యూనిసెఫ్ తొలి యువ బ్రాండ్ అంబాసిడర్‌గా హిమదాస్


Sun,December 2, 2018 03:15 AM

Hima-Das
2018 ఫిన్‌ల్యాండ్ టంపెరేలో జరిగిన వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించిన హిమదాస్ అందరికీ సుపరిచితమే. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి గోల్డ్ మెడల్ విజేతగా కోట్లాదిమంది భారతీయులు మదిలో చిరస్థాయిగా నిలిచింది హిమదాస్. ఇప్పుడామెకు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్)కి ఆమెను తొలి యువ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది.

- మధుకర్ వైద్యుల

ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా హిమదాస్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు మొదలు పెట్టిన తరువాత కేవలం 18 నెలలలోనే ఈ విజయం సాధించిందామె. ఈ బంగారు పతకం జూనియర్ విభాగంలో పొందినా సీనియర్, జూనియర్ విభాగాల్లో బంగారు పతకం పొందిన భారతీయ ఏకైక మహిళ హిమదాస్.

ప్రభుత్వ పాఠశాల నుంచి..

హిమదాస్ అస్సోంలోని నాగయోన్ జిల్లా ఢింగ్ గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో జన్మించింది. తండ్రి రొంజిత్ దాస్, తల్లి జొనాలి దాస్. కుటుంబంలోని నలుగురు పిల్లల్లో హిమదాస్ చివరిది. హిమదాస్ జనవరి 9, 2000లో జన్మించింది. చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ చూపించే హిమదాస్ ప్రపంచ ట్రాక్ ఈవెంట్ ప్రస్థానం అంచెలంచలుగా సాగింది. తండ్రిపడే కష్టం చూడలేక తండ్రితో పాటు పొలానికెళ్ళి పని చేస్తుండేది. హిమదాస్ ప్రభుత్వ పాఠశాల నుంచి తన ప్రస్థానం మొదలుపెట్టింది.

రన్నింగ్‌వైపు అడుగులు

హిమదాస్ మొదట్లో ఫుట్‌బాల్ ఆడేందుకు ఆసక్తి చూపింది. అప్పటి స్కూల్ కోచ్.. సాంసుల్ హోక్వ్ రన్నింగ్ పైకి ఆమె దృష్టి మార్చాడు. మొదటి నుంచి ఆటలను ఎంతగానో ఇష్టపడే హిమను చూసి ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహించేవారు. సాంసుల్ హోక్వ్ హిమదాస్‌ను నాగోన్ స్పోర్ట్స్ అసోసియేషన్‌కు చెందిన శంకర్ రోయ్‌కు పరిచయం చేశాడు. అప్పుడే రన్నింగ్‌లో తన ప్రతిభ చూపేందుకు ప్రయత్నం మొదలు పెట్టింది హిమదాస్.. చెప్పులు లేకుండా రాళ్ళ బాటలో అవలీలగా పరుగులు పెడుతుండేది. ఏ ఆట ఎంచుకున్న గుండెల నిండా ఆత్మైస్థెర్యం నింపుకున్న హిమదాస్‌కు రన్నింగ్‌లో పట్టు సాధించడానికి పెద్ద సమయం ఏమి పట్టలేదు.

సరైన తిండి లేకున్నా

చాలీచాలని తిండి ఉండే పేద కుటుంబంలో జన్మించిన హిమదాస్ క్రీడల్లో ఎవరితో పోటీ అయినా వెనుకంజ వేసేది కాదు. నిజానికి ఆమె అమ్మాయిలతో పోటి పడడం కంటే అబ్బాయిలతో పోటీ పడి గెలువడం అలవాటుగా మార్చుకుంది. గతంలోనూ అనేక పోటిల్లో ఆమె పాలుపంచుకుంది. అందులో భాగంగానే.. 100 మీటర్లు రన్నింగ్ రేస్.. 200 మీటర్ల రేస్‌లోనూ.. జిల్లా స్థాయిలో బంగారు పథకాలు సాధించింది. ఇక అక్కడ నుండి బంగారు పథకాలు సాధించే బంగారు తల్లిగా మారిపోయింది.

మారిన ట్రాక్

జిల్లాస్థాయిలో విజయాలు సాధిస్తున్న హిమదాస్ డైరెక్టరేట్ అఫ్ స్పొర్ట్స్ అండ్ యూత్ వెల్ఫెర్‌కు చెందిన అథ్లెటిక్ కోచ్ నిపోన్ దాస్ అనే మరో కోచ్ కళ్లల్లో పడింది. హిమదాస్‌ను ఆమె తల్లిదండ్రులను ఒప్పించి అస్సోం రాజధాని గౌహతికి తీసుకెళ్ళాడాయన. అక్కడ అద్దె ఇంట్లో ఉండి కొన్నాళ్ళు.. హస్టల్‌లో ఉండి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది. కేవలం నాసిరకం షూస్.. దుస్తులతో ఇంత విజయాన్ని సాధించిన దాస్‌ను మరింతగా ప్రోత్సహించి.. 200 నుంచి 400 మీటర్ల కేటగిరీకి మార్చాడు కోచ్. ప్రతిరోజు క్రమం తప్పకుండాపట్టుదలతో ప్రాక్టీస్ చేసేది. కామన్ వెల్త్ పోటీల్లోనూ సత్తా చాటి.. పతకం పొందకపోయినా ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఏడాదే.. గౌహతిలో జరిగిన అంతరాష్ట్ర చాంపియన్ షిప్‌లోనూ 400 మీటర్ల దూరాన్ని 51.13 సెకన్లలో చేరింది.

ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్‌లో..

ఫిన్‌ల్యాండ్‌లోని టంపెరెలో జూలై 2018న ట్రాక్ అండ్ ఫీల్ విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన 18 యేండ్ల హిమదాస్ తొలి స్వర్ణం సాధించిన భారతీయురాలిగా ఘనత సాధించింది. 400 మీటర్ల ఫైనల్లో 51.46 నిమిషాల్లో గమ్యం చేరి తొలిస్థానంతో బంగారు పతకం అందుకుంది. 4వ నెంబరు లైనులో పరుగుపెట్టిన హిమదాస్ రుమేనియాకు చెందిన ఆండ్రియా మిక్‌లోస్ కన్నా వెనుకపడింది. 50 నుంచి 100 మీటర్ల మధ్యలో ఆండ్రియాతో వెనుకబడిన హిమదాస్ ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని విజయం సాధించింది.

అరుదైన గౌరవం

2018 ఆసియా క్రీడల్లో మూడు పథకాలు సాధించిన స్ప్రింటర్ హిమదాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ నేషషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్) ఆమెను తొలి యువ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు యూనిసెఫ్ ప్రకటించింది. అయితే ఈ గౌరవం తనకు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని హిమదాస్ తెలిపింది. యూనిసెఫ్ ఇండియా యూత్ అంబాసిడర్‌గా నియమించడం నాకు ఎంతో గౌరవప్రదంగా ఉంది అని హిమదాస్ ట్వీట్ చేసింది.

కదిలించిన కన్నీళ్లు

మెడల్‌ను అందుకున్న సమయంలో హిమదాస్ భావోద్వేగానికి లోనైంది. మెడల్ సెర్మనీ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమదాస్ ఆనందభాష్పాలను రాల్చింది. జనగణమన వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది. మహేంద్ర గ్రూపు చైర్మన్ ఆనంద్ మహేంద్ర ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది మిమ్మల్ని కదిలించకపోతే, ఇక ఏదీ మిమ్మల్ని కదిలించలేదని ఆయన తన ట్యాగ్‌లైన్‌లో పేర్కొన్నారు.

106
Tags

More News

VIRAL NEWS