సుమధుర గీతాల కోయిలసునీత

Sun,July 16, 2017 01:09 AM

ఆమె పాటకు పరవశించని మనసుండదు. మృదుమధురమైన ఆ గొంతును ఇష్టపడని మనుషులుండరు. ఆమె పాడే పాట వేణుగానామృతాన్ని మైమరిపిస్తుంది.17 ఏళ్ల వయస్సులో నేపథ్యగాయనిగా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అంటూ సంగీ ప్రియుల్ని సమ్మోహితులను చేసిన సుమధుర గాత్రం ఆమెది. పాటనే ప్రాణప్రదంగా ప్రేమిస్తూ ఇరవై రెండు సంవత్సరాలుగా అవిరామంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా వెరువక గాయనిగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ పాటల పూదోటలో సుమధుర గీతాలను పూయిస్తున్నారు గాయని సునీత.గాయనిగా సునీత సుపరిచితురాలు. తన 22 సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో పాటలు పాడిన ఆమె తొమ్మిది నెలల వయసు నుండే పాటలు పాడేదట. పుట్టినపుడు ఏడుస్తుంటే ఏమిటి ఇది ఏడుస్తుంటే పాట పాడుతున్నట్లుంది అని వారి తాతయ్య అన్నారట. అలా పుట్టుకతోనే ఆ స్వరం రాగాలు తొడిగింది. చిన్ననాటి నుండే సంగీతాన్ని అభిమానించి, ప్రేమించి విజయవాడలో సంగీత ద్రష్ట అయిన పెమ్మరాజు సూర్యారావు వద్ద కర్ణాటక సంగీతంలోను, కలగా కృష్ణమోహన్ దగ్గర లలిత సంగీతంలో 8 సంవత్సరాల పాటు శిక్షణ పొందింది. శిక్షణ సమయంలో వారితో పాటు త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పాల్గొనేది.
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో
గులాబీ చిత్రంలోని ఈ పాటతో సునీత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.
సునీత పూర్తి పేరు ఉపద్రష్ట సునీత. ఆమె 10 మే 1978న గుంటూరులో జన్మించారు. తండ్రి నరసింహారావు, తల్లి సుమతి. ఆమెకు ఇద్దరు పిల్లలు ఆకాష్, శ్రేయ. సునీత గుంటూరు, విజయవాడలో చదువుకుంది. చిన్నతనం నుంచే పాటలపై మక్కువతో పాటు సంగీతం నేర్చుకున్న అనుభవం కూడా ఉండడంతో 17 సంవత్సరాల వయసులో మొదటిసారిగా సినిమాలలో నేపథ్యగాయనిగా ప్రవేశించింది.
ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే-ఈ సందళ్లు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది అంటూ ఊహలు గుసగుసలాడే సినిమాలో మెలోడీ వింటే మది పులకించిపోతుంది. భక్తిగీతాలు మొదలుకుని అన్ని రకాల పాటలు పాడి సునీత మెప్పించింది.
ఊయల చిత్రంలో పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకు మెత్తని ఊయ్యాల
పొత్తిలలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాల
అంటూ అమ్మలాలించినంత హాయిగా ఆమె పాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
కొత్తగా పెళ్లి కుదిరిన యువతి తన పెళ్లి ఘడియ ఎప్పుడొస్తుందో అంటూ ఎదురుచూసే సన్నివేశానికి అద్దం పడుతూ ఎగిరే పావురమా చిత్రంలో సునీత పాడిన పాట..
మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌనరాగాలెన్నినాల్లో
మంచు మబ్బు కమ్ముకొస్తుందో మత్తుమత్తు ఎన్ని యెల్లో
పాట ఎంతోమంది యువతుల మదిని దోచుకుంది. సునీతకు కూడా ఈ పాటంటే ఎంతో ఇష్టం. కోరి వచ్చిన ప్రియుడు ప్రియురాలితో సరసాలాడే సన్నివేశానికి తగినట్లు సింహాద్రి సినిమాలో..
నన్నేదో సెయ్యమాకు నడుముకాడ- ఏదేదో సెయ్యమాకు ఏటికాడ
ముద్దులెట్టి ముగ్గులోకి దించమాకు- ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు
వారిస్తూ సాగే పాటను సునీత ఎంతో చక్కగా పాడి సందర్భానికి బలాన్నిచ్చింది.
నేనున్నాను చిత్రంలోనూ చీకటితో వెలుగే చెప్పెను
నేనున్నానని అంటూ కీరవాణితో కలసి పాడిందామె. గోపి గోపిక గోదావరి చిత్రంలో...
అందంగా లేనా అసలేం బాలేనా- నీ ఈడు జోడు కాననా
అలుసైపోయానా అసలేమి కానా- వేషాలు చాల్లే పొమ్మనా
అంటూ తనను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న కథానాయకున్ని ప్రస్తుతిస్తూ తను అందంగా లేనా? అంటూ కథానాయిక పాడుకునే పాటను అద్భుతంగా గానం చేసింది సునీత.
కేవలం గాయనిగానే కాకుండా వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సునీత పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆయా కార్యక్రమాలకు వన్నె తెచ్చింది. పలు చిత్రాల్లో సునీత డబ్బింగ్‌తో కథా నాయికల నటన మరింత ఎలివేట్ అయ్యిందంటే అతిశయోక్తి కాదు.
సునీత దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో (AIR), జెమిని టీవీలో నవరాగం, ఈటీవీలో ఝుమ్మంది నాదం, సప్తస్వరాలు, పాడుతా తీయగా, అదేవిధంగా జీ సరిగమ లాంటి వివిధ సీరియల్ కార్యక్రమాలకు ఒక నిర్వాహకురాలిగా, న్యాయమూర్తిగా, యాంకర్‌గా 500లకు పైగా కార్యక్రమాల్లో పాల్గొంది. స్వదేశంలోనే కాకుండా కువైట్, దుబాయ్, మలేషియా, సింగపూర్, లండన్, అమెరికా, ఫిలిప్పీన్స్, కెన్యా మొదలైన విదేశాలలో కూడా అనేక కార్యక్రమాలు ఇచ్చింది.

Sunithaవిక్రమార్కుడు సినిమాలోనూ రాత్రయినా పడుకోలేదు, పడుకున్నా నిదురే రాదు, నిదురొస్తే కలలే కలలు కలలోన నవ్వే నువ్వు.. జుం జుం మాయ..జుంజుం మాయ.. ప్రేమిస్తేనే ఇంతటి హాయా అంటూ కీరవాణితో కలసి ప్రేమగీతాన్ని ఎంతో చక్కగా పాడారామె.
పరభాష కథానాయికలందరికీ డబ్బింగ్ చెప్పిన అనుభవం సునీతకు ఉంది. తమన్నా, అనుష్క, సౌందర్య, జెనీలియా, శ్రియా సరన్, జ్యోతిక, ఛార్మి, నయనతార, సదా, త్రిష, భూమిక, మీరా జాస్మిన్, లైలా, స్నేహ, సొనాలి బింద్రె, కమలినీ ముఖర్జీ, కత్రినా కైఫ్ మొదలైన కళాకారుకు కోసం గాత్రదానం (వాయిస్ ఓవర్) చేశారు.
ససలు గగలు.. గగలు నినిలు.. ససలు నినిలు.. దదల నినిలు..
గమదని సగ సగ సగ మగ సని దని దని సగ సని దమ గమ గములు
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
శ్రీరామదాసు సినిమాలో అద్భుత ప్రణయ గీతాన్ని సునీత బాలుతో కలిసి పాడే అవకాశాన్ని పొందింది. ఈ పాట విన్న అక్కినేని నాగేశ్వరరావు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
గాయనిగా ఎన్నో అద్భుత పాటలు పాడిన సునీత, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పటివరకు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు 3,000కు పైగా పాటలు పాడిన ఆమె 750 చిత్రాలకు పైగా డబ్బింగ్ చెప్పి తన కెరీర్‌ను స్ధిరపరుచుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు అందరు సంగీత దర్శకులతో కలసి పనిచేసిన అనుభవం ఉన్న సునీత వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కెరీర్ పరంగా స్వయంకృషితో ఎదిగింది.
సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని అందం, అభినయం ఉన్నప్పటకీ తెర మీద కనిపించాలని ఆమె ఏనాడు అనుకోలేదు. వర్మ, ఎస్.వి. కృష్ణారెడ్డి లాంటి వాళ్లు హీరోయిన్‌గా అవకాశం ఇస్తానన్నప్పటికీ ఆమె ఆ దిశగా అడుగులు వేయలేదు. అయితే తొలిసారి రాగం అనే షార్ట్ ఫిలింలో నటించారు. ఒంటరి మహిళ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ తన కలలను ఎలా సాకారం చేసుకుందో తెలియజెప్పే కథాంశంతో దీనిని తెరకెక్కించారు.

వెళ్లవయ్యా వెళ్లు: సినిమా రంగంలో రకరకాల పాత్రలు పోషించినా, నాకు అత్యంత సంతృప్తికరమైన అంశం డబ్బింగే! ఏ సినిమాకు ఆ సినిమాలో పాత్రకు తగ్గట్లు, సీన్లోని భావోద్వేగానికి తగ్గట్టు పరకాయ ప్రవేశం చేసి స్వరదానం చేయడం ఒక సవాల్ అంటారామె. తన కెరీర్‌లో ఎంతోమందికి డబ్బింగ్ చెప్పినప్పటికీ శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రధారి నయనతారకీ, శ్రీరామదాసులో స్నేహకీ చెప్పిన డబ్బింగ్ ఎప్పటికీ మర్చిపోలేననీ, బాపు లాంటి మహానుభావులతో పనిచేయడం అదృష్టమనీ అన్నారు. జయం చిత్రంలో హీరోయిన్ మేనరిజంగా చూపించే డైలాగ్ వెళ్లవయ్యా వెళ్లూ అనే డైలాగ్ చెప్పింది సునీతనే.

వేదం సినిమాలో వ్యభిచార జీవితం నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలనుకుంటున్న కథానాయిక పక్షిలా ఎగిరిపోవాలనుకుంటుంది. ఆ సందర్భంలో
గుండె గుబులును గంగకు వదిలి
ముందు వెనకలు ముంగిట వదిలి
ఊరిసంగతి ఊరికి వదిలి
దారి సంగతి దారికి వదిలి
తప్పుఒప్పులు తాతల కొదిలి సిగ్గు
యెగ్గులు చీకటికొదిలి
గడులని వదిలి ముడులని వదిలి
గడబిడలన్ని గాలికి వదిలి
హా.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది...
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
అంటూ పాడి తన స్వరంతో పాటకు ప్రాణం పోశారు సునీత.
తమ్ముడు చిత్రంలో తమలోని ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రేమికులు మోహమాట పడే సందర్భానికి పాట రూపమిస్తే, ఆ పాటను సునీత పాడడంతో పాటకే వన్నె తెచ్చినట్లయింది.
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా- అడుగుతావని ఆశగా ఉంది అడగవేం త్వరగా
అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా-మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా

585
Tags

More News