రాజారావు తాత్విక యాత్ర


Sun,December 27, 2015 01:39 AM

satyam-book


తత్వశాస్ర్తాన్ని అధ్యయనం చేసి వాటిని ఆచరణలో ఇముడ్చుకొని కవిత్వం, వచనం రాస్తున్న అరుదైన సృజనశీలి మునిమడుగుల రాజారావు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణానికి చెందిన రాజారావు కవిగా కూడా ప్రసిద్ధులు. ఇదివరకే రెండు కవితా సంపుటాలు ప్రచురించారు. గత కొన్నేళ్ళుగా తన తాత్విక భావనల్ని వ్యాసాలుగానూ రాస్తున్నరు. వాటన్నింటినీ సత్యం వైపు పయనం పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు.

అందులో మనిషి అస్తిత్వానికి సంబంధించిన అంశాల్ని చర్చకు పెట్టారు రచయిత. భయం, నమ్మకం, ఉనికి, బాధ వంటి జీవిత పార్శాలలోని పలు కోణాల్ని తాత్విక దృష్టితో పరిశీలించి వాఖ్యానించారు. జీవితమంటే ఏమిటి? సత్యమంటే ఏమిటి? వంటి అంశాల మూలాల్లోకి వెళ్ళి తర్కం చేశారు. సత్యాన్వేషణలో ఆయన చేసిన తాత్విక సూత్రీకరణలు అందరికీ ఆమోదనీయం కాకపోవచ్చు కూడా. కానీ, అవి మన అంతరాల్లోకి ఒకసారి తొంగి చూసుకొని మనల్ని మనం సరిచూసుకునే అవకాశం కల్పిస్తాయి. మనలో గూడు కట్టుకున్న మానసిక భావాల్ని తట్టి లేపుతై. మనిషిలోని సంశయాలకు తాత్విక భూమిక ఉందా అనే ఆలోచనని రేకెత్తిస్తాయి రాజారావు వ్యాసాలు.

అట్లే, మనిషిని అనాదిగా పీడిస్తున్న భయం గురించి కూడా ఆయన తనదైన తాత్వికతతో విశ్లేషించారు. ఆలోచనలను తయారు చేసే అనేకానేక మానసికాంశాల్లో భయం ఒకటి. అది ఒక మానసిక భావన మాత్రమే. నిజం కాదని తాను నిర్ధారిస్తరు. అందుకు ఇట్లా చెబుతారు రచయిత. ఊహగానీ, కల్పన గానీ, ఆలోచనగానీ గతం పునాదుల్లోంచే మొలకెత్తేవి. అంచేత అవి మళ్ళీ గతాన్నే తలపోస్తవి. అందుకే, భయం తాలూకు మూలాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. భయాన్ని చేరదీసి దానిని సర్వ సమగ్రంగా చూడాలి. గమనించాలి, దర్శించాలి. అప్పుడు దానికదే (భయం) మెల్లమెల్లగా కరిగిపోతుంది. దాని చుట్టూ పేరుకొన్న గోడలన్నీ నిలువునా కూలిపోయి మనిషి మరింత సంతోషంగా జీవన మాధుర్యాన్ని ఆస్వాదించగలడని రాజరావు సూత్రీకరించారు.

జీవితాన్ని ఎలా సుసంపన్నం చేసుకోవచ్చో ఇందులో మనకు విశదీకస్తారు. అల్పాక్షరాల్లో అనంతమైన అర్థాన్ని చెప్పడంలో రాజారావు దిట్ట. సమస్యలన్నింటికీ మూలం మన ఆలోచన సరళినే అంటారు. ఆలోచనలు అంతా ఒక మనసు పెట్టె. అది గతంలో ఉత్పత్తి చేసిన తీయని జ్ఞాపకాల తేనె తుట్టె. మనసంటే అది అనేక అనుభవాల మూట అంటూనే ఆలోచనలకు సత్యం చిక్కదంటారు. ఆలోచన అంతం అయితే గానీ సత్యం అనుభవంలోకి రాదు అన్న సంగతిని మనకు ఎరుక పరుస్తారు. గాఢమైన తాత్విక చింతన, సత్యాన్వేషణలతో జీవిత సారాంశాన్ని పిండి చూపిస్తాడు.

అంతటితో ఆగకుండా మనిషి తన జీవనయానంలో అడుగడుగునా అంతర్వీక్షణ అవసరమని, తద్వారా జీవితంలో తడబాటు లేకుండా ఒడిదొడుకులను అధిగమించి ఉన్నత స్థితికి చేరే అవకాశం ఉంటుందనీ చెబుతారు. ముందుమాటలో గుడిపాటి చెప్పినట్లు మనిషి అస్తిత్వ పరివేదనను వినిపించే వ్యాసాల సంపుటిది. తాత్విక భావనల్ని సులభమైన శైలిలో వివరించడానికి ప్రయత్నించారు. రాజారావు తాత్విక భావనాధార పాఠకుల్ని ఆలోచనలకు పురిగొల్పుతుంది. మనిషి మానవీయంగా మసలుకొని సత్యం వైపు పయనించడానికి తోడ్పడుతుంది. అంతిమంగా ఆత్మదర్శనం కావాలనుకున్న వాళ్ళకు కరదీపిక ఈ పుస్తకం.
- పుట్ట అశోక్

సత్యం వైపు పయనం, రచన: మునిమాడుగుల రాజారావు, వెల: 60/-, ప్రతులకు: పాలపిట్ట బుక్స్, ఇం.నెం. 16-11-20/6/1/403, విజయసాయి రెసిడెన్సీ, సలీం నగర్, మలక్‌పేట్, హైదరాబాద్ - 500036 ఫోన్: 040-27678430

వెయ్యేండ్ల వీణవంక


వీరుల కరవాలంతో రాయబడిందే చరిత్ర అంటారు. అయితే, ఇప్పుడు మన చరిత్రను తిరగరాసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దేశ, రాష్ట్ర చరిత్రలు రాసే ఉన్నవి. ఇప్పుడు కావాల్సింది మన స్థానిక చరిత్రలను మనం రాసుకోవడమే. ఆ సోయితోనే ఆవాల బుచ్చిరెడ్డి వెయ్యేండ్ల వీణవంక పేరుతో పరిశోధనా గ్రంథాన్ని వెలువరించారు. స్థానికులకు తమ ప్రాంతాల పట్ల గౌరవాభిమానాలు పెంచటానికి స్థానిక చరిత్రలను రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్థానిక చరిత్రలు రాష్ట్ర, దేశ చరిత్రల్లో మిగిలిపోయిన ఖాళీలను కూడా పూరిస్తాయి. కాబటి,్ట స్థానిక చరిత్రలే నిజమైన చరిత్రలు కూడా. ఈ సత్యాన్ని గుర్తించిన బుచ్చిరెడ్డి తన కార్యాచరణను ఆ వైపుగా విస్తృతిని పెంచుకొని చారిత్రకాంశాలను వెలికితీశారు.
కాలం కొన్నిసార్లు మనతో అద్భుతాలు చేయిస్తుంది.

అప్పటి వరకు మనకు ఏ మాత్రం ప్రవేశం లేని పనులను కూడా ఎంతో అలవోకగా చేయిస్తుంది. సరిగ్గా బుచ్చిరెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. కరీంనగర్ జిల్లా వీణవంక తన స్వగ్రామం. తన మిత్రుడు బహుమతిగా ఇచ్చిన పుస్తకం ఆయనను కొత్త పరిశోధనల వైపు పురిగొల్పింది. విచిత్రమేమిటంటే ఆ పుస్తకాన్ని కొన్ని సంవత్సరాల వరకు చదవక పోవడం. ఒక దశలో పాత పుస్తకాలకు దానిని అమ్మేయాలనే తలంపు కూడా వచ్చిందంటారు రచయిత.

అనుకోకుండా తను పుస్తకాన్ని తెరవాల్సి రావడంతో వెయ్యేండ్ల చరిత్రకు ప్రాణప్రతిష్ట చేసినట్లయింది. అందులోని శనిగం శాసనంలో బెజువాంక అనే గ్రామం ఉండడాన్ని రచయిత గమనించారు. అది తన ఊరి పేరును పోలినట్లు అనుమానం రావడం అనూహ్య పరిణామం. తన అనుమానం నిజమైంది. దానిపై పరిశోధనలు చేశారు. ఫలితంగా వెయ్యేండ్ల పైగా ఘనమైన చరిత్రను తన పుట్టినూరు కలిగి ఉందని చాటిచెప్పారు.

వృత్తిరీత్యా వాస్తు శిల్పి అయిన బుచ్చిరెడ్డి చరిత్రకారుడి పాత్ర పోషించారు. నిజాల నిగ్గు తేల్చేందుకు ఎన్నో ఊర్లు తిరిగారు. ఎంతోమందిని కలిశారు. అలుపెరగని కృషి చేశారు. ఆ కృషి ఫలించింది. వీణవంక ఒకప్పటి బెజవెంక అనే నిర్ధారణ చేశారు. తాను ఒక వాస్తుశిల్పి అయుండి ఆ రంగంతోపాటు చరిత్ర పరిశోధనలోనూ ఆధారాలు సేకరిస్తున్న బుచ్చిరెడ్డి కృషి ప్రశంసనీయం. ఇలాంటి పుస్తకాలు భావి పరిశోధకులకు ఎంతో ఉపయోగకరం.

భగీరథ అక్షరాంజలి


కవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు, అయిన జి. భగీరథది ఓ విశిష్టమైన శైలి. తాను ఏ పనిచేసినా ఎంతో నిబద్ధతతో, నిరాడంబరంగా చేసుకుంటూ పోతారు. సాహిత్యంలో కూడా ఇదే ఒరవడితో దూసుకెళుతున్న ఆయన అక్షరాంజలి పేరుతో కవితల సంపుటి తెచ్చారు. ప్రకాశం జిల్లా నాగండ్ల గ్రామంలో జన్మించిన భగీరథ చిన్న వయసులోనే కలం పట్టి ఎన్నో రచనలు చేశారు. తన కలం నుంచి అనేక కవితలకు ప్రాణం పోశారు. ప్రకృతిని కవితా వస్తువుగా చేసుకొని తనలోని ప్రేమను ఉదాత్త హృదయ చైతన్యాన్ని కవితల్లో చక్కగా ఆవిష్కరింపజేశారు.

సృష్టిని హృదయ దృష్టితో వీక్షిస్తూ తన అంతరంగంలోని భావాలను ఎంతో ప్రేమపూర్వకంగా కవితలల్లిన తీరు మనల్ని మరో జగత్తులోకి తీసుకెళుతుంది. మౌనంగా, చిరునవ్వై, మధురోహలై, గాలిలో మిళతమై వంటి కవితలు ప్రకృతి పట్ల కవి హృదయ వేదనని పట్టిస్తాయి. ఇలా ఒకటని కాదు, భగీరథ అక్షరాంజలిలోని కవితలన్నీ హృదయాల్ని రంజింపజేసే శైలితో కవిత్వీరించినవే. ప్రతి కవితా హృదయ లోతులను తట్టిలేపే భావోద్వేగంతో రాసిందే. ఇందులో మొత్తం ముప్పై కవితలున్నాయి. ప్రతి కవిత పక్కన అందమైన వర్ణ చిత్రాలు ఉండటం అదనపు ఆకర్షణ. ముందుమాటలు డా॥ కె.వి.కృష్ణకుమారి, డా॥ ఉమాపతి వర్మ. మట్టి వాసనల్ని, పువ్వుల పరిమళాన్ని అద్దుకున్న ఈ కవితలు వేటికవే సాటి.
- అశోక్

వెయ్యేండ్ల వీణవంక, రచన: ఆవాల బుచ్చిరెడ్డి, వెల: 100/-, ప్రతులకు: ఆవాల బుచ్చిరెడ్డి, వాస్తుశిల్పి, స్మిత, ఇం.నెం. 16-11-511/డి/48, శాలివాహన నగర్, మూసారాంబాగ్, హైదరాబాద్ - 500036 సెల్: 9493207198

అక్షరాంజలి, రచన: జి.భగీరథ, వెల: 200/-, ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు

తనబ్బి


మా రమణ (డా॥కె.వి.రమణాచారి జీవితం, వ్యక్తిత్వంపై పలువురి సంస్పందనలు)- సంకలన కర్త: చీకోలు సుందరయ్య, అక్షరం ప్రచురణలు, వెల: 120/-, ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు.

ఒక విజేత (అబ్దుల్ కలామ్‌కు తెలుగువారి కవితా నివాళి)- సంపాదకులు: మాడభూషి సంపత్‌కుమార్, ప్రచురణ: పాలపిట్ట బుక్స్, వెల: 250/-, ప్రతులకు: ఇం.నెం: 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్. మలక్‌పేట, హైదరాబాద్ - 500036.

కాకతీయ మిషన్‌కు కవితాభిషేకం చెరువు శతకం - చిగురుమళ్ల శ్రీనివాస్, వెల: 20/-, ప్రతులకు: జాగ్వల్వ పబ్లికేషన్స్, భద్రాచలం, ఖమ్మం జిల్లా. మొబైల్: 7893229269

ఈ పుడమి కవిత్వం ఆగదు (జాన్ కీట్స్ కవితా వైభవం)- అనువాదం: నాగరాజు రామస్వామి, తిరురంగ ప్రచురణ, వెల: 140/-, ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు. మొబైల్: 91002 26904.

897
Tags

More News

VIRAL NEWS