సాహో.. తెలంగాణ పోలీస్!


Sun,October 8, 2017 05:30 AM

ఎక్కడ శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయో.. అక్కడ పౌరులు సుఖ సంతోషాలతో ఉంటారు. భయాందోళనలను పక్కనబెట్టి భరోసాతో జీవించగలుగుతాడు. తన భావాల్ని స్వేచ్ఛగా ప్రకటించగలుగుతాడు. శాంతిభద్రతల విషయంలో అలాంటి కట్టుదిట్టమైన చర్యల్ని పటిష్టం చేస్తూ సరికొత్త పోలీసింగ్ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నది తెలంగాణ పోలీస్‌శాఖ. ప్రభుత్వ సహకారంతో ప్రజా భద్రతే ధ్యేయంగా ముందుకు సాగుతూ కేసుల పరిష్కారంలో ప్రతిభ, పారదర్శకతలను కనబరుస్తున్నది. తెలంగాణ ఏర్పాటైతే రాష్ట్రం శాంతిభద్రతల సమస్యలతో ఆగమాగం అవుతుందని అసత్య ప్రచారం చేసినవాళ్లే ఇవాళ మన పోలీసింగ్ వ్యవస్థను చూసి శభాష్ అంటున్నారు. ఎన్నో అవార్డులు మెడల్స్‌తో పాటు దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లతో భేష్ అనిపించుకున్నది. అత్యాధునిక టెక్నాలజీని ఆసరాగా చేసుకుని పనితనంలో ముందడుగు, ప్రజా శాంతిభద్రతలో పురోగతి సాధిస్తూ శభాష్ పోలీస్ అనిపించుకుంటున్న తెలంగాణ పోలీసింగ్‌పై ముఖచిత్ర కథనం.
Policeఅత్యాధునిక పరిజ్ఞానం:

పోలీస్ అంటే ప్రజల్లో వేరే అభిప్రాయం ఉంది. ఒక తహశీల్దార్‌ను కలవాలంటే నేరుగా వెళ్లి మన సమస్యను చెప్పుకుంటాం. ఒక ఎంపీడీఓతో పని ఉందంటే వెళ్లి వివరిస్తాం. కానీ అంతే ఉత్సాహంతో.. అంతే స్నేహపూర్వకంగా.. మర్యాదగా పోలీస్ స్టేషన్లోకి వెళ్లగలుగుతామా? ఏదైనా కేసు పరిష్కారం కోసం గంటల వ్యవధి ఆశించవచ్చా? అన్న దగ్గర ఇన్ని రోజులు ఆగిపోయాం. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండొద్దు.. ఉండదు అని ఆలోచించింది తెలంగాణ పోలీస్‌శాఖ. కేసుల పరిష్కారంలో పురోగతి సాధిస్తూనే.. అధునాతన టెక్నాలజీని కేసుల పరిష్కారానికి అనుసంధానం చేస్తూ.. క్షేత్రస్థాయిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను మార్చవచ్చనే ఉద్దేశ్యంతో మార్పు తీసుకొస్తున్నారు. హాక్ ఐ, హైదరాబాద్ కాప్స్, లాస్ట్ రిపోర్ట్, స్టోలెన్ వెహికిల్ ట్రాకింగ్ యాప్‌ల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే చర్యలు తీసుకుంటున్నారు. సమస్యను అక్కడికక్కడే పరిష్కరించాలనే లక్ష్యంతో గ్రామాల్లో విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్ అనే కొత్త పద్ధతిని తీసుకొచ్చారు.
Police1

నిఘా నేత్రం:

ఉగ్ర నీడలను పసిగట్టేందుకు క్లూస్‌టీమ్‌ను మరింత బలోపేతం చేస్తున్నారు. ప్రతీ మూడు స్టేషన్లకు ఒక టీమ్ అందుబాట్లో ఉండే విధంగా చర్యలు తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలను సామాజిక సేవలో కలుపుతూ సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియలో వాటిని భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రజలకు పోలీస్ వాట్సప్ సేవలు మరింత దగ్గరయ్యాయి. హైదరాబాద్ వాట్సప్ 9490616555, సైబరాబాద్ వాట్సప్-9490617444, రాచకొండ పోలీసు వాట్సప్-9490617111 సామాన్య ప్రజల కాంటాక్ట్ లిస్ట్‌లో చేరిపోయి పోలీసులు, ప్రజల మధ్య అంతరాల్ని చెరిపేస్తున్నాయి. ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో దొంగతనాలు ఇతర నేరాలకు పాల్పడే పాత నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు.
cctv

రిసెప్షన్ విధానం:

తన సమస్యను వివరించి పరిష్కరించాల్సిందిగా ఒక వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడనుకుందాం. గేటు దాటి లోపలికి వెళ్లగానే తుపాకులు పట్టుకున్న పోలీసులు.. వాళ్ల బాడీ లాంగ్వేజ్‌తో స్టేషన్ మెట్లెక్కడానికే భయపడే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిలో పూర్తి మార్పు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది పోలీస్ డిపార్ట్‌మెంట్. దీనికోసం ప్రత్యేకంగా రిసెప్షన్ విధానాన్ని తీసుకొచ్చింది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే సామాన్య ప్రజలకు ఈ రిసెప్షన్ విధానం బాగా పనిచేస్తుంది. రిసెప్షన్‌లో మహిళా కానిస్టేబుల్ స్థాయి అధికారి ఉంటారు. కార్పొరేట్ కార్యాలయాలు, మానవ వనరుల శాఖలో పనిచేసిన అనుభవం ఉన్నవారు, పోలీస్ శాఖలోని ఉన్నతాధికారుల సమక్షంతో శిక్షణ పొందిన వాళ్లనే ఇక్కడ నియమిస్తారు. పోలీస్‌స్టేషన్‌కు ఎలాంటి వారొస్తారు? వారి సమస్యలేంటి? ఫిర్యాదులనెలా స్వీకరించాలి? వారి సమస్యను ఎలా వినాలి? వంటి అంశాలు తెలుసుకోవడంలో వాళ్లు తర్ఫీదు పొందుతారు. ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లినవారిని ఆప్యాయతతో పలుకరిస్తారు. వారి పరిస్థితిని చూసి రిలాక్స్ అవ్వాల్సిందిగా ఓదారుస్తారు. అప్పటికప్పుడు వాళ్లకు మంచినీళ్లో.. స్నాక్సో ఆఫర్ చేసి ఫిర్యాదు ఎలా ఇవ్వాలో గైడ్ చేస్తారు. తనకు పూర్తిగా న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పిస్తున్నారు.
RECEPTION-COUNTER

కేస్-1: ట్రాకింగ్:

ఒక అమ్మాయి ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి వేరే అమ్మాయికి మెసేజ్‌లు వెళ్తుతున్నాయి. మొదట్లో చాలా మంచిగా ఛాటింగ్ చేసుకునేవాళ్లు. ఒకరికొకరు తమ భావాల్ని, ఫొటోలను షేర్ చేసుకునేవాళ్లు. ఎందుకంటే వాళ్లు ఒకే స్కూల్లో చదివినవాళ్లు కాబట్టి. కమ్యూనికేషన్ బలపడి వాట్సప్ చాటింగ్ వరకూ వెళ్లింది. కట్‌చేస్తే పదుల సంఖ్యలో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఏం జరిగింది? ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్. అభిషేక్ అనే యువకుడు స్కూల్‌మేట్స్‌ను లక్ష్యంగా చేస్తున్న క్రీడ ఇది. ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అధునాతన టెక్నాలజీ ఆధారంగా అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కేస్-2: ట్రేసింగ్:

గతనెల 1 నుంచి 3వ తేదీ వరకు సెంట్రల్ కోర్ట్‌హోటల్‌లో 52మంది అమ్మాయిలు.. అబ్బాయిలు గెట్ టుగెదర్ అయ్యారు. 17 ఏండ్ల చాందినీ కూడా వెళ్లింది. కట్‌చేస్తే.. హైదరాబాద్ అమీన్‌పూర్ గుట్టలో మృతదేహమై కనిపించింది. ఆమెను హత్య చేసింది ఎవరు? సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా చేసుకుని నిందితుడు ఉపయోగించిన ఆటో నెంబర్‌ను ట్రేస్ చేశారు. చాందినీ కాల్‌డేటాను పరిశీలించగా సాయి కిరణ్ అనే యువకుడికి ఎక్కువ కాల్స్ చేసినట్లు తేలింది. దీంతో మొబైల్ నంబర్ ద్వారా ట్రేస్ చేసిన సంగారెడ్డి, సైబరాబాద్ పోలీసులు సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేవలం మూడ్రోజుల్లోనే ఈ హత్య మిస్టరీని ఛేదించారు.

కేస్-3: ఛేజింగ్:

జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో నిద్రిస్తున్న విక్రమ్‌గౌడ్‌పై అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. తెల్లవారుజామున 3 గంటలకు దేవాలయ సందర్శనకు వెళ్దామని ప్రణాళిక వేసుకోవడంతో అతని భార్య రెడీ అవుతున్నది. అదే సమయంలో కాల్పుల చప్పుడు వినిపించడంతో పరుగుపరుగున వచ్చింది. అపస్మారక స్థితిలో పడివున్న భర్తను హాస్పిటల్‌కు తీసుకెళ్లిందామె. ఈ కాల్పులకు పాల్పడిందెవరు? విక్రమ్‌కు పెద్దగా శత్రువులెవరూ లేరు. వ్యాపారంలో తగాదాలేమీ లేవు. విక్రమ్‌గౌడ్ ఇంటివద్దనున్న సీసీటీవీ ఆధారంగా ముఖానికి మాస్క్ వేసుకుని బైక్ మీద వెళ్లిన వాళ్లను.. విక్రమ్‌గౌడ్ కాల్‌డేటా ఆధారంగా కేసు ఛేజ్ చేశారు. విచిత్రంగా తనపై తానే కాల్పులు జరపమని విక్రమ్ సుపారీ ఇచ్చారనేది వెలుగులోకి వచ్చింది.

మహిళా భరోసా:

మహిళలపై పెరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని భద్రతకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నది పోలీస్ డిపార్ట్‌మెంట్. షీ టీమ్స్‌కు తోడు భరోసా నిలిచింది. తమకు ఎదురవుతున్న వేధింపులను ఎవరికీ చెప్పుకోలేక వేదనపడే మహిళలకోసం ఈ భరోసా కేంద్రాలు. ఆత్మహత్యలకు పాల్పడకుండా.. జీవితంపై విరక్తి చెందకుండా వాళ్లకు సరైన రీతిలో అవగాహన కల్పించి.. జీవితంపై భరోసా కల్పిస్తునాయి. ఇలాంటి ఘటనల గురించి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసుకుని భరోసాకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వరకట్నపు వేధింపులు తట్టుకోలేక ఒకరు.. ఆర్థిక ఇబ్బందులతో మరొకరు.. తండ్రి ప్రేమకు దూరమవుతున్నామని ఇంకొకరు.. తాను చనిపోతే తన పిల్లలను ఎవరు చూసుకుంటారనే ఆందోళనలో మరికొందరు... కుటుంబంలో ఏర్పడిన వివిధ రకాల సమస్యలతో పిల్లలతో సహా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని బాధితులకు జీవితంపై భరోసాను కల్పించేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
Bharosa

డేగ కన్ను:

సామాన్యులను పౌర పోలీసులుగా మార్చేందుకు ప్రారంభించిన కార్యక్రమమే హాక్ ఐ. దీనికి మొబైల్ యాప్‌ను అను సంధానం చేశారు. రెండేళ్లలో సుమారు 3.5 లక్షల మందికిపైగా ఈ యాప్ చేరువైంది. దీనికి తాజాగా నేషనల్ ఈగవర్నెన్స్ అవార్డు దక్కడంతో మరో మైలురాయికి చేరుకుంది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రేవియన్స్ అండ్ ఫెన్షన్ డిపార్టుమెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫామ్స్ అండ్ పబ్లిక్ గ్రేవియన్స్ విభాగం నిర్వహించిన పోటీలలో తెలంగాణ రాష్ట్రం పోలీసుల తరపున పోటీ పడింది. ఈ యాప్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి మరోసారి సంచలనం సృష్టించింది. ఈ యాప్ డిజిటల్ తెలంగాణ 2015, ఎక్స్‌ప్రెస్ ఐటీ అవార్డు 2015, సీఎస్‌ఐ-నీహిలెంట్ 2015, డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్ 2016, స్కోచ్ సమ్మిట్ 2016 అవార్డులు దక్కించుకున్నది.
Police-vehicles

ఫ్రెండ్లీ పోలీసింగ్:

పోలీస్ స్టేషన్‌కు వెళ్లగానే ఆహ్లాదకరమైన వాతావారణం.. బాధతో వెళ్లే ఫిర్యాదుదారుడికి మేమున్నామనే ధైర్యాన్ని కల్పించడమే కాకుండా బయట కూడా పోలీసులంటే ఒక నమ్మకాన్ని కల్పించే ప్రయత్నమే ఫ్రెండ్లీ పోలీసింగ్. అభివృద్ది చెందిన ఆమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఇంగ్లాండ్ వంటి దేశాలను తలపించేలా హైదరాబాద్ నగర ఠాణాలలో రిసెప్షన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను పటిష్టం చేసి, టెక్నాలజీతో ప్రజలకు చేరువవుతూ ఠాణాలను అత్యాధునికంగా తీర్చిదిద్దడమే కాకుండా పోలీస్ సిబ్బందికి టెక్నాలజీపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి అంశం కూడా రికార్డులో ఉండే విధంగా ఇప్పుడు ఠాణాలలో పాలన సాగుతున్నది. సామాన్యులు దైర్యంగా ఫిర్యాదు ఇస్తూ నా ఫిర్యాదు దర్యాప్తు ఏ దశలో ఉంది? వంటి అంశాలు పోలీసులను అడుగగలుగుతారు. ప్రతీ ఫిర్యాదు కంప్యూటరైజ్డ్ చేస్తూ.. ఫిర్యాదులపై దర్యాప్తు గురించి కమిషనర్ ఇచ్చిన ఖచ్చితమైన మార్గదర్శకాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగా ఈ విధానాన్ని సిటీ కాప్స్ నిర్వహిస్తున్నది.

పెట్రోలింగ్:

ఏదైనా ఒక సంఘటన జరిగితే వెంటనే పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్తారు. ఏ సమాచారం సేకరించాలి? నిందితులను ఎలా పట్టుకోవాలి? సంఘటనా స్థలంలోని ఆధారాలు ఎలా సేకరించాలి? వంటి అంశాలను పెట్రోలింగ్ సిబ్బంది చూసుకుంటారు. అయితే ఘటన జరిగిన తర్వాత కాకుండా నిరంతరం ఫుట్ వర్క్ ఉండేందుకు డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకుంటున్నది. గ్రామా ల్లోనూ ఎలక్ట్రానిక్ బీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

స్నేహపూర్వక విధానం:

రాష్ట్రం ఏర్పడగానే శాంతిభద్రతలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకదృష్టి సారించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశ్యంతో వినూత్న చర్యలు తీసుకుని మంచి ఫలితాలు సాధించాం. నేరాలను కట్టడి చేయడంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. గ్రామాల్లో వీపీఓ సిస్టమ్.. రిసెప్షన్ సిస్టమ్‌ను తీసుకొచ్చి ప్రజలకు.. పోలీసులకు నడుమ స్నేహపూర్వక వాతావరణం ఏర్పరుస్తూ నెంబర్‌వన్‌గా నిలుపగలిగాం.
-అనురాగ్ శర్మ, డీజీపీ

భరోసా ఇస్తున్నాం:

ఇప్పటివరకు నిర్వహిస్తున్న షీటీమ్స్ కార్యకలాపాలకు తోడుగా మహిళల కోసం మరో కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. అదే భరోసా. ఆపదలో ఉన్న మహిళలకు భరోసా కేంద్రం అందుబాటులో ఉంది. వివిధ రకాలైన వేధింపులతో బాధపడే మహిళలకు తగిన కౌన్సెలింగ్ ఇచ్చి, వారిలో మనో ధైర్యాన్ని నింపుతాం. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందకుండా, మీరు ముందుగా దైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి. సమస్యలు వాటంతటవే పరిష్కారమవుతాయి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకండి. మీకు అండగా మేముంటాం.
-స్వాతి లక్రా, షీ టీమ్స్ ఇంఛార్జీ

స్మార్ట్ పోలీసింగ్:

హైదరాబాద్ కాప్స్ మొబైల్ యాప్‌తో హైదరాబాద్ పోలీసులు స్మార్ట్ పోలీసింగ్‌గా మారుతున్నారు. ప్రపంచస్థాయి పోలీసింగ్ వ్యవస్థకు ధీటుగా ఈ యాప్‌ను రూపొందించి సిబ్బందికి అందుబాటులోకి తెస్తూ, సాంకేతిక పరిజాన శిక్షణ ఇస్తున్నారు.

ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్:

ప్రాథమికంగా సేకరించిన ఆధారాలను యాప్‌లో షేర్ చేస్తారు. నిందితులు ఆధారాలు లభ్యమయితే వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోకుండా సమాచారం అందుకున్న పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి.

థర్డ్ ఐ:

అనుమానితులు కొన్నిసార్లు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకుంటారు. మరికొందరు గొడవకు దిగుతారు. కాబట్టి సిబ్బంది ఈ యాప్‌లో ఆధార్, ఓటర్‌ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ మొబైల్ ఫోన్ డాటాబేస్ సహాయంతో నేరస్తులను నిర్ధారించగలుగుతారు.

కమ్యూనిటీ పోలీసింగ్:

కమ్యునిటీకి ఏమి అవసరం? కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలంటే వారు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? వలంటీర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారెవరు వంటి ముఖ్యమైన సమా చారం దీనిద్వారా తెలుస్తుంది.

సహకారం: కాశ విజయేందర్

2911
Tags

More News

VIRAL NEWS

Featured Articles