రాళ్లు పుట్టి పెరుగుతున్నాయి!


Sun,March 17, 2019 01:19 AM

Moerak-Beach
అందమైన బీచ్.. చూస్త్తూ ఉండిపోవాలనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం. చూడడానికి వింతగా కనిపించే రాళ్లు. అవును.. అక్కడ రాళ్లు విచిత్రంగా కనిపిస్తాయి. వీటిని చూడడానికి విదేశాల నుంచి పర్యాటకులు క్యూ కడతారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సముద్రపు అలలు ఎగిసిపడుతుంటే.. వాటిని చూస్తూ ఇసుక తిన్నెల్లో ఆడుకోవడం మనస్సుకు చెప్పలేనంత ఆనందం. బీచ్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేవి అలలు, ఇసుక తిన్నెలు. కానీ, న్యూజిలాండ్‌లోని మోరీకీ బీచ్‌లో మరో విషయం పర్యాటకులను కనివిందు చేస్తున్నది. అవి ఇసుకలో కనిపించే కొన్ని రాళ్లు. వాటిని చూస్తే పెద్ద బంతులేమైనా దొర్లుతున్నాయా అనే భ్రాంతి మనలో కలుగుతుంది. కానీ, ఇవి సాధారణంగా కనిపించే రాళ్లు కాదు. బీచ్‌లో 19 కిలోమీటర్ల మేర ఇలాంటి విచిత్రమైన రాళ్లు కనిపిస్తాయి. వీటి వెనుక ఓ శాస్త్రీయ కోణం ఉంది. ఇక్కడ రాళ్లు కొద్ది కొద్దిగా పెరుగుతాయట.
Moerak-Beach1
ఈ రాళ్లు గుండ్రంగా కాకుండా దీర్ఘవృత్తాకారంగా కనిపిస్తాయి. ఇవి పది మీటర్ల వ్యాసార్ధం వరకూ ఉంటాయి. పెద్ద రాళ్లు దాదాపు ఏడు టన్నుల బరువున్నవి ఈ బీచ్‌లో ఉన్నాయి. 40 లక్షల యేండ్ల నుంచి ఇది ఎదుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇవి ఎలా ఏర్పడుతున్నాయి? అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అవి సముద్రంలో ఉండే బురద, ఇసుకతో ఏర్పడ్డ రాళ్లుగా పరిశోధకుల తేల్చారు. వీటిలో కార్బెట్, ఇనుము, మెగ్నీషియం, కార్బన్ లాంటి ఖనిజాలు ఉంటాయి. అందువల్ల ఈ రాళ్లు గుండ్రంగా గట్టిగా ఏర్పడడంతో సిమెంటులా ఉపయోగపడుతాయి. అలల తాకిడికి భూమిపై ఒత్తిడి పెరిగి, బురద మట్టి పైకి పొంగి మేట వేయడంతో ఇవి రాళ్లుగా ఏర్పడుతాయి. వీటిలో మరేదో మిస్టరీ దాగి ఉందని పరిశోధకుల అనుమానం. దాన్ని నివృత్తి చేసుకునే దిశగా మరింత పరిశోధనలు సాగిస్తున్నారు. ఇప్పుడు మోరీకి ప్రాంతం సైంటిఫిక్ రిజర్వ్‌గా మారింది.
Moerak-Beach2
ఈ అందమైన రాళ్ల దగ్గర టూరిస్టులు, ఫొటోగ్రాఫర్లు నిత్యం సందడి చేస్తుంటారు. అయితే కొందరు ఆకతాయిలు వీటిల్లో కొన్ని రాళ్లను ధ్వంసం చేశారు. అయినా ఇవి అందంగానే కనిస్తున్నాయి. మోరీకి ఒక చిన్న మత్స్యకార గ్రామం. ఇది యూరోపియన్ల పాలనలో తిమింగళాల ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వచ్ఛమైన, రుచికరమైన సముద్రపు ఆహారం దొరుకుతుంది. స్థానికంగా ఉండే రెస్టారెంట్లు పర్యాటకులకు మంచి విడిది, భోజనాన్ని అందిస్తాయి. ఈ బీచ్‌లో డాల్ఫిన్లు, సీల్స్, ఓర్కా వంటి సముద్ర జంతువులు సందడి చేస్తుంటాయి. ఇక్కడ లక్షల యేండ్ల నుంచి రాళ్లపై చిత్ర విచిత్రమైన ఆకారాలు చూడముచ్చటగా ఉంటాయి. వేసవి వచ్చిందంటే చాలు ఇక్కడ పర్యాటకుల కోలాహలం కనిపిస్తూనే ఉంటుంది. పిక్నిక్ స్పాట్‌గా ఈ ప్రాంతం స్థానికంగా ప్రసిద్ధి. ఈ బీచ్‌లో 100 మీటర్ల వరకూ సురక్షిత ప్రాంతం ఉంది. అందులో ఈత కూడా కొట్టొచ్చు. ఇక్కడ కనిపించే చిన్న రాళ్లు కూడా దీర్ఘ వృత్తాకారంలోనే ఉంటాయి. అలా.. చిన్న రాళ్లు మొదలుకొని.. పెద్ద రాళ్ల వరకూ అన్నీ గుండ్రంగా కనిపిస్తాయి. చిన్న రాళ్లను తాబేలు గుడ్లుగా స్థానికులు అభివర్ణిస్తారు. ఈ రాళ్లకు పురాణ గాథలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వీటిని ఈల్ కుండలు అని అంటుంటారు. పగిలిన రాళ్లను సెప్టారియా అని పిలుస్తారు. ఇవి లోపల గోధుమ, బూడిద, పసుపు రంగులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా న్యూజిలాండ్ వెళితే.. ఇంత చూడముచ్చటగా ఉన్న ఈ రాళ్లను చూడడం మర్చిపోవద్దు.

- డప్పు రవి, సెల్: 9951243487

370
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles