సన్మార్గ స్వాగత తోరణం హజ్రత్ మౌలానా దర్గా!


Sun,July 8, 2018 01:42 AM

సమాజ నిర్మాణంలో ప్రవక్తలు, సంఘ సంస్కర్తలకు పురుడుపోసిన పుణ్యభూమి తెలంగాణ. అలాంటి ప్రవక్తలలో హజ్రత్ మౌలానా సయ్యద్ ఖాజా మొహినుద్దీన్ ఒకరు. మానవ సమాజానికి దిక్సూచిగా, మార్గదర్శకులుగా, మానవ సంబంధాల్లో ఆత్మీయతను పంచుతూ, ప్రభావితం చేసిన వాళ్లలో మౌలానా ముఖ్యులు. ఆయన పేరుమీద ఎన్నో మందిరాలు, దర్గాలు వెలిసి సందర్శనీయ ప్రదేశాలుగా మారాయి. అలాంటి వాటిలో ఒకటైన మౌలానా దర్గా విశిష్టతే ఈవారం దర్శనం.

-బి. కోహిరి, సెల్: 9398789204

ఎక్కడ ఉన్నది?:

సంగారెడ్డిజిల్లా కోహీరులో ఉంది. జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే జాతీయ రహదారికి సుమారు 95 కిలోమీటర్లు. కోహీరు చౌరస్తా నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మౌలానా దర్గా.

ఎలా వెళ్లాలి?:

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వికారాబాద్ మీదుగా బీదర్ వెళ్లే మార్గంలో దక్కన్ రైల్వేస్టేషన్ చేరుకొని అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళితే మౌలానా దర్గా చేరుకోవచ్చు. రోడ్డుమార్గం గుండా అయితే హైద్రాబాద్-ముంబై దారిలో కోహీరు చౌరస్తా నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

విశిష్టత:

క్రీస్తుశకం 11వ శతాబ్దంలో దేవగిరి రాజులు బలహీన పడటంతో మహమ్మదీయ రాజులు దక్కన్ ప్రాంతంలోకి ప్రవేశించారు. క్రీస్తుశకం 13వ శతాబ్దం ఆరంభంలో కాకతీయ ప్రతాపరుద్రుడి పాలనలో ఓంకార పట్టణంగా ఈ ప్రాంతం ఉండేది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దగ్గర శిశ్యుడిగా వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రబోధిస్తూ ఉండేవారు మౌలానా. 35 మంది శిష్యులతో ఓంకార పట్టణంలో కొంతకాలం ఉన్నారు. కాకతీయ ప్రతాపరుద్రుడు వారికి అన్నివిధాల సహకారం అందజేసి మానవజాతిని సన్మార్గంలో నడిపించేందుకు ప్రబోధాలు అందించాల్సిందిగా కోరారట. అనురాగం, ఆత్మీయత, సోదరభావం, ఐక్యతను మానవాళికి పెంపొందిస్తూ ఆచరణీయ స్ఫూర్తిని అందించిన మోక్షసాధకుడిగా ఆ కాలంలో మౌలానా నిలిచారు.
MUKA-DWARAM

ప్రాచీనమైన దర్గా:

మౌలానా ఈ ప్రాంత ప్రజలతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. తన ప్రబోధాలతో ఎందరినో ప్రయోజకులను చేశారు. అంతటి ప్రభావవంతమైన హజ్రత్ సయ్యద్ మౌలానా అనంతరం ఈ ప్రాంతం దర్గాగా వెలిసింది. ఇది 800 సంవత్సరాల నాటిదిగా స్థానికులు పేర్కొంటున్నారు. మౌలానా దర్గా సమీపంలో అతడి గురువులు, శిష్యులకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీన్నిబట్టి ఇది సామరస్య కేంద్రంగా, మానవ వికాస స్థావరంగా విలసిల్లిందని చెప్తుంటారు ప్రజలు. దర్గాకు తూర్పున అతని గురువు సమాధి ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ దర్గాను సందర్శిస్తుంటారు. వీరిలో పేరుగాంచిన వాళ్లు కూడా ఉన్నారట. గుల్బర్గా ప్రవక్త ఖాజా బందె నవాజ్ ఈ దర్గాను సందర్శించారు. అతడు విడిది చేసిన ప్రాంతాన్ని ఖాజాబాగ్ అని పిలుస్తున్నారు. మౌలానా దర్గాకు 2 కిలోమీటర్ల దూరంలో ఆయన శిష్యుడిగా పేరుపొందిన మారూఫ్ హుస్సేన్ దర్గా కుస్బా ప్రాంతంలో ఉంది.

ఉర్సు ఉత్సవాలు:

ప్రతీ సంవత్సరం 15 జనాదిసని నుంచి 17 జమాదిసని వరకు మూడ్రోజుల పాటు ఉర్సు జరుగుతుంది ఇక్కడ. ఈ ఉర్సుకు రెండు వేర్వేరు విశిష్ట ప్రాంతాల నుంచి సామగ్రిని తీసుకొస్తారు. హీరమన్ సందల్ మారుఫ్‌సాబ్ దర్గా నుంచి సందల్‌లో పూజలు నిర్వహిస్తారు. ఈ సందల్‌లో పూలు, ఛాదర్, శక్కరి, నూనె తదితర పూజా సామాగ్రి వినియోగిస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి కూడా భక్తులు ఉర్సులో పాల్గొంటారు. నెల రోజులపాటు ఉర్సు వైభవంగా జరుగుతుంది. ఆయురారోగ్యాలు కలుగుతాయని, కోరికలు సిద్ధిస్తాయని ఇక్కడకు వచ్చిన భక్తుల నమ్మకం. ఈ దర్గాను దర్శించిన వారికి ఆత్మైస్థెర్యం కలుగుతుందంటారు. మౌలానా దర్గాలో ప్రతీరోజు ప్రాతఃకాలంలో ఒక పులి వచ్చి తన తోకతో దర్గా పరిసరాలను శుభ్రం చేస్తుందని భక్తుల నమ్మకం. దీర్ఘకాలిక వ్యాధులతో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు వచ్చి దర్గాను దర్శిస్తుంటారు. మొక్కులను చెల్లిస్తారు.

608
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles