సిర్పూర్ కేంద్రంగా గోండు రాజుల పాలన


Sun,November 4, 2018 03:18 AM

king-rural
భారత దేశ చరిత్రలో శాతవాహనులు, మౌర్యులు, గుప్తులు, పీష్వాలు, మారాఠాలు, కాకతీయులు, పల్లవులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, విష్ణుకుండినులు, మొఘలాయిలు.. మొదలైన రాజ వంశాల చరిత్రకు ఎంతటి ప్రాధాన్యం ఉందో అదే స్థాయి ప్రాధాన్యం గోండు రాజులకు కూడా ఉంది. 9వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు సుమారు నాలుగు రాష్ర్టాలలో విస్తరించిన గోండ్వానా రాజ్యాన్ని అప్రతిహతంగా వైభవోపేతంగా 18 మంది గోండు చక్రవర్తులు పాలించారు.

నగేష్ బీరెడ్డి
ఫీచర్స్ ఎడిటర్, నమస్తే తెలంగాణ
సెల్ : 80966 77177

గోదావరి నదికి ఉత్తరాన నర్మద, తపతి నదుల మధ్య గోండులు విస్తరించి ఉన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లోని గోండులలో అనేక తెగలవారు ఉన్నారు. చందా, బల్లార్షా, సిర్పూర్ కేంద్రంగా పాలన సాగించిన గోండు (గోండ్వానా) రాజులందరూ ఒకే తెగకు చెందినవారు. కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ మండలం ఒకప్పుడు గోండు రాజులకు కేంద్రం, మూలం. సిర్పూర్‌ను గతంలో సూర్యాపురంగా పిలిచేవారట. దండకారణ్యమైన ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఆదిమజాతి గిరిజనులు నాగరికతకు కొంత దూరంగా బతికేవారు. అప్పుడు కరీంనగర్ ప్రాంతాన్ని వేములవాడ చాళుక్యులు, నిజామాబాద్ ప్రాంతాన్ని రాష్ట్ర కూటులు, మరట్వాడా ప్రాంతాన్ని పీష్వాలు పాలించేవారు. ఆ సమయంలో గోండులు తెగలు తెగలుగా విడివిడిగా బతుకుతుండేవారు.
జనుగాం, తిర్యాని, వాంకిడి, కేరామేరి, గాంధారి, తాండూరు, సిర్పూరు ప్రాంతాల్లో చెల్లా చెదురుగా ఉన్న గోండులందర్నీ ఏకతాటిపైకి తెచ్చి వారిని ఒక జాతిగా నిలబెట్టి గోండు సామ్రాజ్యపు మొదటి రాజుగా పేరుపొందాడు కోల్‌బిల్(కోల్‌కిల్). ఇతని అద్భుత సామర్థ్య నైపుణ్యాలే గోండులను ఒక బలమైన శక్తిగా, ఒక జాతిగా నిలబెట్టింది.

కోల్‌బిల్ గోండులను చైతన్యపరిచి, వారిని వికాసవంతుల్ని చేయడానికి ఎంతో కృషి చేశాడు. భూమి నుంచి ఇనుమును వెలికి తీసే విద్యను నేర్పించాడు. ఇది వారి జాతి సాధించిన మొదటి విజయంగా గోండులు భావిస్తారు. ఈ నూతన ప్రక్రియ వారిని సొంత ఆయుధాలు తయారు చేసుకునే వరకు తీసుకెళ్లింది. ఇదే వారిలో సొంత సామ్రాజ్య కాంక్ష కలిగేలా చేసింది. ఇనుప ఆయుధాలు చూసి ఇతర సామ్రాజ్యాధీశులు భయపడేలా చేసింది. గోండు రాజ్య విస్తరణలో ఇది కీలక పరిణామంగా మారింది. గోండు రాజుల సామ్రాజ్యాన్ని స్థాపించిన కోల్‌బిల్ సిర్పూర్ కేంద్రంగా రాజ్య విస్తరణ చేయడం మొదలెట్టాడు. క్రీ.శ. 870 నాటికే చిన్న చిన్న గోండు రాజ్యాలు ఉన్నా.. వాటన్నింటినీ ఏకం చేసి క్రీ.శ. 1220 నాటికి కోల్‌బిల్ గోండు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కోల్‌బిల్ కాకతీయు గణపతిదేవునికి సమకాలీనుడు.

కోల్‌బిల్ తర్వాత అతని కొడుకు భీమ్ భల్లాల్ సింగ్ రాజ్యాధికారం చేపట్టాడు. సామ్రాజ్య కేంద్రాన్ని పటిష్టం చేసేందుకు ఇతడు సిర్పూర్‌లో కోట నిర్మాణం చేపట్టాడు. సిర్పూర్ పట్టణంలో తూర్పున ఉన్న ఈ కోట ముఖద్వారాన్ని, శిథిలావస్థలో ఉన్న కోటను ఇప్పటికీ మనం చూడొచ్చు. కోట చుట్టూ ఎత్తయిన బురుజులు, 12 అడుగుల లోతైన కందకాలు ఉండేవట. కాలంతోపాటు కోటకు సంబంధించిన ఆనవాళ్లు ధ్వంసమయ్యాయి. నాటి గోండు రాజులు నిర్మించిన అనేక కట్టడాలు పూర్తిగా శిథిలావస్తకు చేరుకున్నాయి. భీమ్ భల్లాల్ సింగ్ తర్వాత అతని కొడుకు కుర్దా భల్లాల్ సింగ్ రాజ్య పాలన గావించాడు. ఇతడు చాలా మృదుస్వభావి. యుద్ధ విముఖుడు. ఆర్థికంగా, సామాజికంగా తన సామ్రాజ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇతడు ఎంతో కృషి చేశాడు. ప్రజల మనిషిగా పేరు సంపాదించుకున్నాడు. ఇతడు రాణీ రుద్రమదేవికి సమకాలీనుడు. ఇతని కొడుకు హీర్ సింగ్. తండ్రి తర్వాత రాజ్యాధికారం చేపట్టిన హీర్ సింగ్ తన సామ్రాజ్యాన్ని చిన్న చిన్న మండలాలుగా విభజించాడు. ఆ మండలాలకు నాయకులను నియమించాడు. ప్రతీ మండలంలో కోటలను నిర్మించి చక్కటి పాలన చేశాడు. ఇతడు కాకతీయ ప్రతాపరుద్రునికి సమకాలీనుడు.

హీర్ సింగ్ తర్వాత అతని కొడుకు ఆదియా భల్లాల్ సింగ్ రాజయ్యాడు. ఇతడు చాలా క్రూరుడు. ప్రజలను హింసించేవాడు. భూమి శిస్తు పన్నులు తొలిసారిగా తన సామ్రాజ్యంలో వసూలు చేశాడు. ఇతనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇతడు చాలా తక్కువ కాలమే రాజ్య పాలన చేశాడు. ఆదియా భల్లాల్ సింగ్ కాలంలో ఏర్పడిన అల్లకల్లోలాన్ని అతని తర్వాత రాజైన కొడుకు తల్వార్ సింగ్ వెంటనే అదుపు చేయలేకపోయాడు. మండల నాయకులు తిరుగుబాటు చేశారు. సొంత సైన్యాలను ఏర్పాటు చేసుకున్నారు. అదును చూసి స్వాతంత్య్రం ప్రకటించుకోవాలని చూశారు. ఈ తిరుగుబాటు దారులను ఎదుర్కోవడంతో విసిగిపోయిన తల్వార్ సింగ్ తన కొడుకు కేసర్ సింగ్‌కు రాజ్యాధికారం అప్పగించి తాను తప్పుకొన్నాడు. కేసర్ సింగ్ చాలా ధైర్య సాహసాలు గల రాజు. తండ్రిని ఎదురించిన తిరుగుబాటు దారులను అణచివేశాడు. రాజ్యంలో తిరిగి శాంతిభద్రలు నెలకొల్పాడు. పన్నులు తగ్గించాడు. సాగు, తాగు నీటి కోసం చెరువులు, బావులు తవ్వించాడు.

కేసర్ సింగ్ తర్వాత అతని కొడుకు దినకర్ సింగ్ రాజయ్యాడు. ఇతడు సాహిత్య అభిమాని. ఇతని కాలంలో మరాఠి సాహిత్యం వెల్లివిరిసింది.
దినకర్ సింగ్ తర్వాత అతని కొడుకు రామ్ సింగ్ రాజ్యాధికారం చేపట్టాడు. ఇతడు రాజ్యంలో కొత్త కోటలు నిర్మించాడు. కొత్త గ్రామాలు నిర్మించాడు. అడవిని చదును చేసి సాగు భూమిగా మార్పించాడు.
రామ్ సింగ్ తర్వాత కొడుకు నూర్జా భల్లాల్ సింగ్ రాజయ్యాడు. క్రీ.శ. 1405 నుంచి 1437 మధ్య ఇతని పాలన సాగింది. ఇతడు బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా, రాచకొండ రెండో అనపోతానాయుడు, రావు మాదానేనికి సమకాలీనుడు.

నూర్జా భల్లాల్ సింగ్ ఢిల్లీ సుల్తాను నుంచి షేర్షా అనే బిరుదును పొందాడు. ఇతని కొడుకు కండ్యా భల్లాల్ షా క్రీ.శ. 1437 నుంచి 1462 వరకు పాలన సాగించాడు. ఇతని భార్య తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో వైద్యులు సిర్పూర్‌ను వదిలి వేరే ప్రాంతంలో జీవించడం మంచిదని చెప్పారు. దీంతో కండ్యా మహారాష్ట్ర వెన్‌గంగా నదీ తీరంలో భల్లాల్‌పూర్ అనే పట్టణాన్ని నిర్మించాడు. అదే ఇప్పటి బల్హార్షా. ఇతడే చంద్రాపూర్ అనే పట్టణాన్ని కూడా నిర్మించాడు. అదే ఇప్పటి మహారాష్ట్రలోని చందా. కండ్యా సిర్పూర్ నుంచి రాజధానిని చంద్రాపూర్‌కు మార్చాడు. కండ్యా భల్లాల్ షా (క్రీ.శ. 1470-1495) తర్వాత క్రీ.శ. 1751 వరకు చంద్రాపూర్ కేంద్రంగా గోండు రాజుల పాలన సాగింది.

క్రీ.శ. 870 నుంచి 1751 వరకు అంటే సుమారు 880 సంవత్సరాల పాటు 18 మంది గోండు రాజులు పాలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ రాజులు మొదట సిర్పూర్ కేంద్రంగా.. అనంతరం చంద్రాపూర్ కేంద్రంగా పాలన కొనసాగించినా మొదటి కోట సిర్పూర్‌పై మాత్రం వారికి ఎప్పటికీ ప్రత్యేక అభిమానం ఉండేదట. భల్లాల్ షా తన రాజధానిని మార్చిన తర్వాత సిర్పూర్ కోట కొంత కాలం పాటు రాజులు లేకుండా ఉండిపోయింది. పరిపాలనా సౌలభ్యం కోసం భల్లాల్ షా సిర్పూర్‌లో గోండు సామంత రాజులను కొనసాగించాడు. ఆ రాజులు కోటను పటిష్ట పరిచి సిర్పూర్ ప్రాంతంలో గోండు రాజ్య విస్తరణ జరిగేలా కృషి చేశారు. సిర్పూర్ సామ్రాజ్యం కింద తాండూర్, గాంధారి, జునగాం, దవేదుర్గం, వెల్లి మొదలైన ప్రాంతాలు ఉండేవి. ఆయా ప్రాంతాల్లో సామంత రాజులు సిర్పూర్ రాజులకు కప్పం కడుతూ పరిపాలన సాగించేవారు. ఇతర రాజుల దండయాత్రలు గోండు రాజులపై మొదలైన తర్వాత వివిధ కులాల వారు, మతాల వారు ఈ ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభమైంది.
గోండు రాజుల తర్వాత సిర్పూర్ కోట వేములవాడ చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కాకతీయులు, మొఘలాయిలు, రేచర్ల పద్మనాయకులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల చేతుల్లోకి మారింది. నిజాం రాష్ట్రంలో భాగంగా ఉన్న సిర్పూర్ జమీందారీ పాలన రద్దయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుతం కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ఒక మండల కేంద్రంగా వెలుగొందుతున్నది.

గోండు రాజులు తమ పరిపాలన కాలంలో మొత్తం 21 కోటలను నిర్మించారు. అసిఫాబాద్(జిల్లా కేంద్రం), నిర్మల్ (జిల్లా కేంద్రం) లక్షెట్టిపేట (మంచిర్యాల జిల్లాలో ఓ పట్టణం), ఆదిలాబాద్ (జిల్లా కేంద్రం), ఉట్నూర్ (ఆదిలాబాద్ జిల్లాలో మండలం), సిర్పూర్(కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలో గ్రామం), తాండూర్(మంచిర్యాల జిల్లాలో గ్రామం), ఖానాపూర్ (నిర్మల్ జిల్లాలో మండలం)లలో కూడా కోటలు కట్టారు.
వచ్చేవారం : గోండు రాజుల కోటలు

543
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles