వాస్తు


Sun,December 2, 2018 12:46 AM

Vasthu

మంచి ఇంట్లో ఎంత కాలానికి మంచి ఫలితాలు వస్తాయి?

కె.వి.కిరణ్మయి, ఖమ్మం
ఫలితం అంటే దానికి పూర్ణమైన అర్థం ఉండదు. ఒకరికి కలిగిన ఫలితం మరొకరికి నష్టం అనిపించవచ్చు. మంచి అయినా, చెడు అయినా దాని పర్యవసానం గుర్తించాలి. సైకిల్ మోటార్ చెడిపోతే బాగుచేసి వారికి మేలు చేయించుకున్నవారికే ఖర్చు. ఇది ఏ ఫలితం. మంచి ఇంట్లోకి వెళతారు. గుండెలో నొప్పి అనిపిస్తుంది. హాస్పిటల్‌కు వెళ్లగానే బైపాస్ చేయాలి బతుకడు అంటారు డాక్టర్. ముందు తెలియడం మంచి ఫలితమా? అందులోకి రాగానే బైపాస్ జరిగింది అనేది చెడు ఫలితమా? ఇవన్నీ కాదు మనిషి ప్రశాంతంగా ఉండగలడా ఆ గృహంలో అనేదే శాస్త్రం లక్ష్యం. అలా అని సుఖం కాదు, దుఃఖం కూడా కాదు. సుఖ దుఃఖాలను గెలిచే మనస్సు ఉన్నత స్థితి పొందడం మనిషికి అల్టిమేట్‌గా అందాలి. డబ్బుల గలగలలో భరోసా ఉండదు. భగవంతుని దృష్టి (విశ్వాత్మ)తో గృహం కనెక్ట్ కావాలి. అది శాస్త్ర ప్రధాన ఉద్దేశం. అందుకు గృహం, వ్యక్తిత్వం రెండూ అవసరమవుతాయి.

నైరుతి పెరిగిందని వదిలి ఇల్లు కట్టాం. ఆ స్థలాన్ని ఎలా వాడుకోవాలి?

పి.వాణి, అల్వాల్
ఇల్లు కట్టేటప్పుడు స్థలాన్ని బట్టి కొన్ని దిశలు పెరుగుతుంటాయి. కొంత స్థలం అనుకున్నదానికన్నా తక్కువ అవుతుంది. మూల మట్టానికి స్థలం చేశాక ఎటువైపు స్థలం పెరిగినా వదిలివేయాలి. తిరిగి దానిని వాడడం మంచిది కాదు. మీరు చెప్పినట్టు నైరుతిలో స్థలం ఎక్కువ పెరిగితే అందులో గది నిర్మించే స్థలం ఉన్నప్పుడు పెరిగిన ఆ స్థలాన్ని కూడా మూలమట్టానికి సరిచేసి దానిని ఇతరులకు ఇవ్వాలి. అందులో ఎవరైనా నివాసం చేయవచ్చు. దానిని ఆ గదిలో ఉండే వాళ్ల పేరుమీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. దానిని అంటకుండా ప్రధాన గృహానికి ప్రత్యేకంగా కాంపౌండ్ పెట్టాలి. యజమాని కుటుంబ సభ్యులు ఆ పెరిగిన గదిని ఎవరూ కూడా వాడకూడదు.

పూజగది వెనుక జాలారు (యుటిలిటి) పెట్టొచ్చా?

కె.అరవింద, ఉప్పల్
పూజగదిని ఎప్పుడైనా స్వతంత్రంగా ఉండేలా నిర్మించాలి. దానిని మరొక దానితో జతకలిపి కట్టొద్దు. కొన్నింటి ప్రత్యేకతకు స్థలం కారణం అని రాజీపడవద్దు. కొందరు మరీ దారుణంగా టాయిలెట్ ముందు వైపు ఇచ్చే దాని వెనుక పూజగది స్థలం వదులుతారు. పైగా మధ్యన రెండు గోడలు కట్టాం అంటారు. జాలారుకు జత చేస్తారు. తద్వారా పూజగది పవిత్రతను కోల్పోతుంది. పూజగదిని ఇంటి తూర్పు మధ్యహాలుకు ఈశాన్యంలో తూర్పుగోడను ఆనించి కట్టాలి. ఆ గదికి తూర్పున ఒక వెంటిలేటర్ వాయు ప్రసారానికి పెట్టాలి. ఇక దానికి ఎటువైపు కూడా జాలారు, టాయిలెట్ లాంటివి కట్టవద్దు. అది భగవంతుడి స్థానం అన్నది మరువద్దు. ఒక తంతు లాగ పూజగది కట్టవద్దు.

దక్షిణంలో ఊరి నీటి స్టోరేజ్ ట్యాంక్ ఉంది. ఆ ఇల్లు కొనవచ్చా?

కొణితల చంద్రశేఖర్
కొన్ని నగరాలలో, ఊళ్లల్లో ఊరి సెప్టిక్‌ట్యాంక్, వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కడుతూ ఉంటారు. అలాంటి వాటి చుట్టూ సాధారణ గృహాలు నిర్మితమై ఉంటాయి. ఆ ఇండ్లకు ఆ గోతులు పడమర, దక్షిణం వచ్చినట్లయితే అవి ఆ గృహాలకు పెద్ద హాని చేస్తాయి. కొన్ని మహా నగరాలలో దక్షిణ పశ్చిమాలలో మున్సిపల్ వాటర్ స్టోరేజ్ ట్యాంకులు ఎత్తుగా చేసి కడుతారు. అవి ఎలాంటి ఇబ్బంది కలిగించవు అలా ఉండే ఇండ్లను కొనుక్కోవచ్చు. తూర్పు ఉత్తరాలలో ఎత్తు ట్యాంకులు వస్తే కొనవద్దు.

మా ఇంటి వెనుక ఖాళీ స్థలం ఉంది. దానిని పెట్రోలు బంక్ కోసం ఇవ్వొచ్చా?

యాదుగాని శంకర్, నిజాంపేట
ఇంటి వెనుక అంటే ఏ దిశ వస్తుందో మీరు తెలుపలేదు. మనం ఉండే ఇంటికి తూర్పు ఉత్తరాలలో ఖాళీ స్థలం ఉంటే అందులో పెట్రోల్ బంక్ కోసం అద్దెకు ఇవ్వవచ్చు. పెట్రోల్ బంక్ అంటే పెద్దగోతులు తీసి ట్యాంక్‌లు నిర్మించి వాటిని కడతారు. పైకి అందంగా కనిపించినా గోతుల నిర్మాణాలు కాబట్టి నివాస గృహానికి దక్షిణ, పడమరలు రావద్దు. తూర్పు ఉత్తరాలలో పెట్టినా వాటిలోకి వచ్చే వాహనాల రాకపోకలు, ఇంటికి వీధిపోట్లు కాకుండా పెట్రోలు బంక్‌లోపలికి వచ్చే పాసేజ్ డ్రైవ్ ఏరియాను నిర్మించాలి. మీరు అన్ని జాగ్రత్తగా చూసుకొని ప్లాను చేసుకోవాల్సి ఉంటుంది.
sudhaala
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

252
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles