సకల కళాభారతి!


Sun,July 29, 2018 07:03 AM

Ravindra-Rathi
ఒకప్పుడు రవీంద్రభారతి తెలంగాణ కళాకారులకు అందని.. కాలు పెట్టలేని.. ప్రవేశం లేని కళా నిలయం. ఇప్పుడు రవీంద్రభారతి కవీంద్ర భారతి. తెలంగాణ తల్లికి సకల సాహిత్య సుధాహారతి. మనందరి చిరునామా. తెలంగాణ భారతి. కొత్త చరిత్రకు పునాది. కొత్త కవులకు ఉగాది. ప్రతి మడి తడియై నవ్వే.. ప్రతి కమ్మ బతుకమ్మయి ఆడే.. ప్రతి కలం అక్షరాల వానై కురిసే.. బహుళ దరువుల ఝరి. రంగు రంగుల కావ్య ధనుస్సుల పురి రవీంద్రభారతి. ఒక బ్యానర్ తియ్యకముందే మరొక బ్యానర్.. కవి గోష్టులు.. కథా వర్క్‌షాప్‌లు.. కూచిపూడి.. పేరిణి.. సంగీత.. నృత్య నాటకాలు.. పైడి జయరాజ్ ప్రివ్యూలు.. చందాల కేశవదాసుల వెండి కాంతుల హారతి.. సకల కళాభారతి రవీంద్రభారతి!
దాయి శ్రీశైలం, సెల్: 8096677035

అన్నీ అద్భుతాలే:

ప్రత్యేకంగా నేను కళాభిమానిని. మా రోజుల్లోనూ కళలకు చాలా ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం. ఒక కళ నేర్చుకోవాలంటే.. దానిని ప్రదర్శించాలంటే ఎంతో ప్రయాస ఉండేది. కానీ ఇప్పుడు అవేవీ లేవు. అన్నీ రవీంద్రభారతిలోనే ఉచితంగా లభిస్తుండటం గొప్ప విషయం. ఒక రకంగా రవీంద్రభారతి అద్భుతాలకు వేదికైంది. మామిడి హరికృష్ణకు అభినందనలు.
-వరప్రసాద్‌రెడ్డి, శాంతా బయోటెక్

దిమాగ్ కరాబ్ రవీంద్రభారతి:

రవీంద్రభారతి యూత్ హబ్‌గా మారింది. సంవత్సరం పొడవునా ఇక్కడ కళాకారుల సందడి కనిపిస్తుంది. కళలకు పట్టం కట్టడంతో పాటు భాషా, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడంలో మామిడి హరికృష్ణగారి పాత్ర అత్యంత క్రియాశీలం. గడచిన నాలుగేండ్లలో జరిగిన కవి సమ్మేళనాలు కమాల్ కీ బాత్. నిరంతర కార్యక్రమాల ద్వారా సరదాగా దిమాగ్ కరాబ్ అని చలోక్తులు విసురుతున్నారు.
-మోహన్ రుషి, కవి

ఫిల్మ్ మేకర్స్ పొదరిల్లు:

మనవైన కథలు ప్రపంచానికి చెప్పగలిగే తెలంగాణ సినిమా రావాలంటే మాటలతో రాదు. ఆ సినిమా కోసం కష్టపడాలి. ఆ పని రవీంద్రభారతి చేస్తున్నది. మొదటి అవతరణలో జరిగిన ప్రోగ్రాంస్ నుంచి నిన్నటి అవతరణ ఫిల్మోత్సవం వరకూ నేను భాగస్వామ్యం అవడం గర్వంగా ఉంది. హరివిల్లు లాంటి ఏడు కార్యక్రమాలతో అలరారుతున్న పైడి జైరాజ్ థియేటర్ ఫిల్మ్ మేకర్స్‌కు ఒక పొదరిల్లు.
-నరేందర్‌గౌడ్ నాగులూరి, డైరెక్టర్

తెలంగాణ నేల ఎన్నెన్నో కళలకు, కళారూపాలకు, కళాకారులకు పట్టుగొమ్మ. అనాదికాలం నుంచి భౌగోళికంగా, సాంస్కృతికంగా తెలంగాణకు అద్భుతమైన చారిత్రక వారసత్వం ఉంది. శాస్త్రీయ, జానపద కళా సంపదకు సంబంధించిన మహా వైభవమూ ఉంది. ఎన్నో రకాల జానపద కళారూపాలు, మట్టి కళారూపాలు ఇక్కడే ఉద్భవించాయి. అవి పరిఢవిల్లడానికి.. ఉన్నత స్థానానికి చేరుకోవడానికి వేదిక కావాలని రవీంద్రభారతిని ఏర్పాటు చేశారు.

అసలు ఉద్దేశమేంటి?

కళల విస్తరణ, కళాకారుల అభివృద్ధే లక్ష్యంగా రవీంద్రభారతి ఏర్పాటైంది. సామాజిక, సాంస్కృతిక, సాహిత్య ప్రదర్శనలకు అవకాశం కల్పించాల్సిందిగా నిర్దేశించబడింది. అయితే, కళను కొంతమందికే పరిమితం చేసి తెలంగాణ కళాకారులపై వివక్ష చూపిస్తూ వచ్చారు.

ఏం జరిగేది?

సాయంత్రం కాగానే ఏదో భాగోతమో.. నాటకమో జరిగేది. వాటిని వీక్షించడానికి కొందరు ప్రేక్షకులు వచ్చేవారు. తెల్లారితే న్యూస్ పేపర్లలో ఆకట్టుకున్న నాటకోత్సవం పేరుతో ఒక వార్త వచ్చేది. అక్కడ కళలను ప్రదర్శించాలి. కళాకారులను అభివృద్ధి చేయాలి. చెల్లియో చెల్లకో.. తమకు చేసిన యెగ్గులు సైచిరందనురన్, బావా ఎప్పుడు వచ్చితివి, ఎక్కడి నుండి రాక ఇటకు ఎల్లరునున్ సుఖులే కదా, చచ్చెదమో రిపువీరుల వ్రచ్చెదమో ఎవ్వడెరుగు రాదలచినచో వంటి పద్యాలతో వయసు పైబడిన వారికి అవసరమొచ్చే కార్యక్రమాలుగా వీటిని రూపొందించేవారు. ఒకటి కాదు.. రెండు కాదు.. అరవైయేండ్లు ఇదే కథ నడిచింది. తెలంగాణ కళలను.. కళాకారులను రవీంద్రభారతి మెట్లు ఎక్కకుండా వివక్ష రాజ్యమేలింది. దీంతో రవీంద్ర భారతి అంటే తమది కాదు.. అక్కడ ప్రదర్శనలిచ్చే వారు వేరే ఉంటారు అనే భావన మన ప్రజల్లో ఏర్పడింది. గ్రామీణ జానపద కళారూపాలు అనేకం ఉన్నప్పటికీ ప్రాముఖ్యం ఇవ్వలేదు. కళాకారులు సరైన గుర్తింపునకు నోచుకోలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే వెనక్కి నెట్టేయబడ్డారు. ఒక్కసారైనా కవి సంగమంలో పాల్గొనాలని.. వేదికపై కళా ప్రదర్శన ఇవ్వాలని.. ఆడాలని.. పాడాలని తెలంగాణ యువ కళాకారులకు ఉన్నా అది కలగానే మిగిలిపోయింది.

కళల కార్ఖానా

తెలంగాణ కళల ఖజానా అనీ.. రవీంద్రభారతి ఆ కళలను తీర్చిదిద్దే కార్ఖానా అని చాటి చెప్పింది. రవీంద్రభారతిలో నాటకాలు మాత్రమే జరగవు, కళ పుట్టుక.. ప్రదర్శన.. వ్యాప్తి కూడా అక్కడే జరుగుతుందని నిరూపితమైంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మట్టి కళా రూపాలన్నీ వెలికి వచ్చాయి. కళలకు సంబంధించిన గౌరవాల్ని, అస్తిత్వాల్ని, గుర్తింపులను కల్పించేందుకు కృషి చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ. కళ కొందరిది కాదు, అందరిదీ అని నిరూపించింది. కళ కళ కోసం కాదు.. ప్రజల కోసం అని చాటి చెప్పింది. తెలంగాణ ప్రజా సంస్కృతికి ఘనమైన వారసత్వ చరిత్ర ఉన్నదని.. ఇక్కడి కళ రాతి గుండెలను సైతం కరిగించీ రాగాలు ఆలపించగలదని ప్రదర్శనల ద్వారా నిరూపించింది.

కొత్త చరిత

రవీంద్రభారతి ఇప్పుడు యువ ఔత్సాహిక కళాకారులకు వేదికైందంటున్నారు కవి వనపట్ల సుబ్బయ్య. రవీంద్రభారతిలోని నిత్య సాహిత్య సంబురాలపై తనదైన శైలిలో రాసిన కవితలో రవీంద్రభారతి గురించి చెప్తూ.. స్వర్ణాంధ్ర మిన్నాగుల పడగ నీడలో.. గేటు దగ్గరే గెంటేయబడ్డోళ్లం.. మర్రిచెట్టు నీడలో.. వలవల వలపోస్తూ కండ్లు నల్సుకుంటు.. వచ్చిన తోవల్నే మల్లిపోయినోళ్లం.. మాది మాగ్గాకుండా పోతదాని.. మనసుల్లోనే కుదేలుపడ్డోళ్లం. ఇప్పుడు.. కుముమూర్తి జాతరల్లా.. కన్నార్పకుండా బృహత్ కవి సమ్మేళనాలు.. ముషాయిరాలు.. ఖవ్వాలి కవాతుల ధిక్కార స్వరాలు.. మహాబోనాలు.. విశ్వ బతుకమ్మల ఆత్మగౌరవ పతాకాలు.. ఆకాశమెత్తు దక్కన్ సదరు ఉత్సవాలు.. సాహిత్య సమూహ సముద్రాలు.. మారాకు తొడుగుతున్న కొత్త చరితలు అని సకల సాహిత్య.. సాంస్కృతిక వేదికైన రవీంద్రభారతి గురించి వర్ణించారు.

దర్శకులకు దగ్గరి దారి..

తెలంగాణ సినిమా కోసం ఆరాటపడే యువ దర్శకులు, రచయితలు, నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానులకు ప్రపంచ సినిమాను పరిచయం చేసే ఉద్దేశ్యంతో తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ తీసుకొచ్చిన మరో కార్యక్రమం సండే సినిమా. ప్రతీ ఆదివారం ప్రపంచ సినిమాల ప్రదర్శనతో పాటు వర్దమాన సినీ కళాకారులకు ప్రపంచస్థాయి సినిమాను పరిచయం చేసి ప్రపంచస్థాయి సినిమా నిర్మాణ విలువలు, విశేషాలు, మెళకువలను తెలియజేసేందుకు వివిధ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. ప్రతీ శనివారం సినీవారం పేరిట సినీ ప్రదర్శన, అభినందన కార్యక్రమాలు ఏర్పాటుచేసి ఎందరికో రూట్ చూపిస్తున్నారు. త్వరలో దాదాపు 15 మంది యువ దర్శకులను సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ కృషి చేస్తున్నారు. ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరిట ఇంటర్నేషనల్ సినిమాను పరిచయం చేస్తూ ప్రతీవారం చిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఫిల్మోత్సవం, బతుకమ్మ ఫిల్మోత్సవం, యువ చిత్రోత్సవం వంటి కార్యక్రమాలను నిరంతరం ప్రదర్శిస్తున్నారు.

ఎప్పుడు స్థాపించారు?

రవీంద్రభారతి ఏర్పాటే ఓ మంచి సదుద్దేశ్యంతో జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశంలో పలుచోట్ల రవీంద్రభారతి కార్యాలయాలు ఏర్పాటుచేశారు. హైదరాబాద్ నగరంలో 1960 మార్చి 23వ తేదీన రవీంద్రభారతికి శంకుస్థాపన చేశారు. కళలను పరిరక్షించడం, కళాకారులను ప్రోత్సహించడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన కళా వైభవాన్ని చాటడం రవీంద్రభారతి ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యం. కానీ, కళామతల్లి అని గొప్పలు చెప్పుకునే వాళ్లు కళా విధ్వంసం చేసి రవీంద్రభారతిని కొన్ని మూస కార్యక్రమాలకు.. కొంతమంది కళాకారులకే పరిమితం చేశారు. సామాజిక, సాంస్కృతిక, సాహిత్య ప్రదర్శనలతో నిత్యం ప్రేక్షకులను అలరించే కళావేదికగా హైదరాబాద్ మారాలని ఆకాంక్షిస్తూ మూడెకరాల విస్తీర్ణంలో ఏర్పడిన రవీంద్రభారతికి 1961 మే 11వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభోత్సవం చేశారు. తొలుత రవీంద్రభారతి నిర్వహణను ప్రభుత్వమే చూసుకునేది. తర్వాత 1963లో స్వయంప్రతిపత్తి హోదా కల్పించింది. 1989 వరకు మేనేజ్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగింది. 1989 నుంచి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖకు అప్పగించారు. కళా భవన్, ఐసీసీఐ ఆర్ట్ గ్యాలరీ, ఘంటసాల వేదిక, కాన్ఫరెన్స్ హాల్, మినీ హాల్, తేజోమూర్తుల మందిరం ఉండేవి. సాయంత్రం వేళల్లో నృత్య, నాటక ప్రదర్శనలు జరుగుతుండేవి.

Cinivaram

సినిమా అవకాశాలకు కేంద్రంగా..

ఒకప్పుడు సినిమా పరిశ్రమలోకి వెళ్లాలంటే కాళ్లరిగేలా సినీ పెద్దల వద్దకు తిరగాల్సిన పరిస్థితి. జెన్యూన్‌గా వినూత్న ఐడియాలజీ ఉన్న తెలంగాణ ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్‌కు ఏనాడూ పెద్దగా అవకాశాలు ఇచ్చేవాళ్లు కాదు. టాలెంట్ ఉండి కూడా చాలామందికి సినిమా కలగా మిగిలిపోయేది. కానీ ఇప్పుడు అలాంటి వాళ్లందరికీ రవీంద్రభారతి ఒక అవకాశాల సెంటర్‌గా మారిపోయింది. సినీవారం కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువ సినీ దర్శకుల్లోని టాలెంట్‌ను గుర్తించి వారిని లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు, ఫీచర్‌ఫిల్మ్స్ రూపొందించే యువ దర్శకులు ఎంతోమంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, రంగస్థలం, మ్యూజియంలను వీటికోసం అందుబాటులో ఉంచారు.

సినిమా పరిజ్ఞానం:

కళల ప్రదర్శనతోపాటు సినిమాను ప్రదర్శించాలి. సినిమాలో రాణించాలి అనే ఆలోచన ఉన్న తెలంగాణ యువతరాన్ని తన ఒడికి చేర్చుకుంటున్నది రవీంద్రభారతి. యువ సినీ క్రియేటివ్ పర్సన్స్‌కు ప్రోత్సాహం ఇచ్చి తెలంగాణ సినిమాను తయారు చేయాలన్న మామిడి హరికృష్ణ ఆలోచన అద్భుతం. అలాంటి అవకాశం నాకు లభించింది. దీనిని అదృష్టంగా భావిస్తున్నా. సినిమా పరిజ్ఞానం, ప్రపంచ సినిమాపై అవగాహనతో సహా సినిమా ఫ్రెండ్స్ నాకు ఇక్కడ లభించాయి.
అక్షర కుమార్, దర్శకుడు

ఇదొక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్:

రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ కళలకు, కళాకారులకు సరైన గుర్తింపు లభిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర భాషా-సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు రూపొందుతున్నాయి. ఇదొక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌గా మారిపోయింది. ఎంతోమంది ఔత్సాహిక క్రియేటర్స్‌కు వేదికగా మారింది. ఇంత గొప్ప యజ్ఞంలో నేనూ భాగస్వామ్యం అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా.
ప్రణయ్ రాజ్,
తెలుగువికీ రైటర్

యువ కళాభారతి..

రవీంద్రభారతిలో ఏ విభాగంలో చూసినా యువ కళాకారులే కనిపిస్తుంటారు. ఒగ్గుడోలు నుంచి చిందు యక్షగానం వరకు.. సినిమా నుంచి నాటకం వరకు అన్నింట్లోనూ యువతే పాల్గొంటున్నారు. ప్రతి రోజూ మూడు పూటలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొత్త ఐడియాలజీకి వేదికైంది. ఇక్కడి కూర్చొని ఆలోచిస్తే వినూత్న ఐడియాలు వస్తాయనే భావన యువతలో వచ్చింది. ఒకప్పుడు ప్రవేశానికే నోచుకోని తెలంగాణ యువత ఇప్పుడు రవీంద్రభారతిని సొంతింటిగా భావించి తమలో ఉన్న టాలెంట్‌ను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. యవతలోని ఈ ఆసక్తిని గమనించిన భాషా సాంస్కృతిక శాఖ వారికి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తూ టాలెంటెడ్ యంగ్ జనరేషన్‌ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నది.
Ravindra-Rathi6

రవీంద్ర భారతి ప్రజల పరమైంది!

అరవైయేళ్లు సాంస్కృతిక విధ్వంసానికి గురైన రవీంద్రభారతికి కొత్త రూపురేఖలు తీసుకొచ్చారు. ఎలా చేస్తున్నారు అని మామిడి హరికృష్ణను అడిగితే.. త్రీ టీ విధానం అన్నారు. రవీంద్రభారతి వేదికగా 56 సంవత్సరాలలో ఒక ట్రెడిషన్ ఏర్పడింది. అందుకే ట్రెడిషన్‌కు కొత్త వన్నెలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మరో టీ.. ట్రెండ్. యువత కొత్తగా ఆలోచిస్తున్నది. కాబట్టి వారికి అనుగుణంగా ఉండేందుకు అప్‌డేట్ ట్రెండ్స్ ఫాలో అవుతున్నాం. ఇంకో టీ.. టెక్నాలజీ. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి దానిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు. మిగతా విషయాలూ ఆయన మాటల్లోనే..
Ravindra-Rathi7
రవీంద్రభారతి టార్గెట్ కళాకారులు, ఆర్గనైజర్స్, వీఐపీలు, ఆడియన్స్. కాబట్టి వాళ్లను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ప్రధానంగా ఆవో అప్రోచ్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఆవో అప్రోచ్ అంటే.. ఆర్టిస్ట్ ఫ్రెండ్లీ, ఆడియెన్స్ ఫ్రెండ్లీ, ఆర్గనైజర్స్ ఫ్రెండ్లీ. వీటన్నింటినీ విజయవంతంగా అమలు చేస్తూ ప్రతిరోజూ మూడు కార్యక్రమాలు జరుగుతాయి.

ఇంటర్నేషనల్ రేంజ్..

రవీంద్రభారతి ఇంటర్నేషనల్ స్థాయి కళా నిలయం. ఇక్కడ అద్భుతమైన సౌండ్ సిస్టమ్స్, ఇంటర్నేషల్ రేంజ్‌లో ఏర్పాటుచేశాం. లైటింగ్ అద్భుతంగా ఉంటుంది. రవీంద్రభారతి చరిత్రలో గర్వంగా చెప్పుకునే మరో సిస్టమ్ గ్రీన్ రూమ్స్. ఒకప్పుడు గ్రీన్ రూమ్స్ అంటే ఏదో పగిలిపోయిన అద్దం.. ఒక దువ్వెన ఉండేది. వాళ్ల మొఖాలు వెతుక్కునేవాళ్లు. ఇప్పుడు నిలువెత్తు అద్దాలు. కళాకారుడికి మేకప్ నఖశిఖ పర్యంతం కనిపించాలి. భారతదేశంలో ఎక్కడా ఇలాంటి సౌకర్యం లేదు.

అన్నీ ఉచితమే..

ఫస్ట్‌ఫ్లోర్ సాహిత్య చర్చలు, పుస్తకావిష్కరణలు, గజల్స్, ముషాయిరాలు, అవార్డ్స్ ఫంక్షన్స్ నిర్వహిస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్‌లో జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమాలు ఉచితం. పుస్తక సంస్కృతిని పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు పుస్తకాలు ఆవిష్కరించుకోవాలంటే వేదికల్లేవు. కాబట్టి మన కళాకారులకు చాలా ఇబ్బందిగా ఉండేది. దానిని అధిగమించేందుకు అక్షర అనే కార్యక్రమం ద్వారా దీనిని అమలు చేశాం. వికలాంగులు రవీంద్రభారతిలో మెట్లు ఎక్కేవాళ్లు కాదు. ఇప్పుడు రెగ్యులర్‌గా వికలాంగుల కళా ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటికి దృష్టిపథం అనే పేరు పెట్టాం. గతంలో వికలాంగులు కళా ప్రదర్శనలకు ఇక్కడ అవకాశమే లేదు. వికలాంగులకు సంబంధించి అన్ని కార్యక్రమాలకు ఇప్పుడు వేదిక. ఈ కార్యక్రమాన్ని చేయూత అని పిలుస్తున్నాం.

సీఎం గారే ఆదర్శం..

కళాకారుడు కూడా ఓ హెరిటేజే. చిందు యక్షగాణ కళాకారుడి కళ ఇప్పటిదా? ఏడొందల యేండ్ల చరిత్ర. అంటే అంతటి చరిత్రకు ఆ కళాకారుడు వారసుడు అన్నమాట. భారతదేశంలో మొత్తంగా చూసినా యూట్యూబ్ చానెల్ ఉన్న మొదటి థియేటర్ రవీంద్రభారతి. ఫ్రీ వైఫై పెట్టిన థియేటర్ కూడా ఇదే. బుకింగ్ అంతా ఆన్‌లైన్ ద్వారా పెట్టారు. మూడు నెలల ముందు ఆన్‌లైన్లో బుక్ చేసుకోవాలి. ఘంటసాల ప్రాంగణంలో సంవత్సరంలో 125 రోజుల పాట ప్రతిరోజు తెలంగాణ కళాకారుల ప్రదర్శనలు జరుగుతాయి. బుర్ర కథా మహోత్సవం, హరితకథా మహోత్సవం, ఒగ్గు కథా మహోత్సవం వంటివి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఉర్దూ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు సలామ్ ఎ తెలంగాణ కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. అన్ని కళలు వస్తాయి. శాస్త్రీయ సంగీతం కూడా ఉంటుంది. శాస్త్రీయ సంగీతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేసేది లేదు. ఖవ్వాలి, సూఫీ సంగీత్, ముషాయిరా వంటివి ఉంటాయి. కానీ ఇంతకు ముందెన్నడన్నా ముస్లీంలు రవీంద్రభారతిలో కార్యక్రమాలు నిర్వహించేవారా? అనేది అర్థం చేసుకోవచ్చు. ఏదీ వదులుకోకుండా పనిచేస్తున్నాం. ఇదంతా సీఎం కేసీఆర్‌గారి ఆదర్శమే.

సజీవ సంస్కృతి..

హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ ఉత్సవాలకు అవకాశం ఉన్నది. ఈ బాధ్యతను ఎత్తుకున్నది రవీంద్రభారతి. సింపుల్‌గా రవీంద్రభారతి అంటే.. ఎక్కడ సంస్కృతి సజీవంగా ఉంటుందో, జీవ చైతన్యంతో తొణికిసలాడుతుందో అదే రవీంద్రభారతి. ఇదొక థింకింగ్ స్పాట్. మేధో మథనానికి కేంద్రం. మంచి హ్యాంగౌట్ స్పాట్. మహనీయుల జయంతి, వర్థంతి ఉత్సవాలకు కూడా అవకాశం లభించింది. వర్ణచాయ కార్యక్రమం ద్వారా పెయింటింగ్, ఫొటో ఎగ్జిబిషన్‌లకు అవకాశం కల్పిస్తున్నాం.
Ravindra-Rathi8

కొత్త వాళ్లకు అవకాశాలు!

కళకు సంబధించి ఇక్కడ వర్క్‌షాప్స్, ఆడిషన్స్ ఉంటాయి. ప్రదర్శనలు ఉంటాయి. రెగ్యులర్‌గా లలిత సంగీత శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఒక శాస్త్రీయ సంగీతానికి, లలిత సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. రంగస్థలంలో వివిధ రాష్ట్ర కళలకు శిక్షణ కోసం అవకాశం కల్పిస్తున్నాం. ఒక రకంగా రవీంద్రభారతి నేర్చుకునే స్థలం, ప్రదర్శనా స్థలం, పరిపక్వత స్థలం, ప్రావీణ్యతా స్థలం. ఇంతకుముందు ప్రదర్శన మాత్రమే ఉండేది. అది కూడా ఇంత స్కోప్ ఉండేది కాదు. ఇప్పుడు వచ్చేవాళ్లంతా కొత్తవాళ్లు. నవ యువకులు. కొత్తవారికి ఇస్తే మొదటి అవకాశం అవుతుంది. అది ఇంకొన్ని అవకాశాలకు మార్గమవుతుంది.

776
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles