వాస్తు


Sun,March 17, 2019 12:28 AM

VASTHU

మంచి ఇండ్లు ఉన్నవారు కూడా తప్పులు, మోసాలు చేస్తూ ఉన్నారు కదా. వాస్తు వల్ల ఏంటి లాభం?

కె.జయదేవరెడ్డి, మూసాపేట
కిష్కింధలో, లంకలో, వాలి-రావణుల గృహాలు వాస్తుకే నిర్మించబడ్డాయి. కానీ ఇద్దరూ వధించబడ్డారు. ధర్మం-వాస్తు పాటించకున్నా వృద్ధిలో ఉంటున్నారు కొందరు. ఎన్నో నియమ నిష్టలతో మనం ఉన్నా మనకెందుకు ఈ కష్టాలు అని చాలామంది అనుకుంటారు. చెడు పని ఫలితం ఎవ్వరూ ఎన్నడూ తప్పించుకోలేరు. ఇది మన సనాత ధర్మం నిర్ధారించిన శాసనం తిరుగులేనిది. పోతే వాస్తు ఉండి మోసాలు, తప్పులు, చేసేవాళ్లు అప్పటికి తప్పించుకున్నట్టు అనిపించినా ఒకరోజు వాళ్లకు నిజాలు తెలిసి వస్తాయి. తగు ఫలితాలు కూడా పొందుతారు. వెనుకముందు అంతే... మనిషి జీవితం పని ఫలితంగా నడుస్తూ ఉంటుంది. అతని వ్యక్తిగత జీవనం అతని గృహ నిర్మాణ విధానం రెండూ ఉన్నత ప్రమాణాలతో ఉన్నప్పుడే గొప్ప శాంతిని పొందగలుగుతారు. ఎన్నిఉన్నా శాంతిరాదు. మనిషికి అందుకే ధర్మ-శాస్ర్తాలు అందించబడ్డాయి మానవాళికి.

మాకు దక్షిణం లోయ దానిని నింపకుండా కింద గదులు కట్టుకొని వాడుకోవచ్చా?

బి.రాజేష్, కొలనుపాక
దక్షిణం, పడమర లోతులు ఉన్న స్థలాన్ని ఎలా కట్టాలి అనేకన్నా అసలు కట్టవచ్చా అనేది ముందు చూడాలి. విరుద్ధమైన దిశలు, శుద్ధమైన దిశలు అనేది మన నిర్మాణం బట్టి నిర్ణయం అవుతాయి. ఏ దాని శక్తిని దాని భౌతిక ధర్మాలకు అనుకూలంగానే వాడుకోవాలి అంటే బ్రష్‌తో నాలుక గీచుకోవడం పనికిరాదు కదా... అలా దక్షిణం లోయ, పడమరలోయలు ఇంటి నిర్మాణానికి గట్టి పట్టును ఇవ్వవు సరికదా మనిషి మానసిక, శారీరక పతనానికి దోహదపడతాయి. ఇక అటువైపు నింపకుండా స్లాబులు వేసుకొని వస్తూ గదులు కట్టుకుంటూ పోతే దక్షిణం లోయలో వసతి దొరుకుతుందేమోకాని పతనం తప్పదు. మీరు ఆ లోయ నింపికట్టాలా అటువైపు సెల్లార్ చేసుకొని వాడాలా అనే ఆలోచనలు విడిచిపెట్టి అక్కడ ఇల్లు కట్టుకునే ఉద్దేశాన్నే మానుకొండి. బాగుంటారు.

మాకు పడమర దక్షిణం వీధులు ఉన్నాయి దక్షిణం డౌను రోడ్డు ఉంది. మేము ఇల్లు కట్టొచ్చా?

బి.మాధవి, తెల్లాపూర్
ఇంటి స్థలానికి రెండు రోడ్లు వస్తే ఆ రెంటిలో ఏది ఎత్తుగా ఉంది. ఏది పల్లంగా ఏది విశాలంగా ఉంది అనేది చూసి ఆ దిశకు సింహద్వారం పెట్టి కట్టాలి. ముఖ్యంగా దక్షిణం పల్లమైన వీధి ఉంటే అటు సింహద్వారం పెట్టకుండా ఆ నైరుతి స్థలానికి పశ్చిమ ప్రధాన ద్వారంలో ఇల్లు కట్టాలి. తూర్పు ద్వారం ఉండాలి తప్పకుండా ఉత్తరం ద్వారం ఏర్పాటు చేసుకొని నివసించాలి. దక్షిణం, పడమర ఖాళీ వదిలి ఇల్లు నిర్మించాలి. దక్షిణంలో అనుకున్న దానికన్నా విశాలత ఎక్కువ ఉండేలా స్థలం ఇచ్చి ఇటు కన్నా ఉత్తరం ఖాళీ పెంచి ప్రదక్షిణానికి వదలాలి. అంటే దక్షిణం పల్లమైనప్పుడు దాని ప్రభావం ఇంటిమీద పడకుండా జాగ్రత్త వహించాలి. చుట్ట్టూ ఎక్కువ ఖాళీ వదలాలి. దిశలో మార్పులు వంకరటింకలు ఉంటే ఆ చోట ఇల్లు కట్టడం మానుకోవాలి.

ఇంటి చుట్టూ మట్టి ఎత్తుగా నింపుకోవచ్చా నైరుతి ఎత్తు చేసి?

వి.చంద్రకళ, వర్ధన్నపేట
ఇంటి ప్రహరీ లోపలి ఆవరణం ఇంటి బలాన్ని, ఆలోచనని, వృద్ధి చేసే విధంగా వినియోగించబడాలి. ఒకరకంగా అది ఆకర్షణను కలిగిస్తుంది (ఫేస్ వ్యాల్యూ పెంచేది). ఇక్కడ చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. అనేకులు ప్రహరీలే కట్టుకోవడానికి ఇష్టపడరు. తక్కువ మంది ఇంటి పరిసరాల విషయంలో గొప్ప శ్రద్ధ వహించి ప్రేరణ పొందుతుంటారు. కలిగిస్తారు. ఇంటిచుట్టూ ప్రదక్షిణ స్థలంలో హెచ్చు పల్లాల విషయంలో జాగ్రత్త వహించాలి. నైరుతి కదా అని ఆ మూల మట్టిదిబ్బ చేయవద్దు. ఈశాన్యం కదా అని అటు దిక్కు బొంద చేయవద్దు. సమపట్టుగా తీర్చిదిద్దాలి. ప్రధానంగా ఇంటి ఫ్లోరింగ్ ఎంత ఎత్తు కట్టారో, కట్టాలో నిర్ణయించుకొని ఇంటి ప్రదక్షిణ స్థలం ఎత్తు పల్లాలు నిలుపాలి. దక్షిణ నైరుతి నుంచి తూర్పుగా.. పశ్చిమ నైరుతి నుంచి ఉత్తరంగా పల్లం సాధారణంగా ఏర్పాటు చేసుకోవాలి. నైరుతి మూల ఎత్తు అరుగు కట్టవద్దు. ముఖ్యంగా ఇంటి పీఠం (ఫ్లోరింగ్) ఎత్తుకన్నా బయటి నైరుతి భాగం తక్కువ ఉండాలి. ఈశాన్యం దిశ కన్నా నైరుతి స్థలం ఎత్తుగా ఉండాలి. అప్పుడే పూర్ణ శక్తి ఆ ఇంటికి లభిస్తుంది.

మా స్థలానికి తూర్పు ఆగ్నేయం నుంచి ఒక రోడ్డు ఉత్తరం ఈశాన్యం నుంచి ఒకరోడ్డు వస్తుంది. మంచిదేనా? రెండురోడ్లు బ్యాలెన్స్ మంచిదే అంటారు కదా?

-చిలుకూరు శైలజ, మాదాపూర్
లోకంలో చాలా రూమర్స్ ఉంటాయి. అవన్నీ నిజాలు అనుకోవద్దు. ఒక స్థలంలో నిర్మాణం చేయడానికి మనం కమిట్ అయితే అక్కడ ఉన్న వీధులు వాటి స్థితిగతులు చక్కగా శాస్ర్తానికి అనుకూలమా? విరుద్ధమా? చూసుకోవాలి. కొందరు ఇటు ఈశాన్యం రోడ్డు రావడం మంచిది కాబట్టి అటు ఆగ్నేయం రోడ్డు శూల వచ్చినా పరవాలేదు. బ్యాలెన్స్ అవుతుంది కదా అని తమకు తామే సొంతంగా తీర్మానించుకుంటారు. అది చాలా విరుద్ధ వాదం గ్లాసు మురికి నీళ్లు తాగి, గ్లాసు మినరల్ నీల్లు తాగితే మురికి ప్రభావం కడుపులో పోతుందా? ఆలోచించాలి. ఒక చెడుకు, ఒక మంచి ప్రత్యామ్నాయం కాదు. వాస్తులో మీరు తూర్పు ఆగ్నేయం రోడ్డు వీధిపోటు పడే భాగాన్ని మొత్తం తొలిగించి ఉత్తరఈశాన్యం వీధిని స్వీకరించి ఇల్లు కట్టండి. అప్పుడే మీరు ఆ గృహంలో పురోగతి చెందుతారు.

sudhaala
సుద్దాల సుధాకర్ తేజ
[email protected]
Cell: 7993467678

763
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles