వాస్తు


Sun,September 9, 2018 12:22 AM

office

ఆఫీసులో క్యాషియర్ చాంబర్ ఎక్కడ ఉండాలి?

బి. మునిస్వామి, కొత్తూరు
వాస్తుపరంగా ఆఫీసును విభాగం చేసినప్పుడు ప్రధాన విభాగాలు.. అంటే డైరెక్టర్లు, చైర్మన్‌లు, మేనేజర్లు దక్షిణ నైరుతి నుంచి ఆరంభించి అటు తూర్పు, ఇటు ఉత్తరం సాగేలా ఎల్ ఆకారంగా కట్టుకోవాలి. ఆఫీసు మధ్యలో ఖాళీ రావాలి. ఆ విభజనలో దక్షిణ భాగంలో ఉత్తర ముఖంగా కూర్చొనే విధంగా ఒక అనుకూలమైన కొలతలో చాంబర్ ఏర్పాటు చేసుకోండి. బీరువాను ఆ గదిలో నైరుతిలో ఉత్తర ముఖంగా పెట్టుకోండి. గల్లా పెట్టెను కుడి వైపు పెట్టుకొని వ్యవహారం చేయాలి. ఆ చాంబర్‌కు ద్వారం ఉత్తర ఈశాన్యం రావడం మంచిది. ఈ చాంబర్ నైరుతి గది కన్నా ఎక్కువ ఉండవద్దు. అవసరమైతే దానితో సమానంగా ఉండవచ్చు.

ఇంటికి ఉడెన్ ఫ్లోర్‌ను ఎక్కడెక్కడ పెట్టొచ్చు? అది ఎత్తుగా ఉండొచ్చా?

కె. అమల, బచ్చన్నపేట
చాలా కొత్త కొత్త విధానాలతో ఇవ్వాళ ఇండ్లు కడుతున్నారు. ఇంటి గర్భం కొంత నుంచి బయటకు నాలుకలా పొడుచుకొని వచ్చే ఉడెన్ ఫ్లోరింగ్ ఉత్తరంలో, తూర్పులో, ఈశాన్యంలో ఎత్తుగా పెట్టడం మంచిది కాదు. దక్షిణం వైపు, పడమర వైపు వాటిని అమర్చుకోవచ్చు. ఇంటికి తూర్పులో, ఉత్తరంలో లాన్ ఏర్పాటు చేసుకొని ఈశాన్యం, తూర్పు ఇంటిని కట్ చేసి ఉడెన్ ఫ్లోరింగ్ చూడడానికి అందంగా అనిపించినా అవన్నీ దోషాలు అవుతాయి. వాటిని ఎంకరేజ్ చేయవద్దు.

మా ఫామ్‌హౌజ్‌కి దక్షిణం ఎత్తుంది. ఆ ప్రాంతంలో ఒక కాలువ కూడా పారుతున్నది. అలా ఉండొచ్చా?

రాధాస్వామి, గోపన్‌పల్లి
మీ ఫామ్‌హౌజ్ స్థలం ఎన్ని ఎకరాలో మీరు తెలుపలేదు. విశాలమైన స్థలంలో ఒక నిర్దిష్టమైన ఉచ్ఛస్థలంలో గృహం (రిసార్ట్)నిర్మించినప్పుడు ఆ మొత్తం స్థలం హద్దులనే ఆ కొత్త ఇంటి హద్దుగా పరిగణించకూడదు. అంత పెద్ద వైశాల్యంలో మీరు కట్టే ఇల్లు ఏ నిష్పత్తిలోనూ నిలువదు. కాబట్టి మనం ఉండే నిర్మాణానికి ప్రత్యేకంగా ప్రహరీలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధానంలో దక్షిణం సాధారణ కాలువలు వాటి ప్రభావాలు నిలువలేవు. అది కూడా లోతు లేని కాలువ అని రాశారు. వర్షాకాలంలో పారుతుందని అన్నారు. వాగు, నది దక్షిణంలో పారడం మాత్రం పనికి రాదు. పైగా దక్షిణం ఎత్తు ఉందంటే ఆ ఎత్తు మీదున్న చిన్న కాలువ లోతుతో మీ ఈశాన్యం గేటు లెవల్ ఉంటే మరింక దోషమే ఉండదు.

మా తాతగారి ఇంట్లో వరుసగా నలుగురు కారు యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఇంటిలో ఏ దోషం ఉంటుంది?

ఎస్. మాధవీలత,
విజయనగర్ కాలనీ, హైదరాబాద్.
ప్రధానంగా నైరుతి దోషం ఉంటుంది ఇంట్లో. ప్రకృతిలో ఏముందో మనిషిలోనూ అదే ఉంది. మానవ జన్మ మూలానికి కేంద్రం నేచర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రకృతి అనే మగ్గంలో కండె (రెండు వైపులా మొనదేలి దారాన్ని ఆడించే వస్తువు)లాంటివాడు మనిషి అటు ఇటు పరుగు తీస్తూ జీవితమనే వస్ర్తాన్ని అల్లుకుంటాడు. కండెను నడిపే మగ్గం బాగా లేకుంటే వస్త్రం అందంగా రాదు. ఈ సుదూరమైన ఆటలో, ప్రయాణంలో మన చుట్టూ ఉండే పరిసరాలు మనల్ని నడిపించే వాహనం లాంటివి. అప్పుడు వాహన వేగం మన వేగం అవుతుంది. వాహనం కుదుపు, మన కుదుపు అవుతుంది. ఇంటిలోకి చేర్చే నైరుతి మార్గం, నైరుతి ద్వారం, నైరుతి వీధిపోటు.. ఇవి చాలాకాలంగా ఉన్నప్పుడు ఆ ఇంటి సభ్యుల బ్రెయిన్ టైమర్ దెబ్బతింటుంది. క్షణంలో వందవంతుతో సేవ్ చేసే నిర్ణయిక శక్తి లోపిస్తుంది. కనురెప్పలు ఆ శక్తితోనే కళ్లను రక్షిస్తూ ఉంటాయి. ఇంట్లోని నైరుతి లోపం, ఓపెన్ నైరుతిలో గోతులు, బావులు వ్యక్తిని నిర్వీర్యం చేసి వాళ్లు డ్రైవింగ్ చేస్తుంటే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి.

కిచెన్‌కు యుటిలిటీ ఈశాన్యంలో పెట్టి, దానికి డోర్ ఇవ్వొచ్చా?

వి. అమరేందర్, షామీర్‌పేట్
కిచెన్‌కు యుటిలిటీ (గిన్నెలు తోమే గచ్చు) అటు ఆగ్నేయం, ఇటు వాయవ్యం పెట్టడం సముచితం. ఇంటికి ఆగ్నేయంలో కిచెన్ వచ్చినప్పుడు దక్షిణ ఆగ్నేయంలో యుటిలిటీ ఉండాలి. వాయవ్యంలో కిచెన్ వస్తే పశ్చిమ వాయవ్యంలో యుటిలిటి రావాలి. ఆగ్నేయం కిచెన్‌కు ఈశాన్యం గచ్చు ఇచ్చారు. అంటే.. అక్కడ బాల్కనీ చేశారని అర్థం అవుతుంది. పైగా దానికి ద్వారం పెట్టడం వల్ల అది ఆగ్నేయ ద్వారం అవుతుంది. అది సరైనది కాదు. పైగా ద్వారం వచ్చేలా ప్లాన్ చేస్తే కిచెన్ భాగం మొత్తం ఆగ్నేయం పెరుగుతుంది. కాబట్టి మీ నిర్ణయం మంచిది కాదు. సరిగ్గా చూపించి కట్టుకోండి.
Teja

260
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles