సారంగుడి తపోవనం బండపాలెం!


Sun,May 14, 2017 03:21 AM

రాణి రుద్రమదేవి నడయాడిన చారిత్రక చందుపట్ల గ్రామానికి అతి సమీపంలో ఉన్న గ్రామమే బండపాలెం. చందుపట్లతో ఈ గ్రామానిది చారిత్రక.. ఆధ్యాత్మికానుబంధం. కాకతీయుల కాలంలో రెండూళ్లు ఒకే గ్రామంగా కలిసి ఉన్నాయి. తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఇప్పుడు రెండూళ్లయ్యాయి. ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే రెండూళ్లకు ఒకే ఉత్సవం జరుగుతుంది. తరాల నుంచి ఇదో సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. నల్లగొండజిల్లా కేతెపల్లి మండలంలోని ఈ ఊరి విశిష్టతలేంటో తెలుసుకుందాం!గ్రామ స్వరూపం
ఊరు: బండపాలెం/సారంగాచలం
మండలం : కేతెపల్లి
జిల్లా : నల్లగొండ
ప్రజల ప్రధాన వృత్తి : వ్యవసాయం
జనాభా : 1200

సరిహద్దులు
తూర్పు : కొండకింద గూడెం
పడమర : చందుపట్ల
ఉత్తరం : కొర్లపాడు
దక్షిణం : మండలాపురం
పిన్‌కోడ్ : 508211

ఎక్కడ ఉన్నది? :

65వ జాతీయ రహదారి. ఇనుపాముల గ్రామంలో మల్లన్నగుట్ట.. దాటుకుంటూ వెళ్తే సుమారు 4 కిలోమీటర్ల దూరంలో రాళ్లగుట్టలు కనిపిస్తాయి. ఇవి దాటితే వచ్చే గ్రామమే బండపాలెం. ఊళ్లోకి వెళ్తూనే ఊడలమర్రి కింద దుర్గమ్మ తల్లి ఆలయం స్వాగతం పలుకుతుంది. నడి ఊర్లో శిథిలమై కనిపిస్తున్న దేశ్‌ముఖ్‌ల గడీలు.. ఊరవతల గుట్ట కనిపిస్తాయి.

ప్రత్యేకత ఏంటి? :

ఊరి చివరన ఉన్న ఆ గుట్ట మామూలుది. శైవం.. వైష్ణవం.. జైనం ఉట్టిపడే ప్రాచీన కట్టడాలు ఈ గుట్టపై ఉన్నాయి. కాకతీయుల శిల్పకళా వైభవంతో ఉన్న కట్టడాలు.. ఆలయాలూ ఉన్నాయి. ప్రాచీన జైన ఆలయాలు ఈ గుట్టపై కనిపిస్తాయి. పూర్తిగా అరణ్యాల మధ్యన ఏదో మహత్తు కలిగినట్లు.. రమ్మని స్వాగతం పలుకుతున్నట్లు కనిపించే ఈ గుట్టకు చరిత్రలో చోటున్నదనే విషయం చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇంత ప్రఖ్యాతిగాంచిన ఆ గుట్టపేరే సారంగాచలం. దీనిని సారంగాద్రి అనికూడా పిలుస్తారు.
సారంగశైల ప్రాశస్త్యం : చారిత్రక ప్రాంతం కావడంతో రెండుమూడు రకాల కథలు ప్రచారంలో ఉండటం సహజమే. కొన్నింటికి ఆధారాలుంటాయి. కొన్నింటికి ఉండకపోవచ్చు. కానీ ప్రజల నోళ్లలో నానుతూ వాస్తవిక చరిత్రగా చెప్పబడుతాయి. బండపాలంలోని సారంగాచలానికి కూడా రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ప్రాంతం పుట్టుక.. చరిత్ర.. నేపథ్యం ఈ రెండు కథల ఆధారంగానే తెలుసుకుంటుంటారు. పూర్వం భద్రుడు.. సారంగుడు అనే ఇద్దరు మునులు ఉండేవాళ్లట. భద్రుడు తపస్సు చేసిన ప్రాంతం భద్రాద్రి.. లేదా భద్రాచలంగా పేర్గాంచింది. అలాగే సారంగుడు కూడా శ్రీరాముని కోసం బండపాలెం గుట్టపై తపస్సు చేయడంవల్ల ఈ ప్రాంతాన్ని సారంగాచలం అంటారు. ఈ క్షేత్ర వైభవం గురించి గోవర్ధనం వెంకట నరసింహాచార్యులు సారంగాశైల మహత్యం అనే ప్రబంధంలోనూ రాశారట. అదే విధంగా శ్రీరంగాచార్య తిరుమంగళ యాళ్వారు ద్వారా కూడా సారంగాద్రి చరిత్ర తెలుస్తున్నది.
Village

బసవేశ్వర కథ :

సారంగాశైల మహత్మ్యంలో ఇలా ఉంటే.. బసవేశ్వరంలోని కథలో ఇంకోలా ప్రచారంలో ఉన్నది. దీనికి కూడా స్పష్టమైన ఆధారాలున్నట్లు చెప్తున్నారు గ్రామస్తులు. బసవేశ్వర కథ ప్రకారం.. రాజరాజ నరేంద్రుడి కుమారుడు సారంగధుడు. కుటుంబంలో జరిగిన ఓ వివాదం కారణంగా సారంగధుడు తండ్రి కోపానికి గురవుతాడట. నిజానిజాలు తెలియకుండా సారంగధుడిని దండించాల్సిందిగా రాజరాజ నరేంద్రుడు ఆదేశిస్తాడట. శిక్షలో భాగంగా సారంగధుడిని అడవుల్లోకి పంపిస్తారు. అక్కడే సీతారాములు కొలువైన గుహలో సారంగధుడు కొంతకాలం ఉంటాడట. తిండీ.. తిప్పలు మానేసి గాఢమైన తపసస్సులో మునిగిపోతాడట. చాలాకాలం సారంగధుడు ఆ అరణ్యంలోని గుట్టపైనే ఉండేవాడు. అలా సారంగధుడు సుదీర్ఘకాలం పాటు ఆ గుట్టపై తపస్సు చేయడం వల్ల ఆ ఊరికి ఈ పేరొచ్చిందట.

నాగమ్మ పుట్ట :

గుడిని ఆనుకొని ముందు కోనేరు ఉంటుంది. దీనిని రాముని పాదం వల్ల ఏర్పడిన పాదముద్రగా భక్తులు నమ్ముతారు. ఈ కోనేరు ఎంత కరువులోనైనా ఎండిపోదు. జాతర సమయంలో ఎవ్వరి ప్రమేయం లేకుండా నీటి మట్టం పెరుగుతుంది. ఈ నీరు ఔషధ గుణాన్ని కలిగి ఉందంటారు. దీని పక్కనే ఎత్తైన నాగమ్మ పుట్ట ఉంటుంది. 500 మీటర్ల ఎత్తులో కోనేరులో నీళ్లు సమృద్ధిగా ఉండటం విశేషం. 6 మీటర్ల లోపలికి గుట్టలో సొరంగం ఉంటుంది. అందులో శ్రీ సీతారామస్వామి కొలువై భక్తుల కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి 50 ఎకరాల భూమి ఉన్నదని 25 ఎకరాల సాగులో ఉన్నదని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని స్థానిక సర్పంచ్ వంగూరి రాములు కోరుతున్నారు.
Village1

రెండూళ్ల దేవుడు:

చందుపట్లకు చెందిన పానుగంటి జగన్నాథరావు, నర్సింహారావు దేశ్‌ముఖ్ దొరల సోదరులు. ఊర్లను పంచుకునే సమయంలో ఒకరి పాలుకు బండపాలెం వచ్చిందనీ.. అందువల్లనే వారు బండపాలెంలో స్థిరపడ్డారని గ్రామస్తులు చెప్తుంటారు. ఒకరు చందుపట్లలో.. మరొకరు గుట్టపై ఆలయాన్ని నిర్మించారు. నిత్యపూజలు చందుపట్లలో జరిగి కార్తీక ఉత్సవం, చైత్రోత్సవం బండెపాలంలో నిర్వహించేవారట. సంవత్సరమంతా సీతారామ ఉత్సవ మూర్తులు చందుపట్లలో పూజలందుకుని శ్రీరామ నవమి సందర్భంగా 10 రోజులు బండపాలెంకు వస్తారు. చందుపట్ల నుంచి దాదాపు 50 బోయలు పల్లకిలో మంగళవాద్యాలు.. దివిటీలతో స్వామి మూర్తులను అత్యంత రమణీయంగా కోలాటాలతో.. భజనలతో.. ముత్యాల తలంబ్రాలతో 4 కిలోమీటర్ల దూరం పల్లకిని మోస్తూ బండపాలెం వెళ్తారు.

పర్యాటక ప్రాంతంగా గుర్తించాలి:

మా ప్రాంతాన్ని కేసీఆర్ కూడా సందర్శించారు. ఇంత చరిత్ర కలిగిన ఊరును ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా గుర్తిస్తే చాలా బాగుంటుంది. సారంగాచలం చరిత్రను భావి తరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఉన్నది.
-మారం భిక్షంరెడ్డి, సారంగాచలం రామాలయ చైర్మెన్

ఇంకా అభివృద్ధి చేయాలి:

బండపాలెం ఎంతో ప్రాచీనమైన గ్రామం. మా పూర్వీకులు కూడా చందుపట్ల నుంచి తలంబ్రాలు తీసుకెళ్లేవారు. ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ఇంత గొప్పగా ఈ ప్రాంతం విలసిల్లడం ఎంతో సంతోషంగా ఉంది.
-మేడవరపు కిషన్‌రావు, చందుపట్ల రామాలయ చైర్మెన్
Village2

చారిత్రక ఆనవాళ్లు :

గుట్ట మీది రాతి గోడలు అలనాటి చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి. అదేవిధంగా పైకప్పు లేని రాతితో పేర్చిన గదుల నిర్మాణం.. రెండు ఫీట్ల మందం కలిగిన రాతితో నిర్మించిన మూడు గడులు.. ఒక ఆలయం కాకతీయుల శిల్పకళతో శివలింగం, నంది సహితంగా ఉన్నాయి. మరొక గుడిలో రాముని పాదాలు ఉంటాయి. మరొక గుడి ధ్వంసమై విగ్రహాలు లేకుండా ఉంది. ఈ ప్రాంతంలో జైనం, శైవం, వైష్ణవం విలసిల్లినట్లు ప్రముఖ చరిత్రకారులు పీవీ పరబ్రహ్మ శాస్త్రి, కృష్ణశాస్త్రి చెప్పారట. పూర్వం నుంచి అక్కడ పెద్ద గుట్ట.. చిన్న గుట్ట ఉన్నాయి. ఇక్కడ బండి వడ్డెరోళ్లు చిన్న గుట్టపై బండలు.. రాళ్లు.. కంకర కొట్టి జీవనం సాగిస్తున్నారు. బండలు కొట్టే ప్రాంతం కాబట్టి దీనికి బండపాలెం అనే పేరు క్రమంగా వాడుకలోకి వచ్చింది.
Village3

1607
Tags

More News

VIRAL NEWS