రీల్ మీద వెలిగిన రియల్‌స్టార్ శ్రీహరి


Sat,March 23, 2019 10:34 PM

భైరవా కమ్ముకుంటున్న ఈ కారుచీకట్లు నిన్ను మింగేశాయని విర్ర వీగుతున్నాయిరా నువ్వు మండే సూర్యుడవని వాటికి తెలియదు. ఈ రోజు నీవు అస్తమించవచ్చు. కానీ, ఏదో ఒకరోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి ఈ చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్లీ పుడుతావురా.. మళ్లీ పుడుతావురా.. మగధీరలోని ఈ డైలాగ్ వినగానే గుర్తుకు వచ్చే నటుడు శ్రీహరి. పేదకుటుంబంలో పుట్టి కష్టపడి స్టంట్‌మాస్టర్‌గా సినిమా రంగప్రవేశం చేసి హీరోగా నిలదొక్కుకున్న నటుడాయన. అడిగిన వారికి లేదనకుండా సాయం చేసే గొప్ప మనసున్న ఆయన సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మరణించాడు. ఆయన మరణం ఇప్పటికీ అంతుపట్టని విషాదమే. అనారోగ్యమా? వైద్యుల నిర్లక్ష్యమా ? తెలియని రఘుముద్రి శ్రీహరి చివరిపేజీ.

-మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

హైదారాబాద్‌లోని బాలానగర్ పారిశ్రామికవాడ.. శోభన థియేటర్ ఎదురుగా చిన్న మెకానిక్ షెడ్డు..అక్కడే పనిచేస్తున్న ఒక నవయువకుడు..పనిచేస్తున్నాడు. కానీ, అతని కళ్లు థియేటర్ పైనే..రోజూ మారుతున్న పోస్టర్‌లు..ఏదో ఒకరోజు ఆ పోస్టర్‌లో తన బొమ్మ చూసుకోవాలి..రోజూ జిమ్ చేస్తూ శరీర ధారుడ్యాన్ని పెంచుకుంటూనే పోటీల్లో పాల్గొనేవాడు. అలా ఏడుసార్లు మిస్టర్ హైదరాబాద్ టైటిల్ విజేతగా నిలిచాడా యువకుడు. యూనివర్సిటీ స్థాయిలో రెండు సార్లు, జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొన్నాడు. ఏషియన్ గేమ్స్‌లో ఆడాలన్న కోరిక ఉన్నప్పటికీ అది తీరలేదు. ఎన్ని విజయాలు సాధించినా తన లక్ష్యం మాత్రం అది కాదు. ఎప్పటికైనా సినిమా నటుడు కావాలి. పోస్టర్‌లో తన ఫొటో చూసుకోవాలి. ఒకవైపు చదువుకుంటూనే తన సోదరుడు నిర్వహిస్తున్న మెకానిక్ షెడ్డూలో పనిచేయడం హబీగా పెట్టుకున్నాడు ఆ యువకుడు. నిజానికి శోభన థియేటర్‌లో మారే సినిమాల కోసమే అతను షెడ్డుకు వచ్చేవాడు. డిగ్రీ పూర్తయింది. స్సోర్ట్స్ కోటాలో పోలీస్ ఉద్యోగంతో పాటు, రైల్వేలోనూ ఉద్యోగం వచ్చింది. కానీ, తను సినిమా నటుడు కావాలి. అందుకే వచ్చిన అవకాశాల్ని వదులుకున్నాడు. నిజానికి పోలీస్ జాబ్ కూడా తన డ్రీమ్.. కానీ, దానికంటే ముఖ్యమైనది వెండితెర మీద కనిపించడం అందుకే వచ్చిన అవకాశాల్నీ వదులుకున్నాడు. ఆయన ఆరుబయట పడుకునేవాడట. ఆ సమయంలో తోకచుక్క రాలిన ప్రతీసారీ తను సినిమా నటుడు కావాలని కచ్చితంగా అనుకునేవాడట. చిత్రరంగంపై విపరీతమైన ఆసక్తితో ఉండే ఆయన ముందుగా ఫైటర్‌గా తెరంగేట్రం చేశారు. ఆయనే శ్రీహరి. తమిళ సినిమా మా ఫిళై చిత్రం ద్వారా నటుడిగా అరంగేట్రం చేశాడు. తెలుగులో బ్రహ్మనాయుడు ఆయన తొలి చిత్రం.
SRIHARI

అక్టోబర్ 8 ముంబైలోని ఒక చిన్న చిట్టడవి..రాంబో రాజ్‌కుమార్ షూటింగ్ సెట్టింగ్..షాహిద్‌కపూర్, సోనాక్షి సిన్హా తారాగణంప్రభుదేవా దర్శకుడు..తెలుగు సినిమా నటుడు శ్రీహరిని ప్రత్యేక పాత్రకోసం తీసుకున్నారు.అడవి ప్రాంతం కావడంతో విపరీతమైన దోమలు..శ్రీహరికి దోమ కాటుతో విపరీతమైన జ్వరం వచ్చింది. ఓపిక లేకపోయినప్పటికీ తన వల్ల నిర్మాత నష్టపోకూడదన్న దృష్టితో ఆయన షూటింగ్‌లో పాల్గొంటూనే ఉన్నారు. ఆయన జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని అసిస్టెంట్ గుర్తించి రెస్ట్ తీసుకుందామని చెప్పినప్పటికీ కమిట్‌మెంట్ విషయంలో రాజీ పడ ని ఆయన షూటింగ్ ముగిసేంత వరకు అక్కడి నుంచి కదలలేదు. షూటింగ్ ముగియగానే ఆయన గదికి వెళ్లిపోయారు. అయితే జ్వరం మరింత పెరిగి 102 డిగ్రీలకు చేరుకుంది. దీంతో వెంటనే ఆయన అసిస్టెంట్ లీలావతి ఆసుపత్రిలో చేర్చి ఈ విషయాన్ని శ్రీహరి భార్య శాంతికి ఫోన్ చేసి చెప్పారు.
నిజానికి శ్రీహరికి అంతకుముందే జాండీస్ వచ్చి అప్పుడప్పుడు తగ్గుతున్నాయి. మందులు వాడుతుండడంతో ఉప్పు, కారంలేని ఆహారం తీసుకోవడం, ఎక్కువగా పెరుగన్నం మాత్రమే తీంటున్నారు. షూటింగ్‌లు ఉన్న సమయంలో సరైన ఆహారం తీసుకోవడం లేదు. ఇది కూడా ఆయన ఆరోగ్యం క్షీణించడానికి ప్రధాన కారణం అంటారు. ముంబైకి షూటింగ్‌కు వెళ్లే సమయంలోనూ ఆయన తన ఫ్యామిలీ డాక్టర్‌కు చూపించుకుని వెళ్లారట.

అక్టోబర్ 9 ఉదయంముంబై విమానాశ్రయంహైదరాబాద్ నుంచి వచ్చిన విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది.ఎయిర్‌పోర్ట్‌లో దిగిన శాంతి నేరుగా లీలావతి ఆసుపత్రికి చేరుకొని శ్రీహరిని ఉంచిన గదికి వెళ్లింది.అప్పటికీ శ్రీహరి బాగానే ఉన్నారు. ఆయనకు స్లైన్ ఎక్కుతుంది. ఆయనను చూడగానే శాంతి ఏంటీ బావా! ఇది? అని ప్రశ్నించింది. ఏంలేదే జ్వరం అంటే ఇక్కడ చేర్చారు. ఏం ప్రాబ్లం లేదులే అన్నారు. సరే బావా మన మధ్యాహ్నం ైఫ్లెట్‌కు హైదరాబాద్‌కు వెళ్లిపోదాం. షూటింగ్ ఉంటే మళ్లీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పింది. సరేలేవే వెళ్దాం అని ఆయన అన్నారు. కొంతసేపటికి అసిస్టెంట్‌కు చెప్పి ఇడ్లీ తెప్పించుకొని తిన్నారు. శ్రీహరి తన కొడుకులతో ఫోన్‌లో సరదాగా మాట్లాడారు. చిన్న కొడుకు శశాంక్‌కు చాక్లెట్లు అంటే ఇష్టం. దాంతో తనకు వచ్చేప్పుడు చాక్లెట్లు తీసుకురమ్మని చెప్తే శ్రీహరి సరేనన్నారు. ఈలోపు ఒక నర్సు వచ్చి స్లైన్ బాటిల్‌లోకి ఇంజిక్షన్ చేశారు. అప్పటి వరకు బాగానే మాట్లాడిన ఆయన మాటలు తడబడుతూ ఉండడాన్ని శాంతి గమనించారు. ఆందోళనతో బావా.. బావా.. ఏమయ్యింది? అంటూ ఏడ్వడం మొదలుపెట్టింది. తల తిప్పినట్లవుతుందని, పడుకుంటానని అర్థమై అర్థం కాన ట్లు మాట్లాడుతుండడంతో మరింత ఆందోళన చెందిన ఆమె వెంటనే అరిచి డాక్టర్‌ని పిలిచింది. నర్స్ వచ్చి శాంతిని అక్కడి నుంచి బయటకు పంపించి వేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న శ్రీహరి సోదరుడు, శాంతి సోదరి ఆమెను ఓ దగ్గర కూర్చోబెట్టారు.

అప్పుడు సమయం మధ్యాహ్నం12.30 గంటలు


అసలు అక్కడ ఏం జరుగుతుందో శాంతికి ఏమాత్రం అర్థం కావడం లేదు. ఐసీయూలో ఉన్న శ్రీహరి వద్దకు ఎవరెవరో వస్తున్నారు, వెళ్తున్నారు. డాక్టర్లు పరుగెడుతున్నారు. శాంతి అనుమానంతో ఏమయ్యింది? అని అడిగింది. వారు ఏం లేదు. ట్రీట్‌మెంట్ జరుగుతుంది అని చెప్పారు. అనుమానంతో వారిని తోచుకుంటూ ముందుకు వెళ్లింది. అక్కడి దృశ్యాన్ని చూసిన శాంతి ఒక్కసారిగా బిగ్గరగా అరిచింది. శ్రీహరి నోరు, ముక్కు, చెవుల నుండి విపరీతంగా రక్తం కారుతూనే ఉంది. ఆయన పడుకున్న బెడ్ అంతా రక్తంతో తడిచిపోయింది. శాంతి ఏడుస్తుండడంతో ఆమెను కొంతమంది అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లారు. సాయంత్రం ఆరున్నర అవుతుందనగా డాక్టర్లు శ్రీహరి చనిపోయాడని చెప్పారు. ఆ విషయాన్ని శాంతికి చెప్పడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. కాలేయ సంబంధ వ్యాధితో శ్రీహరి మరణించాడని వైద్యులు ధృవీకరించారు. అయితే అప్పటికే తెలుగు టీవీ చానల్స్ కొన్ని శ్రీహరి గుండెపోటుతో ముంబైలో చనిపోయాడని, మరికొన్ని జాండీస్‌తో మరణించాడని స్క్రోలింగ్ ఇచ్చాయి. అయితే శ్రీహరి భార్య మాత్రం తన భర్తకు సరైన వైద్యం అందించకపోవడం, రాంగ్ ట్రీట్‌మెంట్ మూలంగానే మరణించారని ఆ తర్వాత పలు మీడియా ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.

ఒక్కసారి వెనక్కువెళితే...


కృష్ణాజిల్లా యలమర్రు గ్రామానికి చెందిన శ్రీహరి కుటుంబం 1977లో హైదరాబాద్ బాలానగర్‌కు వచ్చి స్థిరపడ్డారు. అప్పుడు హైదరాబాద్‌లో వస్తాదుల హవా నడుస్తున్న సమయం. దానితో శ్రీహరి కూడా శరీర దారుఢ్య క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని నేర్చుకున్నాడు. సినిమాల్లోకి స్టంట్‌మాస్టర్‌గా అడుగుపెట్టిన ఆయన కామె డీ విలన్‌గా, విలన్‌గా ఆ తరువాత హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు వారి సంతానం. అయితే కూ తురు అక్షర చిన్నతనంలోనే మరణించడంతో ఆమె పేరు తో అక్షర ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి మేడ్చల్‌లోని నాలు గు గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాల అభివృద్ధికి సాయపడ్డారు శ్రీహరి. ఆపదలో తన వద్దకు వచ్చే వారికి లేదనకుండా దానం చేసే గొప్ప గుణం ఆయనది. తెలంగాణ యాసకు అందులోనూ హైదరాబాదీ తెలుగుకు ఇండస్ట్రీలో గౌరవం తీసుకువచ్చిన నటుడు శ్రీహరి.
SRIHARI1

-ఆరోగ్యం, జిమ్ పట్ల ఆసక్తి చూపే శ్రీహరి ఇంట్లోనే జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఖాళీగా ఉంటే ఎక్కువ సమయం జిమ్‌లోనే గడిపేవారు. శరీరం కోసం విపరీతంగా కష్టపడేవారని, రాత్రిళ్లు కూడా జిమ్ చేసేవారని ఆయన గురించి తెలిసినవారు చెబుతుంటారు. అయితే కొంత వయస్సు వచ్చాక జిమ్ విషయంలో ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని, దానివల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారని చెబుతుంటారు.
-ఇక రెండవది.. శ్రీహరి సినిమా రంగంలోకి రాకముందునుంచే నుంచే ఆయనకు స్నేహితులు ఎక్కువ. దీంతో షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నేహితులలో కలసి ఎక్కువగా మద్యం సేవించేవారని, దానికి తోడు గుట్కా నమలడం కూడా చేసేవారని చెబుతారు. దానివల్లే ఆయన కాలేయం దెబ్బతిని, జాండీస్‌కు దారితీసిందని మరికొందరు అంటారు. ఒక్కోసారి తెల్లవార్లు మద్యం సేవిస్తూనే ఉండేవారని, సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఆయన అనారోగ్యానికి కారణమని అంటారు.
-ఏది ఏమైనా ఆయన సినిమా రంగంలో ఉంటూనే రాజకీయాల్లోనూ ప్రయత్నించారు. ఒక ప్రముఖ పార్టీ నుండి కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ వారు ఇవ్వలేదు. అయితే ఆ తర్వాత ఒక జాతీయ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలోనే ఆయన మరణించడం అటు సినిమా రంగానికి, ఇటు అనేకమంది అభిమానులకు తీరని నష్టం.

784
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles