విడుదల


Sun,October 7, 2018 01:32 AM

క్రైమ్‌స్టోరీ -14
crime-story
ఆ మధ్యాహ్నం జరిగిందాన్ని కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకున్నాను. నేను పాత రోడ్ మీదకి వెళ్తూంటే మార్లిన్ చెప్పిన మాటలే నా చెవుల్లో వినిపించసాగాయి. కొద్ది సేపటికి అలికిడికి తల తిప్పి చూస్తే నా వెనక ఆమె గబగబా నడుస్తూ వస్తున్నది. ఆమె చాలా కోపంగా కనిపించింది. నా పక్క నించి వెళ్ళింది. నేను ఆమెని ఆగమని అరిచాను. ఆగి వెనక్కి తిరిగి చూస్తూ ఏమిటి? ఏం కావాలి? అని గర్జించింది.
-మల్లాది వెంకట కృష్ణమూర్తి

రాత్రి భోజనం పూర్తయ్యాక వాళ్ళు నన్ను ఆ కేఫ్‌కి వచ్చి తమ వెంట తీసుకెళ్ళారు. ఆ ఉదయం నేను బ్లేక్ ఇంటి వెనక గేట్లోంచి పెరట్లోకి వెళ్ళి వారి కుక్కని కెన్నెల్ తలుపు తెరచి బయటకి పంపానని తెలిసి నన్ను పట్టుకెళ్తున్నారు అనుకున్నాను. ఏదీ బంధించబడి ఉండటం నాకు ఇష్టం ఉండదు.
కాని వాళ్ళు దాని గురించి నన్ను ప్రశ్నించలేదు. కార్లో నన్ను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళేప్పుడు దేనికి తీసుకు వెళ్తున్నారో నాకు చెప్పలేదు. వాళ్ళు నన్ను సరాసరి కెప్టెన్ జాన్సన్ గదిలోకి తీసుకెళ్ళారు. స్టేషన్లోని సిబ్బంది నావంక కొంత వింతగా చూడటం గమనించాను.
హలో గూబర్! మేం నిన్ను ఓ విషయం మీద ప్రశ్నించాలి. కూర్చో కెప్టెన్ ఆజ్ఞాపించాడు.
నా పేరు విలియం. కాని అంతా నన్ను గూబర్ అని పిలుస్తారు. ఎందుకంటే నాకు వేరుశెనగ కాయలంటే ఇష్టం. వాటిని స్థానిక ప్రజలు గూబర్ అని కూడా పిలుస్తారు కాబట్టి అంతా నన్ను గూబర్ అంటారు. నేను కూర్చున్నాను. కెప్టెన్ నా వంక కొద్దిగా కరకుగా చూస్తూ అడిగాడు.
ఈ మధ్యాహ్నం నువ్వు ఎక్కడ ఉన్నావు గూబర్?
నన్ను బ్లేక్ కుక్క గురించి ప్రశ్నిస్తారని ఎదురు చూసాను. లేదా రెండు రోజుల క్రితం మెయిన్ స్ట్రీట్‌లోని ఓ ఇంటి బయట బోనులోని రెండు కుందేళ్ళని విడుదల చేయడం గురించి ప్రశ్నిస్తారని అనుకున్నాను. క్రితం సారి నన్ను పంజరంలోని పక్షులని విడుదల చేసావా అని ప్రశ్నిస్తే, అవునని జవాబు చెప్పాను. ఇంకోసారి అలాంటి పని చేస్తే జైలుకి వెళ్తావు అని కెప్టెన్ హెచ్చరించి పంపించాడు.
నేను మధ్యాహ్నం నా గదిలో ఉన్నాను. తర్వాత బయటకి వాకింగ్‌కి వెళ్ళాను. చెప్పాను.

ఎక్కడ నడిచావు?
టౌన్‌విల్ రోట్లోంచి నది ఒడ్డుకి వెళ్ళాను. అక్కడ నడిచాను. అక్కడికే ఎందుకు వెళ్ళావు?
ఆ ప్రశ్న నాకు అర్ధం కాక జవాబు చెప్పలేదు. నువ్వు నది ఒడ్డుకే ఎందుకు వెళ్ళావు?
నాకా ప్రదేశం ఇష్టం. చల్లగా ఉంటుంది. తాజా గాలి. నది ఒడ్డున ఎగిరే పక్షుల్ని చూడచ్చు.
ఇంకా అమ్మాయిలు అక్కడ స్విమ్మింగ్ డ్రస్లో ఈత కొట్టడం చూడటం కూడా ఇష్టం కదా? ఓ సార్జెంట్ నన్ను ఎకసక్కెంగా ప్రశ్నించాడు.
కెప్టెన్ తన చేత్తో అతన్ని మౌనంగా ఉండమన్నట్లుగా సౌంజ్ఞ చేసి నన్ను అడిగాడు.
నది ఒడ్డున ఏం చేసావు? గుర్తు చేసుకోడానికి నేను గట్టిగా కళ్ళు మూసుకున్నాను.
నేను నదికి దక్షిణం ఒడ్డున కొద్ది సేపు నడిచాను. అప్పుడప్పుడు ఓ నిమిషం సేపు ఆగాను. తర్వాత ఊళ్ళోకి తిరిగి వచ్చేసాను.
అక్కడ ఎవరైనా చూసావా?
చూసాను.

ఎవర్ని చూసావు? వాళ్ళేం చేస్తున్నారు?
కొందరు అబ్బాయిలు, అమ్మాయిల్ని చూసాను. డేమ్ దగ్గర వాళ్ళు ఈదుతున్నారు.
తర్వాత?
కెప్టెన్ దేని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాడో నాకు తెలీదు. కాబట్టి నేను మౌనంగా ఉండిపోయాను.
అక్కడ నీకు తెలిసిన ఎవరైనా చూసావా? చూసాను. రేండెల్ కూతురు మార్లిన్ని, డో కొడుకుని. అతని పేరు జిమ్నీ అనుకుంటాను. వాళ్ళే చేస్తున్నారు?
వాళ్ళు తడి స్విమ్మింగ్ డ్రెస్‌లో నది ఒడ్డున నిలబడి ఉన్నారు. తర్వాత పక్క వాళ్ళతో తాము వెళ్తున్నామని చెప్పి చెట్ల వైపు వెళ్ళారు.
అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు?
నది ఒడ్డున నడుస్తున్నాను.
కెప్టెన్ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలాడు.
ఇంతదాకా నువ్వు చెప్పింది నిజమే. జిమ్మీ, మార్జిన్లు వెళ్ళేప్పుడు నిన్నక్కడ చూసామని చాలా మంది చెప్పారు. ఎప్పటిలా నువ్వు ఎవరితో మాట్లాడలేదు. తల వంచుకుని నువ్వు కూడా చెట్లలోకి వెళ్ళడం కొందరు చూసారు. మార్లిన్, జిమ్మీలు వెళ్ళిన వైపే. అది నిజమేనా?
అవును. చెప్పాను.
ఏ కారణంగానైనా నువ్వు వాళ్ళని అనుసరించావా?
లేదు.

మరి? వాళ్ళు వెళ్ళిన వైపే నువ్వు ఎందుకు వెళ్ళావు?
చెట్ల లోంచి పాత రోడ్ మీదకి దగ్గర దారి కాబట్టి. పాత రోడ్ ఊళ్ళోకి వెళ్ళే మెయిన్ రోడ్‌ని కలుస్తుంది.
నన్ను అక్కడికి తెచ్చిన వాళ్ళల్లో ఒకరు నిరసన ధ్వని చేసారు. నువ్వు మళ్ళీ వాళ్ళిద్దర్నీ చూసావా? కెప్టెన్ ప్రశ్నించాడు.
చూసాను.
వాళ్ళేం చేస్తున్నారు?
వాళ్ళు పాత రోడ్ మీద పార్క్ చేసిన కారు పక్కన నిలబడి వాదించుకుంటున్నారు.
దేని గురించి?
ఆ అమ్మాయి అది ఆ అబ్బాయి తప్పని పదే పదే చెప్తోంది. అతను అది తన తప్పు కాదని ప్రతీ సారి ఖండిస్తున్నాడు. అది తన తప్పని చెప్పద్దని తిడుతున్నాడు.
కెప్టెన్ జాక్సన్ అకస్మాత్తుగా ముందుకి వంగి, నా మొహంలోకి చూస్తూ ప్రశ్నించాడు.
వాళ్ళు వాదించుకుంటున్నారా? లేక మాట్లాడుకుంటున్నారా? వాదించుకుంటున్నారు.

మార్లిన్ ఏ విషయంలో జిమ్మీది తప్పని ఆరోపించింది?
నాకు తెలీదు. ఆమె తను గర్భవతినని, అది జిమ్మీ తప్పని చెప్పింది.
నా పక్కన నిలబడ్డ సార్జెంట్లు ఇద్దరూ కొద్దిగా అసహనంగా కదిలారు. కెప్టెన్ వాళ్ళ వంక అర్ధవంతంగా చూసి మళ్ళీ నన్ను అడిగాడు.
సరే. తర్వాత వాళ్ళేం చేసారు?
వాళ్ళు బట్టలు తొడుక్కోసాగారు.
ఏమిటీ? ఓ... స్విమ్మింగ్ డ్రెస్ లోంచి మామూలు దుస్తుల్లోకి మారారన్నమాట? ఆ సమయంలో వాళ్ళు ఒకర్ని మరొకరు చూసుకున్నారా?
అది నాకు తెలీదు కాని ఒకరికి మరొకరు రెండడుగుల దూరంలో ఉన్నారు.
వాళ్ళు పోట్లాడుకుంటూంటే నువ్వేం చేసావు?
ఓ అమ్మాయిని నగ్నంగా చూడటం నాకు ఇష్టం లేకపోయింది. ఆమె అతనితో వాదించడం కూడా నాకు వినబుద్ధి కాలేదు. అది సబబు కాదు కాబట్టి నేను వాళ్ళకి కనపడకుండా చెట్లలోకి వెళ్ళిపోయాను. నేను చుట్టూ తిరిగి పాత రోడ్ మీదకి ఎక్కాను.
వాళ్ళిద్దరూ నిన్ను చూడలేదా?
లేదు.

నువ్వు నించుని వాళ్ళని చూసిన చెట్ల వెనక మాకు వేరుశెనగ కాయ తొక్కలు కనిపించాయి. నువ్వు వెళ్ళేప్పుడు మార్లిన్, జిమ్మీలు అక్కడే ఉన్నారా?
ఉన్నారు. ఆమె జిమ్మీ బిడ్డ తన కడుపులో ఉందని గట్టిగా అరవడం విన్నాను.
జిమ్మీ ఆమెని చెడ్డ మాటలతో తిట్టడం గురించి చెప్పడం ఇష్టం లేక ఆపేసాను. కెప్టెన్, సార్జెంట్స్ ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. తర్వాత?
జిమ్మీ ఆ బిడ్డ గురించి లోకానికి తెలీకుండా ఆమెకి సహాయం చేస్తానని చెప్పాడు. అంతే.
కెప్టెన్ ఓ నిమషం సేపు నా వంక నిశితంగా చూసి అడిగాడు.
గూబర్. నువ్వు ఎప్పుడూ మాకు అబద్దం చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నావా?
లేదు సర్. నేను చెప్పిందంతా నిజమే.
నువ్వు పాత రోడ్ ఎక్కావా? ఏమైనా చూసావా?
ఓ కారు నా పక్క నించి వెళ్ళడం చూసాను. దాన్ని జిమ్మీ డ్రైవ్ చేస్తున్నాడు. అది చాలా వేగంగా వెళ్ళింది.
ఆ కారులో జిమ్మీ ఒక్కడే ఉన్నాడా?
అవును.

కెప్టెన్ సార్జెంట్స్ వంక చూసాడు.
జిమ్మీ తనకి మేర్లిన్‌తో పెద్దగా పరిచయం లేదని చెప్పాడు. అతను ఆమెని నది ఒడ్డున చూడలేదని కూడా చెప్పాడు.
ఈ పిచ్చివాడు చెప్పింది మీరు నమ్ముతున్నారా కెప్టెన్? ఓ సార్జెంట్ ప్రశ్నించాడు.
మీరు నమ్మడం లేదా? కెప్టెన్ ఎదురు ప్రశ్న వేసాడు.
అతను కొంతసేపు ఆలోచించి చెప్పాడు.
నమ్ముతాను. గూబర్! ఇంత కట్టుకథని చెప్పేంత తెలివి లేదు.
గూబర్ సెక్స్ క్రిమినల్ అని నేను కూడా అనుకోను. రెండో సార్జెంట్ చెప్పాడు. వాళ్ళు మాట్లాడింది నాకు అర్ధం కాలేదు.
వెళ్ళి జిమ్మీని తీసుకురండి. అతను చాలా విషయాల్లో మనకి అబద్ధాలు చెప్పాడు.
కొందరు సార్జెంట్స్ వెళ్తే, కొందరు ఆ గదిలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నన్ను వింతగా చూడటం ఆపేసారు. ఒకరు నాకు సిగరెట్స్ కూడా ఇవ్వబోయాడు. వద్దని మర్యాదగా నిరాకరించాను.
సరే గూబర్. బయట కూర్చో, కొద్ది సేపటి తర్వాత నువ్వు మాకు చెప్పింది మళ్ళీ చెప్తే టైప్ చేసాక సంతకం చేసి వెళ్ళచ్చు. భయపడకు. దాని గురించి నిన్ను ఎవరూ ఏం చేయరు. కెప్టెన్ నా భుజం తట్టి చెప్పాడు.

నేను ఆయన చెప్పినట్లే చేసాను. ఒంటరిగా కూర్చుని వేరుశెనగ కాయల్ని తింటూ ఇద్దరు సార్జెంట్స్ మధ్య వచ్చే జిమ్మీ కెప్టెన్ గదిలోకి వెళ్ళడం చూసాను. అతని మొహంలో భయం స్పష్టంగా కనిపించింది. నేను వేచి ఉన్నాను. .
ఆ మధ్యాహ్నం జరిగిందాన్ని కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకున్నాను. నేను పాత రోడ్ మీదకి వెళ్తూంటే మార్లిన్ చెప్పిన మాటలే నా చెవుల్లో వినిపించసాగాయి. కొద్ది సేపటికి అలికిడికి తల తిప్పి చూస్తే నా వెనక ఆమె గబగబా నడుస్తూ వస్తున్నది. ఆమె చాలా కోపంగా కనిపించింది. నా పక్క నించి వెళ్ళింది. నేను ఆమెని ఆగమని అరిచాను. ఆగి వెనక్కి తిరిగి చూస్తూ ఏమిటి? ఏం కావాలి? అని గర్జించింది. ఆమె కోపానికి నాకు భయం వేసింది. ఆమెని బాధించకూడదని నాకు తెలుసు. కాని ఆమె కడుపులోని బిడ్డకి స్వేచ్ఛని ప్రసాదించాలని అనుకున్నాను. నా బొడ్లోని కత్తిని బయటకి తీసాను.
కెప్టెన్ జాక్సన్‌కి అది నేను స్వచ్ఛందంగా చెప్పదలచుకోలేదు. అందుకు ఆయన నన్ను సరైన ప్రశ్నలు అడగాలి. స్టేటిమెంట్ మీద నేను సంతకం చేసాక సార్జెంట్ చెప్పాడు.
ఇక నువ్వు ఇంటికి వెళ్ళచ్చు.
ఇంకేమీ అడగరా? అడిగాను.
లేదు.
నేను థాంక్స్ చెప్పి బయటకి నడిచాను.
(రిచర్డ్ ఎం ఎల్లిస్ కథకి స్వేచ్ఛానువాదం)

373
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles