స్వయంభువు సుదర్శన చక్రధారి..రేకుర్తి లక్ష్మీ నరసింహుడు!


Sun,January 7, 2018 01:24 AM

నరసింహ స్వామి మహిమలు ఎలాంటివో.. ఆయన శక్తి ఎలాంటిదో భక్తులకు తెలిసిందే. వీరత్వానికి.. ధీరత్వానికి ప్రతీకగా ఆయన ప్రతిరూపం కనిపిస్తుంటుంది. అలాంటి శ్రీకరుడు.. శుభకరుడు వందల యేండ్ల క్రితం వెలసి భక్తులతో పూజలందుకుంటున్న ఆలయాల్లో రేకుర్తి ఒకటి. కరీంనగర్ నడి బొడ్డున లక్ష్మీ సమేతంగా కొలువై.. భక్తులకు కొంగుబంగారమయ్యాడు. చారిత్రక నేపథ్యం.. విశిష్టత కలిగి ఉండి ప్రజలకు ఆరాధ్యుడిగా.. సుదర్శన చక్రం స్వయంభుగా వెలసిన రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశిష్టతే ఈవారం దర్శనం.ఎక్కడ ఉన్నది?:

కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామంలోని పురాతన గుట్టలపై ఈ ఆలయం ఉన్నది.

ఎలా వెళ్లాలి?:

కరీంనగర్ నుంచి బొమ్మలగుట్టకు వెళ్లేదారిలో వెళితే సుమారు 7 కిలోమీటర్ల దూరంలో రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శనమిస్తుంది.
VIllage

విశిష్టత ఏంటి?:

400 ఏండ్ల చరిత్ర ఉంది. భారతదేశంలోనే సుదర్శన చక్రం స్వయంభువుగా వెలసిన ఏకైక ఆలయంగా రేకుర్తి ఆలయానికి పేరున్నది. ఈ ఆలయానికి విశిష్ట శక్తులు.. మహిమలు ఉన్నాయని స్థానికుల నమ్మకం. పూర్వం ఈ ప్రాంతాన్ని రేణుగా పట్టణంగా పిలిచేవారట. ఆ కాలంలోనే ఇక్కడ స్వయంభువుగా లక్ష్మీ సమేతుడైన నరసింహ స్వామి వెలసి భక్తులకు ప్రీతిపాత్రుడుగా మారాడని చెప్తుంటారు. తర్వాతి కాలంలో రేణుగా పట్టణం కాస్త దేవకుర్తిగా.. తదనంతరం రేకుర్తిగా మారిందని చరిత్రకారులు చెప్తున్నారు.
VIllage1

చారిత్రక నేపథ్యం:

రేణుగా సంస్థానంగా ఈ ప్రాంతం అప్పట్లో ఎంతో ప్రసిద్ధిగాంచిందిగా.. ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లిందని అని స్థానికులు చెప్తుంటారు. ఆ కాలంలో వెలసిన సుదర్శన చక్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. రుషులు.. ధ్యానం చేసుకున్న గుహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కొంత కాలానికి ఇక్కడ సక్రమమైన నిర్వహణ లేకపోవడంతో పూజా కార్యక్రమాలు తగ్గిపోయాయనీ.. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో పూర్వ వైభవం దిశగా రేకుర్తి ఆలయాన్ని అభివృద్ధి చెందేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రతీ ఏడాది మాఘమాసంలో లక్ష్మీ నరసింహుడి జయంతి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు.. యాగాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు భక్తులు తండోప తండాలుగా తరలివస్తుంటారు. దాదాపు 86 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తే పూర్వ వైభవం తీసుకురావచ్చని భక్తులు కోరుతున్నారు.

లక్ష్మీ దేవి సంచారం:

కొత్తపల్లి గ్రామానికి చెందిన బైరి సుందరయ్య పంతులు గుట్టపై స్థావరం ఏర్పాటు చేసుకుని 1983వరకూ నిర్విరామంగా పూజలు నిర్వహించారు. ఆలయం గుట్ట కింద సరస్వతి ఆలయం, శివాలయం, అంజనేయస్వామి ఆలయం, అనంత పద్మనాభస్వామి ఆలయాలను సుందరయ్య స్వయంగా నిర్మించారు. తరువాత కాలంలో ఆయన మరణంతో పూజలకు దూరమైందని చెప్పవచ్చు. అయితే పురాతన కాలంలో ప్రతీ ఉగాదికి పండుగకు ఇక్కడ లక్ష్మీదేవి స్వయంగా సంచరిస్తుందని రేకుర్తి గ్రామస్తుల విశ్వాసం. ప్రతీ ఉగాదికి గుట్ట చుట్టూ వాహనాలు తిప్పుతుంటారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి ఆలయ నిర్మాణ తరహాలో రేకుర్తి ఆలయాన్ని సైతం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇక్కడ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వసతులు అన్ని అందుబాటులో ఉండటంతో భక్తుల రద్దీ కూడా క్రమంగా పెరుగుతున్నది.
VIllage2

స్థల పురాణం:

రేణుగా పట్టణంగా వెలుగొందిన కాలంలో ఈ సంస్థానాన్ని అల్లం రాజు పాలించేవాడట. ఆయన ఈ గుట్టపై ప్రత్యేకంగా స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. సైన్యం కోసం ప్రత్యేక స్థావరాలు ఉన్నాయి. ఈ గుట్ట సమీపంలో బొమ్మలమ్మ గుట్ట ఉన్నది. కురిక్యాల శాసనం ఇక్కడే లిఖించబడింది. రేకుర్తి వచ్చిన భక్తులు కురిక్యాలకు తప్పనిసరిగా వెళ్లడం.. కురిక్యాల శాసనాన్ని తిలకించేందుకు వచ్చిన సందర్శకులు రేకుర్తి నరసింహుడిని దర్శించుకోవడం ఇక్కడ సంప్రదాయంగా వస్తున్నది. దీంతోపాటు మునులు అభిషేకం చేసుకునేందుకు కోనేరు నీటిని.. కింద ఒక బావిలో ఉన్న నీటిని వాడేవారట. గుట్టపై లక్ష్మీ నరసింహుడు వెలసిన నాటి నుంచి నేటివరకు గుట్టపై ఉన్న కోనేరులో నీరు ఎండిపోలేదు. ఇది ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
VIllage3

ఆనందంగా ఉంది:

మా ఊళ్లో ఇంత చారిత్రక నేపథ్యమున్న.. మహిమగల ఆలయం ఉండటం చాలా ఆనందంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి సైతం ఇక్కడకు భక్తులు.. పర్యాటకులు వస్తుంటారు. వారికి అన్ని ఏర్పాట్లు కల్పించడానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలూ చేపడతాం.
నందెల్లి పద్మ, రేకుర్తి సర్పంచ్

సుదర్శన చక్ర వైభవం:

స్వయంభువుగా సుదర్శన చక్రంతో వెలిసిన లక్ష్మీనృసింహస్వామి ఆలయాలు ప్రపంచంలో రెండే ఉన్నాయి. ఒకటి నైరుతి అరణ్యంలో ఉండగా, మరొకటి రేకుర్తి గ్రామంలో ఉన్నది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఆలయం అభివృధ్దిలో భాగస్వామ్యులవడం సంతోషంగా ఉంది.
ఎన్ ప్రకాశ్, రేకుర్తి

1066
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles