వేసవిని గెలుద్దాం! బీట్ ద హీట్


Sun,March 24, 2019 01:28 AM

ఎండాకాలం పిల్లలకు వేసవి సెలవులను మాత్రమే కాదు.. ఇంకా చాలా తీసుకొస్తుంది. అదిరిపోయే ఎండలతో ఆరడుగుల ఆరోగ్యవంతుడిని కూడా ఒక్క వడదెబ్బతో పడగొట్టేస్తుంది. అలాంటి వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే. అందుకే ఎండాకాలంలో ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు తినే తిండి, తాగే నీరు, వేసుకొనే బట్టలు, ప్రయాణాలు అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం, అందం, ఆహారం ఇలా అన్ని అంశాలతో ఈ వారం బతుకమ్మ ప్రత్యేక కథనం మీకోసం అందిస్తున్నాం.

ఆరంభంలోనే బెదిరిపోయే ఎండలతో మనల్ని డకౌట్ చేయడానికి సమ్మర్ స్పీడ్‌గా వచ్చేసింది. ఎండాకాలం అంటే వడగాలులు, ఉక్కపోత, వడదెబ్బలు కామన్. కొంచెం జాగ్రత్తగా ఉంటే వీటి నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. వడదెబ్బ నుంచి తప్పించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రతలు, తలనొప్పి, వాంతులు, నీరసం వడదెబ్బ లక్షణాలు. శరీరంలోని నీటిశాతం తగ్గినా వేసవిలో ప్రమాదమే. అందుకే ఎప్పటికప్పుడు మంచినీరు, గ్లూకోజ్ వాటర్, నిమ్మరసం తాగుతూ ఉండాలి. ఈ సీజన్‌లో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకి వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే.. ముఖంపైన, తలపైన ఎండపడకుండా తెల్లటి గుడ్డకానీ, టోపీ కానీ పెట్టుకోవాలి. తలపాగా ఓల్డ్ ఫ్యాషనే కానీ ఎండదెబ్బకు సరైన సమాధానం ఇదే. వీలైతే బయటకి వెళ్లినప్పుడు గొడుగు వెంటతీసుకెళ్లండి. వడగాడ్పుల నుంచి, ఎండ నుంచి రక్షణగా ఉంటుంది. గొడుగుతో పాటే.. వాటర్‌బాటిల్ మరిచిపోవద్దు. వేసవిలో లేత రంగు బట్టలు ధరిస్తే శరీరంపై ఉష్ణ ప్రభావం ఉండదు. లేత రంగు దుస్తులు వేడిని శోషణం చేసుకుంటాయి. ముదురు రంగువైతే మన శరీరానికి నేరుగా ఆ వేడిని ప్రసరింపచేస్తాయి. అందుకే లేతరంగులే ఈ సీజన్‌లో ఉత్తమం. కాటన్, లెనిన్, ఖాదీ, రెయాన్, చాంబ్రే, మద్రాస్ కాటన్, లేస్ కాటన్ లాంటి దుస్తులు ఎక్కువగా ధరించండి.
Sun

పిల్లలు జాగ్రత్త..


పిల్లలకు మెత్తని, పల్చని నూలు దుస్తులే వేయాలి. కిస్‌మిస్, ఖర్జూరాలు నీటిలో నానబెట్ట్టి , వడపోసి రవ్వంత తేనె కలిపి పిల్లలకు పట్టిస్తే వారి మీద ఎండ ప్రభావం ఉండదు. నవజాత శిశువుల నుంచి పదేండ్ల లోపు పిల్లలను ఎండ బారిన పడకుండా చూడాలి. సబ్బుకు బదులుగా సున్నిపిండితో మాత్రమే స్నానం చేయించాలి. స్నానానికి గోరువెచ్చని నీరు వాడాలి. పౌడర్ కాకుండాఅప్పటికప్పుడు తీసిన గంధం ఒంటికి ఐప్లె చేస్తే శరీరం చల్లగా ఉంటుంది. వేసవి సెలవులు గడిపే పిల్లలను ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఇంటి పట్టునే ఉండి ఆడుకునేలా చూడాలి. చెస్, క్యారమ్స్ లాంటి నీడపట్టున ఉండి ఆడుకునే ఆటలను ప్రోత్సహించాలి. రాత్రి పడుకోబోయే ముందు కాచిన పాలలో నాలుగో వంతు అన్నం, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, జీలకర్ర, అల్లంముక్కలు వేసి తోడు పెట్టి ఉదయం పూట అల్పాహారంగా పిల్లలకు పెట్టాలి. దీని వల్ల తగినంత శక్తితో పాటు ఒంటికి చలువ చేస్తుంది.

సమ్మర్ ఇలా..


ఆకలుండదు..సమ్మర్‌లో ఎక్కువగా తినాలనిపించదు. ఫుడ్ కంటెంట్ కంటే వాటర్ కంటెంటే ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది. ఈ ఎండలకు, వేడికి తినే ఫుడ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. దీంతో ఆటోమెటిక్‌గానే తక్కువ తినేస్తాం. సో... తిండి తగ్గుతుంది. ఎండకు శరీరంలోని నీటిశాతమంతా చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది కాబట్టి.. ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి.
Sun1

ఈత.. కొవ్వుకు కోత


సమ్మర్ వచ్చిదంటే పల్లె, పట్నం, చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా అందరూ స్విమ్మింగ్‌పూల్స్, చెరువులు, బావుల వైపు ఈతకోసం పరుగులు తీస్తారు. ఓ వైపు ఎండ దంచేస్తుంటే చల్లటి నీటిలో స్విమ్ చేస్తుంటే ఆ మజాయే వేరు. చాలామంది ఎండ వేడికి తట్టుకోలేక ఈతకు వెళ్తారు. కానీ ఈత కొట్టడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువుతో బాధపడే చాలామందికి నిఫుణులు ఈత కొట్టమని సలహా ఇస్తారు. అదే సమ్మర్ వస్తే ఎవరి సలహా లేకుండానే స్విమ్మింగ్ చేస్తారు. దీంతో శరీరం కాస్త నాజూగ్గా మారిపోతుంది.

పండ్లు, పళ్లరసాలు


ఎండాకాలం స్టార్ట్ అయిందంటే చాలు... డాక్టర్లు జాగ్రత్తలు, సూచనలు చెప్తుంటారు. బాడీకి ఎక్కువ నీటిని అందించాలని సూచిస్తుంటారు. మామూలుగా కూడా ఎండాకాలం వచ్చిందంటే రెగ్యులర్ ఫుడ్ కంటే పళ్లు, పళ్లరసాలే ఎక్కువగా తినాలనిపిస్తుంది. దీనికి కారణం పళ్లు తింటే దాహం తగ్గుతుంది కాబట్టి. ఇంతకీ ఎండాకాలం పళ్లు తింటే బరువెలా తగ్గుతాం అంటారా? పళ్లలో ఉండే పోషకాలు మన శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించేస్తాయి.

మంచినీళ్లు


లాస్ట్.... బట్ నాట్ లీస్ట్...! సమ్మర్‌కి దీటుగా సమాధానం చెప్పగలిగేది కేవలం మంచినీళ్లే. ఎండ నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి మంచినీళ్లను మించిన ఆయుధం లేదు. అంతేకాదు సమ్మర్‌లో తినడానికి ముందు ఒక గ్లాస్ వాటర్ తాగితే బరువు తగ్గుతారని పరిశోధనలు చెప్తున్నాయి. కడుపు నిండా మంచినీళ్లే ఉంటే ఫుడ్ తక్కువ తింటాం.
Sun2

సమ్మర్ మేకప్ టిప్స్..


చలికాలం పోయి ఎండాకాలం వచ్చేసింది. అంతం కాదిది ఆరంభం.. ముందుంది ముసళ్ల పండుగ రెడీగా ఉండండి అంటూ ఎండలు అప్పుడే దంచికొడుతున్నాయి. సరిగ్గా ఈ సీజన్‌లోనే పెండ్లిళ్లు, దావతులు ఉంటాయి. అలా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మేకప్ వేసుకోక తప్పదు. మేకప్ కాస్త ఎక్కువైతే ఎండకు చిరాకు పుడుతుంది. అందుకే ఈ ఎండాకాలం మేకప్ వేసుకునే ముందు ఈ టిప్స్ పాటించండి.

-వేసవిలో మైకప్ లైట్‌గా వేసుకుంటేనే చర్మం సహజసిద్ధమైన కాంతితో మెరిసిపోతుంది.
-ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ వాడితే చర్మం జిడ్డుగా మారదు.
-కళ్లకి మస్కారా మాత్రమే వాడండి. ఐ లైనర్, ఐ షాడోలు వాడితే చెమట వల్ల అవి చెదిరిపోవడం, దురద రావడం వంటి సమస్యలు ఎదురుకావొచ్చు.
-లైట్‌కలర్ లిప్‌స్టిక్ పెట్టుకుంటే అసలు మేకపే వేసుకోనట్టుగా.. సహజంగా కనిపిస్తారు. ట్రై చేయండి.
-పెదవులకు వేసుకునే లిప్‌గ్లాస్ లైట్‌గా బుగ్గలకు అద్దుకుంటే చెక్కిళ్లు గులాబీ రంగులో మెరిసిపోతాయి.
-జుట్టు ఫ్రీగా వదిలేయకుండా కాస్త అల్లి, జడలా వేయండి. అప్పుడే హుందాగా ఉంటారు.
Sun3

ఈ చిట్కాలు పాటించండి


-ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి.
-ఎండలో బయటకు వెళ్లాల్సివస్తే చర్మం పాడవకుండా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.
-తల మీద కచ్చితంగా, స్కార్ఫ్, కర్చీఫ్, టోపీ ధరించాలి. వాహనదారులైతే హెల్మెట్ తప్పకుండా ధరించాలి.
-పండ్లరసాలు, కొబ్బరినీళ్లు తాగితే శరీరం డిహైడ్రేషన్ కాదు.తప్పకుండా రోజుకు నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి.
-ఒంటికి వదులుగా ఉండే దుస్తులే ధరించాలి. వేసవిలో వేసుకునే దుస్తులు కూడా ఒంటికి చలువనిచ్చేవిగా ఉండాలి.
-వీలైనంత వరకు నూలు దుస్తులు వాడడం బెటర్.మందంగా ఉండే దుస్తులు, పాలిష్టర్, ఉన్ని దుస్తులు ధరించకూడదు.
-ఎండలో బయటకు వెళ్తే కండ్లకు రక్షణగా చలువ కళ్లద్దాలు వాడాలి.
-పిల్లలను వీలైనంత వరకు ఎండలో బయటకు తీసుకురాకపోవడమే మంచిది.
-వీలైనన్ని సార్లు చల్లని నీటితో మొహం కడుక్కోవాలి. సబ్బు తక్కువగా వాడాలి.
-తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలి.
-మంచుముక్కలు కలిపిన పానీయాలు, మద్యం, జంక్‌ఫుడ్, రోడ్డు మీద అమ్మే పదార్థాలు అస్సలు తినవద్దు.
-వీలైనంత వరకు ఉదయాన్నే ఆఫీసుకు బయల్దేరండి. సాయంత్రం ఎండ తగ్గిన తర్వాతే ఇంటికి వెళ్లండి.
-అధికంగా వేడిగా ఉన్న వాతావరణంలోంచి ఒక్కసారిగా చల్లగా ఉన్న వాతావరణంలోకి, చల్లగా ఉన్న వాతావరణంలోంచి అధికంగా వేడిగా ఉన్న వాతావరణంలోకి ఒక్కసారిగా మారకూడదు.

పండ్లు కాపాడుతాయి..


దానిమ్మ పండు : దానిమ్మ గింజలు ఒక కప్పు, ద్రాక్షపండ్లు రెండు కప్పులు, చెంచా చక్కెర మూడింటినీ మిక్సీలో పట్టి ఆ రసాన్ని వడకట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఎక్కువ కూల్ కాకుండా ఓ స్థాయిలో ఉన్నప్పుడు బయటకు తీసి అతిసారతో బాధపడేవారికి తాగిస్తే మంచి ఫలితాలుంటాయి. జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుంది. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
Sun4

సపోట : ఇందులో చాలా ఔషధ గుణాలు దాగుంటాయి. తిన్న తర్వాత కొద్ది నిమిషాల్లోనే శక్తి పుంజుకుంటుంది. సపోటాలో ఫ్రక్టోజ్, సుక్రోజ్, చక్కెర సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారికి సపోటా మంచి ఔషధం. సపోటాపండ్లు తరచూ తింటే దృష్టి లోపాలు దూరమవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్ధకం సమస్యను తొలిగించడంలో ఇందులోని రసాయనాలు బాగా పనిచేస్తాయి.

పచ్చిమామిడి : ఈ సీజన్‌లో మాత్రమే లభించే మామిడి పోషక ఫలరాజం. వేసవి తాపానికి, వడదెబ్బకు గురైనవారికి ఇది మంచి పరిష్కారం. పచ్చి మామిడికాయను తరిగి ఓ గ్లాసు నీటిలో వేయాలి. అందులో కాసింత చక్కెర వేసి బాగా కలుపాలి. వడదెబ్బకు గురైన వారికి ఈ నీళ్లు తాగిస్తే క్షణాల్లో కోలుకుంటారు. పచ్చిమామిడి ముక్కల మీద కాసింత ఉప్పు చల్లి తింటే దాహార్తి తీరుతుంది. శరీరంలోని లవణాలు, రక్తంలోని ఐరన్ వంటివి బయటకు పోకుండా నిరోధిస్తుంది.

పుచ్చకాయ : నీరుశాతం ఎక్కువగా ఉండే పండ్లలో పుచ్చకాయ ముందుంటుంది. ఇందులోని విటమిన్ ఎ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండెజబ్బులను నిరోధించే పొటాషియం పుచ్చకాయలో సమృద్ధిగా ఉంటుంది. తీవ్రమైన ఎండల కారణంగా చర్మం యూవీ కిరణాల బారిన పడి మృదుత్వాన్ని కోల్పోతుంది. దీన్ని నివారించడానికి పుచ్చకాయలోని లైకోపీన్ సహకరిస్తుంది. దాహార్తిని నివారిస్తుంది.

ద్రాక్ష : ఎండ కారణంగా శరీరం కోల్పోయిన ఖనిజ లవణాలను, యాంటీఆక్సిడెంట్లను ద్రాక్ష తిరిగి శరీరానికి అందిస్తుంది. ఈ కాలంలో వేధించే అలర్జీలు, వాపు, ఇన్ఫెక్షన్ల నుంచి ద్రాక్ష కాపాడుతుంది. కొవ్వుశాతం అసలే లేకుండా సి, ఎ విటమిన్లు, కెరాటిన్, రాగి, మెగ్నీషియం, బీ కాంప్లెక్స్ వంటి విటమిన్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

కీరదోస : సన్నగా తరిగిన నాలుగు కీరదోస ముక్కలు తింటే ఎండాకాలంలో శరీరం నూతన ఉత్సాహాన్ని పొందుతుంది. సలాడ్ రూపంలో, పెరుగు, మజ్జిగలో కలిపి, తాలింపు వేసుకొని కూడా కీరదోసను తినొచ్చు. శరీరానికి సమ్మర్ వేడిని తట్టుకునే శక్తిని కీరదోస ఇస్తుంది.

ముంజలు : ఎర్రని ఎండల్లో చల్లటి ముంజలు నోరూరించడమే కాదు. పోషకాలు అందించడంలోనూ ముందే ఉంటాయి. ఇందులోని పీచు పదార్థాలు శరీరాన్ని వేసవి తాపం నుంచి శ్రీరామరక్షలా కాపాడుతాయి. ఇవి కొన్ని తినగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఒంటికి కావాల్సిన నీటిశాతాన్ని అందిస్తాయి. ఇందులో కాల్షియం, ఇనుము, జింక్, కాపర్, మెగ్నీషియం, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటే థయామిన్, బి1, బి2, రెబోప్లెవిన్ వంటి విటమిన్లు కూడా లభిస్తాయి.

1519
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles