సరైన ఎంపిక


Sun,December 2, 2018 02:33 AM

Chakravarthi
జీవితం మనిషికి అన్నీ ఇస్తుంది. అవకాశాలూ, అవామానాలూ.. అయితే సరైన ఎంపిక మనిషి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆలోచనలు, భావనలు, ఉద్వేగాలను తోడుగా చేసుకొని నిర్ణయాత్మక సమర్థతతో మనిషి తనకు కావాల్సిన వాటిని ఎంచుకోవడంలోనే వివేకం ఉంది. సంకల్ప శక్తికీ, వివేచనకూ ఆధారమైన భౌద్ధిక పార్శం ప్రతీ మనిషిలో ఉండే అద్భుత పర్వం. పట్టిందల్లా బంగారమవుతున్న ప్రతీ మనిషిలో ఎక్కడో సంకల్పబలం, గంభీరమైన శ్రద్ధ, అకుంఠిత విశ్వాసం, సాహసం ఉండే ఉండాలి. ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల ప్రాభవంలో లభించే ఫలితాల పట్ల సరైన అవగాహన ఉండాలి. తనకేం కావాలో, తను కావాలనుకున్నది జీవితంలో అనువైనదై ఉంటుందో లేదో, తను ఎంచుకున్నది తన మనసుకూ, వ్యక్తిత్వానికి ఆసాంతం చేరువైందో లేదో అన్న బుద్ధికుశలత మనిషిని సరైన ఎంపిక దిశగా ప్రోత్సహిస్తుంది. సరైన ఎంపికే జీవిత విలువనూ, మాధుర్యాన్ని ఇనుమడింపజేస్తుందనే విషయం వివరిస్తుందీ కథ. చక్రవర్తి ఆ యువతి తెలివితేటలనూ, గుణగణాలనూ, వాక్చాతుర్యాన్నీ, ఆమె అందమైన రూపాన్ని మెచ్చి, ఆమె ఎంపికను గౌరవిస్తూ ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. మంత్రివర్గం, రాజ్యప్రజల ఆమోదంతో ఆ అందమైన యువతిని వివాహం చేసుకుంటాడు. 

- ఇట్టేడు అర్కనందనా దేవి

పూర్వం చాలా అద్భుతమైన వ్యక్తిత్వం గల చక్రవర్తి ఉండేవాడు. అన్ని విద్యల్లోనూ విశారదుడు. సద్గుణాలన్నీ కలబోసిన సంపన్నుడు. అందానికి నెలవైనవాడు. అంతకుమించిన దయానిధి. ఇన్ని మంచి విశేషాలు ఒకే ఒక్క వ్యక్తిలో ఇమిడిపోవడం అనేది నిజంగా అద్భుతమే. ఆ చక్రవర్తి ఆలోచనలు చాలా విభిన్నంగా ఉండేవి. అలా ఒకరోజు అతను తన రాజ్యంలో ప్రజల ఆలోచనలనూ, ఇష్టాయిష్టాలనూ, అవసరాలనూ తెలుసుకోవాలనుకొని రాజధానీ నగరం మధ్యలో చాలా పెద్దదైన వీధిని ఏర్పాటు చేయించాడు. దానికి విపణి వీధి అని పేరు కూడా సూచిస్తాడు. దాని ప్రత్యేకత ఏంటంటే చాలా విశాలమైన ఆ వీధిలోఎనిమిది విభాగాలను ఏర్పాటు చేయిస్తాడు చక్రవర్తి. రాతి, ఇనుము, ఇత్తడి, రాగి, వెండి, బంగారు, పీతాంబరాలతో మలచబడిన సమస్త వస్తువులూ వేరు వేరు విభాగాల్లో అమర్చబడ్డాయి. ఆ విపణి వీధి తూర్పు నుంచి పశ్చిమం దిశగా ఏర్పరుచబడింది.

చక్రవర్తి ఏడు విభాగాల్లో వరుసగా అనేక వస్తువులను ఏర్పాటు చేయించి ఎనిమిదవ విభాగం అంటే చివరన తన మంత్రివర్గంతో అందరూ కూర్చునే వెసులుబాటును ఏర్పరుచమని పురమాయించాడు. విపణివీధి సిద్ధమయ్యాక రాజ్యంలో ప్రకటన వేయించాడు. ప్రజలందరూ తప్పక విపణ వీధిని దర్శించాలనీ, విపణి వీధికి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏదైనా వస్తువును ఎంపిక చేసుకొని ఉచితంగానే దానిని తీసుకెళ్లవచ్చనీ, ఒక్కరు ఒక్క వస్తువును ఎంపిక చేసుకోవాలనీ, విపణి వీధి తూర్పు నుంచి పశ్చిమానికి ఏర్పరుచబడింది. కనుక ప్రతీ ఒక్కరూ తూర్పు నుంచి విపణివీధికి ప్రవేశించి తమకు కావాల్సిన వస్తువు ఏదైనా ఒకదానిని ఎంపిక చేసుకొని పశ్చిమ ద్వారంగా బయటకి వెళ్ళాలనీ, ప్రవేశించిన ప్రతీ ఒక్కరూ ఏదైనా ఒక్క వస్తువును తప్పక తీసుకెళ్ళాలనీ ఒట్టి చేతులతో వెళ్ళరాదనీ షరతులతో కూడిన ప్రకటన రాజ్యమంతా దండోరా వేయించాడు చక్రవర్తి.

చక్రవర్తి విపణివీధిలోని ఎనిమిదవ విభాగంలో తన మంత్రులతో కలిసి కూర్చొని వచ్చీ పోయేవారి అభిరుచులను గమనిస్తూ ఉన్నాడు. ముందుగా ఒక గ్రామీణ యువకుడు విపణి వీధిలో ప్రవేశించాడు. అతనికి తన ఇంట్లో రోలు లేదనే తలంపు వచ్చి రాయితో చేసిన రోలును తీసుకున్నాడు. దానిని తీసుకొని ఒక్కో విభాగాన్ని దాటుతూ వెళుతుంటే ఇంతకన్నా గొప్ప వస్తువులున్నాయే! తొందరపడి మొదటి విభాగంలోనే రాయిరోలును ఎంపిక చేసుకున్నానే! అని బాధపడుతూ వెళ్ళిపోతాడు. తరువాత ఒక గృహస్థుడు విపణి వీధిలోకి వచ్చి రాతి విభాగాన్ని దాటి ఇనుముతో చేసిన నాగలిని ఎంపిక చేసుకొని మరిన్ని విభాగాల్లోని మంచి వస్తువులు వదులుకున్నాననే చింతతో బయటకి వెళ్ళిపోతాడు. అలా ఎందరో ప్రజలు తమకు కావాల్సినవి ఉచితంగా దొరుకుతున్నాయనే ఆత్రుతలో తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి పశ్చిమ ద్వారం నుంచి వెళ్లిపోతున్నారు. వెండి, బంగారు, రత్న, పీతాంబరాది విభాగాల్లోంచి ఎవ్వరూ ఏ వస్తువునూ తీసుకెళ్ళలేకపోయారు.

విపణి వీధిలోకి సాయంకాలం సమయంలో ఒక అందమైన యువతి, చూస్తేనే ఉట్టిపడే మేధస్సుతో, వివేకం ధ్వనించే ఆత్మవిశ్వాసంతో అడుగు పెడుతుంది. విపణివీధి నియమాలన్నీ చాలా శ్రద్ధగా తెలుసుకొని  మరీ వచ్చింది. అలా ఒక్కో విభాగంలోని అన్నీ వస్తువులనూ చూసి కూడా లక్ష్యపెట్టక అన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళుతూనే ఉంటుంది. అందరూ ఆమెనూ గమనిస్తున్నారు. ఆ యువతి అలా వెళ్ళి చివరగా ఉన్న ఎనిమిదవ విభాగంలో మంత్రుల మధ్యలో కూర్చొని ఉన్న చక్రవర్తిని సమీపించినది. ఆ అందమైన యువతి అందరూ చూస్తుండగానే చక్రవర్తి భుజంపై చేయివేసి, ఈ విపణి వీధిలో నేను ఎంపిక చేసుకున్నది మిమ్మల్నే! ఈ విపణిలోంచి ఏదైనా తీసుకొవచ్చనేదే కదా మీ ప్రకటన. మీరూ ఇందులో భాగమే కదా! అందుకే మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాను. నేను స్వతంత్రురాలను, అన్ని విధాలా మీకు తగిన దానను. మీకూ వివాహం కాలేదు. నాకూ వివాహం కాలేదు. నేను మిమ్మల్ని ఎంపిక చేసుకోవడంలోనూ, మీ పట్టమహిషిని కావాలనుకోవడంలోనూ ఏ మాత్రం తప్పులేదు. పైగా వస్తువులన్నీ అవసరానికి అక్కరకు వచ్చి, తర్వాత విరక్తిని పెంచే క్షణికమైనవి. బంధం మాత్రం శాశ్వతమైంది. కనుక మీరు నన్ను స్వీకరించాల్సిందేనని అంటుందా యువతి.

చక్రవర్తి ఆ యువతి తెలివితేటలనూ, గుణగణాలనూ, వాక్చాతుర్యాన్నీ, ఆమె అందమైన రూపాన్ని మెచ్చి, ఆమె ఎంపికను గౌరవిస్తూ ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. మంత్రివర్గం, రాజ్యప్రజల ఆమోదంతో ఆ అందమైన యువతిని వివాహం చేసుకుంటాడు. ఆ యువతి చక్రవర్తికి తగ్గ పట్టమహిషిగా పేరుగడించింది. జీవితంలో మన నిర్ణయాత్మక విశ్లేషణ సరైన ఎంపికను ప్రోత్సహించినప్పుడు దానిని సఫలం చేసుకోవడంలోనే మనిషిలోని బుద్ధికి అర్థముంటుంది. ఆ బుద్ధే మనిషి వ్యక్తిత్వానికి ప్రాణం పోస్తుంది.

252
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles