వశిష్ట మహర్షి యాగస్థలి రామలింగాల గూడెం


Sun,June 18, 2017 03:31 AM

రామలింగాలగూడెం చూడటానికి కుగ్రామంగా కనిపిస్తుంది. కాని ఇది ఘనమైన చరిత్ర గల ప్రాంతం. బృహత్ శిలాయుగపు నాటి నేల. ఆదిమానవుడికి పుట్టినిల్లు లాంటిది. ఆధ్యాత్మిక శోభకూ నిలయం. ఇప్పుడు ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న ఈ నేల ఒకప్పుడు శాతవాహనుల పాలనా కేంద్రంగా ఉండేది. అప్రతిహతంగా రాజ్యపాలన చేసిన కళ్యాణ చాళుక్యులు, కందూరు చోఢుల శిల్పకళారీతులకు సాక్ష్యంగా నిలిచివున్న పురాతన గ్రామం. వెయ్యికాదు.. రెండువేలు కాదు.. 3500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. పూర్వ చారిత్రకయుగం నుంచి నేటి వరకూ ఇక్కడ మానవ జీవనం కనపడటం ఈ గ్రామ ప్రత్యేకత.
-రాగి మురళి, 7702510250

ఎక్కడ ఉంది? :

నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది.

విశిష్టతలేంటి? :

చాళుక్య సామంతరాజులైన కందూరు భీమన చోఢ మహరాజు, కందూరు, ఇరమ, చెరకులోని బడి తప్పర్తిని కవళఙయ బ్రహ్మదేవయ్యకు ఇక్కడ భూమి ఇనామ్‌గా ఇచ్చారని శాసనం ద్వారా తెలుస్తున్నది. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా శివలింగాలు ఉంటాయి.
Ramalingala-Gudem

పేరెలా వచ్చింది? :

గ్రామంలో లింగాలు ఉండటం వల్ల ఈ గ్రామాన్ని రామలింగాల గ్రామంగా పిలుస్తారు. పురాణగాథల ప్రకారం వశిష్ట మహర్షి రామలింగాల గూడెంలోని గుట్ట సమీపంలో శివలింగాలను ప్రతిష్టించి 5 ఎకరాల స్థలంలో యాగం నిర్వహించడం వల్ల ఈ ఊరుకు గుట్టకాడిగూడెం, రామలింగాల గూడెంగా పేరు వచ్చినట్లు తెలుస్తున్నది.

చారిత్రిక నేపథ్యం :

కోటిలింగాలను రాజధానిగా చేసుకుని భారతదేశంలో మూడవవంతు భూభాగాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతవాహనుల పరిపాలనలో ఈ రామలింగాలగూడెం ఓ పరిపాలనా కేంద్రంగా పరిఢవిల్లినట్లు ఇక్కడ లభించిన తొలి చారిత్రకయుగపు అవశేషాలను బట్టి తెలుస్తున్నది. గ్రామానికి తూర్పు, పడమర దిశలో రెండు పాటిగడ్డలున్నాయి. దీంట్లో తూర్పుదిశలో శివాలయం చుట్టూ ఉన్న పాటిగడ్డలు టెర్రకోట బీడ్స్, ఆఫ్‌స్కాచ్ తొక్కుడు బిల్లలు, నలుపు-ఎరుపు, ఎరుపు-నలుపు కలిగిన కుండ పెంకులు, రిమ్‌భాగపు ముక్కలు, దీపాంతలు, డిజైన్ ఎరుపు-నలుపు కుండ పాత్ర ముక్కలు, శాతవాహన కాలంనాటి ఇటుక ముక్కలు, పెజల్స్, పాటి స్థలానికి ఆనుకుని ఉన్న చిన్న చెరువు అలుగు సమీపంలో ఇటుక నిర్మాణ గోడ ఉన్నది. ఈ నిర్మాణాన్ని వెలికితీస్తే అది గృహసముదాయమా? బౌద్ధ మత ఆరాధనా చైత్యమా? అనేది తెలుస్తుంది. గ్రామానికి పడమర దిశలో పాటిగడ్డలో పల్చటి బూడిద కలర్ పెంకులు, లైట్ ఎరుపు పెంకులు కలిగి ఉండి దాసాంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. ఈ పాటిగడ్డలను పరిశీలిస్తే తొలి చారిత్రక యుగంలో తూర్పుదిశలో ఉన్న ఊరు.. మధ్యయుగంలో పడమర దిశలోకి మారినట్లు తెలుస్తున్నది.
Rathi-Panimtlu

త్రిభువనమల్లు నిర్మాణం :

గుట్ట సమీపంలో ఉన్న శైవక్షేత్రాన్ని మార్కండేయస్వామి దేవాలయంగా పిలుస్తారు. ఈ దేవాలయం చాళుక్య త్రిభువనమల్లు విక్రమాదిత్య-6 కాలం క్రీస్తుశకం 1104లో నిర్మించినట్లుగా ఇక్కడి శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. ఈ శాసనాన్ని పురావస్తు శాఖవారు పానగల్ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ శివాలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజుపాటు అంగరంగ వైభవంగా దేవాలయ ఉత్సవ కమిటీ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నది. ఈ జాతరకు రామలింగాల గూడెం పరిసరప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిషేకాలు, జాగారాలు చేసి ఉపవాస దీక్షలతో అగ్నిగుండాలు నిర్వహించి స్వామి వారి ఊరేగింపులో పాల్గొంటారు. ఈ దేవాలయం ఆవరణలో చెన్నకేశవులు, నంది, వినాయకుడు, నాగిని విగ్రహాలు ఉంటాయి. వీటిని చూస్తే ఆనాటి శిల్పుల కళానైపుణ్యం కండ్లకు కట్టినట్లనిపిస్తుంది.

పెద్ద చెరువు- చిన్న చెరువు :

దాదాపు 94 ఎకరాల్లో ఈ రెండు చెరువులు విస్తరించి ఉంటాయి. వీటిని కందూరు చోఢుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తున్నది. పానగల్ ఉదయ సముద్రం జాలు నీళ్లు ఈ చెరువులకు చేరుతుంది. చెరువుల కింద వేలాది ఎకరాల భూమి సాగవుతుంది. ఈ పరిసర ప్రాంతంలో ముడి ఇనుప ఖనిజం, రాతితో చేసిన గానుగలు భూ ఉపరితలంపై కనిపిస్తుండడంతో ఇక్కడ ఇనుము, నూనె తయారీ పరిశ్రమలు ఉన్నట్లు తెలుస్తున్నది. గ్రామంలోని ప్రాచీన బావులలో శివలింగాలు, దేవతా విగ్రహాలు, దేవాలయ స్తంభాలు, మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి. బహుశా ఇవి వైష్ణవ, శైవ మతాల మధ్య జరిగిన ఘర్షణలో ధ్వంసమై ఉండొచ్చు అని గ్రామస్థులు అంటున్నారు.
Shatavahana-Kaalam

రాకాసి గూళ్లు :

గ్రామంలో ఆదిమ మానవుడు మనుగడ సాగించినట్లుగా ఇక్కడ లభించిన అవశేష ఆనవాళ్ల ద్వారా తెలుస్తున్నది. పెద్ద చెరువు అంతర్భాగంలో పెద్ద సంఖ్యలో సుమారుగా 50 వరకు రాకాసి గూళ్లు (బృహత్ శిలాయుగపు స్మారక సమాధులు) ఉన్నాయి. వీటి పరిసరాల్లోని బండలపై రాతి ఆయుధాలను పదును పెట్టిన గుర్తులు ఉన్నాయి. రాతి గొడ్డళ్లు, వడిసెల రాళ్లు ఈ ప్రాంతంలో లభించాయి. ఇంత పెద్దమొత్తంలో సమాధులు ఉండటం ఇక్కడ పూర్వ చారిత్రక మానవుడి ఒక తెగ నివసించి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.

గ్రామ స్వరూపం


ఊరిపేరు: రామలింగాల గూడెం
గ్రామ పంచాయతీ: జంగారెడ్డిగూడెం
మండలం: తిప్పర్తి
జిల్లా: నల్లగొండ
పిన్‌కోడ్ నంబర్: 508247
అక్షరాస్యత: 65%

సరిహద్దులు


తూర్పున: జంగారెడ్డిగూడెం
పడమరన: రాయినిగూడెం
ఉత్తరాన: పజ్జూరు
దక్షిణాన: జొన్నగడ్డలగూడెం

ఆనవాళ్లకు కొదువలేదు:

ప్రాచీన దేవాలయం గుట్ట పరిసర ప్రాంతంలో పాటి నేలలో అనేకమైన తొలి చారిత్రక యుగపు అవశేష ఆనవాళ్లు దొరికాయి. గ్రామ చరిత్రను పరిశీలిస్తే క్రీస్తుపూర్వం 1500 సంవత్సరం బృహత్ శిలాయుగం నుంచి తొలి చారిత్రక యుగం, మధ్యయుగం, చాళక్యులు, కందూరు చోఢులు, కాకతీయుల రాజ్యపాలనా తీరులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోటిలింగాల రాజధానిగా చేసుకుని పాలించిన శాతవాహనుల అవశేష ఆనవాళ్లు పజ్జూరు, అప్పాజిపేట, పెన్‌పహాడ్, నెమ్మికల్, గాజులబండ, పణిగిరి, ఏళేశ్వరం, వర్థమానుకోట గ్రామాలలో లభించాయి. వీరి రాజ్య విస్తరణ పరిధి రోజురోజుకూ ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి రావచ్చు. ఈ చారిత్రక ప్రాంతాలను పురావస్తు శాఖ ద్వారా అన్వేషణ చేయిస్తే మరెన్నో చారిత్రక ఆనవాళ్లు బయట పడే అవకాశం ఉంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉన్నది.

చారిత్రక సంపదను కాపాడుకోవాలి:

మా గ్రామానికి ఇంతటి ప్రాచీన చరిత్ర ఉండటం సంతోషదాయకం. ప్రభుత్వం ఇక్కడి చారిత్రక సంపదను కాపాడాలని కోరుతున్నాం. గ్రామ చరిత్ర భావితరాలకు అందించేందుకు పాటుపడుతామని మేమూ మాటిస్తున్నాం.
-వనపర్తి నాగేశ్వర్‌రావు

ఇంతవరకూ తెలియదు:

నల్లగొండ జిల్లాలో చెరువుగట్టు తర్వాత ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న మా గ్రామానికి పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి పూజలు చేస్తుంటారు. ఇప్పటి వరకు మాకు ఇంతటి ప్రాచీన చరిత్ర ఉందని తెలియదు. కొత్త తెలంగాణ అన్వేషణ బృందం పరిశీలనలో ఇది వెలుగులోకి రావడంతో సంతోషాన్నిస్తున్నది.
వీ. అంజయ్య
Pedda-Cheruvu

1163
Tags

More News

VIRAL NEWS