వాస్తు


Sun,August 13, 2017 03:00 AM

vastu

ఇంట్లో రెండు వంట గదులు ఎక్కడ పెట్టాలి?:దీప్తిరెడ్డి, మేడ్చల్

గృహ అవసరాలకి రెండు వంటగదులు అవసరం వుందా అన్నది ముందు చూడండి. అందరు పెడుతున్నారు అని ప్రదర్శనకోసం ఇంటి స్థలం వృధా చేయవద్దు. రెండు వంటగదులు ఇంటి మొత్తం వైశాల్యంలో ఆగ్నేయంలోనే రావాలి. దక్షిణ భాగం ఆక్రమించకుండా చూడాలి. ప్రధానంగా వాడే వంటగది (వెట్‌కిచెన్) ఆగ్నేయ భాగంలో వుండాలి. లేదా వాయవ్యంలో మరో గదిని వంటగదిగా మార్చుకోండి. ఏదైనా ప్రాధాన్యం కలిగి వున్నప్పుడే ఇంట్లో స్థానం కల్పించాలి. వస్తువైనా, స్థలమైనా అవసరం అవనది వాడనిది ఇంట్లో వుండి నిరుపయోగం కదా.

వాయవ్యంలో మెట్లు పిల్లర్స్‌తో వేసుకోవచ్చా?:- సి. చంద్రశేఖర్, గజ్వేల్

నిజానికి ఇంటితోపాటే మెట్ల నిర్మాణం చేయాలి కదా! అప్పుడు అదనంగా పిల్లర్స్ రావు. అంటే, మీరు ఇప్పటివరకు మెట్లు వేయలేదన్నమాట. కొత్తగా మెట్లు వేయాలన్నప్పుడు తప్పనిసరిగా పిల్లర్స్ అవసరం. అయితే, ఒక్క పిల్లర్ మాత్రమే తీసుకొని వేయాలి. ఆ పిల్లర్ ఇంటి వాయవ్యం మూలలో వేసి ల్యాండింగ్ కింద ఆ పిల్లర్ నుండి అడ్డబీము తీసుకొని పైకి వెళ్లే మెట్లు వేసుకోవాలి. అలా ప్రతి మిద్దెకు వెళ్లటానికి ల్యాండింగ్‌ల కింద ఏడు అంకె ఆకారంలో పిల్లర్ సపోర్ట్ వస్తుంది. అలా కాకుండా రెండు పిల్లర్స్ వేస్తే ఇంటికి వాయవ్యం పెరుగుతుంది. అప్పుడు ఈశాన్యం మూల కూడా మరొక పిల్లర్ వేయాలి. ఉత్తరం మొత్తం పూర్తి బాల్కనీ తీసుకోవాలి.

పాత ఇల్లు తీయకుండా దానిమీద కొత్త ఇల్లు కట్టుకోవచ్చా?:విష్ణుప్రియ, నారపల్లి

ఉన్న ఇంటిమీద మరో ఫ్లోర్ వేయడానికి ఇబ్బంది ఉండదు. కానీ ఉన్న ఇంటికి పిల్లర్లు సరిగ్గా వున్నాయా.. అది బరువు మోయగలదా. ఎన్ని సంవత్సరాలుగా ఆ పాత ఇల్లు వుంది. పైన ఇల్లు కడితే వాస్తుకు అనుకూలమైన గదుల విభజన చేసుకోవచ్చా అన్న అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లర్స్ లేని ఇల్లు అయితే దానిని తొలగించి కట్టడం మంచిది. సరైన విధానంతో తూర్పు, ఉత్తరాలలో అవసరమైనంత స్థలం వదిలి కట్టుకునే అవకాశం వుంటుంది. ఏదైనా శాశ్వతమైన ఆలోచనలతో నిర్ణయం తీసుకోండి.

ఈశాన్యం స్థలంలో ఇల్లు ఎలా కట్టాలి?:- కె. శ్రీనివాసరావు, హుజూర్‌నగర్

ఈశాన్యం స్థలం అనగానే వెంటనే ఇల్లు కట్టే నిర్ణయం తీసుకోవద్దు. ముందు ఆ స్థలం సరిగ్గా దిశకు వున్నదా అన్నది చూడాలి. అలాగే దక్షిణం, పడమర ఇండ్లు వున్నాయా చూడాలి. వీథులు మన స్థలం దాటి ప్రయాణిస్తున్నాయా, మన స్థలం వద్దనే మలుపు తీసుకొని ఒకే రోడ్డు తూర్పు, ఉత్తరాల నుండి వెళుతున్నాయా చూడాలి. స్థలం అన్ని విధాల బాగుంటేనే ఇల్లు కట్టటానికి నిర్ణయించాలి. అనవసరంగా ఈశాన్యం పెంచే విధంగా వాయవ్యంలో ప్రహరీని లోపలికి తీసుకోకూడదు. తూర్పు ఉత్తరం మరీ ఎక్కువ కాకుండా దక్షిణం, పడమర ఖాళీ కన్నా ఎక్కువ ఉండేలా వదిలి ఇల్లు వాస్తుపరంగా కట్టాలి. శుభ ఫలితాలు వుంటాయి.

మా కొత్త ఇంటికి బయట టాయిలెట్ వేసుకోవాలి. ఎక్కడ వేయాలి?:బి. రాజు, ఆలేరు

మెట్లకింద మాత్రం వేయకండి. మూతపడి గృహంలోని ఆరోగ్యాలలో ఇబ్బందులు వస్తాయి. ఇంటికి తూర్పుభాగం ఉన్న ఖాళీ స్థలంలో ఆగ్నేయం వైపు దక్షిణం ఇంటి పారుకు సమానంగా వేయాలి. లేదా ఉత్తరం వైపు ఖాళీ వుంటే ఉత్తరం వాయవ్యంలో పడమర ఇంటి పారుకు సమానంగా టాయిలెట్ గది వేసుకోవచ్చు. ఈ రెండు ప్రదేశాలలో కూడా ఇంటికి పడమరలో వచ్చిన ఖాళీ లేదా దక్షిణంలో వచ్చిన ఖాళీ ఆ బాత్‌రూంలకు కూడా దక్షిణ పశ్చిమాలలో అంతే ఖాళీ రావాలి. లేదంటే ఇంట్లో కూడా దక్షిణ, పడమరలలో టాయిలెట్ వేసుకోవచ్చు.

తూర్పు ఇంటిని కొనవచ్చా?:- బి. సుధాకర్, పెబ్బేరు

కొనవచ్చు. ప్రధానంగా ఏ ఇల్లు కొన్నా కూడా అది ఉన్న వీథి దిశకు అనుకూలంగా వుందా అనే విషయం గమనించాలి. అలాగే, ఇంట్లో హాలు వుందా లేదా అనేది చూడాలి. గృహం అంటేనే పడక గదులు ప్రధానంగా కాక గర్భం, దాని వైశాల్యం సవ్యంగా ఉండాలి. అంటే ఎల్ ఆకారంలో హాలు తప్పక వచ్చేలా నిర్మించారా లేదా అనేది గమనించాలి. చాలామంది రెండు గదులు రావడం కోసం ఇంటిని చాలా ముక్కలు చేస్తుంటారు. గూటి విభజనలో ఖాళీని లెక్కించాల్సిన అవసరం వుంటుంది. అది సమపట్టుగా ఉన్నప్పుడు ఆ గృహంలో పూర్ణ ఫలితాలు ఉంటాయి.


గుడిని ఫస్ట్‌ఫ్లోర్‌లో కట్టుకోవచ్చా?:వి.వెంకటరెడ్డి, హయత్‌నగర్

గుడి దేవుడి నిలయం. ఇది శారీరంగా మానసికంగా మనిషిని శక్తివంతం చేయాలి. విశ్వంలోని స్పందనా శక్తి బహిర్గతమయ్యే స్థానం దేవాలయం అది ఏ దేవాలయమైనా సరి.. అంటే మనస్సుకున్న ప్రతిస్పందన శక్తిని అది రెట్టింపు చేస్తుంది, చెయ్యాలి. అందుకే అది జీవాలయం కావాలి. అందరూ మహోన్నతులు కానట్టే అన్ని గుళ్లూ జీవాలయాలు కాలేవు. ముఖ్యంగా దేవుడి మూర్తి (విగ్రహం) భూమిపైన వుండాలి. ఆలయాన్ని పై మేడ మీద కట్టాలి అంటే గర్భగుడి భాగాన్ని భూమి నుండి పైకి ఎత్తుగా లేపి మేడమీద విగ్రహాన్ని ప్రతిష్టించుకోవచ్చు. అలాకాక కేవలం స్లాబు వేసి దానిమీద గర్భాలయాన్ని నిర్మించకూడదు. గుడిని శాస్త్రీయంగా కట్టినప్పుడే శుభప్రదం అవుతుంది.

965
Tags

More News

VIRAL NEWS

Featured Articles