వాళ్లు నలుగురూ..


Sun,December 3, 2017 02:28 AM

వాళ్లు నలుగురూ కలుసుకోవడం యాదృచ్ఛికంగా జరిగిందనే చెప్పాలి. శారద గానసభలో యేధో వేదాంతోపన్యాసం జరుగుతుందని అక్కడకు వెళ్లారు. సంగీతసభలు, కచేరీలు జరిగే ఆ సమావేశ స్థలంలో అప్పుడప్పుడు రాజకీయ, సాంఘిక సమావేశాలూ జరుగుతుండడం వాళ్లకు తెలుసు. నిజానికి అక్కడ జరిగే యే సంగీత కచేరీకి వాళ్లు హాజరవకుండా వుండరు. ప్రపంచాన్ని అంతా మరిచిపోయి, కనీసం రెండు మూడు గంటలయినా రసాస్వాదనలో మునిగి తేలడానికి అవకాశం యిచ్చేదీ కచేరి.ఉనన్యాసం అయిపోయిం తర్వాత, తిన్నగా యింటికి వెళ్లకుండా ఆ ఆవరణలోనే వున్న కాఫీ కఫేకు వెళ్లారు. కాస్త వెచ్చదనం శరీరానికి పులుముకుంటే హాయిగా యింటికి వెళ్లవచ్చు. కఫేలో ఒకే బల్ల ఖాళీగా వుంది. వాళ్లలాగ ఆలోచన చేసిన వాళ్లు అప్పటికి సీట్లు ఆక్రమించేసుకున్నారు. ఖాళీగా వున్న బల్ల చుట్టూ నాలుగే కుర్చీలు ఖాళీగా వున్నాయి. అందుకని, మరేం మొహమాటం లేకుండా ఆ నలుగురూ వాటిని ఆక్రమించేసుకున్నారు. అలా అదే వాళ్ల ప్రథమ పరిచయం, సమావేశం అయింది. విద్యుత్ కాంతులతో హాలంతా వెలిగిపోతున్నది. సెర్వర్ల అరుపులు, ఖాళీ కప్పులు, సాసర్ల చప్పుళ్లు, మధ్యమధ్యలో పలువురి సంభాషణలు జోరుగానే వినిపిస్తున్నాయి. అక్కడంతా ఎవరి లోకం వాళ్లది.ఆ నలుగురిలో ఒకతను గవర్నమెంట్ ఆఫీసులో ఓ సామాన్యమైన గుమాస్తా. బలహీనంగా, బక్కగా వున్నాడు. చేతులు అస్తమానం కదుపుతూ వుంటాడు. యేదో రాస్తున్నట్లు, ఫైళ్లు వెదుకుతున్నట్లు. అతనికి ఎదురుగా కూర్చున్న అసామి కాస్త శ్రీమంతుడి లాగానే కనిపిస్తున్నాడు. అతనికి పెద్ద బజారులో ఓ దుకాణం వుంది. మాటకు ముందు నవ్వుతూ వుండడం, ఎప్పడూ ఉల్లాసంగా వున్నట్లు అందరికీ కనబడాలనే తాపత్రయం అతనిలో గూడు కట్టుకున్నాయి. మూడో మనిషి బాగా వృద్ధుడు. ఏదో ఉద్యోగం చేసి భారీ పెన్షన్‌తో రిటైర్ అయినవాడు. కాలక్షేపం కోసం వేదాంత గ్రంథాలు చదువుతూ, గుళ్లలో పూజలు, పునస్కారాలు చేయిస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. నాలుగో మనిషి ఓ కళాకారుడు. పొడవాటి జుట్టు, భుజాల మీద వేలాడుతూ వున్నది.
Katha

పక్కనున్న కిటికీలోంచి ఆకాశం, మిలమిలా మెరుస్తున్న నక్షత్రాల గుంపు కనిపిస్తున్నాయి. బయటి ఆవరణలోని సన్నజాజి పువ్వుల పరిమళం అందరినీ తాకుతూ వుంది.
దుకాణదారు ముందుగా మాట్లాడాడు. ఈ వాతావరణం చాలా బావుంది. ఇక్కడ ఎంతసేపయినా కూర్చోవాలనిపిస్తుంది. కానీ, నేను నా గురించి ఎక్కువగా చెప్పి మిమ్మల్ని విసిగించను కూడా. గొప్ప శ్రీమంతుడిని కాకపోయినా, హాయిగా సంసారం గడపటానికి అవసరమైన ఆస్తిపాస్తులు సమకూర్చుకున్నాను. వ్యాపారంలో తప్పుడు మార్గాలు, తేలిక పద్ధతులు అవలంభిస్తే నిజానికి యింతకంటే ఎక్కువే సంపాదించే వాడిని. అయినా నాకు చిన్నతనం నుండి అన్యాయార్జితం, అనవసర ప్రలోభాల మీద మనసు లేదు. సునాయాసంగా సుఖమయ జీవితం గడపటానికి ఏవైనా మార్గాలు దొరుకుతాయేమోనని ఈ ఉపన్యాసానికి వచ్చాను. ఐతే, నాలో నిరాశయితే లేదు అన్నాడు.గుమస్తా అందుకున్నాడు వెంటనే. నాది దుస్తరమైన జీవితం. చేసిన పనే చేస్తూ, రాసిన కాయితాలే మళ్లీ రాస్తూ కాల హరణం చేసుకునే ఉద్యోగం నాది. నాకు వేదాంతం, మతం అంటే ఆసక్తి లేదు. అయినా, లోతయిన మత జీవనం గడపాలనే కాంక్ష మాత్రం వుంది. చెప్పొద్దూ, సన్యాసం పుచ్చుకుందామని అప్పుడప్పుడూ తీవ్రమైన ఆలోచన వస్తూ వుంటుంది.

మళ్లీ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు- నాకున్న సంసార బాధ్యతలు గుర్తుకు వచ్చి నన్ను నేను సంబాళించు కుంటాను. ఏమీ ఆసక్తి లేని పనులు చేస్తూనే సంవత్సరాల తరబడి బతుకు సాగిస్తున్నాను. ఎప్పటికైనా వివేకోదయం అవుతుందేమో అని యీ ఉపన్యాసం వినడానికి వచ్చాను అన్నాడు.తరువాత వృద్ధ రిటైర్డ్ ఆఫీసర్ తన ప్రవర చెప్పుకున్నాడు. నేను సంస్కృతంలోను, తెలుగులోను వున్న మత వేదాంత గ్రంథాలన్నీ చదివేసాను. నాకు యిప్పుడు సంసార బాధ్యతలు అంటూ యేమీ లేవు. పిల్లలు పెద్దవాళ్లయి వాళ్ల సంసారాలు వాళ్లు చేసుకుంటున్నారు. ఎన్నో వేదాంత ఉపన్యాసాలు, ఎందరో జ్ఞానులు, విద్వాంసుల బోధనలు విన్నాను. అయినా నాకు యేదీ సంతృప్తిగా అనిపించలేదు. కొన్నిమార్లు వాళ్లు చెప్పేవన్నీ పసివాళ్ల పలుకులలాగ అనిపిస్తాయి. మాటలు నేర్చిన చిలుకలు మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. కొందరైతే సంస్కృత శ్లోకాలు వల్లే వేయడమే ఉపన్యాసం అనుకుంటారు. సత్యాన్ని తెలుసుకోవటానికి ఎవరూ సులభోపాయాలు చెప్పరు. నా దృష్టిలో భావం/ ఆలోచన అనేది ముగిసినప్పుడే నిజమైన జీవితం ప్రారంభమవుతుంది అంటూ ఈ వక్త చెప్పిన మాటలు నాకు బాగా తెలిసి వస్తున్నాయి. అయినా, యింకా కొన్ని సందేహాలు నాలో వుండనే వున్నాయనుకోండి అని అభిప్రాయం మధ్యలోనే ఆపేశాడు.

యిప్పుడు నాలుగో మనిషి వంతు వచ్చింది. తనేమిటో, తన అన్వేషణ ఏమిటో తెలియజెప్పటానికి మంచి అవకాశం దొరికినందుకు అతనికి సంతోషంగానూ వుంది. కంఠం సరిచేసుకుని, ఉపన్యాసం యిస్తున్నట్టుగా ప్రారంభించాడు. నేను వృత్తిపరంగా, ప్రవృత్తి పరంగా కూడా కళాకారుడిని. అంతగా పేరున్న వాడిని కాదు, కానీ తీసి పారేయవలసిన, కొట్టి పక్కన నెట్టేయ వలసిన మనిషినైతే కాదు. యూరప్ దేశాలకు వెళ్లి కళను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని నా కోరిక. మన దేశంలోనే చెప్పే వాళ్లు వున్నారనుకోండి. అయినా, మీరు మరోలా అనుకోమంటే, నా అభిప్రాయం చెబుతాను. వీళ్లంతా చచ్చురకం మనుషులు. చవకబారు పద్ధతుల్లో నడిచే వాళ్లూను. నేను యేదైనా కొత్త చిత్రం ప్రారంభించే ముందు చక్కగా దాని గురించి ధ్యానం చేస్తాను. జీవితంలో వున్న లాలిత్యాన్ని గురించి మన సనాతనులు ఆలోచించినట్లుగా చింతన చేస్తాను. అదంతా అయిన తర్వాతనే చిత్రం గీయడం ప్రారంభిస్తాను. కొన్నిసార్లు స్వర్ణతుల్యమైన స్థాయిలో కుదురుతుంది, చిత్రం. చాలామార్లు మాత్రం అలా రాదు. ఎన్నో రోజులు, వారాలు వృథాగా గడచిపోతాయి. ఎంతకూ మనసులో బొమ్మ క్యాన్వాస్ మీదికి రాదు. సమయం వృథా అయిపోతుంది తప్ప, యేమీ ప్రయోజనం కనిపించదు. కొన్నిమార్లు ఉపవాసాలు చేసి, ఉపాసనలు చేసి ప్రయత్నించి చూశాను. నాలో సృజనాత్మకత బయటకు రావటానికి నాకు లభించిన మార్గాలన్నీ ప్రయోగించి చూశాను. ఊహు.. ఏమీ లాభం కనిపించలేదు. మనసులో వచ్చిన చిత్రం మటుమాయం అయిపోదు, కాన్వాస్ మీదకు దిగిరాదు. అలా జరగకపోతే, నేను నిజమైన చిత్రకారుడినని ఎలా చెప్పుకోగలను, చెప్పండి. బొమ్మ పూర్తిగా దిగి వచ్చేంత వరకూ నాలో ఉత్సాహం ఉరకలు వేస్తూనే ఉంటుంది అని తన ఆవేదన అంతా వెళ్లగక్కాడు. తర్వాత చాలాసేపటి వరకూ నలుగురూ మౌనంగానే వుండిపోయారు. ఎవరి ఆలోచనలలో వాళ్లు ఉన్నారు.అందరికీ జీవితాన్ని గురించి, అనుభవాలను యథాతథంగా ఉపయోగించుకోవటాన్ని గురించి నిఖార్సయిన అభిప్రాయాలే వున్నాయి. ఎవరికి వారు వ్యక్తపరుస్తూ పోయారు.

నా సమస్య స్వరూపం వేరు. కళాకారుడిలాగ స్ఫూర్తి కోసం, సృజనాత్మకత బయటపెట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తుంటాను. అయితే, అంతకంటే లోతుగా ఆధ్యాత్మిక జీవితం కోసం వెంపర్లాడుతున్నాను అన్నాడు దుకాణదారు.నాదీ ఇంచుమించు అదే సమస్య. కాకపోతే, వేరు అర్థం వచ్చే మాటలలో చెప్పాను అన్నాడు కళాకారుడు.ఎవరికి వారికి తమదే అసలయిన సమస్యలాగ, అదే జీవితంలో అందరికీ ప్రధానం అవవలసిందిగానూ కనిపిస్తుంది. ఆ సమస్య నుంచి బహుదూరంగా వుండటానికి ప్రయత్నిస్తారు అందరూ. కాని మౌలికంగా తమలోని ఆర్తిని తప్పించుకోవటానికి ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారని అనుకోరు. ఎవరికి వారు తనకు ఒక్కడికే కాదు, ప్రపంచంలోని అందరిదీ యిదే సమస్య అని తెలుసుకోగలిగితే వారి సమస్య మూడు వంతులు మటుమాయమవుతుంది. అప్పుడు అందరూ కలసి తమకు కావాల్సిన మూలాన్వేషణ గురించి ఆలోచించవచ్చు. మూలసమస్యకు పరిష్కారం తయారుచేసుకోవచ్చు. అప్పుడు వేదాంత ఉపన్యాసాలు, గురువులు, బాబాల అవసరం యేమీ వుండదు. బాధయినా, భయమైనా, మమకారమైనా, ప్రేమయినా అందరిదీ ఒక్కటే!వృద్ధుడు అన్నాడు- మనందరి సమస్యా ఒక్కటే అని యిప్పుడైనా ఒప్పుకుందామా?- అందరూ అంగీకారంగా తలలు ఊపారు. మనం యేదో పోగొట్టుకున్నాం. దానిని వెదకటానికి నిరంతరమూ శ్రమిస్తున్నాం. అది దొరికితే మన జీవితానికి సార్థకత చేకూరుతుందని అనుకుంటున్నాం అన్నాడు గుమాస్తా.చాలామంది ధ్యానం చేస్తున్నామంటారు. దేని కోసం, సమస్యల నుంచి తప్పించుకోవటానికా? అసలు సమస్యలు యేర్పడకుండా ఉండటానికా? ఆ విషయం ఎప్పుడైనా ఆలోచించారా మీరు అన్నాడు వృద్ధుడు.మనలో మార్పు రాకపోతే, ఎంత ప్రయత్నించినా పైపై మెరుగు అవుతుందే తప్ప అది మూలాన్ని తాకదు గదా అన్నాడు మళ్లీ.నిజమే, మీరు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. మనం ఎందుకోసం వెదుకుతున్నామో తెలియకుండా, వెదుకులాటను కొనసాగిస్తూ జీవితం గడిపేస్తున్నాం అన్నాడు గుమాస్తా.అవును, మనలో సంపూర్ణమైన మార్పు రావాలి. పైపై మెరుగులతో తృప్తిపడిపోతూ వుంటే మూలవస్తువులో కదలిక, చలనం యెలా యేర్పడుతుంది? అన్నాడు రిటైర్డ్ ఆఫీసర్.
అత్యవసరం అనిపించినప్పుడే కావలసిన మార్గం దొరుకుతుందని మాత్రం అందరూ అంగీకరిస్తారు.

చిలుక పలుకులతో మనసు నింపుకుంటే చాలదు గదూ! చదివిన దాన్ని, అర్థం చేసుకున్న దాన్ని త్రికరణ శుద్ధిగా అమలు పరచవలసిన అవసరం వుంటుంది. ఆ అవసరం వున్నట్లుగానూ కనిపిస్తుంది. లేకపోతే అది యెక్కడో మటుమాయమై పోతుంది. వెదుకులాటే మిగులుతుంది ఎప్పటికీ! అని మళ్లీ రిటైర్డ్ ఆఫీసర్ చెప్పాడు.ఆచరణలోకి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక మార్గం ద్వారాలు తెరుచుకుంటాయని కదా, ఆయన యిందాక చెప్పిందీ! అని గుర్తుకు తెచ్చుకున్నాడు దుకాణదారు.స్ఫూర్తితో బతకడం కొంతవరకు బాగానే వుంటుంది. కాని, స్ఫూర్తి మాత్రమే సరిపోతుందా? మనిషిలో పూనిక, కొనసాగించాలనే పట్టుదల, ప్రగాఢంగా వుండవద్దా? అని కళాకారుడు వంత పాడాడు.మనసు ఒక్క క్షణం నిలకడగా వుండదు. ప్రతి క్షణం యేదో ఒక అవాంతరం, అభ్యంతరం తీసుకువస్తుంది. వాటిని ఎండగట్టడంతో కాకపోతే యింకే పనీ చేయలేం అన్నాడు దుకాణదారు.నిజమే, ఆత్మరక్షణ కోసం వెంపర్లాడుతున్నంత సేపూ చంచలమైన మనస్సు ఆలోచనా పరంపరలను ముందుకు తెస్తూనే వుంటుంది అన్నాడు గుమాస్తా.నా వయస్సులో యిప్పుడు నాకు ఆత్మరక్షణ చేసుకోవలసిన, దాని కోసం వెంపర్లాడ వలసిన అవసరం లేదు. కోరికలు నన్నేం దహించుకు తినడం లేదు. వాటి కోసం అన్యాయం చేయవలసిన, అబద్ధాలు ఆడవలసిన అవసరమూ నాకు లేదు.

నాలో యేమీ మారవలసిన విషయం లేదనుకోవడంలోనే నాకు తృప్తి వుంది అన్నాడు వృద్ధుడు.యిప్పుడు నాకు కొత్తగా కోరుకోవలసింది, సంపాదించివలసింది యేమీ లేనిమాట నిజమే. అయితే, యిన్నాళ్లూ నేను పోషించి పెద్ద చేసిన ఆశయాలు, అతిశయాలు, అభిప్రాయాలు- వీటిని వదులుకోవడం కష్టం కదూ? నిఖార్సుగా ఆలోచించటానికి యివన్నీ అడ్డు రావడం లేదూ? అన్నాడు వృద్ధుడు, తనను తాను సవరించుకుంటున్నట్టుగా.ఇప్పుడు దారికి వచ్చారు మీరు అన్నాడు రిటైర్డ్ ఆఫీసర్. వాటిని కూడా సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం కనిపించడం లేదా మీకు?కనిపిస్తూనే వుంది. మళ్లీ మనసులోకి వచ్చే ఆటంకాలు చిలువలు పలువలు అవుతున్నాయిచదివిన శాస్త్రగ్రంథాల పరిజ్ఞానం యేమయిపోతున్నట్లు?ప్రమాణాల మీద, అధికార వచనాల మీద ఆధారపడి జీవితం సాగిస్తే యిలాగే ఉంటుంది మరిప్రతి దాన్నీ, ప్రతి సన్నివేశాన్నీ ఎప్పటికప్పుడు కొత్తగా యిప్పుడే అది తల పైకెత్తినట్లుగా చూడగలగడం వల్ల, దానికి పరిష్కార మార్గం త్వరగా దొరుకుతుందంటారా? అడిగాడు దుకాణదారు.దొరకదు మరి సమాధానంలా చెప్పాడు గుమస్తా.మరోమాట చెబుతాను వినండి. జీవితాన్ని గురించి ధ్యానం చేస్తే లాభం లేదు. జీవిత విధానం గురించి ధ్యానం చేయడం అత్యవసరం అన్నాడు వృద్ధుడు.అప్పటికి వాళ్లు తీసుకోదలుచుకున్న ఫలహారాలు, కాఫీలు ముగింపునకు వచ్చాయి. సెర్వర్ బిల్లు తెచ్చిచ్చాడు.నలుగురూ నాలుగు దారుల్లో వెళ్లిపోయారు. దారులు వేరైనా గమ్యం మటుకు ఒక్కటే సుమా! అని అందరి మనస్సుల్లోనూ ఒక గట్టి ఆలోచన పాతుకు పోయింది.


1206
Tags

More News

VIRAL NEWS