రామ - లవకుశుల యుద్ధభూమి-వల్మిడి!


Sun,August 13, 2017 04:39 AM

villagestoryచరిత్రను రాసినవాళ్లు.. తిరగ రాసినవాళ్లు.. సకల జనానికీ ఆరాధ్యులైన వారెందరికో జన్మనిచ్చింది తెలంగాణ. అలాంటివారిలో వాల్మీకి ఒకరు. రామాయణం అంటే గుర్తొచ్చేది ఆయనే. చాలామందికి తెలియని విషయమేమిటంటే వాల్మీకి తెలంగాణ మట్టి పరిమళమే అని. రాసే అవకాశం లేక.. మోసే మాధ్యమం లేక వాల్మీకి మనవాడనే విషయం గట్టిగా చెప్పుకునే అవకాశం ఇన్నాళ్లూ మనకు లేకుండే. కర్నాటక వాళ్లు వాల్మీకి మావాడే అంటారు. ఆంధ్రులు మా వాడే అంటారు. వక్రీకరించి ఎవరు ఎలా చెప్పినా వాల్మీకి మాత్రం తెలంగాణవాడే. రామాయణం రాసిన ఆయన స్మారక ప్రాంతమే నేటి వల్మిడి అని మా గ్రామస్తులు నమ్ముతున్నారు.


గ్రామ స్వరూపం
ఊరు : వల్మిడి
మండలం : పాలకుర్తి
జిల్లా : జనగామ
జనాభా : 2752
పురుషులు:1387
స్త్రీలు :1365
ఇండ్లు : 679

సరిహద్దులు
తూర్పు : ముత్తారం
పడమర : తీగారం
ఉత్తరం : పాలకుర్తి
దక్షిణం : మంచుప్పుల


ఎక్కడ ఉంది? : జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో వల్మిడి ఉన్నది. జిల్లా కేంద్రానికి సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
పేరెలా వచ్చింది? : వాల్మీకి మహాముని బోయవాడు. దొంగ. మహా తెలివైనవాడు. వాల్మీకి మేథావితనాన్ని చూసి మారువేషంలో వచ్చిన విష్ణుమూర్తి అతనికి హితోపదేశం చేశాడట. నాటి నుంచి వాల్మీకి కఠోర తపస్సు ఆచరిస్తాడు. వాల్మీకం అంటే పుట్ట. ఆ పుట్టలో నుంచి పుట్టిన వాడే వాల్మీకి మహారుషి. వాల్మీకి మహాముని పుట్టిన గ్రామం కాబట్టి ఆయన పేరుమీద వాల్మీకిపురం ఏర్పడింది. క్రమంగా వాల్మీకిపురం వల్మిడిగా మారింది.

ప్రత్యేకతలు : వల్మిడికి దక్షిణ అయోధ్య అనే కీర్తి ఉన్నది. రామాయణంతో విడదీయరాని సంబంధం ఉన్న గ్రామం ఇది. ఊర్లో రెండు గుట్టలుంటాయి. ఒకటి మునుల గుట్ట. ఇంకోటి రాముని గుట్ట. రామునిగుట్టపై ఉన్న కొలనులో ఎప్పుడూ నీళ్లుంటాయి. భద్రాచలంలో సీతారామ కల్యాణం జరిగితే వల్మిడి ఆలయంలోని బియ్యం పసుపు రంగులోకి వస్తాయట.

చారిత్రక నేపథ్యం : సీతను రాముడు అడవులకు పంపడం, అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఆమె లవకుశులకు జన్మనివ్వడం, తర్వాత అశ్వమేధయాగం సమయంలో రామలక్ష్మణులతో లవకుశులు యుద్ధం చేయడం ఉత్తర రామాయణంలోని ముఖ్య ఘట్టాలు.
గర్భవతైన సీతమ్మను రాముడి ఆజ్ఞ మేరకు అడవుల్లో వదులుతాడు లక్ష్మణుడు. తర్వాత ఆమె వాల్మీకి ముని ఆశ్రమానికి చేరుతుంది. సీతమ్మను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు వాల్మీకి మహర్షి. ఆశ్రమంలో లవకుశులకు జన్మనిస్తుంది సీత. లవకుశులు అక్కడే పెరుగుతూ సకల విద్యలనూ అభ్యసిస్తారు. తర్వాత రాముడు అశ్వమేథ యాగం చేస్తాడు. అప్పుడు వదిలిన గుర్రాన్ని లవకుశులు కట్టేయడంతో రాముడు.. లవకుశులకూ యుద్ధం జరుగుతుంది. ఇదంతా వాల్మీకిపురమనే వల్మిడిలో జరిగిందని.. వాటికి చారిత్రక ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయని గ్రామస్థులు చెప్తున్నారు.


వాల్మీకి గుహ : ఇక్కడ కొండమీద వాల్మీకి మహాముని తపస్సు చేసుకునేవాడట. శ్రీరాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు సీతను తీసుకెళ్లి అడవుల్లో వదిలేస్తాడు. ఊహించని ఈ చర్యకు తీవ్ర మనస్థాపం చెందిన సీత శోకం పెట్టి ఏడుస్తూ వల్మిడిలో కుప్పకూలి పోయిందని ఇక్కడివాళ్లు అంటున్నారు. ముని బాలకుల ద్వారా సీత గురించి సమాచారం తెలుసుకున్న ఈ గ్రామానికి చెందిన వాల్మీకి ఆమెను చేరదీస్తాడు. విష్ణోపదేశంతో తపస్సు చేసుకుంటున్న తన ఆశ్రమానికి తీసుకెళ్లి ఓదారుస్తాడు. నీవు జనకుని కూతురవు. రాముని ఇల్లాలివి. నీవు అతి పవిత్రురాలివి. నేను నా తపస్ శక్తితో సర్వం గ్రహించాను. నీవు ఇక్కడ నిశ్చింతగా ఉండు. ఆశ్రమంలో మునిసతులందరూ నిన్ను కూతురు వలె చూసుకుంటారు అని ఓదారుస్తాడట. వల్మిడి గుట్టపైనున్న ఈ ఆశ్రమంలోని వారంతా సీతకు ఎలాంటి కష్టం కలుగకుండా చూసుకుంటారట.

కాకతీయుల సామంత రాజ్యం : వల్మిడిని కాకతీయ సామంతరాజు వీరమల్ల సోమనాథుడు పాలించినట్లు ఆధారాలున్నాయి. వారి హయాంలోనే వల్మిడిలో చాలా ఆలయాలు, కట్టడాలు చేపట్టారని గ్రామస్థులు అంటున్నారు. కాకతీయుల కాలంలోనే ఇక్కడ శ్రీరామ కల్యాణం ఘనంగా జరిగేదట. పాంచారాత్ర ఆగమ సిద్ధాంతానుసారం చైత్రశుద్ధ పంచమి నుంచి చైత్ర శుద్ధ పౌర్ణమి ఆ కాలం నుంచే ఇక్కడ శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయట. వేలాది మంది భక్తులు ఈ కల్యాణంలో పాల్గొంటారు.

రామపాదం: దక్షిణ అయోధ్యగా; రెండో భద్రాద్రిగా వల్మిడి పేరు గడించింది. లవకుశులు అశ్వాన్ని బంధించి లక్ష్మణుడిని తరిమికొట్టారన్న విషయం తెలుసుకున్న రాముడు స్వయంగా ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టాడట. అప్పుడు రాముడు మోపిన పాదం గుర్తు ఇప్పటికీ ఉన్నదని గ్రామస్థులు అంటున్నారు. అయితే యుద్ధానికి ముందు వాల్మీకి ముని ఆశీర్వాదంతో లవకుశులు రామాయణ గానం నలుదిశలా వినిపించేందుకు బయలుదేరుతారు. అప్పుడు రాముడు మీరెవరు? మీరు పాడిన కావ్యమేంటి? అని ప్రశ్నించగా మా గురువు వాల్మీకి మహారుషి. ఆయన ఇప్పుడు వల్మిడిలోని మా ఆశ్రమంలో ఉన్నారు. అని చెప్తారట. అలా యుద్ధానంతరం రాముడీ ప్రాంతంలో కొంతకాలం ఉన్నాడని ప్రచారంలో ఉన్నది.

భద్రాద్రిలా తీర్చిదిద్దాలి: సీఎం కేసీఆర్ వల్మిడిని మరో భద్రాద్రిగా తీర్చిదిద్దాలి. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా భద్రాచలంలో తలంబ్రాలు పడితే వల్మిడిలో పచ్చ బడతాయని మా తాతల నుంచి అంటుంటారు. వల్మిడి అధికారికంగా ఆలయ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇటీవల సీఎం కేసీఆర్ పాలకుర్తి పర్యటనలో భాగంగా టూరిజం ఫ్యాకేజీ కింద రూ.5కోట్లు మంజూరు చేశారు. చాలా సంతోషం. వల్మిడి టూరిజం కేంద్రంగా వెలుగొందుతుందనే నమ్మకం కుదిరింది.
ఆంజనేయులు రాపర్తి

గొప్ప చరిత్ర: వల్మిడి గ్రామానికి గొప్ప చరిత్ర ఉన్నది. నాడు రామాయణంతో సంబంధమున్న గ్రామం అని చెప్పుకోవడానికి మేం గర్వపడుతున్నాం. కాకతీయులు కూడా వల్మిడిని అద్భుతంగా తీర్చిదిద్దారు. చారిత్రక ఆనవాళ్లను భద్రపరుచుకుని రేపటి తరానికి అందివ్వడం మన బాధ్యత. కాబట్టి పర్యాటకంగా వల్మిడిని అభివృద్ధి చేయాలి. ఎమ్మెల్యే చొరవ తీసుకుని పనిచేస్తున్నారు. అందరి సహకారంతో ప్రతీ యేటా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాం.
కత్తి సైదులు

కమ్మగాని రమేశ్, 9441334214

6390
Tags

More News

VIRAL NEWS