యువ సంగీత కెరటంహేమచంద్ర


Sun,August 13, 2017 04:26 AM

Singer-Hema-Chandra బాల్యంలోనే అమ్మ చేతిముద్దలతో పాటు సంగీతాన్ని ఓనమాలుగా నేర్చుకున్నాడు.

సాధన చేసి అటు సంగీతంలోనూ, ఇటు గాయకుడుగాను ఎదిగాడు.

సరిగమపతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.

తెలుగు చలన చిత్ర రంగంలో ఈయన పాడిన పాటలు ఎన్నో ప్రశంసలందుకున్నాయి.

బుల్లితెర మీద యాంకర్‌గాను, వెండితెర గాయకుడుగాను ఉరికే ఉత్సాహంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే యువతరంగమీయన. చిన్న వయస్సులోనే పాటల పూదోటలో గాయకుడిగా ఎదిగి ఎందరో యువ గాయకుల్లో స్ఫూర్తిని నింపిన సింగర్ హేమచంద్ర.

నిలువమని నన్ను అడుగ వలెనా నిలువకుండా పోతివే లలనా ఓర చూపుల చినదానా ఒకసారి రావే లలనా
నిలువవే వాలు కనులదానా, వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హొయలున్నదె జాణ, నువ్వు కులుకుతు, గలగల నడుస్తు వుంటే
నిలువదె నా మనసు ఓ లలనా.. అది నీకే తెలుసు

పాత ఇల్లరికం చిత్రంలోని ఈ పాటను లక్ష్యం సినిమాలో రీమిక్స్ సాంగ్‌గా ఉపయోగించుకున్నారు. ఈ పాటను హేమచంద్ర పాడాడు. ఈ పాట ఆయనకు మంచి గుర్తింపుతెచ్చింది. పరుగు చిత్రంలో ప్రేమ విఫలమవుతుందన్న బాధతో తన హృదయానికి అయిన గాయాన్ని ఓర్చుకోలేనంటూ బాధపడే కథానాయకుడి హృదయాన్ని పరిచిన పాట హేమచంద్రకు ఎంతో పేరు తెచ్చింది.

shravana-hema-chandra హృదయం ఓర్చుకోలేనిది గాయం
ఇకపై తలచుకోరానిది ఈ నిజం
పెదవులు విడిరాకా నిలువవే కడదాకా జీవంలో బతకవె ఒంటరిగా.

హేమచంద్ర పూర్తి పేరు వేదాల హేమచంద్ర. ఆయన 1988 జూన్ 2న హైదరాబాద్‌లో జన్మించాడు. తండ్రి వీ హెచ్ వెంకట రంగ రామనుజ స్వామి న్యాయవాది. తల్లి శశికళ లలిత. ఆమె గాయని. తన అమ్మ నుండే హేమచంద్రకు సంగీతం అబ్బింది. ఆ తర్వాత హైదరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశాలలో హిందుస్థానీ సంగీతంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో హైస్కూల్ విద్య పూర్తి చేసి ఆ తరువాత బాచిలర్స్ ఇన్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా పూర్తి చేశాడు. చిన్నతనం నుండే సంగీతంలో సాధన చేసిన హేమచంద్ర ఓ పక్క చదువుతూనే మరోవైపు పాటల పూదోటలో రాణించాడు. తొలిసారి బుల్లితెరలో ప్రసారమైన సరిగమప కార్యక్రమంలో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచి తెలుగు వారి కీర్తిని ఇనుమడింపజేశాడు. దీంతో ఆయనకు కోటి దర్శకత్వంలో ప్రేమంటే ఇంతే సినిమాలో పాడే అవకాశం వచ్చింది.
వలచిన ప్రేయసి పక్కనుంటే పగలు రాత్రి అనే తేడా ఉండదు. అసలు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నామనేది కూడా మరిచిపోతారు. పౌరుడు చిత్రంలో కథనాయకుని పరిస్థితి అంతే.

హేమచంద్ర కేవలం గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా రాణిస్తున్నాడు. ఆయన ఇప్పటికే పలు సినిమాలకు సంగీతం అందించారు. వాటిలో రైడ్, మా నాన్న చిరంజీవి, ఆల్ ది బెస్ట్ ముఖ్యమైనవి. ఇక స్నేహితుడు, అన్న చిత్రాల్లో విజయ్‌కి, ధృవలో అరవింద్ స్వామి, రెయిన్‌బోలో రాహుల్, ఓం నమో వెంకటేశాయలో సౌరభ్ రాజ్ జైన్, బిచ్చగాడు, బేతాళుడు, యమన్‌లలో విజయ్ అంటోనీకి డబ్బింగ్ కూడా చెప్పాడు.


నీ పక్కనుంటే పగలే వెన్నెల నేనెక్కడుంది గురుతే రాదెలా
నా నిదురను దోచావూ కల ఉవ్వాహు ఉవ్వాహు ఉవ్వా హు ఉవ్వాహు.

అందమైన అమ్మాయిని చూపించి ఎలా ఉందంటే కేక అంటుంటాం. కానీ హేమచంద్ర అమ్మాయి అందమే కేక అంటాడు దేనికైనా రెడీ చిత్రంలో.
పిల్లందం కేక కేక ఓళ్లంత కాక కాక
ఓ యు ఆల్ సో కేక గుండెల్లో కాక యు ఆల్ సో కేక కేక

ఇది రైల్ జర్నీలో సాగే పాటలా ఉంటుంది. హేమచంద్ర వాయిస్ ఈ పాటకు అద్భుతంగా సరిపోయింది.

ఐదు రోజుల పెళ్లి అమ్మన్ని పెళ్లి/ తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి
వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్ల్లి

వరుడు చిత్రంలో హేమచంద్ర పెళ్లిని వర్ణిస్తూ పాడిన పాట. నేడు ప్రతి తెలుగింటి పెళ్లిపందిళ్లలోనూ, పెళ్లి వీడియోల్లోనూ తప్పకుండా ఉండేపాట.
మరు మల్లెల వాన మృదువైన నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లో ముత్యాలె పోగేస్తున్నా

తారకవి ఎన్ని తలుకులో చాలవె రెండు కన్నులు
కురుస్తున్న వాన మల్లెలను తలపిస్తుంటే ఆ వానలో తన చెలి నవ్వితే రాలే ముత్యాలను ఏరుతున్నానంటాడు సోలో చిత్రంలో కథానాయకుడు. ఆ సన్నివేశం ప్రతిఫలించేలా హేమచంద్ర ఎంతో మధురంగా పాడాడు.
ఇటీవల తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో వచ్చిన ఫిదా సినిమాలోనూ పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఓసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు
వింతఖైదు నాకిలా ఏమిటోతో పాటు టైటిల్ సాంగ్
ఓ ఫిదా..
ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా
ఒక్కసారి తొంగి చూడవా?
అంటూ ఆయన పాడిన పాటలు బహుళ జనాదరణ పొందడంతో పాటు సినిమా విజయంలో కీలకమయ్యాయి.
ఇప్పటివరకు వందలాది పాటలు పాడిన హేమచంద్ర. భవిష్యత్తులో గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకునిగా కూడా మరింత కృషి చేస్తానంటున్నాడు. అవకాశం వస్తే తన టాలెంట్‌ను తప్పకుండా నిరూపించుకుంటానని హేమచంద్ర అంటున్నాడు. పాటల పయనంలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.

ప్రేమ వివాహం


గాయకుడిగా రాణిస్తున్న సమయంలోనే గాయని శ్రావణ భార్గవితో ప్రేమలో పడిన హేమచంద్ర పెద్దలను ఒప్పించి 2013 ఫిబ్రవరి 14న వివాహం చేసుకున్నాడు. 2016 జూలై 2న వీరికి ఒక పాప జన్మించింది.

పాటలన్నీ ఎక్స్‌ట్రార్డినరీ


హేమచంద్రకు చిన్న వయస్సులోనే గొప్ప గొప్ప సంగీత దర్శకులతో పనిచేస్తూ, పెద్ద సీనిమాల్లో పాడే అవకాశాలు వచ్చాయి. దీంతో ఆయన చిన్న వయస్సులోనే మంచి గాయకునిగా ఎదిగాడు. దాదాపు ఆయన పాడిన పాటలన్నీ ఎక్స్‌ట్రార్డినరీగా నిలిచాయంటే అతిశయోక్తికాదు.
కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో ఎక్స్‌ట్రార్డినరీ పాట హేమచంద్రకు మరింత గుర్తింపు తీసుకువచ్చింది.
నీ నగుమోమె ఎక్స్‌ట్రార్డినరీ.. దీని సిగదరగ ఎక్స్‌ట్రార్డినరీ
నీ నడుము పిడికడు ఎక్స్‌ట్రార్డినరీ నా మూతి విరుపుడు ఎక్స్‌ట్రార్డినరీ
అంటూ అమ్మాయి అందాన్ని వర్ణిస్తూ పాడాడాయన.
తనకంటే ఉన్నత స్థానంలో ఉన్న అమ్మాయిని ప్రేమిస్తే ఆ ప్రేమ విజయవంతం కాదని, ఏదైనా వింత జరిగితే తప్ప అది సాధ్యం కాదని రఘువరన్ బి.టెక్‌లో హేమచంద్ర అంటాడు.
తోట రాముడి వంటి సాధారణ వ్యక్తిని ఒక దేశపు యువరాణి ప్రేమిస్తే అతని ఆనందం ఎలా ఉంటుందో శక్తి సినిమాలో హేమచంద్ర తన గానంతో వివరించాడు.
ప్రేమదేశపు యువరాణీ పూతప్రాయం విరిబోణీ
ఏరికోరి మెచ్చావే ఈ తోట రాముడ్నీ.

బిల్లా సినిమాలో హేమచంద్ర పాడిన బొమ్మాళీ పాట ఆయన కెరీర్‌లో మంచి విజయవంతమైన పాటగా నిలిచింది.

ఏక్ నిరంజన్ చిత్రంలో గీతామాధురి హేమచంద్ర పాడిన మెలోడీ సాంగ్ ప్రేమికుల్ని నేటికీ గిలిగింతలు పెడుతున్నది.
గుండెల్లో గిటారు మోగించావే నాకేవేవో సిల్లీ థాట్స్‌నేర్పించావే అని అతనంటే
చూపుల్తో పటాసు పెల్చేసావే నీ మాటల్తో ఫుట్ టాసు వేసేసావే
అంటూ ఆమె అనుభవాలను పంచుకుంటుంది.
మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వత్తావా
నసాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇస్తావా
సీ పోరా రావద్దన్నా రయ్యా రయ్యా వత్తావా
పోపోరా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా
బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మాళీ.

మధుకర్ వైద్యుల

1541
Tags

More News

VIRAL NEWS