విఘ్నరాజాయ నమః!


Sun,September 9, 2018 01:39 AM

Ganesh
గణనాయకాయ.. గణదైవతాయ.. గణాధ్యకాయ ధీమహి.. గుణశరీరాయ.. గుణమండితాయ.. గుణేశానాయ ధీమహి.. అంటూ భక్తితో.. ఆ ఏకదంతుడిని కొలిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి.. వినాయకచవితి రోజున ఆ ప్రథమపూజ్యుడిని కొలుస్తాం.. ఇంట్లో చిన్న చిన్న ప్రతిమలు.. వీధుల్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి.. నవరాత్రులూ భక్తి శ్రద్ధలతో పూజిస్తాం.. మరి ఆ దేవదేవుడు కొలువై ఉన్న ప్రముఖ క్షేత్రాలున్నాయి.. వివిధ రాష్ర్టాల్లో ఉన్న ఆ ఆలయాలు.. అక్కడి గణనాథుల విశేషాలు ఈ జంటకమ్మలో..
- సౌమ్య పలుస

Ganesh2

సిద్ధి వినాయక గుడి ముంబై

1801లో లక్ష్మణ్ వితు పాటిల్ అనే అతను ఈ గుడిని కట్టించాడు. పిల్లలు కలుగాలని ఈ గుడి కట్టించినట్లుగా చెబుతారు. ఆ గణపయ్య, సిద్ధి, బుద్ధితో కలిసి కనిపిస్తాడు. ఈ గుడికి ఎక్కువగా బాలీవుడ్ సెలెబ్రిటీస్ వస్తుంటారు. ఈ గుళ్లో కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. అందుకే 2016లో యాపిల్ సీఈవో కుక్ కూడా తన భారతదేశ సందర్శన ఈ గుడి నుంచే ప్రారంభించాడు. ఇందులో పూజ చేయించుకోవడానికి ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు. అలాగే.. ఈ మధ్య కాలంలోనే బెస్ట్ ట్రస్ట్ అవార్డు కూడా ఈ గుడి గెలుచుకుంది. ఈ గుడి కోసం వచ్చే డొనేషన్లతో సేవాకార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ అవార్డు వరించింది.
Ganesh3

దుగ్దుషెత్ హల్వాయ్ గణపతి ఆలయం పుణే

శతాబ్దాల చరిత్ర ఉంది ఈ ఆలయానికి. 7.5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉంటుందీ గణపయ్య విగ్రహం. పైగా 8కేజీల బంగారు తొడుగు ఉంటుంది. 1800వ సంవత్సరంలో దుగ్దుషెత్ అనే స్వీట్ షాపు యజమాని ఉండేవాడు. ఆ సంవత్సరంలో ప్లేగు వ్యాధి వచ్చి ఆయన కొడుకు చనిపోయాడు. దీంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లాడు. అప్పుడు శ్రీ మధ్వనాథ్ మహరాజ్ అనే స్వామిజీ గణేషునికి గుడి కట్టించమని సలహా ఇచ్చాడు. అలా ప్రారంభమైన ఈ గుడి 1893లో ఒక రూపునకు వచ్చింది. ప్రతి యేటా వినాయకచవితి రోజు ఘనంగా పూజలు నిర్వహిస్తారు.

కాణిపాకం, చిత్తూరు

తిరుపతికి 75కి.మీ.దూరంలో ఈ విఘ్నాధిపతి కొలువై ఉన్నాడు. 11వ శతాబ్దంలో చోళ రాజైన కుళుతుండ చోళుడు నిర్మించినట్టు చరిత్ర చెబుతున్నది. బావిలో సగం మునిగినట్టుగా ఈ గణనాథుడి విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహం నుదురు తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో మెరుస్తుంటుంది. ఈ స్వామి బావిలో ఉండే నీళ్లు బయట కోనేరులో కలుస్తాయి. ఆ నీటిలో మునిగితే సర్వపాపాలూ తొలుగుతాయని నమ్మకం. వినాయక చవితి సందర్భంగా అక్కడ గణనాయకుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

దొడ్డ గణపతి ఆలయం బెంగళూరు

పురాతన కాలం నాటి గుడి ఇది. కెంపె గౌడ దీన్ని నిర్మించారు. 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పుతో వినాయకుడి విగ్రహం ఇక్కడ కొలువై ఉన్నది. ఏక రాతితో చెక్కబడిన వినాయకుడి విగ్రహం ఇది. ప్రతీ సంవత్సరం కుడి వైపునకు ఈ విగ్రహం పెరుగుతూ పోతున్నది. అది చూడడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ వినాయకుడికి వెన్న అంటే ఇష్టమని ఎక్కువ వెన్న నైవేద్యంగా సమర్పిస్తుంటారు. బెంగళూరు బస్టాండు నుంచి 38కి.మీ.ల దూరంలో ఈ గుడి కొలువై ఉంది.

మధుర్ మహాగణపతి ఆలయం కేరళ

10వ శతాబ్దంలో ఈ గుడి కట్టినట్లు చెబుతారు. మధువాహిని నది దగ్గర ఈ గుడి ఉంటుంది. కుంబ్లా మైపాడీ రాజు ఈ గుడిని కట్టించినట్లు చరిత్ర చెబుతున్నది. ఇది రాయి, మన్నుతో కాకుండా డిఫరెంట్ మెటీరియల్‌తో విగ్రహాన్ని తయారుచేశారట. ఒకసారి టిప్పు సుల్తాన్ ఈ గుడిని ధ్వంసం చేయాలని చూశాడట. కానీ మనసు మార్చుకొని తిరిగి వెళ్లిపోయాడంటారు. ఈ గుడి పక్కన చిన్న కొనేరు ఉంటుంది. దీంట్లో మునక వేస్తే సర్వ రోగాలు పోతాయని అంటారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న నీళ్లుగా భావిస్తారు. ముడప్పా సేవ ప్రత్యేకంగా ఒక పండుగ జరుపుతారు.

మోతీ డుంగ్రీ గణేష్ టెంపుల్ జైపూర్

మీవార్ అనే రాజు దూర ప్రయాణానికి పూనుకుంటాడు. మొదట ఎక్కడ ఆగితే అక్కడ గణేషుని గుడి కట్టాలని నిర్ణయించుకుంటాడు. అలా నిర్మితమైనదే ఈ ఆలయం. 1761లో ఈ గుడిని నిర్మించారని చరిత్ర చెబుతున్నది. కానీ ఇందులో ప్రతిష్టించిన గణేషుడికి మాత్రం 500యేండ్ల చరిత్ర ఉందట. ఈ గుడిని నగారా ైస్టెల్‌లో నిర్మించారు. మోతీ డుంగ్రీ కొండ దగ్గర ఈ గుడి ఉంది. ఈ గుడిలో శివలింగాన్ని మహాశివరాత్రి రోజు మాత్రమే దర్శించుకోవడానికి వీలు కల్పిస్తారు.

మనాకుల వినాయక ఆలయం పాండిచ్ఛేరి

1666 సంవత్సరాల క్రితం నాటి పాండిచ్చేరిలోని ఫ్రెంచ్ భూభాగంలో మనాకుల వినాయక ఆలయం నిర్మించబడింది. సముద్రపు ఇసుకతో ఈ లోపల ఆలయం నిర్మించినారు. అలాగే ఈ గణేశుడిని ఎన్నిసార్లు సముద్రంలో విసిరేసినా మళ్లీ అదే స్థానంలో పునఃప్రతిష్ట అయ్యేదట. అలా ఇప్పటికీ ఈ నమ్మకం అక్కడి వారిలో ఉంది. అందుకే ఈ గుడిని ఇంకా ఎక్కడికీ తరలించలేదు. కోరికలు తీర్చే స్వామిగా భక్తులు ఈ గణపయ్యను కొలుస్తారు. ఇక్కడ వినాయకచవితి, బ్రహ్మోత్సవాలను ఘణంగా జరుపుతారు. ఈ గుడి బయట ఒక ఏనుగు తన తొండం ద్వారా భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తుంది.

రాక్‌ఫోర్ట్ ఉచ్చి పిల్లర్ కొల్లి టెంపుల్, తిరుచారపల్లి

తమిళనాడు రాష్ట్రంలో 83 అడుగుల ఎత్తు మీద ఈ దేవుడు కొలువై ఉన్నాడు. రాముడు ప్రేమతో విభీషణుడికి రంగనాథుడి విగ్రహాన్ని అప్పగిస్తాడు. అయితే దాన్ని కిందపెట్టకూడదు. ఒకవేళ పెడితే అక్కడే స్థాపన చేయాలని చెబుతాడు. కావేరి నది దగ్గరకు రాగానే విభీషణుడు అందులో మునక వేయాలనుకుంటాడు. అప్పుడు వినాయకుడు బాలుడి రూపంలో వచ్చి విభీషణుడి దగ్గర విగ్రహం తీసుకుంటాడు. విభీషణుడు కావేరీ నదీలో మునిగి బయటకు వస్తున్నప్పుడు ఆ పిల్లాడు కొండను ఎక్కడం చూసి కర్రతో తలపై బాదుతాడు. అలా కొండ మీద వినాయకుడు కొలువై ఉన్నాడు. ఈ విగ్రహం తలమీద ఇప్పటికీ గాటు ఉంటుంది.

251
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles