వరాలిచ్చే వనదేవత ఏడుపాయల దుర్గమ్మ!


Sun,October 22, 2017 03:11 AM

అక్కడ అడుగుపెట్టగానే అమ్మా దుర్గమ్మా అనే నినాదాలు వినిపిస్తాయి. ఏదో మహిమ ఉంటుందక్కడ. కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయి. భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతూ నిత్యం
పూజలందుకుంటూ.. ఏడు పాయల నదీ ప్రాంగణంలో వెలిసి.. వందల ఏళ్ల చరిత్ర సాక్ష్యంగా.. భక్తులు మొక్కులు చెల్లించే పుణ్యక్షేత్రంగా.. పర్యాటక కేంద్రంగా బాసిల్లుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్న ఏడుపాయల దుర్గమ్మ ఈవారం దర్శనం.


ఎక్కడ ఉన్నది? :

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో ఉన్నది.

ఎలా వెళ్లాలి?:

మెదక్ పట్టణం నుంచి ఇక్కడికి 17 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ నుంచి 114 కిలోమీటర్లు. ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం కలదు.
Temple

విశిష్టత ఏంటి?:

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా.. వరాలిచ్చే వన దుర్గామాతగా భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతున్నది. నల్లసరపు రాతితో చెక్కి కొట్టొచ్చినట్టుండే దుర్గామాత రూపంతో అమ్మవారుంటారు. సర్పయాగ స్థల ప్రాశస్త్యాన్ని కలిగివున్నది. రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా.. పర్యాటక కేంద్రంగా పేరుపొందింది. దీనిని ఒక జాతరగానే కాదు.. జానపద విశిష్టతగా చెప్పవచ్చు.

ఏడుపాయలెలా అయ్యాయి?:

ద్వాపర యుగాంతంలో పరిక్షిత్తు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞ గుండాలు నిర్మింపజేసి జమదగ్ని.. అత్రి.. కశ్యపి.. విశ్వామిత్ర.. వశిష్ట.. గౌతమి.. భరద్వాజ వంటి సప్త రుషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుండటంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగులతల్లి దేవుళ్లకు వేడుకొనన్నదట. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని తీసుకుని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగవతీ నది ఏడుపాయలుగా చీలి ప్రవహించిందట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతిగుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట. ఏడుగురు రుషులతో యజ్ఞం చేయడం.. గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడు పాయలు అనీ.. అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది.

కాశీనాథ యోగీంద్రు తపస్సు:

ఇంత చరిత్ర.. ప్రాశస్త్యం ఉన్నప్పటికీ కొన్నాళ్లపాటు ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ప్రాభవం కోల్పోవడంతో కాశీనాథ యోగీంద్రుడనే అవధూత కాశీ నుంచి 16 కళశాలను తీసుకొచ్చి ఏడుపాయల దుర్గామాత ఆలయంలో విడిది చేశారట. దుర్గామాత అతని కలలో దర్శనమిచ్చి ఈ క్షేత్రాన్ని పునరుద్దరించమని ఆజ్ఞాపించిందట. ఈ మేరకు కాశీనాథ యోగీంద్రులు కాశీకి తిరిగి వెళ్లకుండా రాతిపై యంత్రం వేసి.. దుర్గా మహామంత్ర పుణశ్చరణ చేసి అమ్మవారిని భక్తితో కొలవాలని సూచించి అంతర్ధానమైపోయాడట. యంత్ర మహిమ వల్ల వనదుర్గామాత భక్తులకు కల్పవల్లిగా వెలుగొందుతున్నదని భక్తుల నమ్మకం.

పర్యాటక కేంద్రం:

ఏడుపాయల పుణ్యక్షేత్రమే కాదు పర్యాటక కేంద్రం కూడా. సహజమైన ప్రకృతి అందాలకు నెలవు. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ప్రదేశం. నదీపాయల మధ్య రాతి గుహలో వెలసిన ఆలయం వంకలు తిరిగి ఉండే ఘనపూర్ ఆనకట్ట.. గలగల పారే మంజీరా నది.. ఎటు చూసినా విభిన్న ఆకృతుల్లో ప్రవహించే పాయలు.. రాతి గుట్టలతో ఏడుపాయల ఆహ్లాదకేంద్రంగా మారుతున్నది.

దుర్గమ్మకు బోనం:

ఏడుపాయల జాతర తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ఎడ్లబండ,్ల గుమ్మటాల బండ్ల ఊరేగింపు జాతర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ. ఇక అమ్మవారికి మొక్కుబడులు సమర్పించుకోవడంలో బోనాలు ప్రధానమైనవి. భక్తి ప్రపత్తులతో పటాలు వేసి, బోనాలు తీసి మొక్కులు చెల్లించుకుంటారు.

జాతరమ్మో జాతర:

ప్రతీ సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మను దర్శించుకుని భక్తిపారవశ్యంలో పరవశిస్తారు. విశాలమైన ఏడుపాయల ప్రాంగణం జాతర జరిగినన్ని రోజులు అశేష జనవాహినితో జనసంద్రంగా దర్శనమిస్తుంది. దశాబ్దాల తరబడిగా ఇక్కడ జాతర జరుగుతుండం వల్ల.. ఆలయ ప్రాశస్త్యాన్ని.. భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడుపాయల జాతరను జాతరను ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది.
Temple1

1584
Tags

More News

VIRAL NEWS