విజ్ఞాన ఖని ‘పుస్తకం’


Sun,February 11, 2018 02:20 AM

పుస్తకం..గత చరిత్రను, వర్తమానాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్న విజ్ఞాన భాండాగారం. పుస్తకం.. చరిత్ర గతిని, సామాజిక జ్ఞానాన్ని, శాస్త్ర విజ్ఞానాన్ని అందించే నేస్తం. పుస్తకం.. చరిత్రను వర్తమానానికి పరిచయం చేసే వారధి. విజ్ఞానాన్ని అందించే కర దీపిక. ప్రాపంచిక దృక్పథాన్ని మన ముందుంచే విజ్ఞానగని. అక్షరాలకూ, భావాలకూ, సమాజ ప్రయాణానికి, చరిత్ర ఆవిర్భావానికి మూలం పుస్తకం. మనిషికి ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్నిచ్చేది పుస్తకం. మహనీయుల భావజాలాన్ని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది పుస్తకమే. అనుభవాలను.. అనుభూతులను.. ఆలోచనలను.. అడుగుజాడలకు అద్భుతమైన కూడలి పుస్తకం. తరతరాలుగా జ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తున్నది పుస్తకం. సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం ఎంతగా విస్తృతమైనా పుస్తకం తన ఉనికిని కోల్పోలేదు. పుస్తక ముద్రణలు పెరిగాయి. చదివే పాఠకులూ పెరిగారు. అందుకే పుస్తకం ఎవర్‌గ్రీన్..
Books-Tanja-Tiziana
-మధుకర్ వైద్యుల, సెల్ : 9182777409


బమ్మెర పోతన చెప్పినట్లు పుస్తకం హస్తభూషణం. పుస్తకాల అధ్యయనం ఒక తపన, తీరని విజ్ఞాన దాహం. మనిషికి మరణం ఉండవచ్చు కానీ పుస్తకానికి, దాని ద్వారా ఆర్జించిన విజ్ఞానానికి మరణం లేదు. పుస్తక అధ్యయనం వికాసాన్ని, విజ్ఞానాన్ని ఈ సమాజానికి అందిస్తుంది. ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. వివిధ భాషలపై పట్టును పెంచుతుంది. ఇంటర్‌నెట్, ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్ ఇలా సామాజిక మాధ్యమాలకు ఆదరణ పెరుగడం వల్ల పుస్తకానికి, పుస్తక పఠనానికి ప్రమాదం పొంచి ఉందన్న భయం అక్కర్లేదంటున్నాయి సర్వేలు. సామాజిక మాధ్యమాల్లో తక్షణమే చదివి ఆనందించవచ్చు. అది తాత్కాలికమైన అనుభూతి. కానీ పుస్తకం చదివితే వచ్చే అనుభూతి శాశ్వతమైనది. అందుకే దేశవ్యాప్తంగా పుస్తక ప్రదర్శనలకు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 31వ జాతీయ పుస్తక ప్రదర్శన కూడా చదివే పుస్తకప్రియులు పెరిగారన్న వాస్తవాన్ని మనముందుంచింది.

జీవితమే ఒక పుస్తకం..

పుస్తకాల పునాదులు సమాజంలోనే ఉంటాయి. మన చుట్టూ ఉన్న సమాజమే జీవితం. ఆ జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సంఘర్షణలు. కలలు, కల్లలు, కష్టాలు, కన్నీళ్లు ఇలాంటి అనుభవాలన్నీ మనకు పుస్తకాల్లో తారసపడుతాయి. ఎందరో మహానుభావుల జీవితాలకు పుస్తకాలు అద్దం పడుతాయి. సమాజంలో నిభిడికృతమైన అద్భుతాలకు, ఆలోచనలకు కేంద్ర బిందువు పుస్తకం. గతకాలపు మధురస్మృతులను మనముందుంచి భవిష్యత్‌కు టార్చ్‌లా పనిచేస్తుంది. చరిత్రను వర్తమానానికి అన్వయిస్తూ జీవితం ఎంత సంక్లిష్టంగా గడిచిందో పుస్తకమే తెలుపుతుంది. టెక్నాలజీ ఎంత పెరిగినా సృజనాత్మకమైన పరిశోధనలకు, పరిష్కారాలకు పుస్తక పఠనమే ఆధారం. తెలంగాణ విముక్తి పోరాటమైన, మరే అస్తిత్వ పోరాటమైన విజయవంతమైందంటే పుస్తకమే దానికి కారణం. చారిత్రక ఉద్యమాలు మనల్ని ప్రభావితం చేశాయంటే పుస్తకాలే మూలం. మనిషి ఎప్పటికప్పుడు చైతన్యశీలమై పురోగమిస్తున్నాడంటే దానికి పునాది పుస్తకాలు. ప్రపంచ పరిణామ క్రమంలో వివిధ భాషల్లో విరివిగా సాహిత్యం వెలువడింది. అవన్నీ భారతీయ భాషల్లోకి తర్జుమా అయ్యాయి. ఆయా భాషల్లోని సాహిత్యం, సాంస్కృతిక పరిణామాలు పుస్తకాల ద్వారా చదివి మన మహానీయులు సమ సమాజ నిర్మాతలుగా ఎదిగారు. ఆయా పుస్తకాలు ఎంతోమంది గొప్ప సంఘసంస్కర్తలకు, రాజకీయ నాయకులకు, గొప్పగొప్ప మహానుభావులకు స్ఫూర్తినిచ్చి వారిని గొప్పవారిగా తీర్చిదిద్దింది. సమాజ పరిణామ క్రమంలో నిర్మితమైన చరిత్ర, సృష్టించబడ్డ సాహిత్యం, బయల్పడిన తాత్వికత అన్నింటినీ వందల సంవత్సరాలుగా భవిష్యత్ తరాలకు అందిస్తున్నది పుస్తకం. అది తరగతి గదికే పరిమితం కాలేదు. ఒక్కో పుస్తకం ఒక్క చరిత్రయై ప్రపంచాన్నే ప్రభావితం చేశాయి.
ladies

ఎందరికో స్ఫూర్తి

అక్షరరూపం దాల్సిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నారు కాళోజీ. ఒక్కో అక్షరం ఎన్నో పదాలకు సృష్టినిచ్చి, సమాజ నాగరితకత, సంస్కృతి, భాష, చరిత్రను పుస్తకాల్లో నిక్షిప్తం చేశాయి. ఆ పుస్తకాలే ఎందరో కళాకారులు, కవులు, రచయితలు, మేధావులకు మార్గదర్శకం అయ్యాయి. వారి ఆలోచనలు ఎన్నో ఉద్యమాలకు, సామాజిక మార్పుకు దోహదం చేశాయి. పుస్తకాలు ఉద్యమాల్ని నిర్మించాయి. ప్రభావితం చేశాయి. ఆ ప్రభావం ఎంతోమంది అదర్శనాయకులకు పురుడు పోసింది. గ్రీక్ తత్వవేత్తలైన సొక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ ఆలోచనలకు పుస్తకం తోడైతే వారి కార్యచరణ తరువాతి తరానికి పుస్తకరూపంలోనే స్ఫూర్తినిచ్చింది. ఒక అబ్దుల్‌కలాం, ఒక వాజ్‌పాయ్, కేసీఆర్ ఇలా ఎందరికో పుస్తకాలే మార్గనిర్దేశం చేశాయి. శాస్త్ర పరిశోధనలకు, రాజకీయ చతురతకు, ఉద్యమ నిర్మాణాలకు వారు చదివిన పుస్తకాలే ప్రేరణగా నిలిచాయి. మానవ జీవన సాంస్కృతిక పరిణామ క్రమంలో పుస్తకం పోషించిన పాత్ర గొప్పది. ప్రపంచంలోని అన్ని భాషల భావాలను, మార్పులను, ఆయా క్రమాల్లో చోటు చేసుకున్న ఉద్యమాలను, పోరాటలను అనేకమైన పరిణామాలను పుస్తకం తనలో నిక్షిప్తం చేసుకొని నేటి తరానికి అందించింది. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞాన కేంద్రాలైన ఈ పుస్తకాల్లోనే ప్రపంచం పొదిగి ఉంది. తెలుగు నేలపై సైతం ఎందరెందరో ప్రముఖులు పుస్తకాల ప్రభావంలోంచే తమను తాము గొప్పగా తీర్చిదిద్దుకున్నారు. వర్తమాన చరిత్ర నిర్మాణంలో తాము భాగమయ్యారు.

ఆరోగ్యానికి దివ్యౌషధం పుస్తకం

పుస్తకాలు మనిషి జీవితానికి ఔషధాలుగా పని చేస్తాయి. పుస్తకం కోపాన్ని జయిస్తుంది. ఆలోచనను పెంపొందిస్తుంది. మానసిక ప్రశాంతతనిచ్చి మనిషిని సన్మార్గంలో నడిచేలా ప్రేరేపిస్తుంది. మనిషి ఆరోగ్యానికి ఔషధం ఎంత అవసరమో, విజ్ఞాన విశాలత్వానికి అధ్యయనం అంత అవసరం. అధ్యయనం మనిషి జీవితాన్ని సారవంతం చేస్తుంది. సుసంపన్నం కావిస్తుంది. పుస్తకాలు అస్తిత్వ స్పృహ కల్గిస్తాయి. ఉద్యమాలకు ప్రాణం పోస్తాయి. భావ జాల వ్యాప్తికి తోడ్పడతాయి. చదువుతో మానవునిలో రసాయన ప్రక్రియ జరుగుతుంది. మంచి సాహిత్య విలువలున్న పుస్తకాలను చదువడం వల్ల జీవితంలో ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కవిత్వం, నవలలు, కెరీర్, చరిత్ర, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, ఆధ్యాత్మికం, బాలసాహిత్యం, పోటీపరీక్షల పుస్తకాలు, కొంగొత్త సేద్య పద్ధతులు..సైన్స్ ప్రయోగాలు.. ఇలా ఏదైనా కావచ్చు. ఒత్తిడి నుంచి విముక్తి చెందాలంటే, రాత్రి పడుకోబోయే ముందు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదువడం మంచిది. గాఢనిద్ర పట్టి శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఏకాగ్రత చేకూరి ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. పుస్తక పఠనం సమస్త ఆరోగ్యానికి దివ్యౌషధం.

పెరిగిన చదువరులు

ఆధునిక యుగంలో ఇంటర్‌నెట్ వినియోగం పెరిగి ముఖపుస్తకం తప్ప మరే పుస్తకం దరిచేరనీయడం లేదు నేటి యువత. అయితే అంతర్జాలం ఎంతగా పెరిగినా చదివేవారి సంఖ్య పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. అవి పుస్తకాలు కావచ్చు, పత్రికలు కావచ్చు. చదివే పాఠకుల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని నిరూపిస్తున్నాయి. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్, ఇండియన్ రీడర్‌షిప్ సర్వే-2017ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వార్తాపత్రికలు చదివే పాఠకుల సంఖ్య 40.7 కోట్లకు చేరుకుందని ఈ సర్వేలు వెల్లడించాయి. అందులో తెలుగు చదివేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కోటి డ్బ్బైలక్షలమంది తెలుగు పాఠకులు పత్రికలు చదువుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

బెంగళూరుది అగ్రస్థానం

దేశంలో పుస్తకాలు ఎక్కువ చదివేది బెంగళూరు వాసులు. అవును పుస్తకప్రియులు ఎక్కువగా బెంగళూరులోనే ఉన్నారని అమెజాన్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు వార్షిక రీడింగ్ ట్రెండింగ్స్-2017 ను విడుదల చేసిన అమెజాన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదికలో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, ముంబై, ఢిల్లీ నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే పరీక్షాసన్నద్ధ పుస్తకాలను ఎక్కువ మంది కొన్నారని, వాటిలో ఎక్కువగా ఇండియన్ పాలిటీ (ఐదో సంచిక) పుస్తకం మొదటి స్థానంలో ఉందని అమెజాన్ ఇండియా పేర్కొంది. ఇక ఎక్కువమంది కొన్న వాటిలో రెండో స్థానంలో ఫిక్షన్ రచనలు, మూడో స్థానం లో వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు నిలిచాయి.

school-childrens

పిల్లల్నీ ప్రోత్సహించాలి

నేటి తరం పిల్లలు మొబైల్‌ఫోన్, ఐఫోన్‌లలో ముఖపుస్తకం తప్ప పుస్తక ముఖం చూసేవారు కరువయ్యారు. దీనివల్ల పిల్లల్లో సహజ ఎదుగుదల మందగిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇంటర్నెట్ మూలంగా కళ్ళు పాడవడం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు ఇంట్లో బామ్మలు, తాతలు కథలు చెప్పేవారు. ఇప్పటి పిల్లలకు వారితో సన్నిహిత్యమే లేకుండా పోయింది. దీంతోవారిలో సృజనాత్మకత కొరవడుతున్నది. నిజానికి ఎదిగే పిల్లలకు ఒక్కో వయస్సులో ఒక్కో తరహ పుస్తకం అవసరం. చిన్నతనంలో బొమ్మలు, కథల పుస్తకాలను అందుబాటులో ఉంచి ఆ తరువాత జీవన విధానాలు, నాగరికతలు, చారిత్రకవిశేషాలు, వింతలు, సాహసగాథలు, సైన్స్, శాస్త్రవేత్తలు, పరికరాలు, పనిముట్లు ఇలా ఒక్కో దశలో ఒక్కో పుస్తకాన్ని వారికి అలవాటు చేస్తే పుస్తక పఠనం పెరుగడంతో పాటు పిల్లల్లో మానసిక ఎదుగుదల కూడా పెరుగుతుంది.

juluru-goui-shnkar

పుస్తకానికి మరణం లేదు

ప్రస్తుతకాలంలో పుస్తకాలు చదువడం లేదన్న వాదనలు తప్పు అని హైదరాబాద్ పుస్తక ప్రదర్శన రుజువు చేసింది. 31వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు 10 లక్షల మంది పుస్తకప్రియులు హాజరయ్యారైతే వారిలో సుమారు 7 లక్షల మంది రూ. కోటి విలువైన పుస్తకాలు కొన్నారు. సాఫ్ట్‌వేర్ ఎంత ముందుకు దూసుకువచ్చినా, సాఫ్ట్‌కాపీ మీద ఎప్పటికైనా హార్డ్‌కాపీ విజయం సాధిస్తుందని పుస్తకప్రదర్శన నిరూపించింది. పుస్తకానికి మరణం లేదని, పుస్తకం అజేయమై వర్ధిల్లి తీరుతుందని ఆచరణ రూపంగా తేలింది. పుస్తకాలు మంచి పౌరుల్ని, మంచి పౌరసమా జాన్ని నిర్మించడానికి దోహదపడుతాయి.
-జూలూరు గౌరీ శంకర్, అధ్యక్షులు,హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ

pathipaka-mohan

పుస్తకం వికాసానికి చిహ్నం

గతంతో పోలిస్తే పుస్తకానికి ఆదరణ, ప్రభావం పెరిగింది. పుస్తకాన్ని అందరూ తమ చేతిలో ఒక గుర్తింపుగా భావిస్తున్నారు. ఈసారి బుక్‌ఫెయిర్‌లో అమ్మకాలు కూడా పెరుగడం పుస్తక వికాసానికి తార్కాణం. అమ్మకాల్లో క్లాసికల్ లిటరేచర్, బాలసాహిత్యం, వ్యక్తిత్వవికాసం, కవిత్వం, కథల పుస్తకాలు ముందు నిలిచాయి. పుస్తకం ఎప్పటికీ సజీవమే. పుస్తకం ఇంకా దేదీప్యమానంగా వెలుగాలి. పాఠశాలల్లో విధిగా పుస్తకప్రదర్శనలు ఏర్పాటు చేయాలి.
-పత్తిపాక మోహన్, అసిస్టెంట్ ఎడిటర్, నేషనల్ బుక్ ట్రస్ట్

vasireddy-venu

కొత్తతరమూ చదువుతున్నారు.

నేను గడచిన ఆరు సంవత్సరాలుగా బుక్‌ఫెయిర్‌లో పాల్గొంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా కొత్త రీడర్స్ పెరుగుతున్నారు. యువతరం ఎక్కువగా జనరల్ బుక్స్ చదవడానికే ఆసక్తి చూపుతున్నారు. ట్యాబ్, మొబైల్‌లలో చదవడం కంటే పుస్తకాలు చదవడమే ఆరోగ్యానికి, ముఖ్యంగా కళ్లకు మంచిదనే అభిప్రాయం చాలామందిలో వచ్చింది. ఈ ఏడాది పది లక్షల మంది బుక్‌ఫెయిర్‌కు వచ్చారంటే పుస్తకాలకు ఆదరణ తగ్గలేదన్నట్లే. కొత్తపుస్తకాలు వస్తున్నాయి, కొత్తతరం చదువరులు వస్తున్నారు. ఇప్పుడు పుస్తక ప్రమోషన్ కూడా పెరిగింది. సోషల్‌మీడియాలో పుస్తకాన్ని పరిచయం చేయడం వల్ల రీడర్ దాన్ని ఆదరిస్తున్నాడు. నా రోటిపచ్చళ్లు పుస్తకం కేవలం సోషల్‌మీడియా, బుక్‌ఫేయిర్‌ల ద్వారానే ఒక సంవత్సరంలో 2500 కాపీలు అమ్మాను. ఆదరణ లేకుంటే అన్ని బుక్స్ పోవు.
-వాసిరెడ్డి వేణుగోపాల్, వాసిరెడ్డి పబ్లికేషన్స్

chandramohan-koya

పిల్లల్నీ ప్రోత్సహించాలి

పుస్తకరూపం మారచ్చుకానీ పుస్తకానికి మాత్రం ఆదరణ తగ్గలేదు. చదివేవారి సంఖ్య కూడా మరింత పెరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా భారీ పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేశాం. అంతటా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇతర జిల్లాల్లో లాగే పాలమూరు జిల్లాలోను అంతే స్పందన ఉంది. కేవలం పాతతరం వారే పుస్తకాలు చదువుతారు అనుకుంటే పొరపాటు అన్ని వయస్సుల వారు పుస్తకాలు కొంటున్నారు. భక్తి పుస్తకాలకు ఎంతటి ఆదరణ ఉందో విప్లవసాహిత్యానికి అంతే ఆదరణ ఉంది. ఈ ఏడాది పుస్తక ప్రదర్శనకు పదిలక్షల మంది వచ్చారు. ఆకలి, ధరిద్రం, అన్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడ రాసేవారు, సాహిత్యం ఎక్కువే. పిల్లల్ని కూడా పుస్తకం చదివేలా ప్రోత్సహించాలి. వారిలో మరింత అవేర్‌నెస్ పెంచాల్సిన అవసరం ఉంది.
-కె.చంద్రమోహన్,కార్యదర్శి, హైదరాబాద్ బుక్ ఫెయిర్

jothy-valaboju

పుస్తకానికి ఆదరణ తగ్గలేదు

ప్రతీ సంవత్సరం పుస్తకాల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇతర దేశాలు, పుస్తకాలు కొనే అవకాశం లేనివారే ఇంటర్‌నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. చాలామంది స్వంతంగా బుక్స్ వేసుకుంటున్నారు. కొత్త రచయితలు పుట్టుకొస్తున్నారు. చదివేవారు లేకుంటే ఇది సాధ్యం కాదు కదా? విశాలాంధ్ర వంటి పబ్లికేషన్స్ కూడా కొత్తవారికి అవకాశం ఇస్తున్నాయి. కొత్త కొత్త పబ్లికేషన్స్ కూడా వస్తున్నాయి. పాఠకులు కూడా ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు అడుగుతున్నారు.
-జ్యోతి వలబోజు, రచయిత్రి, పబ్లిషర్, జె.వి.పబ్లికేషన్స్

sadik-thopudu-bandi

బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంది

పుస్తకానికి గతం కంటే బ్రహ్మాండంగా ఆదరణ పెరిగింది. అదే సమయంలో అమ్మకాలు కూడా పెరిగాయి. గతంలో పర్సనల్ డెవలప్‌మెంట్ పుస్తకాల పట్ల ఉండే వ్యామోహం పోయింది. ఈసారి కథాసాహిత్యం, నవలా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలకు ఆదరణ పెరిగింది. అదే సమయంలో కవితలు, కథల పుస్తకాలు కూడా విరివిగా అమ్ముడయ్యాయి. అలాగే సంవత్సరం సంవత్సరం కొనుగోళ్ల్లు పెరుగుతున్నాయి. సోషల్‌మీడియాలో పుస్తకాల పై వచ్చిన రివ్యూస్, వాటి ప్రత్యేకతలపై వ్యాసాల ప్రభావం వల్ల ఇష్టమైన పుస్తకాలనే ఎంచుకొని కొంటున్నారు.
-షేక్ సాధిక్ అలీ, తోపుడుబండి పబ్లికేషన్స్

round-self

చదువులో మనమే టాప్

పేపర్, ప్రింటింగ్ పెరిగిన తర్వాత పుస్తకాల సంఖ్య, చదివేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచంలో పుస్తకాలు ఎక్కువ సమయం చదివేవారు ఎవరంటే భారతీయులే అని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇదీ సర్వేలో తేలినవిషయమే.మనం వారానికి సగటున 10.4 గంటలపాటు చదువుతామని సర్వేలు తేల్చాయి. ఇప్పుడు వీరిసంఖ్య మరింత పెరిగింది. టీవీలు, సినిమాలు, ఇంటర్నెట్ ఎన్ని వచ్చినా చదివేవారిని ఎవరూ మార్చలేరన్నదానికి ఇది నిదర్శనం.

Visitors

10 లక్షలకు చేరిన సందర్శకులు

సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక మాధ్యమాలు ఎంత ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ పుస్తకం మీద ఉన్న ఆసక్తి, అభిమానం, ప్రేమ ఏమాత్రం తగ్గలేదని జనవరి 18-28వరకు హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బుక్ ఫెయిర్ నిరూపించింది. ఈ ఏడాది పుస్తక ప్రదర్శనను 8-10 లక్షలమంది సందర్శకులు సందర్శించారు. ఈ ఏడాది పుస్తక ప్రదర్శనలో దాదాపు 350 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. మన రాష్ట్ర ప్రచురణ కర్తలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రచురణ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.

books

జీవితకాలంలో పెరుగుదల

గంటల కొద్దీ కూర్చొని చదువడం వల్ల లేనిపోని రోగాలు వస్తుంటాయని చాలామంది అభిప్రాయం. కానీ పుస్తకాలు చదివితే మనిషి జీవిత కాలం పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలింది. అమెరికాలోని యాలే యూనివర్సిటీ ప్రజారోగ్య బృందం చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వయసు, లింగము, జాతి, విద్య, వివాహ స్థితి తదితరాల వారిగా విభజించి పరిశోధన చేయగా పుస్తక పఠనం చేసినవారు దీర్ఘకాలం జీవించడానికి అవకాశం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 12 సంవత్సరాల పరిశీలనలో పుస్తకాలు చదవనివారికంటే చదివేవారు చనిపోయే స్థితి 20 శాతం తగ్గింది. మొత్తంగా పుస్తక పఠనం వల్ల 23 నెలల జీవితకాలం పెరిగింది. పుస్తకంలోని కథనం, ఆ కథలోని పాత్రలతో పూర్తిగా లీనమవడంపై కూడా మనిషి జీవిత కాలం పెరుగుదల ఆధారపడి ఉంటుందని పరిశోధన తేల్చింది.

circle-self
దేశవ్యాప్తంగా వార్తాపత్రికలు చదివే పాఠకుల సంఖ్య 40.7 కోట్లు.

భారతీయులు వారానికి సగటున 10.4 గంటలపాటు చదువుతారు.

పుస్తక పఠనం వల్ల 23 నెలల జీవితకాలం పెరుగుతుంది.

ఇంటర్నెట్‌లో చదివే పిల్లల్లో సహజ ఎదుగుదల మందగిస్తుంది.

పుస్తకాలు ఎక్కువ చదివేది బెంగళూరు వాసులు.

1258
Tags

More News

VIRAL NEWS

Featured Articles