శల్యుడు


Sun,July 8, 2018 01:46 AM

మారుతున్న కాల ప్రభావం వల్ల గానీ, పరిస్థితుల ప్రలోభాల వల్లగానీ, మనసుకు నచ్చిగానీ, మనసు నొప్పించుకొనే ప్రతికూలత వల్లగానీ, తనవారి కోసం గానీ, పగవారి కోసం గానీ మనిషిలో సహజమైన మార్పులు సంభవించవచ్చేమో గానీ అసలైన నైజం తనదైన వ్యక్తిత్వ ధోరణి ఎన్నటికీ మారదు. దానిని మార్చే ప్రయత్నాలు ఎంత గాంభీర్యంతో చేసినప్పటికీ అది సాధ్యం కాదు. అయినా మనిషి ఎవరికోసమో, ఎందుకోసమో మారుతూ వస్తుంటే తనదైన తత్వం, అస్తిత్వం అన్యాయం అయిపోదూ! ఆలోచనల్లో మార్పు రావాలి. జీవించే విధానంలో మార్పు రావాలి. చేసే పనుల్లో మార్పు రావాలి. కానీ, వ్యక్తిత్వంలో మాత్రం మార్పుకు చోటివ్వడం అనేదసలు జరగని పని. ఎవరి వ్యక్తిత్వం వారిదైనప్పుడు వ్యక్తిత్వాలు మార్చుకోమనే హక్కు మరొకరిదని ఎలా చెప్పగలం. ప్రపంచంలో ఏదైనా సంపూర్తిగా మన సొంతం అంటూ ఉందంటే అది కేవలం వ్యక్తిత్వం మాత్రమే. మన వ్యక్తిత్వంపై నమ్మకం ఉంటే మనకుండాలిగానీ దానిపైనా స్వాతంత్య్రం లేకుండా చేస్తామంటే ఊరుకోదు మన వ్యక్తిత్వం. ఎంతసేపూ సమాజం కోసం బతకడం మాట అటుంచి వ్యక్తిత్వం కోసం బతికి చూపించగలమా! చూపించగలమని చెప్పిన వ్యక్తిత్వ సాధకుడు శల్యుడు. భారతంలో పర్వానికి నామసారధ్యం వహించడమేకాదు, విజయానికి ఊతమందించాలని కర్ణుని రథ సారధ్యం స్వీకరించాడు శల్యుడు.

-ఇట్టేడు అర్కనందనా దేవి

మద్ర దేశానికి అధిపతి, పాండురాజు భార్య మాద్రికి అన్న, పాండవులకు స్వయానా మేనమామ. దేశానికి చక్రవర్తిలా, ఒక సోదరునిగా, ఒక మేనమామగా, తండ్రిగా తన ధర్మాన్ని ఎన్నడూ విస్మరించలేదు శల్యుడు. తనదైన వ్యక్తిత్వాన్ని నిండుగా నిలబెట్టుకున్నాడు. ధర్మం పక్షాన నిలబడి సర్వదా తన నిజాయితీని నిరూపించుకున్నాడు. కాకపోతే శల్చునిలో ఒక తొందరపాటు గుణముంది.
Shailyudu

అల్పసంతోషం, అంతలోనే మాటనివ్వడం, తర్వాత విచారణ చేయడం చేసేవాడు. కానీ, చేసిన దానినీ తొందరపాటునూ మాటతో నిలబెట్టుకున్నా, మనసును మాత్రం న్యాయం పక్షాన్నే నిలిపాడు.శల్యుడిది చాలా పెద్ద రాజ్యం. అపారమైన సైన్యం శల్యునిదగ్గర ఉండేది. శల్యుని సేనంటేనే విజయానికి చిహ్నంగా భావించేవారంతా. శల్యుడు కూడా చాలా గొప్పవీరుడు. పాండురాజుతో పాటు తన సోదరి మాద్రి కూడా మరణించినా మేనమామగా తన బాధ్యతనూ, పాండవులతో బంధుత్వాన్నీ కొనసాగించాడు శల్యుడు. కౌరవులు పాండవుల పట్ల చేస్తున్న అకృత్యాలను తెలుసుకొని చలించిపోయేవాడు. వారిపట్ల ప్రేమను సానుభూతిగా కాకుండా నమ్మకంలా వ్యక్తపరుస్తూ శల్యుడు వారికి ధైర్యం చెప్పేవాడు. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసాలు ముగించుకొని ఉపప్లావ్య నగరంలో కౌరవులపై యుద్ధానికి సిద్ధమవుతున్నారని తెలుసుకొని వారి పక్షాన చేరి ధర్మయుద్ధం చేద్దామని తన అపారసేనను తీసుకొని బయలుదేరుతాడు శల్యుడు. దుర్యోధనునికి శల్యుని పరాక్రమం గురించి తెలుసు. అందుకని శల్యునిరాక తెలుసుకొని అతని దారిపొడవునా అడుగడుగునా విడిది చేసే మందిరాలూ, ఆహార వసతులూ, సైన్యాన్ని ఆదరించే పనివారినీ ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. అదంతా పాండవుల ఆతిథ్యమని సంబురపడిపోయి శల్యుడు వారిని సేవించిన సేవకులతో పాండవులకు నా కృతజ్ఞతలు తెలియజేయండని అంటాడు. ఈ మాట దుర్యోధనునికి చెబుతారు గూఢాచారులు. పాండవుల పట్ల శల్యుని ప్రేమను గమనించి అదే తడువు దుర్యోధనుడు శల్యుని చేరి ఈ ఏర్పాట్లన్నీ తానే ఏర్పాటు చేసానని చెబుతాడు. శల్యుడు దుర్యోధనునితో ఇంతటి మంచిపనికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలనంటాడు.

వెంటనే దుర్యోధనుడు శల్యా! ఏముంది నీవూ, నా సైన్యం నా తరుపున పోరాడితే చాలు అంటాడు. దుర్యోధనుని మాటలకు ఆశ్చర్యపోయిన శల్యుని నోటివెంట మరో మాట రాకుండా పాండవ కౌరవులు ఇద్దరికీ మీరు సమానబంధువు కదా! నేనడిగితే ఆ మాత్రం చేయరా! అంటాడు దుర్యోధనుడు. శల్యుడు చేసేదేమీ లేక సరేనంటాడు. మాట ఇస్తాడు. కానీ, యుద్ధానికి ముందు పాండవులను ఒకసారి కలిసి వస్తానంటాడు శల్యుడు.పాండవులు శల్యుడు వచ్చాడని సంతోషించి స్వాగతం పలుకుతారు. శల్యుడు తాను దుర్యోధనునికి ఇచ్చినమాట వారికి చెప్పుకొని బాధపడతాడు. కానీ, ధర్మజుడు శల్యునితో మీరు ఏ పక్షాన ఉన్నా మీ ఆశీర్వాదం మాకుందని అంటాడు. కానీ, కర్ణుని చేతితో అర్జునునికి పరాభవం కాకుండా చూడమని అడుగుతాడు. కర్ణుని వల్ల అర్జునునికి ఎన్నటికీ అపాయం కలుగకుండా చూస్తాననీ, తాను దుర్యోధనునికి ఇచ్చిన మాటకు చింతిస్తున్నాననీ మీ కష్టాలు అంతమయ్యేరోజు తప్పక వస్తుందనీ ఓర్పు విజయానికి దారి చూపిస్తుందనీ దీవించి వెళతాడు శల్యుడు.దుర్యోధనుని కోరిక మేరకు కర్ణుని రథ సారధ్యం వహించి, కృష్ణ సారథ్యంలో రథంపై నుండి యుద్ధం చేస్తున్న అర్జునున్ని కంటికి రెప్పలా కాచుకుంటాడు శల్యుడు. కర్ణున్ని దారి మళ్ళిస్తూ అర్జునున్ని కాపుకాసినా కర్ణుని దీనావస్థనూ, అతని శాపాలనూ తెలుసుకొని చాలా మదనపడిన సున్నితత్వుడు శల్యుడు. దుర్యోధనుని పక్షాన పోరాడుతూ చివరికి ధర్మజుని చేతిలో శక్తి ఆయుధ ప్రయోగంతో ఒక మహావృక్షంలా నేలకూలాడు శల్యుడు. బాంధవ్యం, యుద్ధం రెండింటికీ న్యాయం చేసిన గొప్పవ్యక్తిగా, తాననుకున్న, తాను నమ్మిన విషయాలకి విలువనిచ్చే వ్యక్తిత్వ పరిపోషకుడిగా, ధర్మ సంస్థాపనలో భాగమై వీరమరణం పొందిన చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయిన శల్యుని ఆత్మ సంయమనం వ్యక్తిత్వ పరిపోషణం ఆదర్శానికి అనుకరణీయమనే చెప్పాలి.

636
Tags

More News

VIRAL NEWS