సంపదే సమస్తమా?


Sun,November 4, 2018 04:04 AM

Income
మనదేశంలో 81,344మంది కోటీశ్వరులున్నారు. మూడేండ్ల క్రితానికి, ఇప్పటికి 68 శాతం మంది కోటీశ్వరులు పెరిగారు.ప్రపంచ ఆనంద సూచికలో మాత్రం మన స్థానం 133. మూడేండ్ల క్రితం అంటే.. 2016లో ఇదే మన స్థానం 118. అంటే.. 15 స్థానాలకు పడిపోయాం. దీన్నిబట్టి ప్రజల ఆదాయం పెరిగిపోతున్నది.. కానీ ఆనందం తరిగిపోతున్నదని అర్థం చేసుకోవచ్చు. మరి ఆదాయం పెరిగితే ఆనందం కూడా పెరుగాలి కదా? ఎందుకు పెరగడం లేదు. అంటే.. డబ్బుంది.. సుఖం లేదు. ఆహారం ఉంది.. అరుగుదల లేదు. మందులున్నాయి.. కానీ రోగాలు రోజు రోజుకూ కొత్తవి పెరిగిపోతున్నాయి. ఆదాయం ఉంటే.. అన్నీ ఉండాలి, ఆనందంతో సహా అని చెప్పలేమన్నమాట. ఆదాయం పెరిగితే ఆనందం ఎందుకు కొరవడుతున్నది? ఆదాయం వేటలో పడి ఆనందాన్ని కోల్పోతున్నామా? ఇంతకూ మనకేం కావాలి? ఆదాయమా? ఆనందమా??

నగేష్ బీరెడ్డి
ఫీచర్స్ ఎడిటర్, నమస్తే తెలంగాణ
సెల్ : 80966 77177

Income1

అత్తారింటికి దారేది?

సినిమాలో ప్రవీణ్ నల్లా అనే వాడిని కథానాయకుడు గౌతమ్ నంద ఇలా అడుగుతాడు.. మా కంపెనీ షేర్లు కొంటే నీకు ఏమొస్తదిరా? అని. అందుకు నాకు ఆనందం వస్తది? అంటాడు ప్రవీణ్. రివాల్వర్‌తో కాళ్లకి బుల్లెట్ తగులకుండా కాలుస్తాడు గౌతమ్. ప్రవీణ్ భయపడుతాడు.ఆ.. ఇది భయం.. (కాల్చిన రివాల్వర్ చెంపకు తాకిస్తూ) ఇది బాధ. మరి ఆనందం ఎలా ఉంటదిరా?.. వెతుకు.. డబ్బులో ఉంటదా? అమ్మాయిలు తిరిగే క్లబ్బులో ఉంటదా? లేదంటే వాళ్ల ఒంటి మీద జారే సబ్బులో ఉంటదా? అని వెదుకమంటాడు. ఆ తర్వాత.. ఆనందం అంటే ఏంటని అడిగివా? అని గౌతమ్‌ని అడుగుతాడు వాళ్ల తాతయ్య నవ్వుతూ. మరి నాకు ఆనందం ఏంటో తెలుసా? అని కూడా ప్రశ్నిస్తాడు ఏదో ఆశిస్తూ. డైనింగ్ టేబుల్ కుర్చీలను చూపిస్తూ.. ఇవన్నీ నిండిపోవాలి.. అప్పుడే నాకు ఆనందం అంటాడు. వారికి మిలాన్‌లో కోట్లకు కోట్ల ఆస్తి ఉంటుంది. కానీ ఏదో వెలితి. ఆనందంగా ఉండరు. బాగుండడం అంటే బాగా ఉండడం కాదు.. నలుగురితో ఉండడం.. నవ్వుతూ ఉండడం. అదే వారికి లేదు. సంపదలు ఎన్ని ఉన్నా సంతోషంగా ఉండలేరు కొందరు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా చిరునవ్వులొలికిస్తూ ఆనందంగా గడిపేస్తుంటారు ఇంకొందరు. ఏమిటీ వ్యత్యాసం? అంటే.. సంపదే సమస్తం కాదు. అది ఉంటే.. సకల సౌకర్యాలతో సుఖంగా ఉండొచ్చేమోగానీ సంతోషంగా ఉండకపోవచ్చు.

జ్యో అచ్చుతానంద సినిమాలో విడిపోవాలనుకుంటున్న కొడుకు(నారా రోహిత్, నాగశౌర్య)లను ఉద్దేశించి తల్లి ఒక మాట చెబుతుంది. కలిసి సంతోషంగా ఉండలేనప్పుడు.. విడిపోయి అయినా.. సుఖంగా ఉండడి అని. సింపుల్‌గానే చెప్పినా ఎంత గొప్ప మాట అది. సుఖానికి, సంతోషానికి ఎంతో తేడా ఉందని చెప్పకనే చెబుతుంది ఆ తల్లి. ఇంతకీ సుఖానికి, సంతోషానికి ఏమిటి తేడా?
చాలా తేడా ఉంది.. బతుకడానికి.. జీవించడానికి ఉన్నంత తేడా ఉంటుంది.

సుఖం అంటే కంఫర్ట్.. సౌకర్యం. సంతోషం అంటే హ్యాపీనెస్.. మరి ఆనందాన్ని కూడా హ్యాపీనెస్ అంటాం కదా. సంతోషానికి ఆనందానికి ఏమిటి వ్యత్యాసం? సుఖం.. సంతోషం, ఆనందం ఈ మూడూ ఒక రకం కాదు. అనుకూలత ద్వారా కలిగేది సుఖం. సందర్భం, సంఘటనల ద్వారా కలిగేది సంతోషం. ఆనందం అనేది హృదయానికి సంబంధించినది. అంతర్గతమైనది. ఎవరికీ అర్థం కానిది. డబ్బు సుఖాన్ని, సంతోషాన్ని, సౌకర్యాన్ని అందించగలదు. కానీ శాశ్వతమైన అవసరమైన ఆనందాన్ని మాత్రం అందించలేదు.

మరి ఆనందంగా ఉంటున్నారా?

ఆనందం అనేది ఒక మనిషి లోపలి విషయానికి సంబంధించింది. మన వ్యక్తిగత ప్రవర్తన, ఇంటి పరిస్థితులను బట్టి అది మారుతూ ఉంటుంది. పెండ్లి విఫలం కావడం, పిల్లల్లో మనపట్ల కృతజ్ఞత లేకపోవడం, ఉద్యోగంలో అసంతృప్తి, పదోన్నతి లభించకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో మనలో ఆనందం కొరవడుతూ ఉంటుంది. సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. మరి ఈ సంతోషం కూడా అనేది మనిషి ధోరణిని బట్టే మారుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో విషయం సంతోషం అలియాస్ ఆనందాన్ని ఇస్తుంటుంది. అందం, వివేకం, తెలివి, విజయాలు, సంపద వంటివి మనిషికి సంతోషాన్ని తెచ్చిపెడుతాయని చెప్పలేం. ఎందుకంటే ఎంతో సంపద, పేరు ప్రఖ్యాతలు, అందం ఉన్నా సంతోషంగా లేని వారు చాలామంది ఉంటారు. మరి సంతోషంగా జీవించడం ఎలా అనేది వారి వారి మనఃస్థితిని బట్టి ఉంటుంది.

ఆనందానికి కొలమానాలు

మనిషి సంతోషం మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుందని అమెరికాలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఎంత సంపద ఉన్నా కోరిక తీరని వారు సంతోషంగా ఉండలేరు. ఎంత సంపద ఉంది? ఇంట్లో ఏఏ వస్తువులు ఉన్నాయి? కోరికల చిట్టా ఎలా ఉంది? అనే ఈ మూడు అంశాలు ఆనందాన్ని నిర్దేశిస్తాయని తేల్చారు. ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాల్లో 8 లక్షల మందిపై ఆరేండ్ల పాటు చేసిన పరిశోధన ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆ పరిశోధకులు వెల్లడించారు. ఆదాయం పెరిగే కొద్దీ కోరికలు అదుపులో ఉన్నప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడని వారు తెలిపారు. సంపద ఎంత ఉన్నా, కోరికలు ఆకాశంలో ఉంటే ఆనందం ఉండదని వివరించారు. ఒక దేశంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నంత మాత్రాన సంతోషం ఎక్కువ ఉండదని కూడా వారి పరిశోధనలో వెల్లడయినట్లు చెప్పారు.

పనిలో ఆనందం ఉందా? మనం ఆనందంగా ఉండాలంటే మనం ఇష్టపడే పని చేయాలి. మనకు ప్రావీణ్యం ఉన్న రంగంలో, మనం ఆస్వాదించే పనిని చేసుకునే అవకాశం దొరికితే మనం అదృష్టవంతులం. అందుకే ప్రపంచ ఆనంద నివేదికలో ఒక అధ్యాయాన్ని పూర్తిగా పని గురించే కేటాయించారు. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడాలి. బాగా చదువాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి.. ఇదే మనకు అందరూ చెబుతుంటారు. కష్టపడుతాం. ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తాం. మనకు తగ్గ భాగస్వామిని వెతుక్కుంటాం. ఇల్లు, కారు కొనుక్కుంటాం. మన పిల్లల్నీ అదే దారిలో నడిపిస్తాం. నలభై, యాభై యేండ్లు దాటాక ఓ ఉదయాన మనల్ని మనం జీవితం అంటే ఇదేనా అని ప్రశ్నించుకుంటాం. ఆదాయం పెరుగుదల కోసం, పదోన్నతి కోసమే సగం జీవితం పోయిందనిపిస్తుంది. అసంపూర్ణంగా బతుకుతున్నామనిపిస్తుంది. జీవించడానికి, బతుకడానికి మధ్య ఎంత తేడా ఉందో అర్థమవుతుంది. ఈ విషయం మనం యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరూ చెప్పలేదే అనిపిస్తుంది. మనం చేస్తున్న పని ఓ పనిలా అనిపించిందంటే నువ్వు నీకు ఆసక్తి ఉన్న రంగంలో లేవన్నమాట. చేస్తున్న పనిలో పడి ఏ సాయంత్రమో అయినప్పుడు మధ్యాహ్నం భోజనం చేయలేదన్న విషయం గుర్తుకు వచ్చిందంటే మనం మనకు నచ్చిన పనిని చాలా ఆనందంగా చేస్తున్నట్లే లెక్క.

పెరుగుతున్న ఆదాయం..

మనదేశంలో 81,344 మంది కోటీశ్వరులున్నారు. ఇది సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) అధికారికంగా చెప్పిన లెక్క. గడిచిన మూడేండ్లలో కోటీశ్వరులు 68 శాతం పెరిగారట. వీరిలో వ్యక్తులు, కార్పొరేట్లు, సంస్థలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఉన్నాయి. 2014-15 మదింపు సంవత్సరంలో వ్యక్తిగతంగా కోటి రూపాయలకు పైగా వార్షిక ఆదాయాన్ని చూపించిన పన్ను చెల్లింపుదారులు 48,416 మంది ఉన్నారని, 2017-18లో ఆ సంఖ్య 81,344కు చేరిందని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర ప్రకటించారు.

అన్నీ వదిలి.. ఆనందం కోసం కదిలి..


Income3

సంపద నుంచి సన్యాసం.. అక్కాతమ్ముల నిర్ణయం

వారు కావాలనుకుంటే విలాసవంతమైన జీవితం గడపొచ్చు. కానీ సన్యాసమే మేలని మనస్ఫూర్తిగా ఎంచుకున్నారు. సూరత్‌కు చెందిన వస్ర్తాల వ్యాపారి భరత్ వోరా కుమార్తె ఆయుషి వోరా (22), కుమారుడు యష్ వోరా (20) జైన సన్యాసులుగా మారాలని నిర్ణయించుకున్నారు. హైస్కూలు చదువు పూర్తి కాగానే ఇద్దరూ సన్యాస జీవితానికి శిక్షణ పొందేందుకు గురుశుశ్రూష చేశారు. టూవీలర్లు, ఖరీదైన కార్లలో తిరిగిన ఆ అక్కాతమ్ములు ఇక నుంచి పదయారులుగా జీవనం సాగించాల్సి ఉంటుంది. పంచభక్ష్య పరమాన్నాల స్థానంలో భిక్షాన్నం భుజించాల్సి ఉంటుంది. తండ్రి వ్యాపారంలో కొన్నాళ్లు పనిచేసినా తనకు ఆ జీవితం తృప్తి ఇవ్వలేదని, సన్యాసమే తనకు నచ్చిందని యష్ చెప్పారు. డిసెంబర్ 9న వారికి సన్యాస దీక్ష ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.
Income4

వంద కోట్ల వ్యాపారం వదిలిన

మోక్షేష్ సేథ్
ముంబైకి చెందిన ఇతని పేరు మోక్షేష్ సేథ్. వయసు 24 సంవత్సరాలు. మొదటి ప్రయత్నంలో చార్టెట్ అకౌంటెంట్ అయ్యాడు. ఇతని తండ్రి సందీప్ సేథ్ కరుణప్రేమ్‌విజయ్ జీగా ప్రసిద్ధి. సందీప్‌కి మోక్షేష్ పెద్ద కొడుకు. వీరికి సంగ్లీలో అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంది. సీఏ అయిన తర్వాత మోక్షేష్ తన కుటుంబ వ్యాపారం రెండేండ్ల పాటు చూసుకున్నాడు. విజయవంతంగా ఫ్యాక్టరీని నడిపించాడు. కంపెనీ టర్నోవర్ 100 కోట్లకు చేరుకుంది. మోక్షేష్‌కు ఇదంతా సంతృప్తిని ఇవ్వలేదు. ఆనందం కోసం వెతుక్కున్నాడు. సన్యాసం స్వీకరిస్తేనే అది దొరుకుతుందన్నాడు. ఆస్తిని, కుటుంబాన్ని వదిలి జైన సన్యాసిగా మారిపోయాడు.
Income5

ఆనందం కోసం అన్నీ వదిలి..

ఈ దంపతులు మధ్యప్రదేశ్‌కు చెందినవారు. భర్త పేరు సుమిత్ రాథోడ్. 35 యేండ్ల వయస్సు. భార్య అనామిక. పెండ్లయి నాలుగేండ్లయింది. మూడేండ్ల పాప ఉంది. పేరు ఇభ్య. సుమిత్ ఒక వ్యాపారవేత్త. వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన వ్యాపారం అది. డబ్బుంది. విలాసవంతమైన జీవితం ఉంది. కానీ ఇవేవీ ఈ దంపతులకు ఆనందాన్ని ఇవ్వలేదు. అన్నీ వదిలి సన్యాసం స్వీకరిస్తేనన్నా ఆనందం దొరుకుతుందేమో అనుకున్నారు. అనుకున్నదే తడువు పాపను అమ్మానాన్నలకు అప్పగించి సన్యాసం స్వీకరించారు. అయితే ఇది అంత సులభం ఏమీ కాలేదు. మైనర్ అయిన పాపను వదిలేసి అలా ఎలా సన్యాసం స్వీకరిస్తారని ఒక సామాజిక కార్యకర్త జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఇభ్య భవిష్యత్తుకు భరోసా లభించిన తర్వాతే సుమిత్ దంపతులు సన్యాసం స్వీకరించారు.

ప్రపంచ ఆనంద నివేదిక ఏం చెబుతున్నదంటే..!

ఒక దేశం ఆనందాన్ని అంచనా వేయడానికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) స్థానంలో స్థూల జాతీయ ఆనందం అనే ప్రాతిపదికను ప్రవేశపెట్టడం ద్వారా భూటాన్ ప్రపంచ ప్రఖ్యాతి సాధించింది. స్వాతంత్య్రం, సుపరిపాలన, ఉద్యోగాలు, నాణ్యమైన పాఠశాలలు, మంచి ఆసుపత్రులు, అవినీతి లేకుండా చేయడం.. ఇలాంటి వాటి ద్వారా దేశం తన ప్రజల యోగక్షేమాలను, ఆనందాన్ని గణనీయంగా మెరుగుపరచగలదని భూటాన్ రుజువు చేసింది. ఐక్యరాజ్య సమితి ఆమోదించిన ప్రపంచ ఆనంద నివేదక ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే ఆ దేశమే కారణం.

ప్రపంచ ఆనంద నివేదిక ఏం చేస్తుందంటే ప్రజలు ఎంత బాగున్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో గ్యాలప్ పోల్ ద్వారా తెలుసుకొని ఆనందపు స్థాయిల్ని లెక్కగడుతుంది. సామాజిక భద్రత, తలసరి ఆదాయం, శాంతి భద్రతలు, జీవన ప్రమాణాలు, సగటు ఆయుః ప్రమాణం, స్వేచ్ఛ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే చేస్తారు. మనం ఎంత ఆనందంగా ఉన్నాం? తరుగని ఆస్తులు లేకపోయినా.. ఎడాపెడా ఆదాయం లేకపోయినా మనం సుఖంగానే ఉండగలుగుతున్నామా? తలసరి ఆదాయం సరే, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి? ఆనందాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నాం? నిజంగా మనం ఆనందంగా ఉన్నామా?తదితర అంశాలను అధ్యయనం చేసి ఆనందాన్ని లెక్కకడుతారు. ప్రతీ ఏడాది మార్చి 20న ప్రపంచ ఆనంద దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి, ఎస్డీఎస్‌ఎన్ (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్) సంయుక్తంగా ప్రపంచ ఆనంద సూచికను విడుదల చేస్తుంటాయి.
Income5

మరి మనం ఎక్కడున్నాం?

ప్రపంచంలో ఆనంద సూచికల్లో మనం ఎక్కడున్నామో తెలుసా? మనకన్నా ఎవరెవరు ఆనందంగా జీవిస్తున్నారో తెలుసా? మనకన్నా పాకిస్తాన్ వారు ఆనందంగా ఉన్నారంటే నమ్మగలరా? ఈ ఏడాది ఆనంద సూచికలో మన దేశం స్థానం 133. గత ఏడాది 122, అంతకుముందు 118. అంటే.. ప్రతీ ఏడాది ఇంకా మన స్థానం పడిపోతూనే ఉంది. అంటే ఆనందం ఏ ఏడాదికి ఆ ఏడాది ఇంకా తగ్గుతూనే ఉంది. మరి సంపన్నులు పెరుగుతున్నారు కదా. ఆనందం కూడా పెరుగాలి అని అనుకుంటే పొరపాటే.. ఆదాయాన్ని బట్టి ఆనందం.. సంపదను బట్టి సంతోషం దొరుకదని దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
Income6
ప్రపంచ ఆనంద సూచికలో పాకిస్తాన్ స్థానం ఈ ఏడాది 75. పోయిన సంవత్సరం 80వ స్థానంలో ఉండేది. అంటే అక్కడ ఆనందం మరింత పెరిగిందన్నమాట. 2016లో మాత్రం 81వ స్థానం సంపాదించింది. అంటే పాకిస్తాన్‌లో ప్రతీ ఏడాది ఆనందం అంతో ఇంతో పెరుగుతూనే ఉందన్నమాట.

872
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles