శ్రీకాళహస్తి (పానగల్లు సంస్థానం)


Sun,April 15, 2018 02:26 AM

ప్రపంచ ప్రసిద్ధ నగరాల్లో ఒకటైన ఇప్పటి చెన్నయ్ ఒకప్పటి చెన్నపట్టణం. దాన్ని కట్టిందెవరు? పానగల్ సంస్థానాధీశులకు చెన్నపట్టణానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఎవరీ పానగల్ సంస్థానాధీశులు? రాచకొండ పద్మనాయకుల్లో వీరెవరు? ఏ తరం వారు?? నల్లగొండ దగ్గరలోని ఒకప్పటి పానగల్ పాలకులవి.. చెన్నయ్‌లో ఇప్పటికీ కనిపిస్తున్న పానగల్ తాలూకు ఆనవాళ్ల మూలాలు ఒకటేనా?శ్రీకాళహస్తి సంస్థానాధీశులు దామెరవారు. వీరు సప్తసప్తతి గోత్రజులైన పద్మనాయకుల్లో ఇనగాల గోత్ర ప్రశస్తులు. వీరికి చార్ హజారా మున్‌సబ్‌దారు అనే బిరుదును మొగల్ చక్రవర్తులిచ్చారు. వీరి వంశ గౌరవనామం నాయనంగారు. కాకతీయ సామ్రాజ్యానికి పూర్వం నుంచే ఈ ఇనగాల వారు ప్రసిద్ధులైనట్లు వీరి బిరుదులు చెబుతున్నాయి. కాకతీయ సామ్రాజ్య అనంతరం వీరు కళింగ సామ్రాజ్యధినేతలైన గజపతుల సేనానుల్లో ముఖ్యులుగా చలామణి అయ్యారు. వీరి వంశ మూలపురుషుడు మాదానాయుడు. ఇతడు పద్మనాయకుల వంశంలో ఆరో తరానికి చెందినవాడు. అటు తర్వాత ప్రసిద్ధికెక్కిన వాడు వల్లభ రాయుడు (నాయుడు?). ఇతడు ఎనిమిదో తరానికి చెందిన రెండో అనపోతానాయునికి సమకాలికుడు. వడ్డాది (ప్రస్తుత విశాఖపట్టణంలోనిది)లో గజపతుల సామంతునిగా ప్రసిద్ధికెక్కిన ఈ వల్లభుడు గజపతుల ఆదేశానుసారం ఖాదిరిఖాన్ అనే వజీరును యుద్ధంలో ఓడించినట్లు చరిత్ర చెబుతున్నది. ఈ పద్మనాయకుల్లో ఏడో తరంలో ధర్మానాయుడు, తొమ్మిదో తరంలోని సర్వజ్ఞ సింగభూపాలుని సమకాలినుడు రావు ధర్మానాయుడు.. పన్నెండో తరంలో మరో ధర్మానాయుడు ఉన్నారు. ఎనిమిదో తరానికి చెందిన తిమ్మానాయునికి ఇద్దరు కుమారులు. వారు ధర్మానాయుడు, చిట్టి దాచానాయుడు. పద్మనాయకుల ప్రధాన శాఖ(వెంకటగిరి)కు చెందిన చిట్టి దాచానాయునికి అన్న అయిన, పిఠాపురం రాజుల సంతతికి చెందిన ధర్మానాయుడు నల్లకొండ(ప్రస్తుత నల్లగొండ)పై శత్రుదుర్భేద్యమైన కోటను నిర్మించాడని వెంకటగిరి సంస్థానాధీశుల వంశ చరిత్ర చెబుతున్నది. ధర్మానాయుడు నల్లగొండ కోట నిర్మించాడని చరిత్ర చెబుతున్నది. కానీ ఈ నల్లగొండ నుంచి వెళ్లిన వారే అటు తర్వాత శ్రీకాళహస్తి సంస్థానాధీశులు అయ్యారనడాన్ని కొందరు చరిత్రకారులు తప్పదోవ పట్టించారు. ఇందుకు పద్మనాయకుల మూడు తరాల్లో కనిపించే ధర్మానాయుడు అనే పేరే కారణం. నల్లగొండ కోట కట్టింది పన్నెండో తరానికి చెందిన ధర్మానాయుడిగా చూపించడం వల్లే ఈ పొరపాటు జరిగింది. దీని గురించి రాచకొండ చరిత్రము అనే గ్రంథంలో తేరాల సత్యనారాయణ శర్మ వివరంగా రాశారు. - రాచకొండలో ఏడో తరానికి చెందిన రెండో సింగభూపాలుడి సోదరుడైన ధర్మానాయుడు అతని సంతతి వారు విజయనగర ప్రాంతానికి తరలిపోయి మిక్కిలి ప్రసిద్ధి చెందారు. వెలుగోడులో కోటనొకటి కట్టి వెలుగోడు వెంకటగిరి రాజ్యాలను స్థాపించారు. ఈ సంతతిలో తొమ్మిదో తరంలో ఒక ధర్మానాయుడు, 12వ తరంలో ఒక ధర్మానాయుడు ఉన్నారు. అచ్యుతదేవరాయల (క్రీ.శ. 1530-72) కాలానికి, ఈ పన్నెండో తరానికి చెందిన ధర్మానాయుడు సమకాలీనుడు. ఇతని కాలంలో నల్లకొండ నిర్మాణం జరిగిందని కొందరు చరిత్రకారులు రాశారు.
Konda

నీలగిరి దుర్గప్రతిష్టాపన నిమిత్తం నారికేళంపల్లి (ప్రస్తుత నార్కెట్‌పల్లి) గట్టుమీదికి ధర్మానాయుడు పోయినట్లు ఒకచోట రాయబడింది. ఇది నల్లగొండ దుర్గ నిర్మాణమని కొందరు తలిచారు. నల్లగొండ దుర్గం ఇంతకంటే ప్రాచీనమైంది. అది అంతకు పూర్వమే నిర్మితమైంది. దీనిని బట్టి అంతకుముందు తరాల్లోని (ఏడో, తొమ్మిదో) ధర్మానాయుడెవరో ఈ కోటను నిర్మించి ఉంటారు. కానీ, పన్నెండో తరానికి చెందిన ధర్మానాయుడు కాదని- తేరాల వివరించారు. పై అంశాలను బట్టి, వెంకటగిరి రాజుల వంశ చరిత్రను అనుసరించి నల్లగొండ దుర్గ నిర్మాణం చేసిన ధర్మానాయుని సంతతి వారే అటు తర్వాత శ్రీకాళహస్తిని ఏలినట్లు తెలుస్తున్నది. ఇప్పటికీ శ్రీకాళహస్తి పక్కనే ఉన్న పానగల్లు అనే పట్టణం ఇందుకు చారిత్రక ఆధారంగా కనిపిస్తున్నది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు.. ధర్మానాయుని తర్వాత ఆ తరంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తుల గురించి కొంత తెలుసుకోవాలి. వల్లభనాయుని తర్వాత ఎనిమిదో తరానికి చెందిన తిమ్మయ్య శ్రీకాళహస్తి సంస్థానాధీశుల్లో ప్రసిద్ధుడు. ఇతనికే తిమ్మానాయుడు అనే పేరు. ఈయన 15వ శతాబ్దంలో తెలుగు నాట మహా విక్రమునిగా పేరుగాంచాడు. గజరావు తిప్పయ అనే ఆయన ఈ తిమ్మయ్యకు సమకాలీనుడు. వీరిద్దరూ గజపతుల సేనానుల్లో ముఖ్యులు, చరిత్ర ప్రఖ్యాతులు. రాచకొండ సామ్రాజ్యం పద్మనాయకుల నుంచి, రెడ్డి సామ్రాజ్యం రెడ్డి రాజుల నుంచి చేజారిపోయిన తర్వాత మధ్యాంధ్రదేశంలో గుడిమెట్ట (ప్రస్తుత ప్రకాశం జిల్లా రేచర్ల మండలంలోని ఓ గ్రామం)ను ఏలుతున్న సాగి బైచరాజు మహావిక్రముడుగా పేరు పొందాడు. ఇతడు పద్మనాయకులను జయించి దేవరకొండను ఆక్రమించాడు. ఈ బైచరాజును కళింగ సేనానుల్లో ముఖ్యుడైన దామెర తిమ్మయ జయించాడు. అనంతరం దేవరకొండ రాజ్యాన్ని కళింగాధీశుల సామంతుడిగా ఈ తిమ్మానాయుడు కొంతకాలం పాలించాడు. దామెర వారి వంశంలో తిమ్మయ పేరు కలవారు ఎందరో కనిపిస్తారు. వీరందరూ విఖ్యాతులేనని కవులు కీర్తించినప్పటికీ వారిలో ప్రధాన పురుషుడిగా, ప్రఖ్యాతుడిగా ఈ దేవరకొండ రాజ్యగ్రహీత, గజపతుల సేనాని అయిన దామెర తిమ్మనను గురించే ఎక్కువగా చెబుతారు. వీరి తరువాత తిమ్మానాయుని కుమారుడు శ్రీపాద నాయనింవారు ప్రసిద్దికెక్కారు. బహులాశ్వ విజయం, ఉషాపరిణయం అనే ప్రబంధాల్లో శ్రీపాద నాయనింవారి నుంచే కాళహస్తి వంశక్రమం మనకు తెలుస్తున్నది. విజయనగర పాలకులు ప్రబలులై చక్రవర్తులుగా ప్రకటించుకొన్న తరువాత దామెర ప్రభువులు విజయనగర సామంతులలో చేరి అక్కడ కూడా ముఖ్య భూమికను పోషించారు. వారి సామంతులుగా కాళహస్తితో పాటు వందవాసి (ప్రస్తుత తమిళనాడు తురువణ్ణమలై జిల్లాలోని పట్టణం) పరగణాను పొంది కాళహస్తి సంస్థాన స్థిరపాలకులై విఖ్యాతిగాంచారు. బహులాశ్వ గ్రంథకర్త దామెర వెంగ భూపాలుడు తమ వంశక్రమాన్ని అప్పటికి పదో తరానికి చెందినవారైన శ్రీపాద నాయనింగారి నుంచే శ్రీకాళహస్తి సంస్థాన శాఖ ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. వీరి కుమారులు అప్పానాయనింవారు, వారి కుమారులు ధర్మానాయనింవారు, అటు తరువాత క్రీ.శ. 1570 ప్రాంతంలో వెంకటప్పానాయనింవారు ప్రముఖులుగా వెంగభూపాలుడు చెప్పాడు.

దామెర వారి పూర్వీకుల్లో తిమ్మనలు చాలామంది కనిపించినట్లుగానే ఆ తరువాత కాలంలో వెంకటప్పానాయనింవారు, చెన్నప్పనాయనింవారూ కనిపిస్తారు. వీరినుంచే కాళహస్తి సంస్థానాధీశుల గౌరవనామం నాయనింవారుగా చరిత్రకెక్కింది. వెంకటప్పానాయనింవారి తరంలో ముద్దు వెంకటప్పానాయనింవారు ప్రసిద్ధికెక్కారు. వీరు తమ తండ్రి చెన్నప్పనాయునింవారి పేరు మీద ఈస్టిండియా కంపెనీ వారికి చెన్నపట్టణానికి స్థలం ఇచ్చిన విఖ్యాతుడు. ప్రపంచంలోని మహానగరాల్లో ఒకటి అయిన నేటి చెన్నపట్టణం (చెన్నయ్) ఈ విఖ్యాత చరిత్రుని రూపకల్పనయే. ఈ ముద్దు వెంకటప్పానాయునింవారి కాలంలో విదేశీయులైన ఇంగ్లిషు వారు, డచ్చివారు భారతభూమిని ఆక్రమించాలని ప్రయత్నిస్తుండేవారు. దేశంలో సుస్థిర ప్రభుత్వం లేని కాలమది. మహమ్మదీయుల దండయాత్రలు తట్టుకోవడం దుర్భరమైన సమయం కూడా. ఇలాంటి వేళ.. వివేకదక్షుడైన ముద్దు వెంకటప్పానాయనింవారు తమ రాజు, కర్ణాటాంధ్ర సామ్రాజ్యాధీశులైన చంద్రగిరి పాలకుడు శ్రీరంగరాయలను సంప్రదించి తమ ఆధీనంలో ఉన్న స్థలాన్ని ఇంగ్లిషు వారికి ఇచ్చారు. అక్కడ బ్రిటిషు వారు నిర్మించిన పట్టణానికి వెంకటప్పానాయనింగారు తన తండ్రి పేరున చెన్నపట్టణం అని నామకరణం చేశారు. ఈ పట్టణం ఆవిర్భవించిన ఏడాది తర్వాత 1640లో బ్రిటిషు వారు ఇక్కడ సెయింట్ జార్జి కోటను నిర్మించి తమ ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను నిర్వహించుకున్నారు. 18వ శతాబ్దం వచ్చేసరికి ఇప్పటి తమిళనాడులోని చాలా భాగం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలలోని కొంత భాగాలతో బ్రిటిషు వారు మద్రాసు ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశారు. బ్రిటిషు ప్రభుత్వం వారు కాళహస్తి సంస్థానపు జమీందార్లను ప్రత్యేక గౌరవంతో చూసేవారు. తిమ్మానాయనిం వారి కాలంలో ఈ సంస్థానం అప్పుల పాలు కాగా బాకీదార్లు కోర్టులకెక్కి సంస్థానంలోని భాగాలను వేలం వేయించారు. ఈ సందర్భంలోనే పానగల్లు వెంకటరామారాయణిం గారు నెల్లూరు ఉత్తరార్కాడుమండలంలో ఈ విలువైన భూములను సంపాదించారు. వీరి కుమారుడు వేంకటరంగారాయణింగారి కాలంలో పానగల్లు ప్రభువులు కాళహస్తిలో స్థిరపడ్డారు. వెంకటరంగారాయణింగారి సర్వతోముఖ ప్రతిభ వల్ల ఎస్టేటు వర్థిల్లసాగింది.
Konda1

ఈయన పెద్ద కొడుకు శేషాచలపతిరాయణింగారు కాళహస్తి పట్టణం సమీపంలోని స్వర్ణముఖి నది గట్టున ఒక గ్రామం నిర్మించి దానికి పానుగల్లు అని తమ పూర్వుల రాజధాని పేరు పెట్టారు. ఈ పానుగల్లు వారు వెలమలే అని, వీరిది మట్నూళ్ల గోత్రమని, కాలచోదితమున కాకతేశ్వరులను గొలిచినవారని, వీరి పూర్వులు కాకతీయ సామ్రాజ్యమంతరించుదాక తెలంగాణమునందలి నల్లగొండకు 3 మైళ్ల దూరమునగల పానుగల్లు కోటకు అధిపతులుగా నుండినారు. బాలనాగమ్మ, మాయలమరాఠీల జానపదగాథలకీ పానుగల్లు ముఖ్యరంగము. పదునెనిమిదవ శతాబ్దం నాటికి ఈ కుటుంబం అనేక విపత్పరంపరలకు లోనయి తమ పాలనమునందలి పెక్కు ప్రాంతాలను పోగొట్టుకొనిరి, ఆ పిమ్మట నీ వంశీయులు దక్షిణ సీమలకు తరలివచ్చిరి అని డా. తూమాటి దోణప్ప తన సాహిత్య అకాడమీ బహుమతి పొందిన రచన ఆంధ్ర సంస్థానములు : సాహిత్య పోషణము అనే గ్రంథంలో పానుగల్లు సంస్థానం గురించి రాశారు. పానుగంటి వెంకటరంగారాయణింగారి పెద్ద కుమారులు రామారాయణింగారు (క్రీ.శ. 1866-1928) ఈ వంశంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించారు. రాజకీయ రంగంలో, సాంఘిక సేవా కార్యక్రమాల్లో, విద్యారంగాల్లో ఎంతో కృషి చేశారు. 1912లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సెల్‌లో మద్రాసు రాష్ట్రం జమీందారుల, భూస్వాముల ప్రతినిధుల్లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. 1915లో విశాఖపట్టణంలో జరిగిన మూడో ఆంధ్రమహాసభలకు, అదే సంవత్సరం రాజమండ్రిలో జరిగిన రెండో ఆంధ్రదేశ గ్రంథాలయాల మహాసభకు ఈ పానుగంటి రామారాయణింగారు అధ్యక్షత వహించారు. 1918లో దివాన్ బహద్దూర్ బిరుదును, 1922లో రాజా బిరుదును, 1926లో సర్ బిరుదును పొందారు. జస్టిస్ పార్టీ పక్షాన మద్రాసు రాష్ర్టానికి విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా వ్యవహరించి ఆయన గొప్ప పేరు గడించారు. ఈయననే రాజా ఆఫ్ పానగల్, పానగల్ రాజాగా పిలుస్తారు. చెన్నయ్ టీనగర్‌లో వారు కట్టించిన పానగల్ పార్కులో ఆయన విగ్రహం ఇప్పటికీ ఉంది. పానగల్ మాలిగయై అనే వీరి ఎస్టేటులు ఇప్పటికీ చెన్నయ్‌లో కనిపిస్తాయి.

పానగల్ పార్కులో ఫలకం
జస్టిస్ పార్టీ పక్షాన మద్రాసు రాష్ర్టానికి విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా వ్యవహరించి రామా రాయణింగారు గొప్ప పేరు గడించారు. ఈయననే రాజా ఆఫ్ పానగల్, పానగల్ రాజాగా పిలుస్తారు.

1247
Tags

More News

VIRAL NEWS