వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్సమ్మా?


Sun,August 5, 2018 02:27 AM

Fakenews
సోషల్ మీడియా ఒకానొక సమయంలో భావస్వేచ్ఛను ప్రకటించడానికి చక్కని వేదికగా ఉండేది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే బలంగా పనిచేసింది. అంతెందుకు ఉద్యమాలకూ పురుడు పోసింది. లక్షల మందిని ఏకతాటిపైకి తేవడానికి, సమాచారాన్ని పంచుకోవడానికి, గొంతును వినిపించడానికి ఓ ఆయుధమయ్యింది. అందులో వాట్సప్ కీలకంగా ఉన్నది. అయితే ఇటీవలి కాలంలో మంచి చేయాల్సిన, బాధ్యతగల వాట్సప్ పక్కదారి పడుతున్నది. వదంతులు వ్యాప్తి చెంది వార్తలుగా మారుతున్నాయి. అవే మరణవార్తలవుతున్నాయి. వాట్సప్ వదంతులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తల సమాచారం పైన ఈ కథనం.

అజహర్ షేక్
సెల్: 9963422160

ప్రేమించు.. ప్రేమ పంచు.. ప్రేమగా జీవించు.. వీలైతే మంచియన్నది పెంచు. ఇది ఒకప్పటి నానుడి. ఇప్పుడు వచ్చిన మెసేజ్‌ను పదిమందికి పంచు, వీలైతే పెంచు, పనేం లేకుంటే ఎక్కువ మందికి పంచు, మంచియన్నది తెంచు అనే విధంగా మారింది. మంచి చేయకపోయినా ఫర్వాలేదు. హాని మాత్రం చేయకూడదు. కానీ మనమేం చేస్తున్నాం? వాట్సప్‌లో వచ్చిన మెసేజ్ నిజమా? అబద్ధమా? అన్నది తెలుసుకోకుండానే ఫార్వర్డ్ ఆప్షన్ ఉందిగా అని రెచ్చిపోతున్నాం. ఫార్వర్డ్ చేస్తే పోయేదేముంది, మొబైల్‌లో డేటా తప్పు కాదని లైట్ తీసుకుంటున్నాం. వదంతులను వైరల్ చేస్తున్నాం. వీటివల్ల ఇప్పటికే హత్యలు, దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ఏది నిజం.. ఏది అబద్ధమో తెలుసుకోకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఘటనలు జరిగే ప్రమాదమున్నది. ఈ విషయం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. అలాంటి చర్యలకు పాల్పడుతున్న గ్రూప్ అడ్మిన్లను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇస్తున్నది. ప్రత్యేక శ్రద్ధతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలను చిట్కాల రూపంలో సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం వాట్సప్ తప్పుడు సమాచారాలపై ఉక్కుపాదం మోపి ప్రజలకు నష్టాలు జరుగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

పోస్ట్ నంబర్

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఫేక్ వార్తలు సృష్టిస్తూ,
ఫేక్ అకౌంట్స్‌లో జనాలను వేధిస్తున్న అనామక అరాచకవాదులపై
ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మొదట ఈ అంశంపై పెద్దగా స్పందించని ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌లు ఇప్పుడు కొంచెం స్పందించడం మొదలుపెట్టాయి.
-గడిచిన వారంలో ట్విట్టర్ కొన్ని లక్షల నకిలీ ఖాతాలపై కొరడా ఝులిపించి వాటిని మూసివేసింది.
-గత ఆరు నెలలుగా ఫేస్‌బుక్ కూడా నకిలీ ఖాతాలపై, ఫేక్‌న్యూస్ వ్యాప్తి చేస్తున్న పేజీలపై కఠినంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రముఖ ఫేక్‌న్యూస్ పేజీ పోస్ట్‌కార్డ్ న్యూస్‌ను ఫేస్‌బుక్ నుంచి తొలగించింది.
-సోషల్ మీడియాలో మీరు మారుపేర్లతో అకౌంట్ తెరవడం ఇక ముందు సాధ్యం కాదు. ఒకవేళ తెరిచినా అవి ఎక్కువ కాలం మనుగడలో ఉండకపోవచ్చు.

-మీరు ఇదివరకే ఏదైనా మారుపేరుతో అకౌంట్ తెరిచి ఉంటే, అది ఎక్కువకాలం కొనసాగకపోవచ్చు. ఉద్యమకాలంలో మిత్రులు కొందరు అప్పటి అవసరాల రీత్యా వేరే పేర్లతో అకౌంట్లు తెరిచారు. వారు వెంటనే తమ సమాచారం మొత్తం తీసి భద్రపరచుకోవడం ఉత్తమం. ఎప్పుడైనా ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ మీ అకౌంట్ మూసివేయొచ్చు.
-పదమూడు సంవత్సరాల లోపల వయసున్న పిల్లలకు సోషల్ మీడియా ఖాతా ఇవ్వరు. మీరు మీ పిల్లల పేరు మీద ఖాతా తెరిచినట్టయితే వెంటనే దానిలోనే డేటాను భద్రపరచుకుని, ఆ అకౌంటును డిలీట్ చేయండి
-మీ దృష్టికి ఏదైనా ఫేక్ అకౌంట్ కానీ, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న పేజీ కానీ వస్తే మాకు తెలియజేయండి.

సోషల్ మీడియాలో

నకిలీ ఖాతాలు తెరిచి ఇతరులను వేధించడం, ఫేక్ న్యూస్ వ్యాప్తి ద్వారా సమాజంలో అలజడి సృష్టించే ప్రయత్నంచేసే వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది.

పోస్ట్ నంబర్-2

Stop This Madness!
Whatsapp Rumors Lead to Another Lynching Incident Near Bidar.
ఇదేదో మనకు సంబంధం లేని విషయం అని వదిలేయకండి. రేపు మీరూ బాధితులు కావచ్చు.
ఖతర్‌లో ఉద్యోగం చేసుకునే హైదరాబాదీ మహమ్మద్ ఆజం మిత్రులతో కలిసి ఇటీవల బీదర్ విహార యాత్రకు వెళ్లి వస్తుండగా దారిలో ఒక గ్రామ ప్రజలు వీరి వాహనాన్ని అటకాయించి, అతడిని కొట్టి చంపారు.

వీరు చేసిన పొరపాటు - దారిలో ఒక గ్రామం వద్ద ఆగినప్పుడు కనిపించిన పిల్లలకు వీరి వద్ద ఉన్న చాక్లెట్లు ఇవ్వటమే.
పిల్లలకు చాక్లెట్లు ఇచ్చారు కాబట్టి వీరు పిల్లలను ఎత్తుకుపోయే ముఠా అంటూ ఆ ఊరిలోని ప్రజలు వీరి వెంటబడ్డారు. తప్పించుకునే ప్రయత్నంలో వుండగానే పక్క ఊరి ప్రజలకు విషయం తెలిసి వారు రోడ్డుకు అడ్డంగా రాళ్ళు పెట్టి వీరు ప్రయాణిస్తున్న కారుని ఆపారు. విచక్షణారహితంగా కొట్టడంతో ఆజం ప్రాణాలు కోల్పోయాడు. మిగతా మిత్రులు హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా!

బాగా చదువుకున్న వారు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాల్ని గుడ్డిగా షేర్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో (ముఖ్యంగా వాట్సప్‌లో) ప్రచారం అవుతున్న అనేక విషయాలు అవాస్తవాలు. దయచేసి వాటిలో నిజం ఏమిటో తెలియకుండా మీ ఫ్రెండ్ లిస్టులో ఉన్న అందరికీ తొందరపాటుతో షేర్ చేయకండి.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి. పుకార్లు నమ్మి అమాయకుల మీద చేయి చేసుకోకండి. ఒకవేళ మీ ఊర్లో కానీ, కాలనీలో కానీ ఎవరైనా ఇట్లా అపరిచితుల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. వాట్సప్, ఇతర సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న పుకార్లపై తెలంగాణ పోలీస్ శాఖ, ఐటి శాఖ చేపడుతున్న ప్రచారానికి పౌరులుగా మీ వంతు సహకారం అందించండి.

పోస్ట్ నంబర్-3

వాట్సప్ ద్వారా వ్యాప్తి చెందుతున్న పుకార్లను నమ్మకండి. పిల్లలను అపహరించే ముఠాల గురించి కొందరు ఆకతాయిలు వాట్సప్ ద్వారా పుకార్లు ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల కొంతమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వండి. పుకార్లను సృష్టించినా, వ్యాప్తి చేసినా కఠిన చర్యలు ఉంటాయి. దయచేసి మీ మిత్రులకు ఈ సమాచారం షేర్ చేయండి. ఈ మూడు పోస్టులను తెలంగాణ డిజిటల్ డైరెక్టర్ కొణతం దిలీప్ ఫేస్‌బుక్ వాల్ మీద కనిపించాయి. నెటిజనులు వాటిని షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. వాట్సప్ వదంతుల వల్ల జరుగుతున్న నష్టం పట్ల కొణతం దిలీప్‌లాగా చాలామంది స్పందిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకుంటున్నాయి.

కొత్తగా ఇంటర్నెట్ వాడబోయే వారిలో ఎక్కువమంది ఇంగ్లీష్ తెలియనివారే ఉంటారని, అక్షరాస్యత తక్కువతో పాటు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారే ఉంటారని, వారు ఎక్కువగా వీడియోలు చూస్తారని, సంగీతం వింటారని టెలికాం సంస్థలు వెల్లడించాయి. టెక్నాలజీ కూడా ఈ సమస్యను ఇంకాస్త పెద్దది చేస్తుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్‌తో కూడిన ఈ టెక్నాలజీ ప్రైవసీ ఎక్కువ కలిగి ఉన్నది. ఒకరు పంపిన సందేశాలను, పంపిన వ్యక్తి తప్ప ఇంకెవరూ చూసేలా లేదు. వాట్సప్ కూడా ఈ సందేశాన్ని చూడలేదని వాట్సప్ సంస్థ స్వయంగా ప్రకటించింది. వాట్సప్ ద్వారా పంపుకొనే సందేశాలు వాట్సప్ సర్వర్‌లో కూడా స్టోర్ అవ్వవు.
dileep

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో సలహాలు : దిలీప్ కొణతం

సోషల్ మీడియా వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవ్వడం లేదు. ఇదివరకే సమాజంలో ఉండిన భయాల వల్ల అవుతున్నాయి. సోషల్ మీడియా సమాజంలోని పరిస్థితులకు, సమస్యలకు ఒక అద్దం లాంటిది. ఏదైతే బయటి ప్రపంచంలో ఉందో అదే సోషల్ మీడియాలో ప్రతిబింబిస్తుంది. ఇలాంటి వదంతులు ఇంతకు ముందు కూడా వచ్చేవి. అవి వేరే మార్గాల్లో! కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడం ఒక పద్ధతి. సామాజిక రుగ్మతలే వీటికి ప్రధాన కారణం అవుతున్నాయి. వ్యవస్థల మీద నమ్మకం లేకపోవడం కూడా ఇందుకు మరొక కారణం. తక్షణ పరిష్కారం కోసం దాడులు, కొట్టి చంపడాలు జరుగుతున్నాయి. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే కమర్షియల్ కంపెనీలు కనీసం ప్రజలకు ముందు అవగాహన కూడా కల్పించడం లేదు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాలని తెలంగాణ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నది. ఇప్పటికే పలు కార్యక్రమాలు మొదలుపెట్టింది. పోలీసులు ఈ విషయాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్‌లలో అవగాహన కల్పిస్తున్నారు. చాలాచోట్ల పోలీసు కళా బృందాలు ఏర్పాటు చేసి వదంతుల వల్ల వచ్చే పర్యవసానాలను పాటలు, ఆటలు, ఉపన్యాసాల రూపంలో వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం మహబూబ్‌నగర్‌లో ఎస్పీ రమా రాజేశ్వరి ఆధ్వర్యంలో సత్ఫలితాలనిచ్చింది. ఫేక్ న్యూస్ విషయంలో ఆమె చాలా అవగాహన కల్పిస్తున్నారు. ఆన్‌లైన్ ఫేస్‌బుక్, వాట్సప్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో అంటే గ్రామ పంచాయతీల్లో, మీ సేవ కేంద్రాల్లో, కాలేజీల నోటిస్ బోర్డులలో పోస్టర్లు అంటిస్తున్నారు. తెలంగాణ ఐటీశాఖ తరపున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ రంగాల్లోని అన్ని శాఖలను, మీడియాను భాగస్వామ్యం చేసి కావలసిన సూచనలు తీసుకుంటున్నాం అని తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం వివరించారు.
whatsapp3

రోజు రోజుకూ పెరుగుతున్న సంఘటనలు

దేశంలో ప్రస్తుతం సుమారు 20 కోట్ల మంది వాట్సప్ వాడుతున్నారు. రానున్న మూడేళ్లలో మరో 30 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. సో.. వాళ్లూ వాట్సప్ వినియోగించే అవకాశాలు లేకపోలేదు. వాట్సప్‌కు అతిపెద్ద మార్కెట్ భారతే. ఇండియన్స్‌కు అందుబాటులో ఉన్న అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత సర్వీసు కూడా వాట్సపే. ఫలితంగా వాట్సప్ వల్ల సమాచారం ఎక్కువ మందికి, వేగంగా చేరుతుంది. ఇలాంటి సమాచారానికి సంబంధించి జనం పోగయ్యేందుకు కూడా వాట్సప్‌కు ఉన్న రీచ్ కారణమవుతున్నది. వాట్సప్‌లో వదంతుల వ్యాప్తి కారణంగానే వ్యక్తులపై జరిగే దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాగే జరిగితే ఇవి అదుపులోకి తీసుకురావడం కష్టం అవుతుంది. చాలామంది తమ న్యూస్, చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కువమందికి పంచుకోవాలనే కుతూహలంతో ఫేక్ వార్తలను ఎక్కువగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇందులో తెలియని వాళ్లు తక్కువ ఉండగా, తెలిసిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా చాలావరకు రీచ్ అవ్వాలని సెలబ్రిటీల మీద, తారల కుటుంబాల మీద ఫేక్ వార్తలను సృష్టించి వాళ్లను రోడ్డుపైకి లాగుతున్నారు. ఫలానా సెలబ్రిటీ కన్నుమూసింది. ఫలానా సెలబ్రిటీ ఇంట్లో విషాదం వంటి వార్తలను అనవసరంగా వైరల్ చేస్తున్నారు. రీచ్ కోసం తారల జీవితాలను రిస్క్ చేయిస్తున్నారు.

గ్రూపు అడ్మిన్లకు శిక్ష.. సామాన్యులకు రక్ష

ఒక్క ఏప్రిల్ నెలలోనే కర్ణాటక, త్రిపుర రాష్ర్టాల్లో కనీసం బూటకపు మెసేజ్‌ల వల్ల 18 మంది చనిపోయారు. ఇలాంటి వార్తలను సర్క్యులేట్ చేస్తున్న గ్రూపు అడ్మిన్లను కఠినంగా శిక్షిస్తున్నారు. అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం వల్ల ఇవి జరుగుతున్నాయి. 21 యేండ్ల జునైద్ ఖాన్‌కు వాట్సప్ వల్ల ఐదు నెలల జైలు శిక్ష పడింది. అసోంలో బడికొచ్చే ముస్లిం మగపిల్లలను నపుంసకులుగా మార్చేస్తున్నారంటూ వాట్సప్‌లో ఒక అవాస్తవమైన సందేశం ప్రచారం కావడంతో చాలామంది తమ పిల్లలను బడికి పంపించడం మానేశారు. ఈ పుకారు అక్కడ తీవ్ర ప్రభావమే చూపింది. వాట్సప్ గ్రూప్‌లలో తేడా వస్తే జైలే అంటున్నారు పోలీసులు. షేర్ చేయకూడని అంశాలను, తెలియని సమాచారాన్ని, తప్పుడు సమాచారాన్ని, తప్పుదారి పట్టించేవి, విద్వేషాలు రెచ్చగొట్టేవి, వివాదాలకు కారణమయ్యేవి ఏవైనా సందేశాలు సర్క్యులేట్ చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. గ్రూప్‌లో ఎవరు తప్పు చేసినా బాధ్యత అడ్మిన్‌దేనని దోషిగా తేలితే మూడు నుంచి ఐదేండ్ల వరకు జైలు శిక్ష వేసే చట్టాలున్నాయని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయం పట్ల సైబర్ క్రైమ్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Fakenews2
అమెరికాలో ట్రంప్, భారత్‌లో మోదీ టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ఎన్నికల్లో గెలిచారని ఓ ప్రచారం ఉన్నది. టెలికాం సంస్థల వద్ద డేటాను సంపాదించి వాళ్ల భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి దీనిని ఒక వారధిలా వాడుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ తెలుగు రాష్ర్టాల్లో తమ బలాన్ని, బలగాన్ని పెంచుకోవడానికి వాట్సప్ గ్రూపుల్లో ఎక్కువ చురుకుగా పనిచేస్తున్నది. సాంకేతిక నిపుణులను, ఉద్యోగులను పెట్టి పూర్తిగా దీనిపై దృష్టి పెట్టారు. ఇలాంటి గ్రూపుల వల్ల కూడా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుందన్న విషయం చర్చకొస్తున్నది. దేశాన్ని ముక్కలు చేసి విద్వేష, విచ్ఛిన్నకర ప్రచారాలన్నీ సోషల్ మీడియా ద్వారానే వ్యాపింపచేస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో వీటి ప్రభావం మరింత పెరుగనున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం మీద ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు అధ్యయనం కూడా చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది.
nallamothu-sridhar

అవగాహనా రాహిత్యం : నల్లమోతు శ్రీధర్

ఎక్కువ మెసేజ్‌లు సర్క్యులేట్ అవడం వల్ల వాట్సప్ ఎక్కువ సేపు యాక్టివ్‌గా ఉంటుంది. దానివల్ల వాట్సప్‌కు లాభం ఉంటుంది. ఈ చిన్న కారణం వల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో పట్టించుకోకుండా సొంత లాభం కోసం వాట్సప్ సంస్థ ఇలా చేస్తుంది. దీనివల్ల సమాజంతో పాటు భవిష్యత్తులో వాట్సప్ కూడా తీవ్రంగా నష్టపోతుంది. యాజమాన్యం చేయగలిగింది చాలా ఉన్నా.. పేరు ఫార్వర్డ్ మెసేజ్ అనే ఆప్షన్ పెట్టి చేతులు దులుపుకొన్నది. పెద్ద ఎత్తున మార్పులు చేయగలిగే శక్తి ఉన్నా రిస్క్ ఎందుకని చిన్న మార్పులతో పని కానిచ్చేస్తున్నారు. పేపర్లలో ప్రకటనలిచ్చి అంతటితో ఆపేసింది. వాస్తవానికి ఒకే రకమైన మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్న క్రమంలో వాటిని కట్టడి చేసే వెసులుబాటు వాట్సప్ ప్రతినిధులకు ఉంటుంది. పోస్ట్ రిపోర్ట్ మెకానిజం వస్తే వీటి ఎద్దడి తగ్గొచ్చు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా వాట్సప్ యాజమాన్యం పైపైన స్పందిస్తూ లోలోపల మాత్రం నిర్లక్ష్యం చేస్తుంది. ఇదిలా ఉంటే.. చదువుకున్న వాళ్లకు, నిరక్షరాస్యులకు తేడా లేకుండా పోతున్నది. షేర్ చేసే ముందు అది నిజమా? అబద్ధమా? తెలుసుకోకుండా గ్రూపులో వచ్చింది కదా అని అడ్డగోలుగా షేర్ చేయడం వల్ల మన అమాయకత్వం బయటపడుతుంది. ఈ చిన్న లాజిక్‌ను మరిచిపోయి చాలామంది నవ్వుల పాలవుతున్నారు. ఇలా జరుగడానికి కారణం తక్కువ రేటుకే ఇంటర్నెట్ డేటా లభించడం. ఇలా ఇస్తున్న ఏ సంస్థ అయినా కొంత అవగాహన కల్పిస్తే బాగుంటుంది. అలా చేయకపోతే మరింత నష్టం వాటిల్లే ప్రమాదముంది అని సాంకేతిక నిపుణులు నల్లమోతు శ్రీధర్ అభిప్రాయపడ్డారు.
mic

వాట్సప్ ఏమంటున్నది?

వ్యక్తులను కొట్టి చంపుతున్న ఘటనలపై వాట్సప్ స్పందించింది. ఇలాంటి దారుణమైన, హింసాత్మక ఘటనలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని తెలిపింది. ఈ సవాలును ఎదుర్కోవాలంటే ప్రభుత్వం, పౌరసమాజం, టెక్నాలజీ కంపెనీలు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని చెప్తున్నది. సందేశాల ఎన్‌స్క్రిప్షన్ విధానంలో మార్పులకు మాత్రం వాట్సప్ అంగీకరించలేదు. వాట్సప్ యూజర్లు వినియోగించే తీరు పూర్తిగా వారి వ్యక్తిగత గోప్యతకు ముడిపడి ఉంటుందని, అందువల్ల ఆ విధానంలో మార్పులు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. గ్రూపుల నుంచి బయటకు రావడం, ఎవరినైనా బ్లాక్ చేయడం యూజర్లకు సరళతరం చేశామని చెప్పింది. ఫార్వర్డ్ సందేశాన్ని ఫార్వర్డ్ అయిన సందేశంగా చూపుతున్నామని పేర్కొన్నది. వాట్సప్ ద్వారా ఫార్వర్డ్ చేసే మెసేజీల సంఖ్యపై పరిమితిని వాట్సప్ ప్రకటించినా ఇప్పటి వరకూ దానిని అమలు పరుచలేదు.
thief

ప్రాణాలు తీస్తున్న ఫార్వర్డ్ మెసేజ్‌లు

ప్రమాదకర, బాధ్యతారహిత వదంతులు, సమాచారం వాట్సప్ ద్వారా వ్యాప్తి చెందడాన్ని సత్వరం అడ్డుకోవాలని వాట్సప్ యాజమాన్యాన్ని భారత ప్రభుత్వం ఆదేశించింది. పిల్లల అపహరణ గురించి వాట్సప్ ద్వారా వ్యాపించిన వదంతుల వల్ల కొత్తవారిని స్థానికులు కొట్టి చంపుతున్న ఘటనలు పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వం ఇలా స్పందించింది. వాట్సప్ వదంతుల వల్ల ఇప్పటికే జరిగే తీవ్ర నష్టం జరిగింది. అలాంటి హత్యల నియంత్రణకు ఇది ఎంత మేరకు తోడ్పడుతుందో పక్కన పెడితే కొంతమేరకు తగ్గించడం అయితే సాధ్యమవుతుంది. దేశంలో గత మూడు నెలల్లో మనుషులను కొట్టి చంపిన ఘటనలు చాలా జరిగాయి. దేశవ్యాప్తంగా ఇలా కనీసం 100 మంది చనిపోయారని ఓ అంచనా. మృతుల సంఖ్య ఇంతకన్నా ఎక్కువే ఉంటుందని పలు మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. పిల్లలను ఎత్తుకెళ్లేవారు తిరుగుతున్నారనే ప్రచారం వాట్సప్‌లో ప్రచారం జరుగుతుండగా కొత్తగా, అనుమానాస్పదంగా అనిపించిన వారిపై స్థానికులు దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ప్రచారాల్లో నిజం లేదని, అదంతా బూటకమని ప్రజలకు తెలియజెప్పడం తమకు చాలా కష్టం అవుతుందని పోలీసులు చెబుతున్నారు. త్రిపుర రాష్ట్ర అధికారులు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులను నమ్మొద్దని గ్రామాల్లో మైకులు పెట్టి చెప్పేందుకు ఏర్పాటు చేసినా ఎలాంటి మార్పు లేదు. ఇంత చేసిన తర్వాత కూడా అక్కడే ఒక వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు. వాట్సప్ ద్వారా వైరల్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నా ఫలితం శూన్యం.

త్రిపుర రాష్ట్ర అధికారులు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులను నమ్మొద్దని గ్రామాల్లో మైకులు పెట్టి చెప్పేందుకు ఏర్పాటు చేసినా ఎలాంటి మార్పు లేదు. ఇంత చేసిన తర్వాత కూడా అక్కడే ఒక వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వచ్చే ఫేక్‌న్యూస్‌ను కనిపెట్టే కొత్త టెక్నాలజీలు చాలా వచ్చాయి. కేంబ్రిడ్జిలో ఇంజినీరింగ్ చేసిన లిరిక్ జైన్ లాజికల్లీ(Logically) పేరుతో స్టార్టప్ మొదలుపెట్టాడు. ఇది మొట్టమొదటి ఇంటెలిజెంట్ న్యూస్‌ఫీడ్ కంపెనీ. ఇది వార్తలను వడపోస్తూ ఫేక్ ఏది? రియల్ ఏది? అనే విషయాన్ని తెలియజేస్తుంది.

1215
Tags

More News

VIRAL NEWS

Featured Articles