లచ్చువంబోరు


Sun,June 18, 2017 02:49 AM

గాసం అయిపోయింది. అందులో రెండో శనివారం కల్సొచ్చింది. పొద్దుగాల్నే లేసి తయారయ్యి ఇంటికొచ్చిన. గాసం అనంగానే కాపోల్ల అరుంధతక్క యాదికొస్తది. బయట సదువుకుంటామని, కంట్రోల్ బియ్యం, గాసునూనే ఇస్తప్పుడు జెరంత కనిపెడ్తది. పొద్దుగూకింది. అమ్మజేసిన సర్వపిండి తింటుంటే నాయిన ఇంటికొచ్చిండు. ఎప్పుడొచ్చినవ్ బిడ్డ అడిగిండు. పగటీలీ నాయిన అన్న. ఎండకాలం, పున్నమున్నట్టుంది. మంచి పండు వెన్నెలా కాస్తుంది. మంచం బయట యాపచెట్టు కింద యేసుకొని ఎల్లెలుకల పడుకొని కొమ్మలల్లకెళ్లి సుక్కల సిరులను సూస్తున్న. నాయిన గుడిసెల్నుంచి అంగి ఇడ్సేసి బయటికొస్తూ బిడ్డా పసులు సానా కనరువి ఉన్నాయ్, అంగడికి పోదాం ఒస్తావా? అని జెరంత బతిలాడినట్టు అడ్గిండు. సిర్రు బుర్రులాడే పసులున్నప్పుడు నాయిన నన్ను సుత పసుల కొట్టుకుపోతందుకు రమ్మంటడు. సరే ఒస్త నాయిన అన్న. అయితే తిని జల్దీ పండుకో. సీకటి మోకాన్నే లేవాల్నాయే అన్నడు బువ్వ తింటందుకు సెయ్యి కడుక్కుంటా. అమ్మ టమాట, పుదీన రోట్లో యేసి నూరి తొక్కు చేసింది. ఇన్ని ఒట్టి తుంకలు ఏంచి తట్ల అంచుకు పెట్టింది. ఉడుకు ఉడుకు బువ్వల పచ్చడ కమ్మగుంది. బుక్క బుక్కకు బలే రుషోస్తుంది. కడుపు నిండా తిన్న. నిద్ర కమ్ముకొస్తుంటే నాయిన బేరంలకు ఎట్లొచ్చిండో కండ్ల ముందు కదులుతోంది.
-గాదె వెంకటేశ్, 9849722127

నాయిన సిన్నప్పటి నుంచి జీతం ఉండు. పసుల బేరం సేయడానికి మునుపు ఒక్కొకరి దగ్గర్నే ఇరవై ఏండ్లు జీతం ఉండు. ఆసామి యవుసాయం బందువెట్టిండు. పసులని అమ్మెటప్పుడు ఎక్కడ కోతకమ్ముతరోనని తాను పసులెమ్మటి అంగడికి పోయి, మల్ల వ్యవసాయదారునికి అమ్మెదాక బేరగాన్ని వదల్లేదు. అయ్యకు పసులంటే పసిపిల్లలకంటే ఎక్కువ. సుక్క బర్రె సంతానమంటే మరీ పాణం. మా బర్లపాలు పిండెటప్పుడు దుడ్డెలకి ఎక్కువ ఇడ్సెటోడు. నాయిన దూడెలు కడుపునిండా తాగాలంటడు. అట్లా సీకినంక మిగిలినవే పిండేటోడు. ఒక్కపాలి మురుగుపాలు ఎక్కువయి బర్దుడె సచ్చిపోయింది. అప్పుడు అమ్మ అయ్యను లెస్స తిట్టి బాగా ఏడ్సింది. నాయిన సుతా లోపట సాన బాధపడ్డడు దూడ సచ్చినందుకు. ఐదారు ఊర్ల దొడ్ల పసువులను ఒక్కజాగల్నే సూసేసరికి నాయినకు పానం లేసొచ్చినట్టయింది. ఎండిపోయిన బాయి ఒక్కసారి అలుగెల్లపోసినట్టయింది నాయిన మనుసుకు. నాయినకు యవుసాయం పనులు తప్ప ఇంకేం రాదు. మాకేమో భూమి లేదు. ఇంకా జీతం ఉండడం సుతాం ఇష్టం లేదు. అందుకని బేరం నేర్సుకొని అండ్లనే నేను 8వ తరగతప్పటి సంది బేరం జేస్తుండు. బేరం నాయినకు బాగానే అబ్బింది.
story

సోమారం-రామన్నపేటలో, సుక్రారం వలిగొండ నార్కట్‌పెల్లిలో, ఆదివారం చౌటుప్పల్‌లో అంగళ్ళు అయితవి. రామన్నపేట సిన్న అంగడి, మాకు మూడు కిలోమీటర్లే. వలిగొండ, నార్కట్‌పెల్లి పెడమర్ల అని ఎప్పుడో ఒక తాప పోతడు. చౌటుప్పల్‌లో పెద్దగా అంగడి జరుగుతది. అంగడి అనంగనే సంతా మా ఊరిసంత.. అనే గోరటి వెంకన్న పాట గుర్తొస్తది. అండ్ల ఎడ్ల బేరం సేసే మా అయ్యనే తచ్చాడుతుంటడు. వారం మొత్తం అయ్యా, సుట్టుపక్క ఊర్లళ్ల, బాయికాడి దొడ్ల మీదికి పోయి పసులను బేరం చేసుకొని బయాన ఇచ్చొస్తుండే. కొందరు అపతున్నోల్లు తప్ప సానామట్టుకు పసులు అమ్ముడు పోయినంకనే ఇయ్యమంటరు, అది నాయిన మీద నమ్మకం. మా ఆడకట్టోల్లకి ఎవరికన్నా పైసలు, ఆపతికి కావాలంటే అయ్యనే ఏ అర్థరాతిరయిన సదురుతడు. బేరం మంచిగా సాగినన్ని రోజులు అయ్య ఎంతో మందికి సాయం జేసేది. వారానికి నాల్గయిదు రోజులు మా ఇంట్ల నీసుండేది.

అయ్యకు పసురం ఎంతకమ్ముడు పోతది, ఎంతకు కొనాలే బాగా తెలుసు. పసుల తోక లేపి, ఎన్ను మీద సెయ్యేసి పసురం పగుడమా? పగులు రాయా? ఇట్టే సెప్పగలడు. మా ఊర్లె ఎవ్వలికి యవుసాయానికి పసురాలు కావాలన్నా నాయిన దగ్గరకే వస్తుండ్రి. నాయిన ఆళ్ళ నమ్మకాన్ని 15 యేండ్ల సంది నిలబెట్టుకుంట వస్తుండు. మొదట్లో ఇద్దరి ముగ్గురితో కల్సి పొత్తుల బేరం జేసెటోడు. కాని వాళ్ళు పొత్తుల ముల్లె ఖర్సు సేసుకొని అయ్యను లాస్ జేస్తుండ్రి. అందుకే కొన్నేండ్ల సంది నాయిన ఒక్కడే జేస్తుండు. నాయిన బేరం రెండు మూడు తీర్లుగా జేస్తడు. ఒకటి ఎవ్వరికన్నా మధ్యవర్తిగా ఉండి పసుల ఇప్పిస్తే, వాళ్లు ఎంతో కొంత ఇస్తుండ్రి. తెల్సినోల్ల దగ్గరయితే తీసుకోడు, చాయ్ తాపించమంటడు. రెండోది, నాయిన దగ్గర రూపాలుంటే అంగట్లో కొని, అంగట్లనే అమ్ముతడు. మూడోది, ఊల్లో దొడ్లమీద కొని అంగట్ల అమ్మడం. బేరం భాష ఏరే తీర్గ ఉంటది. గది బేరగాళ్ళకు తప్ప ఇంకొలకు సమజ్‌గాదు. ఎప్పటికైనా ఆ భాష నేర్సుకోవాలని ఎప్పుడూ అనిపిస్తుంటది. నాయిన పసులను ఆడికాడికన్న అమ్ముతడు కాని, లాస్‌కి అమ్మంగా సూడలే. నాయిన బేరం అంత ఉపాయంగా ఉంటది. ఏ బాంబే షేర్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ పనికిరారు అయ్య బేరం ముందల. లాస్ వొచ్చినా ఎవ్వరికి తక్కువ పైకం కట్టిచ్చెటోడుగాదు. అది ఆయన నియతి. కోతకు పసులను అమ్మాల్సి వచ్చినప్పుడు అయ్యా పాణం సాన కొట్టుకుంటది. అందరూ బేరగాళ్ళు వృత్తిలో భాగంగా అయ్యతోడు, అమ్మతోడు అని ఇమానం చేస్తుండ్రి. కాని అయ్య ఏనాడు గట్ల జెయ్యంగ జూడలే. పడక పోతే బేరం ఇడిసేస్తడు. లాభం వచ్చినప్పుడు నాయిన అక్కకు నాకు తప్పకుండా పండ్లన్న లేకుంటే ఏదో సిరిదిండ్లు తెస్తడు, నీసయితే తప్పక తెస్తుండె. సీకట్ల కోస్తే అమ్మ తిడ్తూనే ఒండుతుండె. మరి అమ్మకూడా పొద్దస్తమానం కాళ్ళు రెక్కలు పోంగ పని చేసి ఒస్తుండే. ఆయ్య ఏమి కూకోపెట్టి సాక్తలేడు అమ్మను. సుట్టు పక్కల ఊర్లల్ల బేరగాడు రాములంటేతెల్వని ఆసామి ఉండడు, బేరగాళ్ళు ఉండరు.

చౌటుప్పల్ మా ఊరికి 20 కి.మీ. ఉంటది. వారం మొత్తం కొన్న పసులను నాయిన శనివారం పొద్దుగాళ్ళనే ఇంటికి కొట్టుకొచ్చుడు షురుసేస్తడు. వచ్చేటప్పుడు బాయోల్ల దగ్గర్నె ఇంత ఒట్టిగడ్డి మోపు కట్టుకొస్తడు. ఇంటి కాడ ఉన్న కంప చెట్లనీడకు కట్టేసి బకిట్ల నీళ్ళు బెడ్తుండె. పొద్దుగూకె సరికల్లా దొడ్ల మీద కొన్న అన్ని పసులను ఇంటికి జెరుస్తడు. నిమ్మలి నాగయ్యగౌడ్ మామ, రసూల్ తాత పసులను కూడా మా ఇంటికాన్నే కంపచెట్ల నీడకు కట్టేస్తుండే. అందరు కల్సె చౌటుప్పల్‌కి పోతరు కాని ఎవ్వరి బేరం వాళ్ళది. కుప్ప మీద పోర్లాడితే ఎంత అంటాల్నో అంత అంటుతది బిడ్డా అనేటోడు అయ్య. ఒకరు బేరానికి పోయినకాడికి, ఇంకొకలు పోరు. అది ఆళ్ళ నియతి. రసూల్ తాతను బేరం గురించి కదిలిస్తే తిన్నంత కాడికే బయటికొస్తది మనువడా అని పరాషికం ఆడుతుండే. అదివారం చౌటుప్పల అంగడి. నాయిన నా కంటే ముందే లేసి కొన్నింటికీ బంధాలు ఏసిండు. ఒకదానికొకటి లెంకలు పెట్టిండు. పడుగు తొక్కిస్తప్పుడు పసుల బంతి కట్టినట్టు. ఈసారి మొత్తం నాలుగు జతలున్నయ్. మాయి రెండయితే రసూల్ తాతదొకటి, నాగయ్య తాత దొకటి. రసూల్ తాత రాలే. గొడ్డుకు రూ. 20 ఇస్తడు. నాగయ్య తాత ఆయన పాలుకి వస్తడు. నాకు కూడా రాత్రి పూట పసులు కొట్టుకు పోవుడంటే సానా ఇష్టం. ఎండకాలమంటే మరీ ఇష్టం. పట్నం చదువుకోను జేరినంక గట్లా పోక చానా రోజులైంది. ఇప్పడయితే ఆటోలల్ల లారీలల్ల పసుల తీసుకుపోతుండ్రు.

నాయిన నన్ను అంతా తయారయినంక నాల్గింటికి లేపిండు. ఇన్ని మొఖం మీద నీళ్ళు సల్లుకొమ్మని జెప్పి, తోలు చెప్పులు తొడ్కోమని ఇచ్చిండు. అప్పటికే నాగయ్య మామ, రసూల్ తాత వచ్చిండ్రు. రసూల్ తాత ఊరవతలి దాకా వొచ్చి పసులను తొవ్వవట్టించి పొయ్యి పండుకొని, పొద్దుగాల టెంపోకన్న బస్సుకన్న వస్తనన్నడు. నేను నాయన, నాగయ్య మామ పసులను కొట్టుకుపోతున్నవ్‌ు. రోడ్డు పొంటి పోతే 20 కిలోమీటర్లే. కాని నడువంగా పోతే 15 కి.మీ. వస్తది చౌటుప్పల్. ఎల్లంకి, సుంకనపెల్లికి పోగానే ఆ ఊరి బేరగాల్లు కూడా కల్సిండ్రు. ఒక బేరగాడు. ఏం బేరగా, పుల్లకోల్లాగాను, దోరావును ఎంతకిస్తవ్ అయ్య సవ్వడిగారాలు బీడి ముట్టించుకుంట. అంతన రాములు సవ్వడిగారాలకు రాదా అండు. నాయిన కాడ బీడి తీసుకొని ముట్టించుకుంట. నోట్లో పొగ ఊదుతూ నాకే తీన్‌డిగారాలు పడ్తది.

తీసుకుంటట్లయితే సెప్పు బేరగా ఏడికోకాడికి వదిలేస్తా అన్నడు నాయన. సరే రాములు నగదు ఇస్తా ఖమ్మాన్‌కి ఇస్తావా అండు అవతలి బేరగాడు. పడదు కానీ బేరగా అంగట్లకు పోయినంక జూద్దాం పా అని పసులను ఎనుకంగా అద్లిస్తుండ్రు.తెల్లారే సరికల్లా చౌటుప్పల్ దగ్గరికి పోయినం. పసుల కాళ్లు మెత్తబడ్డయ్. సూర్యుడు నిమ్మలంగా రోడ్డెక్కుతున్నాడు. మోటర్లు బుర్రబుర్ర పోతున్నాయి. పసులు రోడ్డు దాటడానికి బెదురుతున్నయి. ఊరి నుంచి కొట్టుకురావడం ఒక ఎత్తయితే పెద్ద రోడ్డు దాటించడం ఇంకో ఎత్తు. ఒకరి ముందర ఒకరు ఎంక ఉండి ఒక్కొక్క జతను రోడ్డు దాటించి అంగట్ల కట్టేసిండ్రు. రోడ్డు దాటగానే అంగడి. అంగట్లో ఒక నీళ్ళు మొత్త (హౌజ్) ఉంటది. గడ్డి కొనుక్కోవాలి. తెల్లారే సరికల్లా అంగడి నిండి పోయింది మనుషులు, పసులతోటి. అంగట్ల పసులను తోలినంక, నేను బస్సు ఎక్కి ఇంటికి మర్లొచ్చిన. పానం అస్సలు వశపడ్తలేదు. అల్వాటు తప్పిన పానమాయే. వచ్చి ఒట్టి సాపల్నే పడుకున్న. సానాసేపు మత్తొచ్చినట్టే నిద్రపోయిన. నిద్ర లేసినంకా ఇంత అన్నం తిని మూడు నాల్గింటప్పుడు దోస్తులను కలుద్దామని ఊళ్లకు బోయిన.

ఊరికి రాక చానా రోజులైంది. ముచ్చట సంబురాన టైం మర్సిపోయిన. సీకటయ్యింది. నేను అయ్యి ఇయ్యి సదురుకోవాలని దోస్తులకు చెప్పి లేసిన. మల్లెప్పుడొస్తవ్ రా అని జంగులు అడ్గిండు. కల్లు బాగా అయితప్పుడు చెప్పుండ్రా తప్పక వస్తా అనుకుంట మళ్లిన. ఆదలబాదల ఇంటికి రాంగనే అమ్మ ఆకిట్ల తొక్కులాడుకుంట ఎదురుబడ్డది. ఏంది అమ్మ, సీకట్ల సూస్తున్నవ్ అని అడ్గిన. నాయిన ఇంకా అంగడి బోయి రాలేదు బిడ్డా.. పసులు అన్నీ అమ్ముడు పోలేనట్టుంది, మల్లా ఇంటికి కొట్టుకొస్తుండేమో, జెర సిన్నగా ఎదురు పోరాదు బిడ్డ, నాయినొచ్చి మల్లా బాయికాడికి పోయి రావాల్నాయే అంది. సరే పోత గాని నువు ఇంట్లకు పో అని సైకిలు తీస్కొని ఎదురుపోతున్న. వెల్లంకి మీదుగా సుకనపల్లి దాటినంక నాయిన కల్సిండు. కొద్దిసేపు అయినంకా నాయిననే అమ్మ బాయికాడికి పొయ్యి వచ్చిందా బిడ్డ. సుక్క బర్రె మేత ఏమైన ముట్టిందంటన అని అడ్గిండు. ఆ వచ్చిందే, అమ్మనే పంపింది ఎదురు పొమ్మని. బర్రె సంగతి నాకు తెల్వదు అన్న. నాయినకు సైకిలిచ్చి నేను పసుల ఎన్కెమ్మటి అల్లిస్తున్న. పసుల కాళ్లు మొత్తబడ్డయ్. పొద్దున ఉన్న ఉరుకులాట గిప్పుడు లేదు. నాయిన ముఖమంతా సిన్నబోయింది. నాయిన పసులను తిర్గి ఇంటికి కొట్టుకురావడం సానా తక్కువ. ఏమయింది, నాయిన పసులమ్ముడు పోలేదెందుకే, ధర పడలేదా? సీజన్ కాదా? అని అడిగిన. జెరంత సేపు ఉంటే అమ్ముడుపోయేవేమో కాని పానమంత సుక్క బర్రె మీదనే గుంజుతుండే బిడ్డా అండు.

అయినా ఒకప్పటి కాలం గాదు బిడ్డ, గిప్పుడు యవుసాయం అంతా ఒట్టి పోయింది బిడ్డా. ఇయ్యాల రేపట్ల పసులను ఎవరు కాస్తుండ్రు. గడ్డిగూడ దొరుకుతలేదు. అందరు మిషన్లు పెట్టి వరి కోస్తుండ్రు. మిషన్లు సగానికే కోస్తయ్. ఆ సగమయిన ఏరి గడ్డాం వేసే మానుడే లేడు. సానా మంది తగులబెడ్తుండ్రు. ఎనుకటికి ఎన్ని అరకలు ఉంటే అంత పెద్ద యవుసాయం అనేటోలు. పసులుంటే లచ్చువంబోరు, బర్కత్ అనుకునేటోళ్లు. గీ దినంల నాల్గు అర్కలు కట్టి దున్నే రైతే కరువయిండు. గీ దినాళ్ల అయితే పసువుల్ని పాలిచ్చే వస్తువులుగానే సూస్తుండ్రు. సానా బాయిలకాడ దొడ్లు లేవు. బాయికాడ పసుల దొడ్డంటే ముఖంల బొట్టోలే. ఎనుకటికి ఏ దొడ్ల పుడ్తె, సచ్చిందాక ఆ దొడ్లనే ఉండేయి. కాని యియ్యాలరేపట్ల పసులను ఎవడు సాత్తుండ్రు బిడ్డ. పాలిస్తే, పని చేస్తే ఉంచుతరు లేకపోతే అమ్ముతరు. యవుసాయానికి పసులను ఎవ్వరు కొన్తలేరు. సేత సేసి సేసి ముసలివి అయితే కసాయికి అమ్ముతుండ్రు. ఆళ్లను మాత్రం ఏంచెయ్యమంటవ్. భూమ్మీద గూడ గడ్డి లేదాయే. కండ్ల ముందు సస్తే సూడ లేక అడ్డికి పావు సేరుకి అమ్ముతుండ్రు. గడ్డికి ఎటమాటం అయితదని మనసుకు ఒప్పుకోకున్న తగులు పట్టిస్తుండ్రు దొడ్డి మీదనే. ఆవులయితే ఆడ ఆడ కోతకు పోతుంటె, కొందరు ఆపుతుండ్రు. కాని బర్లనయితే ఆపే దిక్కే లేదు. ఇంకా నయం మన ఊళ్లే కరువుకు ఎవలు నడువంత్రాన సావాలే. మన ఊరి శాలె పని పుణ్యాన. భూమ్మీద ఏదో ఆపద రాబోతుందన్నంత గోసగా జెప్పిండు. అయినా జెరంత సేపుంటే ఏడికోక్కాడికి అమ్ముదును గాని సుక్క బర్రె మీదనే పానమంత గుంజుతుండే బిడ్డ మళ్ల అండు నాయిన సిన్నబోయి.

సుక్క బర్రె సంతానం అయిదారు తంతెలు (తరాలు) మా అయ్య చేతిలోనే పుట్టి పెరిగినయ్. ఆయన చేతుల్నే కన్ను మూసినయ్. మాతోపాటే అయ్యి, ఆటితోపాటే మేము పెర్గినం. ఆ సంతతి బర్లంటే మరీ ఇష్టం మా అయ్యకు. ఎంతకష్టం వచ్చినా అమ్మలే. మా ఇంట్లో ఒక మనిషిలాగా సూసేటోడు నాయిన. ముప్పై యేండ్ల నుండి మా అయ్య ఆటిని, సంతతిని సాదుతుండే. కాదు.. కాదు అయ్యే మా ఇల్లును సాదుతున్నయ్. పాలు, పెరుగు, చాయ్, పెండ.. అన్ని ఇదాలుగా మమ్మల్ని కాపాడుతూనే వచ్చినయ్. ఎంత కరువొచ్చినా మా నాయిన ఆ సంతతిని పోనియ్యలే. అయ్యి కూడా కరువొచ్చినా, కట్టినా కూడా పాలిచ్చి మమ్మల్ని సాదినయ్. అమ్మోలే అమ్మయినయ్. అయ్యకు సంసారాన్ని ఎల్లదీయా ఒక కొడుకోలే కుడి బుజంలా ఉండేవి. ఎవ్వరు పిండినా పాలిచ్చేవి. మా నాయిన చెయ్యి పడితే ఇంకొన్ని ఉతారుగా పాలు ఇచ్చేవి. పెండ కూడా బాగా వచ్చేది. గీ బర్రె ఆ సంతతిలో ఆఖరిది. గందుకే నాయిన సానా నారాజుగా ఉండు. ఇంట్లో మనిషి నవుసుతున్నట్టు.

మాటల్లోనే దబ దబ బేరం పసులను ఇంటికి కొట్టుకొచ్చినం. వస్తొస్తనే ఏళ్ళ సంజీవన్నోళ్ళ బాయికాడ ఇంత గడ్డి కట్టుకొచ్చినం. పసుల కట్టేసి, మేతేసినం. నాయిన మల్ల సైకిలు ఏస్కొని బాయికాడికి పోయిండు. నేనే నాయిన బువ్వ తినిపోరాదే అంటే బర్రెను సూసొస్త బిడ్డ అనుకుంట పోరంబోకుల కొట్టం కాడికి పోయిండు. అంతల్నే అమ్మ నేను ఎంత మంచిగా పసులను మేపినా మీ అయ్య మెచ్చడు బిడ్డ. మల్లొక్కసారి సూసుకోన్ది మనుసుకు పట్టదు. అసలే బర్రెకు బాగలేదాయే. ఇంగెట్ల పోకుంట ఉంటడు గాని నువ్వు తిని పండుకో బిడ్డ. పొద్దుగాళ్ల మబ్బుల బస్సుకు పోవాల్నంటివి అంది. నాయిన ఏ నాతిరో ఒచ్చుండో రాలేదో. ఎగుల్లవారంగ నా తోటే బస్టాండుకొచ్చిండు. నేనొద్దన్న ఇనలే. అట్నే బాయికాడికి పోతబిడ్డ అండు. నీయమ్మ ఎప్పుడు నీకు పసుల పిచ్చే అనుకుంట బస్సు రాంగనే ఎక్కి కూసున్న. నా ఎన్కెమ్మటే పోలేపాక యల్లప్పన్న ఎక్కిండు. ఆయిన బాగా సద్వుకున్నోడు. ఇద్దరం మందలించుకొని ఒక్క సీట్లోనే కూకున్నం. మా కిటికీ కాడంగ వొచ్చి నాయన యల్లప్ప జర తమ్మున్ని అప్పుడప్పుడు అర్సుకో బిడ్డా అన్నడు. సరేనే అన్నడు ఎల్లప్పన్న. బస్సు కదిలింది. ఏవ్‌ు తమ్మి నాయినను కష బిష అంటున్నవు అని అడ్గిండు. బియ్యం సంచి సీటు కిందికి జరుపుతూ.. ఏవ్‌ు లేదన్న, సిన్నప్పటి నుంచి సూస్తన్న ఎప్పుడు పసుల లోకమే. పంట కావలి కుక్కలు, ఇంటికాడ కోళ్లు, పసులు.. ఇయ్యే ఆయన లోకం. మాకంటే అయ్యే ఎక్కువయినయి కొద్దిగా నిష్టూరమాడిన. రాత్రి బాయికాడికి పొయ్యి ఏ నాతిరొచ్చిండో, గిప్పుడు మళ్ల పోతుండు. కుక్కలంటే, పసులంటే, కోళ్లంటే పిచ్చిపట్టినట్లుందన్న. బస్సు నార్కట్‌పల్లి దాటింది. అన్న నవ్వుతూ నిమ్మలంగా ఇంటుండు. ఇని.. తమ్మీ, నేనొక మాట చెప్పనా? అండు. ఇగ నేను ఆపేటట్లు లేనని నాలుక కర్సుకొని సరే సెప్పుండ్రి అన్న.

అయ్యతరం వాళ్లు అందున ఉత్పత్తి కులాలోళ్లు. మనమూ బతకాలే మనమున్న సోటు, పురుగుబూషి బతకాలనుకుంటారు. మనతరం మనం బతికితే సాలు అనుకుంటం. మనం సాటి మనుషుల పట్ల సమానత్వం సూపమని కొట్లాడుతున్నాం. కాని అయ్యోళ్లు వాళ్లు సేతనయినంత సమానత్వం సాటి జీవి పట్ల కూడ సూపుతుండ్రు. వాళ్లు మనకంటే ఒకడుగు ముందుండ్రు. నాయిన జీతం ఉన్నప్పటి సంది సూస్తున్న. పసుల మీద దెబ్బ పడనిచ్చెటోడు కాదు. పానంగా పసిపిల్లలోలె సూసుకుంటడు. మచ్చిక సేసుకునే దున్నకానికి ఒంగబెడ్తుండే. గీయాల్ల కొన్ని సంఘాలపోల్లు లావులావుగా మాట్లాడ్తరు. కాని పాటించేది ఉండదు. ఇంతెందుకు ఆవును గోమాత అని పూజిస్తారు గదా? పాలు ఎండిపోయినంక ఎంతమంది సాకుతుండ్రు. మూత్రం కూడా పవిత్రమే కదా మరి ఎందుకు తన్ని తరిమేస్తుండ్రు. నొచ్చిననుంచి సచ్చిందాక సాది, సవరించి, ఆనక ఆకలి తీర్సుకోనీకి తిన్నోళ్లను బద్నాం చేస్తుండ్రు. తమ్మీ! నోరు లేని జీవాల సాదుడంటే నిజమైన, నిస్వార్థమైన ప్రేమ. ఎందుకంటే ఆటి నుంచి ఏమి తిర్గి ఆశించం. కాని మనుషుల్ని ప్రేమించడం, సాయం చేయడంలో సానామట్టుకు ఏదో ఒక తీరుగా తిర్గి వస్తుందనో, సివరకు కృతజ్ఞత సూపుతరనో సూస్తం, సేస్తం. గొప్పోల్లందరు గొప్ప పనులేం జెయ్యరు. చేసే పనినే గొప్పగా చేస్తారు. మన అయ్యతరం వాళ్లు ఆకోవకు చెందినందుకు మనం గర్వపడాలే. మనం జంతు ప్రేమికులమని టి.వి.లల్ల, సినిమాలల్ల, పేపర్ల వస్తే గొప్పోల్లు అనుకుంటాం. అలాంటోళ్లు మనింట్ల పుడ్తే, అర్థం చేసుకోం. నెగలనియ్యం, చాదస్తం అంటం. పోచంపల్లి గుట్టల మీదినుంచి సూర్యుడు మీదికొస్తుండు. సీకటి తేలి పోతుంది. బస్సు అద్దం తీసిన. ఒక్క సారిగా ఒక కొత్త విషయం ఆవహించింది. ఎక్కడో సద్విన ఒక మాట యాదికొచ్చింది. మన నాయినే ఒప్పు అనుకునే కాలానికి మనల్ని తప్పుపట్టే కొడుకు పుడ్తడని.

బస్సు పోచంపల్లి కాడ ఆగింది. డ్రైవర్ చాయ్ తాగుతోల్లు తాగుండ్రన్నడు. అన్న, నేను చాయ్ తాగి ఎక్కి కూసున్నాం. అన్న తమ్మీ.. నాతిరి ఏం జర్గిందో ఎరుకనా? అని తనే అసలు సంగతి చెప్పిండు ఆగబట్టుకోలేక. నాయిన నాతిరి మొత్తం తిర్గుతనే ఉండు. సుక్క బర్రెకు బాగాలేక, గావార గావార చేస్తుండే. ఆ నాతిరే పేటకు పోయి, పసుల డాక్టర్ని తీసుకొచ్చి చూపిచ్చిండు. డాక్టర్ కూడా లాభం లేదని సెప్పిండు. అయినా ఏదో సూది ఇచ్చి ఎల్లిపోయిండు. ఇంకా పానం ఊకోక, దాని గోస సూడలేక ఆళ్లను, ఈల్లను పిల్సుకొని పోయి సూపిచ్చిండు. మా అయ్య పోతుంటే నేను సుత ఎంబడి పోయిన. కాకయ్య ప్రేమ కొద్ది చెట్ల మందులు, పసర్లు పోపిచ్చిండు బర్రెకు. మంత్రాలు కూడ యేయించిండు. తాటికమ్మతోని బర్రెకు గాలి ఊపిండు. ఎదురుగొట్టంతోటి నీళ్ళు తాపిండు. అద్ద రాతిరి దాకా ఎంత తిప్పలపడ్డా.. గింత సుక్కకూడ గొంతిక దిగినట్టు అనిపియ్యలేదు. బర్రె ఆయాసం ఏం తక్వగాలే. సూస్తుండంగనే గోసతీసి తీసీ పానమిడ్సింది. ఏం సెయ్యాల్నో పాలుపోక కాకయ్య అట్లనే దిమ్మరపోయి కూలబడ్డడు.

ఓ తరం ఎళ్లిపోయింది. ఒకటే గోస. మీ నాయిన జేతుల మీద పెరిగిందాయే. పుట్టుపూర్వోత్తరాలు ఎల్లబోసుకుంట బర్రె మీద పడి ఒక్కతీర్గ ఏడ్సిండు. దాని మొకంల మొకం పెట్టి శిన్నపిలగానోలె ఏడ్సిండు. కాకయ్య గట్ల ఏడ్వంగ నేను ఎప్పుడూ చూడలే తమ్మీ.. ఆయిన తండ్లాట చూస్తుంటే అక్కడున్నోల్లందరికి కడ్పుల దేవినట్లయింది. ఇగ పొద్దుగాలొచ్చి బర్రెను తీశేద్దాం.. ఇంటికి రా అని ఎందరు పిల్సినా.. కాకయ్యకు మాత్రం పానం పోయిన బర్రెను ఇడ్సిరాబుద్ది గాలేదు. కాకయ్యనూ, సచ్చిపోయిన బర్రెను చూస్తుంటే నాకు కూడ పానమంత కలికలి అయింది తమ్మీ.. బువ్వ, బుగ్గి లేకుండా రాత్రి నిద్ర కాసుకుంట ఏడ్సి ఏడ్సి కూడ బర్రె సచ్చిన గంపెడు బాధను దిగమింగుకుంట కూడ మల్లా నిన్ను బస్కెక్కిద్దామని వచ్చిండు. అది కాకయ్య మనస్సు, స్థిత ప్రజ్ఞత. ఈ ముచ్చట నీకే కాదూ.. అమ్మకు కూడ సెప్పలే మీ నాయిన. ఎందుకంటే ఏడ్సుకుంట కొడుకును సాగతోలొద్దని.
నాకు పానం పోయినంత పనయ్యింది. ఎల్‌బి నగర్ వచ్చింది. అన్న దిగిండు. బస్సు ముందుకు పోతున్నది. నాకు వషం గాలే. సుక్క బర్ల సంతలోని మూడు తరాల నుంచి సాదుతుండు నాయిన. మాకు అవంటే సానా బర్కత్, లచ్చువంబోరు. ఓ తరం అంతరించి పోయిందని అయ్య పడే గోసను తల్సుకుంటే నా తరం గాలే. కండ్లళ్ల కెళ్లి నీళ్లు దుంకుతున్నయ్. ఒళ్లంత కండ్లయినయ్. మొదటిసారి మా ఇంట్లో ఫోన్ ఉంటే బాగుండనిపించింది.

గమనిక : సవ్వ డిగారాలురూ.7 వేలు, రవ్వ డిగారాలు రూ.4 వేలు, తీన్ డిగారాలురూ.6 వేలు

949
Tags

More News

VIRAL NEWS