రేచర్ల పద్మనాయకుల మూలాలు,తొలితరం నాయకులు


Sun,January 7, 2018 01:38 AM

త్రిలింగ సామ్రాజ్య రాజధానియైన ఓరుగల్లు కులమత విభేదాలు, రాజకీయ వైషమ్యాలు, అంతఃకలహాలనే గాక మహమ్మదీయులనూ ఎదుర్కొని విరాజిల్లింది. ఆనాటి సామ్రాజ్యం కుల, మత, వర్గాలకు ప్రధాన కాలం అయినప్పటికీ కాకతీయ చక్రవర్తులు జాగ్రత్తగా ఆయా నాయకుల భుజ బల మేధా సంపత్తులను ఉపయోగించుకోవడంలో సఫలీకృతులయ్యారు. దేశాన్ని పరాధీనం కానీయకుండా సామ్రాజ్యాన్ని నిలుపడంలో కాకతీయులకు తోడు క్షత్రియులు, పద్మనాయకులు, బ్రాహ్మణులు, రెడ్లు ప్రధాన వర్గాలుగా నిలిచి జాతికి జీవన నాడులై దేశ సమగ్రతను కాపాడారు. కానీ ప్రతాపరుద్రుని తర్వాత ఆ మహా సామ్రాజ్యం అంతరించిపోయింది. అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. అంతఃకలహాలు చెలరేగాయి.ఈ నేపథ్యంలో మహమ్మదీయులను తరిమికొట్టి ఓరుగల్లుపై తిరిగి మన జెండా ఎగరేసిన ముసునూరి నాయకులకు, రాచకొండ కేంద్రంగా స్వతంత్ర పాలన చేస్తున్న రేచర్ల పద్మనాయకులకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పటి రాచకొండ పాలకుడైన రేచర్ల అనపోతా నాయకుడు తన సోదరులతో కలిసి ఓరుగల్లుపైకి దండెత్తాడు. క్రీ.శ. 1369లో భీమారం (నేటి హన్మకొండలో భాగం) వద్ద రేచర్ల పద్మనాయకులకు, ముసునూరి నాయకులకు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ముసునూరి నాయకుడు, ఓరుగల్లు పాలకుడు అయిన కాపయ నాయకుడు మరణించాడు. దీంతో ముసునూరి వంశం అంతరించిపోవడమే కాకుండా ఓరుగల్లు రేచర్ల పద్మనాయకుల వశమైంది. దీంతో రేచర్ల పద్మనాయకులు తెలంగాణకంతటికీ అధిపతులయ్యారు. ఇది ఒక చారిత్రక ఘట్టం. ఒక రాజ్యం మహా సామ్రాజ్యంగా ఎదిగే క్రమంలో ఇలాంటి ఘట్టాలెన్నింటినో దాటాలి. ఒకరి పతనం.. మరొకరికి విజయం. ఇది అలాంటి సందర్భమే. రాచకొండ ఇప్పుడు రాజ్యస్థాయి నుంచి సామ్రాజ్య స్థాయికి ఎదిగింది.ఇంతకీ ఎవరీ పద్మనాయకులు? వీరి మూలాలేమిటి? కాకతీయ మహా యుగాన కాకతీయ రుద్రదేవుడి కాలం నుంచి, అటు తర్వాత గణపతిదేవ చక్రవర్తి, సామ్రాజ్ఞి రుద్రమదేవి, ప్రతాపరుద్ర చక్రవర్తుల కాలాల్లోనూ అనేకానేక బాధ్యతాయుత పదవులను అలంకరించిన వారిలో పద్మనాయకులూ ముఖ్యులు అని చరిత్ర చెబుతున్నది. కాకతీయ రాజ్య ప్రారంభానికి పూర్వం నుండే పద్మనాయకులు విఖ్యాత శౌర్యవంతులై ప్రఖ్యాతిగాంచినట్లు చారిత్రకాధారాలు స్పష్టంగా ఉన్నాయని, కాకతి రాజ్య స్థాపనాచార్యులుగా, సేనానులుగా, సామంతులుగా, కవి, పండిత, కళాపోషకులుగా కీర్తినార్జించారు అని పద్మనాయక చరిత్ర గ్రంథంలో కోటగిరి వెంకట నరసింహ సత్యనారాయణరావు రాశారు. వీరిని రేచర్ల వెలమలు అంటారు. ఈ అంశపు మూల పురుషుడైన రేచడి పేరు మీదుగా వీరు రేచర్ల వారయ్యారు. రేచడినే బేతళ నాయుడు అని కూడా అంటారు.
PillalaMarriTemple

రాచకొండ చరిత్రము పుస్తకంలో తేరాల సత్యనారాయణ శర్మ బేతళ నాయుడికి సంబంధించిన ఒక కథను రాశారు. పద్మనాయకులకు మూలపురుషుడైన బేతళ నాయుడు అమనగంటి పురాన్ని పాలించే వాడు. రేచడు ఇతని సేవకుడు. రేచడు ఒకసారి పొలం దున్నుతుండగా రాయి తగిలి నాగలి పగిలిపోగా, అచ్చట నిధి ఒకటి గానవచ్చెను. ఆ నిధిని వారు వెలికిదీయుటకు ప్రయత్నించగా నరబలి ఇస్తేనే అది లభిస్తుందని ఆకాశవాణి వినిపించింది. తక్షణమే సేవకుడైన రేచడు అందుకు అంగీరించి తన ప్రాణాలర్పించాడు. ఆ త్యాగానికి గుర్తుగా అతని వారసులు రేచర్ల వారు కీర్తింపబడ్డారు - ఇదీ ఆ కథ. సామాన్యంగా పరాక్రమ శూరులైన వారి విషయంలో ఇలాంటి కథలెన్నో ప్రచారంలో ఉంటాయి. అంతేగానీ, దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఒక పుక్కిటి పురాణమే అని కూడా తేరాల రాశారు. ఇలాంటి కథే స్థానికంగా జనబాహుళ్యంలో కూడా ఉన్నది. రేచడు గణపతిదేవుడి కొలువులో ఉండేవాడు. గణపతిదేవుడి సుస్థిర సామ్రాజ్య విస్తరణ కోసం ఒక నిధిని కట్టబెట్టే క్రమంలో ప్రాణత్యాగం చేశాడనేది ఆ కథ. రెండు కథలూ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. కాకతీయుల పరుసవేదికి సంబంధించిన కథలు కూడా మనం గతంలో చదువుకున్నాం. అవన్నీ జనబాహుళ్యంలో ఉన్న కథలే తప్ప చారిత్రక ఆధారాలు ఉన్నవి మాత్రం కాదు. బేతళ నాయుడి జన్మస్థలం అమనగల్లు (నల్లగొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర). ఆ కాలంలో రేచర్ల వెలమలు కాకతీయుల సామంతులుగా అమనగల్లు, పిల్లలమర్రిని పరిపాలించేవారు.

పద్మనాయకుల తొలితరం

కాకతీయుల సామంతుల్లో రేచర్ల నాయకులైన పద్మనాయకులు రుద్రమదేవునికి సేనానులుగా ఉండి అతనికి ఎంతో సాయం చేసినట్లు నిదర్శనాలున్నాయని, ఈ వంశంలోని తొలి నాయకులు రుద్రమదేవి, ప్రతాపరుద్రుల దగ్గర పనిచేశారని వెలుగోటి వారి వంశావళి అనే తెలుగు గ్రంథం పేర్కొంటున్నది. దీని ప్రకారం రేచర్ల పద్మనాయకుల మూల పురుషుడు బేతళ నాయకునికి దామా నాయుడు, ప్రసాదిత్యనాయుడు, రుద్రానాయుడు (రుద్ర నాయకుడు) అనే ముగ్గురు కుమారులున్నారు. రుద్ర నాయకుడి కుమారుడైన బిచ్చి (దాచా) నాయకుడు విసునూరు ప్రాంతాన్ని నాయంకర హోదాలో పాలించాడని, అతనికి కాకతి రాజ్య స్థాపనాచార్య బిరుదు ఉందని విసునూరులో వెలుగుచూసిన, ప్రచురితం కాని క్రీ.శ. 1280 నాటి శాసనం పేర్కొంటున్నదని కాకతీయులు గ్రంథంలో పి.వి. పరబ్రహ్మశాస్త్రి రాశారు. ఈ గ్రామంలో ఇప్పుడు కూడా అత్యధికులు వెలమ కులస్తులే కావడాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆ శాసనంలో ఉన్న రుద్ర నాయకుడు ప్రసాదిత్యుని తమ్ముడై ఉండవచ్చని శాస్త్రి భావించారు.
PillalaMarriTemple1

రేచర్ల రుద్రుడు

బేతళ నాయకుని కుమారుడైన రేచర్ల రుద్రుడు కాకతీయ గణపతిదేవుని పరిపాలనా ప్రారంభ రోజుల్లో రాజ్య సిరిసంపదలను, వైభోగాన్ని తిరిగి స్థాపించడంలో ప్రధానపాత్ర పోషించాడు. కాకతీయ రాజు రుద్రదేవుడు, అతని సోదరుడు మహాదేవుడు యాదవ రాజులతో జరిగిన యుద్ధంలో మరణించారు. కాకతీయ వారసుడయిన గణపతిదేవుడిని యాదవ రాజు జైతుగి దేవగిరిలో బంధించాడు. ఈ సమయంలో రాజ్యాన్ని రక్షించడంలో రేచర్ల రుద్రుడు కీలక పాత్ర పోషించాడు. యాదవరాజు నుంచి గణపతిదేవుడిని విడిపించడంలో విజయం సాధించాడు. ఇందుకుగాను రేచర్ల రుద్రుడు తర్వాత కాకతి రాజ్య సామ్రాజ్యధౌరేయ అనే బిరుదు అందుకున్నాడు. పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని నిర్మించింది ఈ రుద్రుడే.

రేచర్ల ప్రసాదిత్యుడు

బేతళ నాయకుని రెండో కుమారుడైన ప్రసాదాదిత్యుడు రుద్రమదేవిని కాకతీయ సింహాసనంపై కూర్చోబెట్టాడని, రుద్రమదేవి పట్టాభిషేకాన్ని వ్యతిరేకించిన వారందరినీ అణిచివేశాడనీ వెలుగోటి వారి వంశావళి చెబుతున్నది. ఇతనికి ఉన్న కాకతి రాజ్య స్థాపనాచర్య, రాయపిత మహాంక బిరుదులు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. కాకతీయ పాలనలో నాయంకర వ్యవస్థను ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఇతనికే దక్కుతుందని కూడా ఆ గ్రంథం పేర్కొంటున్నది.

వెన్నమ నాయుడు

దామానాయుడు, ప్రసాదిత్యుని కుమారుల్లో వెన్నమ నాయుడు, సబ్బి నాయుడు ప్రఖ్యాతులు. వెన్నమ నాయుడి వీరత్వం గురించి శాసనాలలో, వెలుగోటి వారి వంశావళిలో ప్రస్తావనలున్నాయి. ఉత్తరాదినంతా జయించిన తర్వాత తురుష్కుల కన్ను దక్షిణాదిపై పడింది. ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరిని జయించాడు. క్రీ.శ. 1303లో తొలిసారి తురుష్కులు ఓరుగల్లుపై దాడి చేశారు. ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు తన సేనాధిపతులను సిద్ధం చేశాడు. కాకతీయ సైన్యానికి వెన్నమ నాయుడు, పోతుగంటి మైలి నాయకత్వం వహించారు. మాలిక్ ఫక్రుద్దీన్ జునా, కర్రాకు చెందిన ఝాజూల నాయకత్వంలో మహమ్మదీయ సైన్యం వింధ్య పర్వతాలను దాటి కాకతీయ సామ్రాజ్య సరిహద్దుల దాకా రాగలిగింది. కానీ కాకతీయ సైన్యం తురుష్కుల సైన్యాన్ని ఉప్పరపల్లి వద్ద దెబ్బతీసింది. ఇక్కడ జరిగిన చండప్రఛండ యుద్ధంలో తురుష్కులు తోక ముడిచారు. తురుష్కుల తొలి దండయాత్రను తిప్పికొట్టడంలో సఫలీకృతమైనందుకు వెన్నమనాయుడు ప్రతాపరుద్రుని ప్రశంసలు అందుకున్నాడు.

ఎఱదాచ నాయడు, నలదాచ నాయుడు

వెన్నమ నాయునికి ఎఱదాచ నాయుడు, సబ్బి నాయునికి నలదాచ నాయుడు అనే కుమారులున్నారు. ఎఱదాచ నాయుడు శౌర్య పరాక్రమాలతో కాకతీయులకు సాధించిన కంచి విజయం గొప్పదిగా చరిత్రకారులు పేర్కొన్నారు. కాకతీయులు చేసిన సహాయాన్ని మరిచిన పాండ్యులు తిరిగి కంచిని ఆక్రమించుకున్నారు. వీరిని ఎదుర్కొనే బాధ్యతను ప్రతాపరుద్రుడు రేచర్ల ఎఱదాచ నాయునికి అప్పగించాడు. ఇతనికి తోడు ముప్పిడినాయకుడు, కొలని రుద్రదేవులు కూడా వెళ్లారు. క్రీ.శ. 1316లో జరిగిన ఈ యుద్ధంలో ఎఱదాచ నాయునితో పాటు అతని సోదరుడు నలదాచ నాయుడు, కుమారుడు ఒకటవ సింగమ నాయుడు కూడా పాల్గొన్నారు. ఎఱదాచ నాయుడు అసామాన్య సాహస పరాక్రమాలతో భీకరమైన పాండ్య గజదళాన్ని ఎదిరించి, పంచపాండ్యులైన వీర, విక్రమ, పరాక్రమ, సుందర, కులశేఖర పాండ్యులను జయించి కంచిని అవలీలగా సాధించాడు. ఇతడు చూపిన పరాక్రమ సాహసాలను ప్రతాపరుద్రుడు మెచ్చుకుని పంచపాండ్య దళవిఫాళ, పాండ్య గజకేసరి, కంచికవాట చూరకార అనే బిరుదులతో సత్కరించాడు.

1147
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles