రేపటి రౌడీ


Sun,March 17, 2019 01:21 AM

Crime
ఈ ప్రయాణంలో అతనికి కొత్త రోల్ మోడల్ లభ్యమయ్యాడు. ఇప్పుడు అతను పోలీస్ అవాలనుకుంటున్నానని చెప్పసాగాడు. నాకు మాత్రం గుర్తున్నది. అతను ఆఖరిసారి ఊపిన కుడి చేతికి ఉన్న బేడీ. పోలీస్ తన ఖైదీ కుడి చేతికి బేడీ వేస్తాడు. అతను పోలీ సైతే ఆ చేతిని స్వేచ్ఛగా ఉంచుకోడా? అతనిది ఎడమ చేతివాటమైతే తప్ప అలా వేసుకోడు. ఆ యువకుడు పోలీస్ కాక ఖైదీ అయ్యే అవకాశం చాలా ఉంది. ఆ రౌడీలా కనిపించిన లావుపాటి వ్యక్తి పోలీస్ ఆఫీసరై ఉండాలి.

విమానం బయలుదేరడానికి మునుపే నేనా అబ్బాయిని లాస్ ఏంజెల్స్ ఎయిర్ పోర్ట్ లో గమనించాను. సుమారు పన్నెండేండ్లు వయసున్న వాడు ఐదున్నర అడుగుల దాకా ఎత్తున్నాడు. యాభైలలోని తల్లితండ్రులతో వాడు ప్రయాణిస్తున్నాడు. వాడు మెటల్ డిటెక్టర్ గుమ్మంలోంచి నడుస్తుంటే అది ఆకస్మాత్తుగా మోగింది. వాడి బెల్ట్ వెనక వీపు వైపు చిన్న రివాల్వర్ ఉంది. అర నిమిషం గందరగోళం తర్వాత అది నిజం రివాల్వర్లా కనిపించే బొమ్మ రివాల్వర్ అని సెక్యూరిటీ వాళ్ళు కనుక్కున్నారు. వాడి తల్లిదండ్రులు సిగ్గుపడి సెక్యూరిటీ వాళ్ళకి క్షమాపణ చెప్పాడు. కానీ ఆ కుర్రాడు మాత్రం బెదరకుండా చెప్పాడు.

అది నిజమైన రివాల్వరైతే దాన్ని మీరు నా నించి తీసుకోగలిగే వాళ్ళు కాదు. ఏదో ఓ రోజు నిజం రివాల్వర్‌తో వచ్చి ఏం జరుగుతుందో అప్పుడు మీకు చూపిస్తాను.
మా అబ్బాయి టీవీల్లో, సినిమాల్లో నేర కథలని ఎక్కువగా చూస్తుంటాడు. పెద్దయ్యాక గూండా అవుతానంటున్నాడు. వాడి తండ్రి ఎవరికీ కాక సాధారణంగా చెప్పాడు.
ఒకరిద్దరు ముందు నవ్వినా తర్వాత అందులో హాస్యం లేదనుకోగానే ఆ నవ్వులు ఆగిపోయాయి. నేను గమనించింది ఆ కుర్రాడు, వాడి తల్లిదండ్రులనే కాదు. విమానంలో కూర్చున్నాక మరో ఇద్దర్ని గమనించాను. వాళ్ళు కొద్దిగా ఆలస్యంగా వచ్చి విమానం వెనక్కి నడిచారు. నేను అంతదాకా ఎన్నడూ విభిన్నమైన ఇద్దరు కలిసి ప్రయాణం చేయడం చూడలేదు. త్రీ పీస్ సూట్లో ఇరవై ఐదు - ఇరవై ఆరేండ్ల ఓ సన్నటి వ్యక్తి. అతని చేతిలో ఓ నల్లటి బ్రీఫ్ కేస్ రెండో అతను బాగా వాడిన లెదర్ జాకెట్ ధరించిన లావుపాటి యాభై యేండ్ల వ్యక్తి. చేతిలో ఓ పాత పెట్టె. దాన్నిండా ఇటుకలు ఉన్నాయా అన్నంత బరువుగా మోస్తున్నాడు. అతనికి ఓ చెవి లేదు. అది పళ్ళతో కొరకడం వల్ల పోయిందని గ్రహించాను.
వారిద్దరి మధ్యా ఎలాంటి సంబంధం ఉందా అని అనుకున్నాను. చివరకి అది నాకు తెలిసింది. ఇద్దరి చేతులకి కలిపి బేడీలు ఉన్నాయి. ఓ పోలీస్ అధికారి ఓ నేరస్థుడ్ని రవాణా చేస్తున్నాడని ఆ బేడీలు నాకు చెప్పాయి. వాళ్ళు నాకు రెండు వరసల వెనక కూర్చున్నారు.

అతన్ని చూశావా నాన్నా? పెద్ద రౌడీ. సినిమాల్లో రౌడీలు కూడా అంత భయంకరంగా ఉండరు. అకస్మాత్తుగా ఆ కుర్రాడి గొంతు పెద్దగా వినిపించింది.
సీట్ బెల్ట్ కట్టుకోమన్న సైన్ వెలిగింది. విమానం టేకాఫ్ కోసం నెమ్మదిగా కదిలింది. ఎయిర్ హోస్టెస్ మా సీట్ల మధ్య నడుస్తూ అంతా సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? లేదా? అని తనిఖీ చేసింది. ఆమె పోలీస్, ఖైదీల దగ్గరకి చేరుకున్నాక చెప్పింది.
ఆఫీసర్! మీరా బేడీలని తేసేయాలి. విమానం ఎగురుతూండగా బంధింపపడడాన్ని ఫెడరల్ రూల్స్ అనుమతించవు. బేడీలు విప్పిన శబ్దం విన్నాను. ఎలాంటి పిచ్చి నియమం? ఆ నేరస్థుడు ఇంకాస్త ఎక్కువ బంధింప బడడం వల్ల ప్రయాణీకులు రక్షణగా ఫీలవుతారు అనుకున్నాను. ఆ పోలీస్, ఖైదీలంటే ఆసక్తి ఉన్నది నా ముందు కూర్చున్న ఆ కుర్రాడికి మాత్రమే కాదు. మిగిలిన ప్రయాణీకులకి కూడా. ఓ సారి విమానం గాల్లోకి లేచి, సీట్ బెల్ట్ సైన్ ఆరిపోయాక చాలామంది ప్రయాణీకులు రెస్ట్ రూంకి వెళ్తున్నట్లుగా నటిస్తూ, విమానం వెనక వైపుకి వచ్చి, వాళ్ళ సీట్ల దగ్గరకి చేరుకున్నాక నడక వేగాన్ని తగ్గించడం నేను గమనించాను.

వాళ్ళతో ఆ కుర్రాడు తప్ప మరెవరూ మాట్లాడలేదు. వారి వైపుకి వాడు వెళ్తూంటే నేను తల తిప్పి చూడకుండా ఉండలేకపోయాను. వాడు వాళ్ళ ముందు ఆగి ఆ ఖైదీని చూశాడు.
నువ్వు చాలా భయంకరంగా కనిపిస్తున్నావు. వాడు చెప్పాడు. కఠినమైన మొహం గల ఆ మధ్య వయస్కుడు వాడి మాటల్ని పట్టించుకోకుండా తను చదివే పత్రిక లోంచి తలని బయటకి తీయలేదు.
ఇతను భయంకరమైన వాడు కాదు. ఐతే చెవి, ముక్కు అలా ఉండేవి కావు. ఖైదీ పక్కన కూర్చున్న యువకుడు నవ్వుతూ చెప్పాడు.
నేను నవ్వాను కానీ వాడు నవ్వలేదు. ఆ ఖైదీని వాడు తన రోల్ మోడల్ వంక చూస్తున్నట్లుగా చూడటం నాకు అర్థమైంది. కొద్ది సేపు నిలబడి చూశాక వాడు ముందుకి నడిచాడు. చికాగో నించి మేం బయలుదేరిన పావుగంటకి అది ఆరంభమైంది. బయటి గాలి తీవ్రతకి విమానం బాగా ఊగసాగింది. విమానం రెండు వేల అడుగులు కిందకి జారాక కాని పైలట్ దాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. ఫాస్టెస్ సీట్ బెల్ట్ సైస్ మళ్ళీ వెలిగింది. కానీ అప్పటికే చాలా మంది సీట్ల రెండు వరసల మధ్య గల నడిచే మార్గంలో కింద పడ్డారు. విమానంలోని ఏదో భాగం పటపట విరిగిన శబ్దం వినిపించింది. ఎయిర్ హోస్టెస్ మొహంలోని చిరునవ్వు మాయమై పాలిపోవడం గమనించాను. మరోసారి అదే చప్పుడు వినిపించడంతో నా కాళ్ళు వణికాయి. నాలో భయం అలుముకుంది. లౌడ్ స్పీకర్లోంచి పైలట్ కంఠం శాంతంగా వినిపించింది.

నేను మీ కెప్టెన్‌ని. ఓ ఇంజిన్ పడిపోయింది. సాధారణంగా రెండు ఇంజన్లతో మనం ప్రయాణించొచ్చు కాని ఆ ఇంజిన్ వర్జికల్ స్టెబిలైజర్ మీద పడడంతో విమానం నా పూర్తి ఆధీనంలో లేదు. పైకి, కిందకి వెళ్ళగలం కాని పక్కకి మళ్ళలేం.
అంతా ఒకరి వంక మరొకరు భయంగా చూసుకున్నారు. కొందరు భయంతో అరిచారు కూడా. పైలట్ కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత చెప్పాడు. అంటే మనం చికాగో ఎయిర్ పోర్ట్ లో దిగలేం. లేక్ మిచిగన్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నాను. ైఫ్లెట్ అటెండెంట్స్! ప్రయాణీకులకి ఎమర్జ్జెన్సీ లేండింగ్ ప్రొసీజర్నీ వివరించండి.
నేను చాలా సంవత్సరాలుగా విమాన ప్రయాణాలు చేస్తూ, ఎమర్జెన్సీ ల్యాండింగ్ సూచనలని ప్రతీ సారి వింటున్నాను. కాని ఎన్నడూ అంత శ్రద్ధగా వినలేదు. ప్రతీ పదాన్ని మిగతా వాళ్ళలాగా జాగ్రత్తగా విన్నాను. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపులు ఎక్కడ ఉన్నాయో చూపించారు. మా రబ్బర్ లైఫ్ జాకెట్‌లో గాలి ఎలా నింపాలో ప్రదర్శించి చూపించారు. తర్వాత మాకు వీళ్ళని ఇచ్చి వాటిని మా ఒళ్ళో ఉంచుకొని, దాని మీద తలనీ ఉంచమని కోరారు. విమానం కిందకి దిగసాగింది. తర్వాతి కొద్ది నిమిషాలు నాకు గంటల్లా తోచాయి. నేను ఓ సారి తలెత్తి కిటికీలోంచి చూస్తే కింద సరస్సు కనిపించింది. నేను నా తలని దిండులో ఉంచి ప్రార్థించసాగాను.

పళ్ళు విరిగేంత ఒత్తిడితో విమానం దిగింది. నేను నా సీట్లో ముందుకి విసిరేయబడ్డాను కాని నా బెల్ట్ నేను పడిపోకుండా ఆపింది. పైలట్ చెప్పినట్లుగా పేలే బదులు విమానం మధ్యకి రెండుగా విరిగిపోయింది. రెక్కలు, ముందు భాగం నీళ్ళల్లో మునిగిపోయాయి. నా చెవులు ఆ శబ్దానికి గింగురుమంటున్నాయి. ముందు భాగంలోని ప్రయాణీకులు ఇంకా సీట్ బెల్ట్‌ని విప్పుకోకుండానే మా మధ్యకి నీళ్ళు వచ్చాయి. నేను సీట్ బెల్ట్ విప్పుకొని లేచి నిలబడ్డాను. ఎయిర్ హోస్టెస్ ముందు భాగం విమానం నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. మాకు మార్గదర్శకత్వం వహించే వాళ్ళు ఎవరూ లేరు. అంతా బయటకి వెళ్ళండి. ఇది ఎంత సేపు తేలి ఉంటుందో తెలీదు. నీళ్ళల్లోకి వెళ్ళి లైఫ్ జాకెట్లలో గాలి ఊదండి.
ఆ యువ పోలీస్ అరిచారు. నేను ఇంకో సారి చెప్పించుకోకుండా విమానం తెరచుకుని ఉన్న భాగం వైపు పరిగెత్తి నీళ్ళల్లోకి దూకాను. ఆ పోలీస్ ఆఫీసర్, ఆ కుర్రాడు, మరో ఇద్దరు ప్రయాణీకులు నా వెంట నీళ్ళల్లోకి దూకారు.
మా అమ్మానాన్నా ఇంకా లోపలే ఉన్నారు కుర్రాడు అకస్మాత్తుగా అరిచాడు. మీ ఖైదీ ఏమయ్యాడు? నేనా పోలీస్ ఆఫీసర్ని అడిగాను.
నేను విదేశీ భాష మాట్లాడినట్లుగా, అతను నా వైపు అర్థం కానట్టుగా చూశాడు. గత కొద్ది నిమిషాల పరిణామంతో అతని ఆలోచనల్లోంచి ఖైదీ వెళ్ళిపోయాడని గ్రహించాను.
అతనికి స్పృహ తప్పింది. మిగిలిన వాళ్ళతో అతను కూడా లోపల చిక్కుకున్నాడు. ఉదాశీనంగా జవాబు చెప్పాడు. అతనిలో నాకు భయం కనిపించలేదు. ఆ కుర్రాడు తన తల్లిదండ్రుల కోసం గట్టిగా ఏడవసాగాడు. ఆ ఆఫీసర్ తన లైఫ్ జాకెట్‌లని విప్పుతంటే అడిగాను. ఏం చేస్తున్నారు?

విమానంలోకి నీళ్ళు వెళ్ళాయి. వాళ్ళంతా నీళ్ళల్లో ఈది బయటకి రావాలి. కానీ గాలి నింపిన లైఫ్ జాకెట్లతో వాళ్లు పని చేయలేరు. నాది తొడుక్కొని నేను నీళ్ళల్లో లోపలకి వెళ్ళి ఆ సంగతి చెప్పలేను. జాగ్రత్తగా ఉంచండి. దాన్ని నాకు ఇచ్చి అతను చెప్పాడు.
అతను నీళ్ళల్లోకి మునిగాడు. కొద్ది నిమిషాల తర్వాత ఆ పిల్లవాడి తల్లితో మళ్ళీ పైకి వచ్చాడు. మరోసారి నీళ్ళల్లో మునిగే ఆ విమాన శకలాలలోకి వెళ్ళి పిల్లాడి తండ్రితో వచ్చాడు. మూడోసారి వెళ్ళేప్పుడు అతను ఆ కుర్రాడి వైపు చేతిని ఊపాడు. దానికి బేడీ సగ భాగం వేలాడుతూ కనిపించింది. కొద్ది క్షణాల తర్వాత తోక భాగం పెద్దగా శబ్దం చేస్తూ నీళ్ళల్లోకి అడుక్కి మునిగిపోయింది. లోపల నించి నీళ్ళు పైకి చాలా బుడగలు వచ్చాయి. ఆ పోలీస్ విమానంతో పాటు మునిగిపోయినట్టున్నాడు. మళ్ళీ పైకి రాలేదు. ఎవరూ కూడా. ఓ గంటలో మేమంతా రక్షించబడి చికాగో హాస్పిటల్‌కు తీసుకెళ్ళబడ్డాం. పోలీస్ అతని ఖైదీతో సహా మిగిలిన అందరి శవాలని బయటకి తీశారు.
ఆ కుర్రాడు తను గూండా అవుతానని చెప్పడం మానేశాడు. ఈ ప్రయాణంలో అతనికి కొత్త రోల్ మోడల్ లభ్యమయ్యాడు. ఇప్పుడు అతను పోలీస్ అవాలనుకుంటున్నానని చెప్పసాగాడు. నాకు మాత్రం గుర్తున్నది. అతను ఆఖరిసారి ఊపిన కుడి చేతికి ఉన్న బేడీ. పోలీస్ తన ఖైదీ కుడి చేతికి బేడీ వేస్తాడు. అతను పోలీ సైతే ఆ చేతిని స్వేచ్ఛగా ఉంచుకోడా? అతనిది ఎడమ చేతివాటమైతే తప్ప అలా వేసుకోడు. ఆ యువకుడు పోలీస్ కాక ఖైదీ అయ్యే అవకాశం చాలా ఉంది. ఆ రౌడీలా కనిపించిన లావుపాటి వ్యక్తి పోలీస్ ఆఫీసరై ఉండాలి.
రావాలంటే అది నేను తేలిగ్గా కనుక్కోగలను. ఓ ఫోన్ కాల్ చేస్తే చాలు. కానీ నేనా ఫోన్ కాల్ చేయలేదు. ఎప్పటికీ చేయను కూడా. నాకు తెలుసుకోవాలని లేదు.
(అల్ నుస్ బొమ్ కథకి స్వేచ్ఛానువాదం)

- మల్లాది వెంకట కృష్ణమూర్తి

303
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles