శౌర్య వంశ రెడ్డి రాజుల ఆందోలు-జోగిపేట


Sun,September 9, 2018 02:05 AM

ANDOLE
(తెలంగాణ సంస్థానాలు : పదకొండో భాగం)
మంజీరా నది చెంత.. శౌర్య వంశ రెడ్డి రాజులు ఏలిన సంస్థానం ఆందోలు - జోగిపేట సంస్థానం. ప్రస్తుతం మెదక్, సంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంస్థానాల్లో ఒకటైన ఆందోలు సంస్థానంలో భాగంగా ఉండేవి. పాపన్నపేట సంస్థానంతోపాటు ఏర్పడిన ఈ సంస్థాన చరిత్ర రాయబాగిన్ రాణీ శంకరమ్మ పాలన తర్వాత పాపన్నపేట సంస్థానంలో భాగంగానే కలిసిపోయింది.
నగేష్ బీరెడ్డి
ఫీచర్స్ ఎడిటర్, నమస్తే తెలంగాణ
సెల్ : 80966 77177

ఆందోలు- జోగిపేట సంస్థానాధీశులు శౌర్య వంశానికి చెందిన రెడ్డి రాజులు. ఈ సంస్థానం మూల పురుషుడు అనంతరెడ్డి. ఈయన కాకతీయుల సేనానుల్లో ఒకడుగా ఉండేవాడు. ఆ రాజ్య పతనం తర్వాత అనంతరెడ్డి సంగారెడ్డి సమీపంలోని కల్పగూరు వచ్చి స్థిరపడ్డాడు. ఆయన నాటి పాలకులకు సాయం చేసి, వారి నుంచి కల్పగూరు పరగణా హక్కులను పొందాడు. ఆయనే ఈ వంశ స్థాపకుడు. అనంతరెడ్డి మనవడు రామినేడు. అనంతరెడ్డి తర్వాత రామినేడు క్రీ.శ. 1398లో పట్టాభిషక్తుడయ్యాడని ఆందోలు తహశీల్దార్ రాసిన మెదక్ చరిత్రలో ఉంది. కల్పగూరు ప్రాంతం గోలకొండ, బీదర్‌ల మధ్య ఉన్నది. ఈ ప్రాంతంలో తరుచూ దండయాత్రలు, యుద్ధాలు జరిగేవి. దీంతో పాలనకు ఎప్పుడూ అంతరాయం ఏర్పడుతుండేది. శౌర్య రామినేడు తన రాజ్యంలో నాయనమ్మ పేరుతో ఓ నగరాన్ని నిర్మించాలని తలపెట్టాడు. అలా మంజీరా నదీ తీరాన ఆండాలుపురాన్ని నిర్మించాడు. కాలక్రమంలో ఆండాలుపురం అందవోలుగా, ఆ తర్వాత ఆందోలుగా మారింది. ఆందోలులో కోట, చుట్టూ బురుజులు, గౌనీలు రామినేడు నిర్మించాడు. ఆందోలులో చెరువును తవ్వించి పదివేల ఎకరాల ఆయకట్టుకు ఉపయోగపడేలా చేశాడు. శౌర్య రామినేడు ఆందోలు సంస్థానాన్ని స్థాపించి విస్తరించిన వాడిగా చరిత్రకారులు చెబుతారు. ఈయన క్రీ.శ. 1416 నుంచి 1460 వరకు పాలన సాగించినట్లు తెలుస్తున్నది. రామినేడు క్రీ.శ. 1418 నుంచి కల్పగూరు నుంచి రాజధానిని ఆందోలుకు మార్చి పాలన సాగించాడు. కొండాపూర్(సంగారెడ్డి జిల్లాలో మండలం), ఓంకారపురం (సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని గ్రామం), పొటన్‌చెర్వు (సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెర్వు పట్టణం), రుద్రారం (పటాన్ చెరువు మండలంలోని గ్రామం), దాకూరు (సంగారెడ్డి జిల్లా ఆందోలు మండలంలోని ఒక గ్రామం) మొదలైనవి రామినేడు సంస్థానంలో భాగంగా ఉండేవి.

రామినేడు తర్వాత ముసలారెడ్డి, పెద్దరెడ్డి, అల్లమయ్య చౌదరి(అల్లమరెడ్డి)లు పాలన సాగించినట్లు తెలుస్తున్నది. వీరిలో అల్లమరెడ్డికి సంతానం కలుగలేదు. దీంతో రామజోగి అనే సాధువు వైక్రాంతగిరి(జోగిపేట గుట్ట)పైన శివలింగాన్ని ప్రతిష్టించి, పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాలని సూచించాడట. అల్లమరెడ్డి అలాగే చేయడంతో ఆయనకు సంతానం కలిగింది. దీంతో రామజోగికి కృతజ్ఞతగా ఓ గ్రామాన్ని నిర్మించి దానికి రామజోగి పేటగా నామకరణం చేశాడట. ఇది కాలక్రమంలో జోగిపేటగా రూపాంతరం చెందింది. జోగిపేట గురించి మరో కథ కూడా ఉంది. వైక్రాంతగిరిపై ఉన్న జైన తీర్థంకరుల విగ్రహాలను తొలిగించి తమ ఇష్టదైవమైన శివలింగాన్ని ప్రతిష్టించి జైన జోగుల బస్తీని వీరశైవ బస్తీగా పేరు మార్చారట. అదే కాలక్రమేణా జోగుల బస్తీ, జోగిపేటగా మారిందని కూడా చెబుతారు. జోగినాథుడు వెలసిన ప్రాంతం జోగిపేటగా ఆందోలు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో వాణిజ్య, వ్యాపార రంగాల్లో ప్రసిద్ధి గాంచి అటు తర్వాత ఆందోలులో అంతర్భాగమైంది. అల్లమరెడ్డి తర్వాత ఆందోలు-జోగిపేట సంస్థానాన్ని రామిరెడ్డి, మొదటి సదాశివరెడ్డి, పెద్ద నరసింహారెడ్డి, లింగాయమ్మ, లింగారెడ్డి తదితరులు పరిపాలించినట్లు తెలుస్తున్నది. వీరిలో రామినేడు, నరసింహారెడ్డి, రెండో సదాశివరెడ్డి పాలనా కాలాన్ని ఆందోలు - జోగిపేట సంస్థాన చరిత్రలో స్వర్ణయుగంగా చరిత్రకారులు చెబుతారు. వెంకట నరసింహారెడ్డికే పెద్ద నరసింహారెడ్డి అని పేరు. ఇతడు క్రీ.శ. 1720 నుంచి 1760 వరకు పాలన సాగించాడు.
పాపన్నపేట సంస్థానాధీశురాలు రాయబాగిన్ రాణీ శంకరమ్మ పరాక్రమం గురించి తెలుసుకున్న నరసింహారెడ్డి ఆమెను వివాహమాడాడు. పెండ్లయిన కొంత కాలానికే రాజా వెంకట నరసింహారెడ్డి మరణించాడు. దీంతో రాణి శంకరమ్మ ఎంతో మనస్థాపం చెందింది. అయినా తేరుకొని ఆందోలు సంస్థాన బాధ్యతలను కూడా తానే చేపట్టి, ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకున్నది. నరసింహారెడ్డి మరణం తర్వాత ఆందోలు జోగిపేట సంస్థాన చరిత్ర పాపన్నపేట సంస్థానంతో ముడిపడిపోయింది.

రాణి శంకరమ్మ, రాజా వెంకట నరసింహారెడ్డికి పుత్ర సంతానం కలుగలేదు. దీంతో దోమకొండ సంస్థాన పాలకుడైన రాజన్న చౌదరి (క్రీ.శ. 1748-57) మనుమడు సదాశివరెడ్డిని దత్తత తీసుకున్నది. ఈ సదాశివరెడ్డి మొదటి రాజేశ్వరరావు, రంగవ్వ (రంగమ్మ)ల కొడుకు. ఈ రంగమ్మ, రాణి శంకరమ్మకు చెల్లెలు. రాణి శంకరమ్మ తర్వాత పాపన్నపేట సంస్థానాన్ని రాజా రెండో సదాశివరెడ్డి పాలించాడు. ఈయన గురించిన చారిత్రక గాథ పాపన్నపేట సంస్థాన చరిత్ర (మనచరిత్ర 63, ఆగస్టు 12, 2018)లో చదువుకున్నాం. రెండో సదాశివరెడ్డి తన తల్లి పేరుతో నగరాన్ని నిర్మించి, క్రీ.శ. 1763లో కోటను కట్టించి రంగమ్మపేటగా నామకరణం చేశాడు. అది కాలక్రమేణా రంగంపేట (మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని ఒక గ్రామం)గా మారింది. రంగంపేట కోటలో సిపాయిలు, అశ్వాలు, ఏనుగుల కోసం గడీని కూడా నిర్మించారు. 35 అడుగుల ఎత్తులో ఈ గడీ ప్రహరీ ఉంటుంది. రంగంపేట కోటను మొత్తం రాతితో నిర్మించడం విశేషం. ఈ కోటపై నుంచి చూస్తే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ పట్టణం చక్కగా కనిపిస్తుంది. కోటలో చేపల పెంపకం కోసం కుంటలను తవ్వించారు. బంగారు ఆభరణాలు దాచడానికి ఆభరణాల గది, ధాన్యాగారం, ఇతర సౌకర్యాలతో నాడు సుందరంగా నిర్మించగా నేడు ధాన్యాగారం, ఆభరణాల గది శిథిలావస్థకు చేరుకున్నాయి. కోటలో రెండు సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి.

రంగంపేటలోని రంగనాయక స్వామి ఆలయాన్ని కూడా ఈయన కాలంలోనే నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఒక కథ కూడా జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది. రాజు సదాశివరెడ్డి పాపన్నపేటలో రంగనాయక స్వామి ఆలయం నిర్మాణం కోసం భువనగరిలో విగ్రహం తయారు చేయించాడట. ఆ విగ్రహాన్ని ఎడ్లబండిలో రంగంపేట మీదుగా పాపన్నపేటకు తీసుకెళ్తున్నారట. ఆ బండికి వేటకుక్కలు రక్షణగా ఉన్నాయట. రంగంపేటలో ఒకచోట ఎడ్లబండ్లు ఆగిపోయాయట. ఎందుకో అని ఎండ్లబండి నడుపుతున్న వాళ్లు చూస్తే ఒక కుందేలును చూసి వేటకుక్కలు పారిపోయాయట. ఈ విషయం తెలుసుకున్న సదాశివరెడ్డి కుందేలును చూసి వేటకుక్కలు పారిపోవడం ఏంటని ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని వేద పండితులతో చర్చిస్తే వారు రంగంపేట కేంద్రంగా కోటను నిర్మించి, అక్కడే రంగనాయక ఆలయాన్ని నిర్మించాలని సూచించారు. సదాశివరెడ్డి అలాగే చేశాడట. అలా పాపన్నపేటలో నిర్మించాల్సిన రంగనాయక ఆలయాన్ని రంగంపేటలో నిర్మించారని స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయంలో నిత్యపూజల నిర్వహణ కోసం అగ్రహారం పేర సదాశివపేట గ్రామాన్ని నిర్మించి 98 ఎకరాల భూమిని అర్చకులకు ఇనాంగా ఇచ్చాడట.
ANDOLE1
రెండో సదాశివరెడ్డి తర్వాత ఒక కుట్ర వల్ల ఆందోలు జోగిపేట సంస్థానం కొంత కాలం లింగాయమ్మ, ఇంకొంత కాలం లింగారెడ్డి చేజిక్కించుకున్నట్లు చరిత్రకారులు చెబుతారు.
భర్త మరణంతో ఆవేదన చెందిన రాణీ శంకరమ్మ ప్రశాంతత కోసం పాలనా బాధ్యతలను సదాశివరెడ్డికి అప్పగించి తాను కొంతకాలం కాశీయాత్రకు వెళ్లింది. శంకరమ్మ తిరిగి వచ్చేటప్పటికి సంస్థానంలో కుట్రలు ప్రబలాయి. అధికారం పరుల హస్తగతమైంది. దీంతో శంకరమ్మ ఆ కుట్రదారుని చంపించి, సదాశివరెడ్డికి తిరిగి పట్టం కట్టింది. పాపన్నపేట సంస్థాన చరిత్రను బట్టి ఈ సమయంలోనే లింగాయమ్మ, లింగారెడ్డి సంస్థానాన్ని పాలించి ఉంటారన్నది అంచనా.
* * *

పద్మనాయకులు ఏలిన సంస్థానాల్లో జటప్రోలు ఒకటి. పద్మనాయక చరిత్రలో భాగంగా ఆ సంస్థానం గురించి కొంతే తెలుసుకున్నాం. కొల్లాపూర్‌గా పేరొందిన జటప్రోలు సంస్థానం గురించి సమగ్రంగా.. వచ్చేవారం..

రంగంపేటలో ఒకచోట ఎడ్లబండ్లు ఆగిపోయాయట. ఎందుకో అని ఎండ్లబండి నడుపుతున్న వాళ్లు చూస్తే ఒక కుందేలును చూసి వేటకుక్కలు పారిపోయాయట. ఈ విషయం తెలుసుకున్న సదాశివరెడ్డి కుందేలును చూసి వేటకుక్కలు పారిపోవడం ఏంటని ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని వేద పండితులతో చర్చిస్తే వారు రంగంపేట కేంద్రంగా కోటను నిర్మించి, అక్కడే రంగనాయక ఆలయాన్ని నిర్మించాలని సూచించారు.

609
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles