వనపర్తి సంస్థానం


Sun,July 8, 2018 01:53 AM

(తెలంగాణ సంస్థానాలు: రెండో భాగం)
సవై వెంకటరెడ్డిని సుభేదారు సైనికులు దొంగదెబ్బ తీసి చంపారు. అప్పటికి ఆయన కొడుకు మూడో గోపాలరావు పిన్నవయస్కుడు. సవై వెంకటరెడ్డి భార్య కేశమ్మకేమో పాలనా అనుభవం లేదు. దీంతో వనపర్తి సంస్థాన పాలనా బాధ్యతలు తిరిగి రాణి జానమ్మే చేపట్టింది. కేశమ్మ, మనుమడు మూడో గోపాలరావులకు ఆమెనే పాలనా వ్యవహారాలను నేర్పించింది.


మూడో గోపాలరావు

మనుమడు మూడో గోపాలరావుకు చిన్నమాంబతో వివాహం చేసి క్రీ.శ. 1722లో జానమ్మ మరణించింది. అప్పటికి ఈయన పాలనా వ్యవహారాలను చక్కదిద్దడంలో నేర్పరి అయ్యాడు. జానమ్మ అనంతరం మూడో గోపాలరావు కొత్తకోటను ప్రధాన స్థానంగా చేసుకుని వనపర్తి సంస్థాన పాలన సాగించాడు. మొదటి అసఫ్‌జా నిజాముల్ ముల్క్‌కు సహాయకుడిగా ఉండి తండ్రి కాలంలో కోల్పోయిన అధికారాలను తిరిగి పొందాడు. గోపాల్‌పేట సంస్థానంలో తలెత్తిన సమస్యలను కూడా ఇతడు పరిష్కరించాడు. క్రీ.శ. 1742లో నిజాముల్ ముల్క్ మహారాష్ట్రపై దండెత్తి వెళ్లినప్పుడు గోపాలరావు గోల్కొండలో రక్షకునిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇతడు క్రీ.శ.1747లో మరణించాడు.

నాలుగో వెంకటరెడ్డి

మూడో గోపాలరావుకు సంతానం లేకపోవడంతో వెంకటరెడ్డిని దత్తత తీసుకున్నాడు. ఇతడే నాలుగో వెంకటరెడ్డి. ఇతడు మూడో గోపాలరావు అనంతరం నుండి క్రీ.శ. 1783 వరకు సంస్థాన పాలకుడుగా ఉన్నాడు. ఇతడు రాజధానిని కొత్తకోట నుంచి శ్రీరంగాపురానికి మార్చాడు. ఈయన భార్య పేరు కూడా జానమ్మయే.
Wanaparthysamsthanam

నాలుగో గోపాలరావు - ఇద్దరు జానమ్మలు

నాలుగో వెంకటరెడ్డి, జానమ్మల దత్తపుత్రుడు నాలుగో గోపాలరావు. ఈయన భార్య పేరు కూడా జానమ్మే. నాలుగో వెంకటరెడ్డి తర్వాత రాజ్యాధికారం చేపట్టిన ఈ గోపాలరావు కొంతకాలానికి మరణించాడు. దీంతో అత్తాకోడళ్లయిన జానమ్మలు రామకృష్ణారావును దత్తత తీసుకున్నారు. ఇతడు పిన్నవయస్కుడు కావడంతో అత్తాకోడళ్లే పాలనాధికారం చేపట్టారు. క్రీ.శ. 1791 నుంచి 1807 వరకు వీరి పాలన సాగింది. క్రీ.శ. 1799లో జటప్రోలు సంస్థానాధీశుడు జగన్నాథరావు నిజాంకు కప్పం చెల్లించకుండా తిరుగుబాటు చేశాడు. నిజాం ఆజ్ఞపై జగన్నాథరావును జానమ్మ బంధించి ఇచ్చిందట.

రాజా బహద్దూర్ రామకృష్ణారావు

తల్లి జానమ్మ క్రీ.శ. 1807లో మరణించిన తర్వాత దత్తపుత్రుడు రామకృష్ణారావు అధికారం చేపట్టాడు. ఇతడు క్రీ.శ. 1807లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానిని శ్రీరంగాపురం నుంచి వనపర్తికి మార్చాడు. అప్పటి నుంచి ఈ సంస్థానం చివరి వరకు వనపర్తియే రాజధానిగా ఉన్నది. క్రీ.శ. 1817లో నిజాం నవాబు సికిందర్ జా రామకృష్ణారావుకు రాజా బహద్దూర్ అనే బిరుదును, నౌబత్, పతాకం, నగారాలను ఇచ్చి గౌరవించాడు. ఇతడు క్రీ.శ. 1816లో స్వతంత్ర నాణేలను ముద్రించుకునే అనుమతి పొందాడు. ఈ నాణేలనే నూగూరు సిక్కాలు అంటారు. 20వ శతాబ్దం ప్రారంభం వరకు చలామణిలో ఉన్న ఈ సిక్కాలు సంస్థానంలోనే కాక నిజాం రాష్ట్రమంతటా చెల్లుబాటు అయ్యేవట.

నాంచారమ్మ, రామమ్మల నీడనరామేశ్వరరావు

రాజా బహద్దూర్ రామకృష్ణారావుకు సంతానం లేకపోవడం వల్ల రామేశ్వరరావును దత్తత తీసుకున్నారు. క్రీ.శ. 1823లో ఈ బాలుని పేరిట నిజాం నవాబు సికిందర్ జా వారసత్వపు సన్నదునిచ్చారు. ఈ బాలుని పేరిట దత్తత స్వీకరించిన తల్లులు నాంచారమ్మ, రామమ్మలు సంస్థాన పాలన బాధ్యతలను చేపట్టారు. క్రీ.శ. 1833లో రామమ్మ, 1835లో నాంచారమ్మ చనిపోయారు. అప్పటికి రామేశ్వరరావుకు 14 ఏండ్లు. అయినా పరిపాలనా బాధ్యతలను స్వీకరించాడు. ఎనిమిది భాషల్లో ప్రావీణ్యుడైన రామేశ్వరరావుకు నిజాం బలవంత్ అనే బిరుదును ఇచ్చాడు. రామేశ్వరరావు పాలనా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకొచ్చాడు. సివిల్, క్రిమినల్ కోర్టులను ఏర్పాటు చేశాడు. జ్యుడీషియల్ స్టాంపులను వాడుకలోకి తెచ్చాడు. పోలీసు బలగాన్ని పెంచుకున్నాడు. ఇతడిని నిజాం 26 పరగణాలపై జిల్లాదారుగా నియమించాడు. అనంతరం సైన్యంలో బ్రిగేడియర్ పదవిని, అటు తర్వాత ఇన్‌స్పెక్టర్ జనరల్ స్థాయినీ పొందాడు. రామేశ్వరరావు మొదట నిజాంతో సఖ్యతగా ఉన్నా తర్వాత ఎదిరించాడు. నిజాంకు కట్టాల్సిన కప్పాన్ని నిలిపివేశాడు. తర్వాత నిజాం కోరిక మేరకు ఆయనతో సఖ్యతగా ఉన్నాడు. నిజాంను ఎదిరించిన జమీందారులను పట్టి ఇచ్చి మెప్పు పొందాడు. రెండు గుండ్ల తుపాకీ, పిస్తల్, కత్తి బహుమతిగా పొందాడు. క్రీ.శ. 1864లో నిజాం తన అశ్విక దళానికి అధిపతిగా నియమించాడు. 1866లో సైన్యాధిపతి పదవిని అలంకరించాడు. ఇదే సంవత్సరం 46 ఏండ్ల వయసులో రామేశ్వరరావు మరణించాడు. క్రీ.శ. 1849లో రంగు మహలు (వనపర్తి కోట) భవన నిర్మాణాన్ని చేపట్టిన రామేశ్వరరావు 1864 నాటికి మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేశాడు.
Wanaparthysamsthanam1

పాతికేండ్లు పాలించిన రాణి శంకరమ్మ

రామేశ్వరరావు భార్య శంకరమ్మ. క్రీ.శ. 1851లో ఆయనను పెండ్లాడింది. క్రీ.శ. 1866లో ఆయన మరణానంతరం శంకరమ్మ సంస్థానం పాలనా బాధ్యతలను చేపట్టింది. క్రీ.శ. 1892 వరకు పాలించిన శంకరమ్మ 72 ఏండ్ల వయసులో మరణించింది. ప్రస్తుతం వనపర్తిలోని వాసుదేవమ్మ తోటలో ఈమె సమాధి ఉన్నది. రామేశ్వరరావు, శంకరమ్మలకు సంతానం కలుగలేదు. దీంతో ఆయన మరణానంతరం శంకరమ్మ రామకృష్ణారావును దత్తత తీసుకుంది. క్రీ.శ. 1867లో ఈయన పేరిట వారసత్వం లభించింది. కానీ అతడు చిన్నపిలగాడు కావడంతో శంకరమ్మే పాలన కొనసాగించింది. రామేశ్వరరావు రామచంద్రాంబను పెండ్లాడిన కొంతకాలానికే చనిపోయాడు. దీంతో శంకరమ్మ ఒక బాలుడిని దత్తత తీసుకుని రామేశ్వరరావు అని పేరు పెట్టింది.

శంకరమ్మ రెండో దత్తపుత్రుడు రామేశ్వరరావు

క్రీ.శ. 1893లో రాణి శంకరమ్మ సంస్థాన పరిపాలనను రామేశ్వరరావుకు అప్పగించి విశ్రాంతి తీసుకోసాగింది. రామేశ్వరరావు ప్రజాహితం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. సైన్యాన్ని చక్కగా పోషించాడు. నిజాం నుంచి మహారాజా, మహాభూపాల్ లాంటి బిరుదులు పొందాడు. ప్రథమ రామేశ్వరరావు ప్రారంభించిన రంగు మహలు నిర్మాణాన్ని ఈ రామేశ్వరరావు పూర్తి చేశాడు. ఇతనికి లక్ష్మీ దేవమ్మ, వాసుదేవమ్మ అని ఇద్దరు భార్యలు. శ్రీకృష్ణదేవరావు, రామదేవరావు అని ఇద్దరు కొడుకులు. క్రీ.శ. 1922లో రామేశ్వరరావు మరణించాడు.

సరళాదేవి సమేత కృష్ణదేవరావు

శంకరమ్మ రెండో దత్తపుత్రుడు రామేశ్వరరావు తర్వాత అతని పెద్ద కొడుకు కృష్ణదేవరావు సంస్థాన పాలకుడయ్యాడు. మునగాల రాజా నాయని వేంకట రంగారావు కుమార్తె సరళాదేవిని పెండ్లాడాడు. వీరికి ఒక కొడుకు పుడితే రామేశ్వరరావు అని పేరు పెట్టుకున్నారు. ఈ రామేశ్వరరావుకు ఏడాది వయసు ఉన్నప్పుడు కృష్ణదేవరావు అకస్మాత్తుగా మరణించాడు. దీంతో సంస్థాన పాలన కోర్టు ఆఫ్ వార్డ్స్ వారి చేతిలోకి వెళ్లింది. పాలనాధికారం కోసం కృష్ణదేవరావు తమ్ముడు రామదేవరావు సరళాదేవితో పోటీ పడ్డాడు. దీంతో మరిది రామదేవరావుతో ఆమెకు కొంతకాలం వ్యాజ్యం నడిచింది. చివరికి క్రీ.శ. 1944లో సంస్థానాధికారం సరళాదేవికి దక్కింది.

చివరి పాలకుడు రామేశ్వరరావు

కోర్ట్ ఆఫ్ వార్డ్స్ తీర్పు సరళాదేవి పక్షాన రావడంతో 1944 సెప్టెంబర్ 27న కొడుకు రామేశ్వరరావుకు పట్టాభిషేకం చేసింది. ఇతడే ఈ సంస్థానానికి చివరి పాలకుడు. రామేశ్వరరావు హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివాడు. మద్రాసులో చదివి ఎం.ఏ. పట్టా పొందాడు. ఇతడు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు జాగీరుదారుల పక్షాన ఒక సభ్యునిగా ఎన్నికయ్యాడు. నిజాం నిరంకుశ విధానాలకు అసమ్మతి సూచికగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి పలువురి ప్రశంసలు పొందాడు. క్రీ.శ. 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్వతంత్ర భారత సైన్యానికి లొంగి పోవడంతో ఈ సంస్థానం కూడా భారత యూనియన్‌లో విలీనమైంది. రామేశ్వరరావు జనుంపల్లి రామేశ్వరరావు ఎంఏగా ప్రసిద్ధి. ఈయన కొంతకాలం నాటి భారత విదేశాంగ శాఖలో ఉన్నత పదవులను నిర్వహించారు. మహబూబ్‌నగర్ పార్లమెంటుకు వరుసగా నాలుగుసార్లు ఎన్నికై పేరు ప్రతిష్టలు గడించారు. ఈయన 1968లో ఓరియంట్ లాంగ్మాన్ (ఇప్పుడు ఓరియంట్ బ్లాక్‌స్వాన్) అనే పుస్తక ముద్రణా సంస్థని స్థాపించారు. రామేశ్వరరావు 1998 సెప్టెంబర్ 15న తన 75 ఏండ్ల వయసులో హైదరాబాద్‌లో మరణించారు. ఈయన భార్య పేరు శాంతా రామేశ్వరరావు. ఈవిడ 1961 విద్యారణ్య పాఠశాలను నౌబత్ పహాడ్ (ప్రస్తుతం బిర్లామందిర్ ఉన్న గుట్ట) ప్రాంతంలో స్థాపించారు. గొప్ప విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఈవిడ 2015లో మరణించారు.

రామేశ్వరరావు, శాంతకు ఒక కొడుకు, ముగ్గురు కూతుర్లు. బాలీవుడ్ అగ్రనటుడు అమీర్‌ఖాన్ భార్య కిరణ్ రావు జనుంపల్లి వారి వారసురాలే. రామేశ్వరరావు కొడుకు కూతురు ఈ కిరణ్ రావు.
వర్దమాన హీరోయిన్ అదితీ రావు హైదరీ కూడా రామేశ్వరరావు మనుమరాలే. రామేశ్వరరావు ముగ్గురు కూతుర్లలో విద్యా రావు ఒకరు. ఈవిడ హిందూస్థాన్ సంగీత విద్వాంసురాలిగా తుమ్రీ, దండ్రాలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈవిడ నిజాం కాలంలో అస్సాం ప్రధానిగా పనిచేసిన సర్ అక్బర్ హైదరీ కొడుకు ఇషాన్ హైదరీని ప్రేమించి పెండ్లి చేసుకుంది. అదితీ పుట్టిన రెండేండ్లకే ఈ దంపతులు విడిపోయారు. అదితీరావు హైదరీ మలయాళీ చిత్రం ప్రజాపతి (2006)లో తొలిసారి నటించింది. ఢిల్లీ 6తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన అదితీ 2018లో పద్మావత్ సినిమాలో మెహరున్సీసాగా కీలక పాత్ర పోషించింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన సినిమా సమ్మోహనంతో సమీరాగా తెలుగు తెరపై కూడా ఇటీవలే మైమరపించింది.వనపర్తి సంస్థాన చరిత్ర ఉపయుక్త గ్రంథాలు: డా. తూమాటి దోణప్ప ఆంధ్ర సంస్థానములు సాహిత్య సేవ, ఆలేటి మోహన్ రెడ్డి వనపర్తి సంస్థాన చరిత్ర, కృష్ణ వనపర్తి సంస్థాన చరిత్ర, కేశవ పంతులనరసింహ శాస్త్రి సంస్థానములు సాహిత్యసేవ.
(సమాప్తం):వచ్చేవారం..గద్వాల సంస్థానం

నగేష్ బీరెడ్డి, ఫీచర్స్ ఎడిటర్, నమస్తే తెలంగాణ
సెల్ : 80966 77177

871
Tags

More News

VIRAL NEWS