వ్యవసాయం చేస్తా!


Sun,January 7, 2018 03:39 AM

కొత్తబంగారు లోకంతో రంగుల లోకంలోకి అడుగుపెట్టాడు. ప్రేమకథా చిత్రమ్ సినిమాతో తెలుగు ప్రేక్షక లోకానికి దగ్గరయ్యాడు. రకరకాల పాత్రలతో నవ్విస్తూ ఉండే ప్రవీణ్ కూడా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. అయ్య బాబోయ్.. నవ్వకుండా ఎలా ఉంటారండీ బాబూ అంటున్న ప్రవీణ్ బతుకమ్మతో పంచుకున్న ప్రస్థానం ఇది.హాయ్.. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మిమ్మల్ని ఇలా పలకరించడం చాలా సంతోషంగా ఉంది. నా మనసులోని చాలా విషయాలు మీతో పంచుకునే అవకాశం రావడం బాగుంది ఫీలింగ్. అందరూ నన్ను ప్రవీణూ.. ప్రవీణూ.. అని పిలుస్తుంటే మీరు పిలిచినట్టే ఉంటుంది. అయినా అందరూ నన్ను గుర్తు పట్టడానికి కారణం మీరే కదండీ! కొత్త సంవత్సరం ఎలా మొదలుపెట్టారు. నేను మాత్రం కాస్త తిండి తగ్గించి, కాస్త వ్యాయామం మొదలు పెడుదామనుకుంటున్నా. ఇంతకీ తిండెందుకు తగ్గిద్దామనుకుంటున్నా అని డౌటొచ్చిందా? ఇప్పుడే కాదండీ..! చాలారోజులుగా అనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి నేను భోజన ప్రియుడిని. నానమ్మ చేతి వంటంటే చాలా ఇష్టం. ఆమె వంటనే నన్ను తిండి ప్రియుణ్ణి చేసింది. ఆ ఇంపాక్ట్ ఎంత వరకు వచ్చిందంటే నేను కూడా వంట చేసేంతగా నా మీద నానమ్మ ప్రభావం పడింది. మాంసం, ఆలూ ఫ్రై బాగా వండుతా. నేను వండే వంటల్లో ఆ రెండు నాకు చాలా ఇష్టం. పప్పు, ఎగ్‌కర్రీ, పులుసు కూడా చేస్తా. నేనే కాదు.. ప్రతీ బ్యాచ్‌లర్ మినిమం చేయగల కూరలు కదా అవి. ఇక నా స్కూల్, కాలేజీ విషయానికొస్తే హైస్కూల్ చదువు అంతర్వేదిలో చదివా. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ కోసం మల్కాపురం అని ఒక ఊరుంటది, మా చుట్టుపక్కల గ్రామాలకు అదే పట్టణం. డిగ్రీ అక్కడే చేశా. చదువులో మనం బెస్ట్ స్టూడెంటేం కాదు. అలా అని లాస్ట్‌బెంచ్ బ్యాచ్ కూడా కాదు. ఏదో అంతంత మాత్రమే. మల్కాపురంలో నాలుగు సినిమా థియేటర్లుండేవి. ఆ థియేటర్లలో ఏ సినిమా ఆడినా ఫ్రెండ్స్‌తో కలిసి వదలకుండా చూసేవాణ్ణి. షాపింగ్, సంత, జాతర అన్నీ ఏదో సరదాగా గడిచిపోయాయి కాలేజీ రోజులు. ప్రతిరోజూ కాలేజీకెళ్లడం, అది అవగానే అట్నుంచటే ట్యూషన్, సాయంత్రం ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు. ఇప్పుడవన్నీ గుర్తొస్తే భలే అనిపిస్తది. సరదాగా అమ్మాయిలను ఆట పట్టించేవాళ్లం. కానీ ఎవర్నీ ఏడిపించేవాళ్లం కాదు. ఎవరైనా నొచ్చుకుంటే వెళ్లి వెంటనే సారీ చెప్పడానికి వెనుకాడేవాళ్లం కాదు. మన వల్ల నలుగురూ నవ్వుకోవాలి. నలుగుర్నీ నవ్విస్తూ మనమూ నవ్వుతూ బతకాలి అనేది చిన్నప్పటి నుంచీ నాకు తెలిసిన దారి.
Praveen

నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు నాన్న కాలం చేశారు. అమ్మ ఓపిక వల్లే డిగ్రీ పూర్తయేంత వరకు నాకు బాధ్యత గుర్తు రాలేదు. ఎలాగోలా డిగ్రీ దాటేశా. బట్టలన్నీ సర్దుకొని ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామని హైదరాబాద్ బస్సెక్కేశా. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే ఎంకామ్ చేశా. కాలేజీ రోజుల్లో స్టేజీ మీద ప్రదర్శనలు, నాటకాలు వేసిన అనుభవం ఉంది. ఆ ధైర్యంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించా. సినిమా చాన్సుల కోసం ప్రయత్నించడం అనే తెలుసు. కానీ.. ఎలా ట్రై చేయాలి? ఎవర్ని కలువాలి? ఎవరి ద్వారా పని జరుగుతుంది? అనే విషయాలేవీ తెలియవు. చీకట్లో నడుచుకుంటూ వెళ్లినట్టు సాగేది వ్యవహారం. సినిమా వాళ్లతో పరిచయాలు లేవు. ఏవో గుడ్డి ప్రయత్నాలు అంటారు కదండీ! అలా అన్నమాట. తిరిగి తిరిగి బేజారొచ్చేసింది. తిరిగి ఊరెళ్లిపోయా. ఒక రోజు మా పక్కూళ్లో సినిమా షూటింగ్ జరుగుతుందంటే ఆసక్తి కొద్దీ అక్కడికి వెళ్లా. అక్కడ సునీల్ గారిని సరదాగా పలుకరించా. ఆయన రిైప్లె ఇచ్చారు. అలా మా ఇద్దరికీ పరిచయమైంది. రోజూ షూటింగ్‌కి వెళ్లేవాడిని. రోజూ సునీల్‌తో కబుర్లు చెప్పేవాడిని. ఒకరోజు సునీల్ నన్ను దిల్ రాజుగారికి పరిచయం చేశాడు. సరిగ్గా అప్పుడే కొత్త బంగారులోకం సినిమా ప్రకటించారు. నాకు సినిమా చూడడం అంటే చాలా ఇష్టం. థియేటర్లో, టీవీలో ఏ సినిమా వచ్చినా వదలకుండా చూసేవాడిని. సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలైతే చేశా. కానీ ఒకేసారి ఇంత పెద్ద నిర్మాత, కమెడియన్‌తో పరిచయం ఏర్పడుతుందని ఊహించలేదు. వీళ్ల పరిచయం ద్వారా ఏదో ఒక చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలనుకున్నా. కొత్త బంగారులోకంలో హీరో వరుణ్‌సందేశ్ ఫ్రెండ్‌గా అవకాశం వచ్చింది. ఆ విషయంలో దిల్ రాజుగారి సహాయం మరిచిపోలేను. 2008లో సినిమా రిలీజయింది. హిట్ టాక్.. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని టాక్ రావడం థ్రిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇదిగో ఇప్పటి వరకూ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటికి 110 సినిమాలు చేశా. అన్నింటికీ కారణం మొదటి సినిమానే. ఆ సినిమా అవకాశం వచ్చిందంటే దిల్‌రాజు, సునీల్ గారే కారణం. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. నన్ను కూడా ఆ ఇద్దరూ ఇండస్ట్రీలో ఒక వ్యక్తిలా చూడరు. దిల్ రాజు గారైతే నన్ను వాళ్లింటి మనిషిలా చూస్తారు. మా ఊరివైపు వస్తే కచ్చితంగా మా ఇంటికి వచ్చే వెళ్తారు. మా ఇంటి వంటంటే ఆయనకు చాలా ఇష్టం. సునీల్ కూడా అంతే. ఏ విషయమైనా మేమిద్దరం పంచుకుంటాం. కాకపోతే నా ముక్కుసూటితనం తనకు కొంచెం నచ్చదు.

మాకు పొలం ఉంది. కాలేజీ రోజుల్లో ప్రతిరోజూ పొలానికి వెళ్లేవాడిని. ఇప్పుడు కూడా ఊరికెళ్తే కచ్చితంగా పొలానికి వెళ్తా. నా చివరి రోజుల్లో కచ్చితంగా వ్యవసాయం చేస్తా. అందరూ తినే తిండిని కాపాడుకుంటున్నారు. తిండి పెట్టే ఉద్యోగాన్ని, డబ్బులను కాపాడుకుంటున్నారు. కానీ తినే తిండిని పండించే రైతును మాత్రం విస్మరిస్తున్నారు. మనం కాపాడుకోవాల్సింది అన్నాన్ని కాదు. అన్నదాతను. ఒక రైతు బిడ్డగా, రైతును గౌరవిస్తా. మాకున్న భూమిలో ఆరేడు ఎకరాలు కౌలుకిచ్చాం. యేటా పంట మీద ఎంతో కొంత డబ్బు వస్తది. కౌలు చేసుకున్న వారు ఇచ్చినంత తీసుకుంటానే తప్ప.. నా వాటా నాకివ్వు అని అడగడానికి మనసొప్పదు. ఏదైనా వ్యాపారం చేసేవాడి దగ్గర ముక్కుపిండి వసూలు చేయొ చ్చు. రైతును ఇబ్బంది పెట్టొద్దు కదండీ! ఇలా రైతు గురించి మాట్లాడమంటే ఎంతైనా మాట్లాడుతా. అంతిష్టం నాకు రైతులన్నా.. వ్యవసాయమన్నా. ఇక వేరే వ్యాపకం ఏమైనా ఉన్నదంటే.. పుస్తకాలు చదువడం. చిన్నప్పుడు పుస్తకాల పట్ల పెద్ద ఆసక్తి ఉండేది కాదు గానీ.. సినిమాల్లోకి వచ్చాక పుస్తకాల మీద ఇష్టం పెరిగింది. త్రివిక్రమ్ గారు, వేటూరిగారు, సిరివెన్నెల గారు, బ్రహ్మానందం గారు, కేసీఆర్ గారు వీళ్లు మాట్లాడుతుంటే తెలుగు భాష మీద, కవిత్వం, పుస్తకాల మీద ఇష్టం పెరిగింది. ఎక్కడికెళ్లినా పుస్తకాలు, కవుల పేర్లు సేకరించడం మొదలుపెట్టా. అవన్నీ తెప్పించుకుని చదువడం మొదలుపెట్టా. అలిశెట్టి ప్రభాకర్ కవితలు చదువుతుంటే ఏదో తెలియని ఆవేశం మనిషిని ఆవహిస్తది. చిల్లరదేవుళ్లు లాంటి గొప్ప పుస్తకాలు సంపాదించా. అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం చదువమని నాకు రావు రమేష్ చెప్పారు. ఆయన చెప్పగానే తెప్పించుకుని చదివా. అందులో ప్రతీ లైన్ మనసును కదిలించేలా ఉంటుంది.
Praveen1

నాకు తెలుగు భాష మీద ఇష్టం పెరగడానికి కారణం మా తెలుగు మాష్టారు పొన్నపల్లి శ్రీరామారావు. ఆయన పాఠం చెప్తుంటే అందరం అలా వింటూ ఉండేవాళ్లం. ఒక కథ చెప్తున్నారంటే.. ఆ కథ జరిగే ప్రదేశానికి మనసు వెళ్లిపోయేది. బ్రహ్మానందం కూడా ఏదైనా చెప్తుంటే భలే అనిపిస్తుంది. ఆయన తెలుగు మాష్టారు కదా.. ఆ పదాలు, భాష, చెప్పే తీరు మధురంగా ఉంటుంది. కేసీఆర్ స్పీచ్, భాష, యాస, మాట తీరులోని గొప్పదనం అర్థమయింది. తెలుగు గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఎందుకంటే నాకంటే తెలుగు తెలిసిన మహానుభావులు చాలామంది ఉన్నారు. నేను బతికి ఉన్నన్ని రోజులు తెలుగు గురించి తెలుసుకుంటూనే ఉంటా. మహానుభావులు రాసిన పుస్తకాలు చదువుతూనే ఉంటా. చాలామంది అడుగుతున్నారండీ.. కమెడియన్లుగా వచ్చి హీరోలవుతున్నారు. మీరెప్పుడు హీరో అవుతారు? హీరో ఛాన్స్ వస్తే చేస్తారా? అని హీరో పాత్ర అని కాదు కానీ.. కథలో ఫుల్‌లెంగ్త్ పాత్ర అయితే ఓకే. అలా అని హీరోయిజం ఉండి, ఫైట్లు, సాంగులు ఉంటే కష్టమే. నవ్విస్తూ ఉండే పాత్ర అయితే చేయగలను, చేస్తా. కొత్త తరహా పాత్రలు చేయడానికి ట్రై చేస్తున్నా. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు సినిమాలు, నటన అప్‌డేట్‌గా ఉంటున్నాయి. ఒకప్పుడు సినిమాలో చాన్స్ రావాలంటే సరైన ప్లాట్‌ఫామ్ ఉండేది కాదు. ఇప్పుడు ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. పోటీ పెరిగింది. పోటీకి తగ్గట్టు బరిలో నిలువాలంటే ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించాలి. అప్‌డేట్ అవ్వాలి. కేవలం సినిమాలోనే కాదు. ఎక్కడైనా ఇది వర్తిస్తుంది. ఓకే అండీ.. ఇప్పటికి చాలా విషయాలు చెప్పేసినట్టున్నాను. ఇంకెప్పుడైనా మళ్లీ కలుద్దాం.

-మాకు పొలం ఉంది. కాలేజీ రోజుల్లో ప్రతిరోజూ పొలానికి వెళ్లేవాడిని. ఇప్పుడు కూడా ఊరికెళ్తే కచ్చితంగా పొలానికి వెళ్తా. నా చివరి రోజుల్లో కచ్చితంగా వ్యవసాయం చేస్తా. అందరూ తినే తిండిని కాపాడుకుంటున్నారు. తిండి పెట్టే ఉద్యోగాన్ని, డబ్బులను కాపాడుకుంటున్నారు. కానీ తినే తిండిని పండించే రైతును మాత్రం విస్మరిస్తున్నారు. మనం కాపాడుకోవాల్సింది అన్నాన్ని కాదు. అన్నదాతను. ఒక రైతు బిడ్డగా, రైతును గౌరవిస్తా. మాకున్న భూమిలో ఆరేడు ఎకరాలు కౌలుకిచ్చాం. యేటా పంట మీద ఎంతో కొంత డబ్బు వస్తది. కౌలు చేసుకున్న వారు ఇచ్చినంత తీసుకుంటా.

-త్రివిక్రమ్, వేటూరి, సిరివెన్నెల, బ్రహ్మానందం, కేసీఆర్.. వీళ్లు మాట్లాడుతుంటే తెలుగు భాష మీద, కవిత్వం, పుస్తకాల మీద ఇష్టం పెరిగింది. ఎక్కడికెళ్లినా పుస్తకాలు, కవుల పేర్లు సేకరించడం మొదలుపెట్టా. అవన్నీ తెప్పించుకుని చదువడం మొదలుపెట్టాం. అలిశెట్టి ప్రభాకర్ కవితలు చదువుతుంటే ఏదో తెలియని ఆవేశం మనిషిని ఆవహిస్తది. చిల్లరదేవుళ్లు లాంటి గొప్ప పుస్తకాలు సంపాదించా.
Praveen2

1356
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles