రసాగర సరస్సు సమీపంలో కలదు. పరమేశ్వరునికి స్మశానమంటే ఇష్టం. ఈ ప్రాతంలో స్మశానం, ఎడారి, పాలపీఠం, అరణ్యం ఒకేచోట ఉన్న ప్రదేశం ఉజ్జయిని. త్రిభువన లింగాల్లో ప్రసిద్ధునిగా ఈ పరమశివుడికి పేరుంది. దక్షిణ ముఖంగా ఉండే ఏకైక శివాలయంగా ప్రసిద్ధికెక్కింది.

Omkareshwar-Temple

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరంలో శివపురి అనే ద్వీపంలో ఈ శివుడు కొలువై ఉన్నాడు. ఈ ద్వీపం పవిత్ర ఓంకార ఆకారంలో ఉండడం వల్ల దీనికి ఓంకారేశ్వర అనే పేరు వచ్చింది. ఈ ద్వీపంలో ఒకటి ఓంకారేశ్వర గుడి, రెండవది చిరాయు అమరేశ్వరుడి గుడి. ఒక శివలింగాన్ని రెండు భాగాలుగా చేసి ఈ గుళ్లు కట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి.

Kedarnath

కేదర్‌నాథ జ్యోతిర్లింగం

ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత శ్రేణుల్లో మందాకినీ నదీ సమీపంలో కలదు. 12వేల అడుగుల ఎత్తులో కేదర్‌నాథ్‌గా ఆ పరమశివుడు కొలువై ఉన్నాడు. పైగా ఈ జ్యోతిర్లింగం లింగాకారంగాకాక పట్టక రూపంలో ఉంటుంది. వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు తెరిచి ఉంటుంది.

Bhimashankar-Jyotirlinga

భీమ శంక జ్యోతిర్లింగం

మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఖేడ్ తాలూకాలో ఈ గుడి ఉంది. భీమా నది సమీపంలో ఉండడం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. నల్ల రాతితో ఈ గుడిని నగారా ైస్టెల్‌లో నిర్మించారు. ఈ గుడి దగ్గర్లో శాకినీ, ఢాకినీ మందిరాలు కూడా ఉన్నాయి. మోక్ష, జ్ఞాన కుండాల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు హరిస్తాయని అంటారు.

Kashi-Vishwanath

కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం

కాశీ దేవాలయం.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పట్టణంలో ఉంది. ఇక్కడ పరమశివుడు సగుణరూపాన్ని ధరించాడు. స్త్రీ, పురుష రూపాలకు భిన్నంగా ఉన్న ఈ రూపంలో ప్రకృతి పురుషులు ఉదయించారు. కాశీ యాత్ర చేయలేని వారు, కాశీ పేరును తలుచుకుంటే చాలు. ఆ పుణ్యఫలం దక్కుతుంది. రామేశ్వరం నుంచి ఇసుకను తెచ్చి ఆ విశ్వేశ్వరున్ని అభిషేకిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇక్కడ గంగాస్నానం చేసిన వారికి ముక్తి, అన్నపూర్ణాదేవిని పూజించే వారికి భుక్తికి లోటుండదంటారు.

Trimbakeshwar-Jyotirlinga

త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం

ఇది అతి పురాతన ప్రసిద్ధ జ్యోతిర్లింగంగా చెబుతారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబక పట్టణంలో ఈ పరమశివుడు కొలువై ఉన్నాడు. నాసిక్ పట్టణానికి 28కి.మీల దూరంలో గల త్రయంబకేశ్వర ద్వీపం భారతదేశంలో అతి పొడవైన గోదావరి నది పుట్టుక ప్రదేశంగా చెబుతారు. ఈ క్షేత్రాన్ని త్రిసంధ్యాక్షేత్రమని కూడా పిలుస్తుంటారు. ఇక్కడి లింగం చిన్న గుంటలాగా కనిపిస్తుంది. ఇందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న లింగాలు ఉన్నాయి.

Vaidyanath

వైద్యనాథ జ్యోతిర్లింగం

ఈ జ్యోతిర్లింగం విషయంలో అనేక భేదాభిప్రాయాలున్నాయి. మహారాష్ట్ర పర్లీ గ్రామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని, గంగాఖేడలోని కీరగ్రామం, హిమాచల్ ప్రదేశ్‌లోని పఠాన్ కోట్, కర్ణాటకలోని గోకర్ణ లింగం.. ఇవన్నీ ఆత్మలింగాలేనన్న వాదన ఉంది. అయితే జార్ఖండ్ వైద్యనాథ్‌లో వెలసినదే అసలైన జ్యోతిర్లింగం అంటారు. ప్రతీ శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది. కానీ ఈ ఆలయ మందిరంపై పంచశూలం ఉంది.

malikarjun

మల్లిఖార్జున జ్యోతిర్లింగం

కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిదాయకాలంటారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కోపోద్రిక్తుడై తల్లిదండ్రులను వదిలి క్రౌంచపర్వతానికి చేరుకోగా, కుమారుడిని వదిలి ఉండలేని పార్వతీ పరమేశ్వరులు ఈ ప్రాంతంలో ఆగిపోయారని పురాణ కథనం. అందుకే శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదట. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కొలువై ఉంది.

nageshvara-jyotirlinga

నాగేశ్వర జ్యోతిర్లింగం

మహారాష్ట్ర దగ్గరలోని ద్వారక వద్ద గల నాగేశ్వర జ్యోతిర్లింగం భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. దారుక అనే రాక్షసుడు అతని భార్య కలిసి రుషులను హింసించేవారు. సుప్రియుడనే శివభక్తుడిని కూడా హింసించడంతో ఆయన చేసిన ఆర్తనాదానికి ఆ పరమశివుడు దివ్యతేజ పుంజముతో వచ్చి ఆ రాక్షసులను చంపేసి నాగరూపమై జ్యోతిర్లింగమై వెలిశాడు. ఈ స్వామిని దర్శించి, సేవించుకున్న వారికి శాశ్వత పుణ్యలోక వాసం సిద్ధిస్తుందట.

Rameshwaram

రామేశ్వర జ్యోతిర్లింగం

ఈ ఆలయంలో శ్రీరాముడు ప్రతిష్టించిన లింగం రామేశ్వరలింగమని, హనుమంతుడు ప్రతిష్టించిన లింగం హనుమదీశ్వర లింగమని పూజలందుకుంటున్నాయి. రామేశ్వర లింగాన్ని పూజించిన వారికి బ్రహ్మహత్యాది దోషాలు తొలిగిపోతాయి. కాశీయాత్ర చేసినవారు గంగాజలంతో రామేశ్వర లింగాన్ని అభిషేకిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుందని రుషివాక్కు.

Girneshwar-Jyotirlinga

శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం

వెరుల్ నగర్, ఔరంగాబాద్ ఎల్లోరా గుహల వద్ద మహారాష్ట్రలో ఈ దేవస్థానం ఉంది. దౌలతాబాద్ నుంచి 20కి.మీలు, మన్‌మాడ్ స్టేషన్ నుంచి 100కి.మీల దూరంలో ఈ దేవాలయం ఉంది. జ్యోతిర్లింగాల్లో చివరిదిగా దీన్ని చెబుతారు. అహిలాభాయ్ హోల్కర్ ఈ గుడిని పునర్నిర్మించారట. ఇక్కడి దేవుడిని కుసుమేశ్వర్, గుసుమేశ్వర్, గుష్మేశ్వర్, గ్రిష్నేశ్వర్ అని పిలుస్తారు.

1736
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles