వెయ్యి కిలోల బంగారు గుడి!


Sun,March 17, 2019 01:07 AM

temple
ప్రపంచంలోని పురాతన దేవాలయాల కంటే భారతదేశంలో ఉన్న ఆలయాలకు ఎంతో ప్రత్యేకత ఉన్నది. అటువంటి ప్రత్యేకత ఉన్న ఆలయాల్లో అద్భుతమైనవి కూడా ఉన్నాయి. వాటిలో అతి ప్రాచీనమైనవి కొన్ని కాగా, మనిషి నిర్మించినవి కొన్ని. రాజుల కాలంలో నిర్మించినవి, మానవులు నిర్మించినవి ఇలా ఎన్నో అద్భుతమైన గుళ్లు, గోపురాలు అబ్బురపరుస్తుంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే దేవాలయం కూడా ఆ కోవకు చెందిందే. ఆ గుడిని మట్టితోనో, సిమెంట్‌తోనో నిర్మించలేదు బంగారంతో నిర్మించారు. బంగారంతో నిర్మించడమంటే ఏదో పైపైన కట్టడాలకు బంగారు పూత పూయలేదు. అచ్చంగా 1,000 కిలోల స్వర్ణంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

భారతదేశంలో స్వర్ణదేవాలయం అనగానే పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయమే అందరికీ గుర్తొస్తుంది. కానీ రాజస్థాన్‌లోనూ మరో స్వర్ణదేవాలయం ఉన్నది. ఆ గుడిని సోనీజీకీ నాశియన్ అని పిలుస్తుంటారు. దీన్ని 19వ శతాబ్దంలో అజ్మీర్‌లో నిర్మించారు. ఇది జైనుల పవిత్ర ఆలయంగా విలసిల్లుతున్నది. ఈ దేవాలయంలోని పలు నిర్మాణాలకు గాను 1000 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. కేవలం బంగారమే కాదు వెండి, విలువైన రంగు రాళ్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మొదటి అంతస్తులో ఉండే ఓ గదిని స్వర్ణ నగరి అంటారు. పేరుకు తగినట్టుగానే దీంట్లో ఉండే అన్ని విభాగాలను బంగారంతోనే తయారు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణదేవాలయానికి నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉన్నది. దీనిని సిక్కు మతస్తుల పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఈ ఆలయ నిర్మాణానికి 700ల కిలోల బంగారాన్ని మాత్రమే వినియోగించారు. అజ్మీర్‌లో నిర్మించిన జైన దేవాలయ నిర్మాణానికి వెయ్యి కిలోల బంగారాన్ని వాడారు.

సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా..

జైన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించే విధంగా ఈ ఆలయంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ స్వర్ణ నగరిలో జైన మతానికి చెందిన ప్రవక్తలు సాధించిన విజయాలు, వారికి సంబంధించిన సమాచారాన్ని, ముఖ్యమైన అంశాలకు చెందిన వివరాలను కూడా పొందుపరిచారు. ఈ గుడిలో అయోధ్య, ప్రయాగ నగరాలకు చెందిన నమూనాలను కూడా బంగారంతో చెక్కారు. ఈ ఆలయాన్ని అజ్మీర్‌కు చెందిన సోనీ కుటుంబసభ్యులు నిర్మించారు. ప్రస్తుతం వారి వారసులు ఈ ఆలయానికి సంరక్షకులుగా కొనసాగుతున్నారు. మరో విశేషమేమిటంటే విశ్వం మొత్తం ప్రతిబింబించేలా ఓ నమూనాను రూపొందించి ఇక్కడ ఉంచారు. ఆ నమూనాను జైన మత దృష్టిలో చూపించారు. జైన మతానికి చెందిన సంస్కృతి, సంప్రదాయాలను గాజు అద్దాలపై అందంగా చెక్కారు. ఆకట్టుకునే విధంగా రంగురంగుల చిత్రాలను ఆలయంలో ఏర్పాటు చేశారు. వాటిలో విలువైన రాళ్లు, రత్నాలనూ పొదిగారు. ఇక ఈ ఆలయం బయట నుంచి చూస్తే ఎరుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఎరుపు రంగు ఇసుక, రాళ్లతో నిర్మించడంతోపాలు ఎరుపు రంగు గ్రానైట్‌ను వినియోగించారు. అందుకోసమే దీనిని లాల్ దేవాలయం అని కూడా పిలుస్తుంటారు.
temple1

మూల విరాట్టుగా అధినాథ్

ఈ ఆలయంలో మూల విరాట్టుగా అధినాథ్ పూజలందుకుంటూ ఉంటాడు. జైన మతస్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన్ని ఆరాధిస్తారు. అజ్మీర్ గుడిని 1865లోనే నిర్మించినప్పటికీ 1870-1895మధ్యకాలంలో కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత 19వ శతాబ్దంలో అజ్మీర్ దేవాలయాన్ని వెయ్యి కిలోల బంగారంతో పునర్నిర్మించారు. ఇక్కడ వాస్తు శిల్పాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. వాస్తు శిల్పాలకు ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని సిద్ధకూట్ చైత్యాలయం అని, సోనీజీ కీ నాశియాన్ అని, కెంపు దేవస్థానం అని కూడా పిలుస్తారు. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ దేవాలయంలో ప్రముఖంగా చెప్పుకోవల్సింది 82 అడుగుల ఎత్తైన వృక్ష స్తంభం గురించే. ఈ వృక్షాన్ని ఆర్.బి.సేథ్, భగచంద్ సోనీలు నిర్మించారు. బంగారు లోహంతో తయారు చేసిన ఈ మహావృక్షాన్ని దర్శించుకునేందుకు భక్తులు మరింతగా ఆసక్తి చూపుతుంటారు. వృక్ష స్తంభం ఉన్న ప్రదేశంలో మండపాలు, దిగంబరుల శిల్పాలు, అందమైన శిల్ప సౌందర్య సంపద అజ్మీర్ దేవాలయానికే దక్కుతుంది. జైనులలో రెండురకాల వారున్నారు. ఒకటి దిగంబరులు, రెండు శ్వేతాంబరులు. దిగంబరులు ఎటువంటి దుస్తులూ ధరించరు. శ్వేతాంబరులు మాత్రం తెల్లని వస్ర్తాలు ధరిస్తారు. ఈ దేవాలయం దిగంబరులకు చెందినది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే ఉత్సవాలకు ప్రముఖులు హాజరవుతుంటారు.

పసుపులేటి వెంకటేశ్వరరావు
సెల్: 8885797981

318
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles