సరైన నాయకత్వం


Sun,August 13, 2017 02:29 AM

moralstoryనాయకత్వం ఆలోచనల్లోనూ, ఆచరణలోనూ సదా సన్నద్ధమై ఉండాలి. అటువంటి నాయకత్వం నీడలో సంస్థ, సంఘం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా రక్షణగా భరోసానివ్వాలి. అలా కానిదేదీ ఎన్నడూ నిలబడదు. పైగా నశిస్తుంది. ఎందుకంటే మేకపోతు గాంభీర్యంతో, అహంకారంతో నాయకత్వం నాదనే మూర్ఖత్వంతో కొంతమందిని ఎల్లకాలం మోసం చేయొచ్చు. అందరినీ కొంతకాలం మాయలో పడేయొచ్చు. కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయడం కుదరదు. పరిశోధన, సరైన అవగాహన, అనుభవం చెప్పిన పాఠాలు నాయకత్వాన్ని సరైన దారిలో నడిపిస్తాయి. అవి లెక్కచేయకపోతే చివరికి తనకు తానూ, తనను నమ్మినవారూ నష్టాలపాలు కాకతప్పదు. ఈ హెచ్చరికే ఈ కథారూపంలో మన కళ్ళు తెరిపిస్తుంది.

ఒక దట్టమైన అడవి. అందులో ఎన్నో మహావృక్షాలూ, ఏపుగా పెరిగిన చెట్లు పక్షిజాతికి ఆధారమై వున్నాయి. ఎత్తుగా పెరిగే పొన్న చెట్లు ఆ అడవికే ప్రత్యేకం. ఎందుకంటే ఆ పొన్న చెట్ల కాయలకై వలస వచ్చే చక్రవాక పక్షులు అడవి అందానికే ప్రామాణికమవుతాయి గనుక. చక్కవాక పక్షులు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందనే నమ్మకం ఆ అడవి చుట్టుపక్కల గ్రామాల వారి ఆచారంగా మారింది. పొన్నచెట్ల కాయలు తింటూ అవే చెట్లపై గూళ్ళు కట్టుకొని నివసించే చక్రవాక పక్షులను వేటగాళ్ళు వలవేసి పట్టుకొని గ్రామాల్లో అమ్ముకోవడం సర్వసాధారమైపోయింది.

ఒకసారి చాలా సుదూర ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ మంచి అడవికై వెదుకుతున్న వందకుపైగా చక్రవాక పక్షులు పొన్నచెట్లతో నిండుగా ఉన్న ఈ అడవే మనకు అనువైందని భావించి రెండు ఏపుగా పెరిగిన పొన్న చెట్లు పక్కపక్కనే ఉన్నవి చూసుకొని వాటిమీద గూళ్ళను నిర్మించుకున్నాయి. ఆ చక్రవాక పక్షుల నాయకుడు సుందరకీర్తి. ఆతని తాత సుమతి. వంశపారంపర్యంగా వస్తున్న నాయకత్వాన్ని అందుకున్న సుందరకీర్తి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుచూపు లేక అహంకారంతో అనుభవానికి విలువనివ్వక విధినిర్వహణ చేస్తుండేవాడు. కానీ సుమతి తన మనవని తప్పుడు నిర్ణయాలతో పక్షిజాతి నశించిపోకుండా వాటికి ఆపద వాటిల్లక తన అనుభవంతో, వివేకంతో నెట్టుకొస్తుండేవాడు.

చక్రవాక పక్షులు రెండు పొన్న చెట్లను ఆధారంగా చేసుకొని గూళ్ళు కట్టుకున్న చెట్లకింద బలమైన తీగలతో మాధవీలత పువ్వులతీగ పెరగసాగింది. అది ఒక్కసారి చెట్లను అల్లుకుందంటే చాలా ఎత్తువరకూ తన బలమైన తీగలతో ఆ చెట్లకే ఆధారంగా మారిపోతుంది. దానిని గమనించిన సుమతి పక్షితాత ఆ తీగ ఎదిగేలోపు మనం వేరే చోటు చూసుకోవాలనీ లేదంటే దానిని ఆధారంగా చేసుకొని వేటగాడు చెట్లపైకి సులభంగా ఎక్కి వలపన్నితే మనమంతా పట్టుబడి పోతామనీ నాయకుడైన సుందరకీర్తికి చెబుతాడు. అతను ఎప్పటిలాగే నిర్లక్ష్యధోరణితో అది ఎదిగినప్పుడు చూసుకుందామని తోసి పుచ్చేస్తాడు.

చక్రవాక పక్షుల వేటకై బయలుదేరిన వేటగాడు ఆ రెండు పొన్న చెట్లను చూడటం, దానికున్న మాధవీలత తీగ ఆధారంగా ఆ పక్షులు విహారానికి వెళ్ళిన సమయం చూసి చెట్లను అవలీలగా ఎక్కడం, వల వేయడం జరిగిపోయింది. హాయిగా వలవేసి వేటగాడు భోజనం చేద్దామని నదీ తీరానికి వెళ్ళగానే చక్రవాక పక్షులన్నీ గూళ్ళకు చేరతాయి. అంతే వలలో చిక్కుకుపోయి జరిగిందేంటో ఊహించి ఎటూ పాలుపోక కుమిలిపోతాయి. వేటగాడు తాపీగా వచ్చి ఆ వందకుపైగా చక్రవాక పక్షులను అమాంతం వలతో సహా తీసుకొని వెళ్ళి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకొని చాలా లాభం పొందుతాడు. చివరిసారిగా వలలో చిక్కుకున్న సుందరకీర్తి తన నిర్లక్ష్యం, అనుభవం ఉన్న తాత మాటను పట్టించుకోకపోవడం వల్ల జరిగిన దానికి చింతిస్తాడు. తన నాయకత్వ వైఫల్యాన్ని తలచుకొని తలదించుకుంటాడు.
ఇట్టేడు ఆర్కనందనా దేవి

944
Tags

More News

VIRAL NEWS