సమ్మక్క కొలువైన చిలుకల గుట్ట


Sun,February 14, 2016 02:48 AM


800 సంవత్సరాల క్రితం కాకతీయ ప్రతాపరుద్రుని సేనలతో పోరాడి ఓ సైనికుడి వెన్నుపోటుతో యుద్ధరంగం నుంచి వెనుదిరిగిన సమ్మక్క తల్లి జంపన్నవాగుకు ఈశాన్య దిశగా ఉన్న చిలుకల గుట్టకు వెళ్లి అక్కడే అదృశ్యమైందని కథనం. ఈ మేరకు యుద్ధంలో పాల్గొన్న ఓ కోయ సైనికుడు అందించిన సమాచారం ప్రకారం చిలుకల గుట్టను సమ్మక్క నిలయంగా భావిస్తారు.
గోదావరి పరీవాహక ప్రాంతమైన మేడారం ప్రాంగణానికి సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో చిలుకల గుట్ట ఉంది. ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన కీకారణ్యంగా విరాజిల్లిందని కోయజాతి ప్రజలు చెబుతుంటారు. 1968లో మేడారం జాతరను రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖకు అప్పగించినప్పటి నుంచి జాతర విశిష్టత పెరిగింది. దీంతోపాటే ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం చిలుకల గుట్ట ప్రాంతం తీవ్ర పర్యావరణ సమస్యతోపాటు తల్లి నిలయానికి ముప్పు పొంచి ఉందని కొన్నేళ్లుగా పూజారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోడుపోటుతో చిలుకల గుట్ట పరిసరాలు మైదానాలుగా మారుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. వనం ఉంటేనే అమ్మవార్లు ఉంటారని వారు అంటున్నారు. ఆ దిశగా అడవిని కాపాడే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Chiluka-gutta

చిలుకల గుట్ట సర్వరోగ నివారిణి అని, దివ్య ఔషధాల నిలయమని కోయ గిరిజనులు విశ్వసిస్తారు. సువాసనలు వెదజల్లే పలు రకాల చెట్లు గుట్టపై ఉన్నట్లు చెబుతారు. అడవిబిడ్డలను ఉద్ధరించేందుకు సమ్మక్క ఉద్భవించిందని నమ్ముతారు. కోయవీరులు తమపై ఉన్న భక్తికి వారి పట్టుదలకు మెచ్చి మాఘశుద్ధ పౌర్ణమి నాడు చిలుకల గుట్టపై పులి వాహనంగా ఎనిమిది చేతుల ఆయుధాలతో కనులు మిరుమిట్లు గొలిపేలా దివ్య తేజస్సుతో అమ్మవారు కనిపించిందంటారు. సమ్మక్క ప్రత్యక్షంగా కనిపించడంతో సంతోషించిన కోయ గిరిజనులు తిరిగి వచ్చి తమను పాలించమని యుద్ధంలో మృతి చెందిన వీరులందరినీ బతికించమని కోరారు. దీనిపై అమ్మవారు జాతస్య మరణం ధృవంఅని చెప్పి రాజ్య పాలనకు తన పునరాగమనం అసాధ్యమని చెప్పింది. తలచినంతనే కోరికలు తీరుస్తానని చెప్పి ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు వనదేవతల రూపంలో వస్తామని తెలిపింది. గూడెంలో మీతో ఒకరోజు గడిపి తిరిగి చిలుకల గుట్ట చేరుకుంటానని సమ్మక్క తల్లి చెప్పింది. ఆ రోజు కుల సంప్రదాయం ప్రకారం గిరిజన కులపెద్ద వచ్చి నన్ను స్వాగతిస్తేనే అంగరంగ వైభవంగా గద్దెకు చేరుకుంటానని, అక్కడ తనకు ఇష్టమైన పసుపు, కుంకుమలు, బంగారం, భక్తుల నుంచి కానుకలుగా తీసుకుంటానని చెప్పి మాయమైంది. అప్పటి నుంచి ఆ జాతి పరగణాల వారికి ఏ విధమైన ఆపద, జబ్బు, ఇబ్బంది వచ్చినా అమ్మను తలచినంతనే పరిష్కారం దొరికేది. దీర్ఘ రోగాలు, పాము కరిచిన వారికి వైద్యంగా పేదలకు ధనలక్ష్మిగా అవసరాలకు ఆదుకున్న సమ్మక్క మహిమలు కాలక్రమేణ విస్తృతమయ్యాయి. ఏ ప్రాంతం వారైనా కోరిన వెంటనే కోరికలు తీర్చే కొంగు బంగారంగా సమ్మక్క వారిని వెన్నంటి కాపాడుతోందన్నది వారి విశ్వాసం.

Chiluka-gutta3ఓ సందర్భంలో మునులు, దేవతలు పులి వాహనంపై ఉన్న అమ్మవారిని సేవించడం కొందరు గిరిజనులు చూశారట. మరో సమయంలో చిలుకల గుట్టపై ఊయలలో ఊగుతూ, చిలుకలతో మాట్లాడుతూ సమ్మక్క ఉన్నట్లు కోయలు చూశారట. అనారోగ్యం సంభవిస్తే తల్లికి మొక్కి చిలుకల గుట్ట ఎక్కి మొక్కనో, కాయనో, ఆకునో తెంపి వ్యాధిగ్రస్తునికి ఇస్తే క్షణంలో నయమయ్యేదనీ గిరిజనులు చెబుతారు. కాగా, ప్రస్తుతం చిలుకల గుట్ట పరిరక్షణను అధికారులు చర్యలు చేపట్టారు. గుట్ట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

2320
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles