యాప్ యాప్ హుర్రే!


Sun,November 25, 2018 03:50 AM

appsపర్సనల్ కంప్యూటర్లదే భవిష్యత్ అంతా అనుకొని స్మార్ట్‌యాప్స్, మొబైల్ విప్లవాన్ని మేం పసిగట్టలేకపోయాం. అది మేం చేసిన తప్పు- ఈ మాటలన్నది ఎవ్వరో కాదు.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల. యాప్స్ మనిషి జీవితంలో ఇంతలా ఇమిడిపోతాయని అప్పుడు అంచనా వెయ్యలేకపోయారు. యాప్స్ రాకతో వెబ్‌సైట్లు బోసిపోతున్నాయి. కొన్నింటిని మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేసేది లేక చాలా వెబ్‌సైట్లు యాప్స్ రూపంలో తమ వినియోగదారుల ముందుకొస్తున్నాయి. అరచేతిలో ప్రపంచాన్ని శాసిస్తూ.. ఏ పనైనా క్షణాల్లో చక్కదిద్దుతూ.. మనిషి జీవితంలో ఒక భాగమైపోయిన మొబైల్ యాప్స్‌పై ఈవారం ముఖచిత్ర కథనం.

సంతోష్ కుమార్.. ఉదయం లేవగానే ఫిట్‌నెస్ కోసం జిమ్ ఎలా చెయ్యాలో యాప్‌లో చూసుకున్నాడు. ఫ్రెషప్ అయి.. ఓ యాప్‌లో బ్రేక్‌ఫాస్ట్ బుక్ చేసుకున్నాడు. తింటూనే న్యూస్ యాప్స్‌లో వార్తలు చదివాడు. కాసేపు సోషల్ మీడియాలో చాటింగ్, తర్వాత పేరెంట్స్‌తో వీడియోకాల్ మాట్లాడాడు. ఆఫీస్‌కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. కారులోనే ఈరోజు తన షెడ్యూల్ చెక్ చేసుకున్నాడు. మధ్యాహ్న భోజనాన్ని ఆర్డర్ చేశాడు. సాయంత్రం ఓ గంట విశ్రాంతి దొరికింది. ఆ సమయంలో ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్ ఓపెన్ చేసి స్పూఫ్ వీడియోలు చూసి నవ్వుకున్నాడు. తన ఫొటోలను అందంగా ట్రిమ్ చేసుకొని డీపీ, స్టేటస్ పెట్టుకున్నాడు. క్యాబ్‌లో రూమ్‌కి వస్తూ.. తన బ్యాంక్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు డబ్బులు పంపాడు. రూమ్‌కి వచ్చి రిలాక్స్ కోసం గేమ్స్ ఆడుకున్నాడు. పడుకునే ముందు ఫెస్టివల్‌కి కావాల్సిన షాపింగ్ అంతా ఫోన్‌లోనే చేసి, పడుకున్నాడు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ యాప్స్ ఇప్పుడొక భాగమైపోయాయి.

ఈ రోజుల్లో ప్రపచంలోని సగంమందికిపైగా జనాభా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. సగటున ఓ వ్యక్తి కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్‌ఫోన్, ఇతర పరికరాల ద్వారా దాదాపు 185 నిమిషాలకు పైగా ఇంటర్‌నెట్‌ను ఉపయోగిస్తున్నాడు. ఇది గత ఏడాది 200 నిమిషాలకు పైగా ఉన్నది. స్మార్ట్‌కాలం మొదలైన దగ్గర్నుంచి ప్రతియేటా యాప్స్ వినియోగం పెరుగుతూనే ఉంది. మరికొన్ని సంస్థలైతే ఏకంగా సర్వేలు నిర్వహించి, మనిషి స్మార్ట్ భవిష్యత్‌ను అంచనా వేస్తున్నాయి. తాజాగా యాప్స్ వినియోగంపై మోమాజిక్ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే.. ఈ ఏడాది 60 శాతం పెరిగిన యాప్స్ వినియోగం.. వచ్చే ఏడాదికి 90 శాతం పెరుగనున్నట్లు సర్వేలో తేలింది. తక్షణ అవసరాన్ని తీర్చే యాప్స్‌పైనే అందరూ మక్కువ చూపుతున్నారు. తన జీవనం సాఫీగా సాగేందుకు మనిషి ఎలాంటి యాప్స్‌ను వాడుతున్నాడు? వాటి ఉపయోగాలపై మీరూ ఓ లుక్కెయ్యండి. మీకోసం ఆయా కేటగిరీల్లో టాప్ 5 యాప్స్ అందిస్తున్నాం.
dailyhunt

న్యూస్ యాప్స్..

డైలీహంట్ : దీన్నే న్యూస్‌హంట్ అని కూడా పిలుస్తుంటారు. ఇది మన దేశంలో ప్రధాన వార్తా సంస్థలు, టీవీ చానెళ్ల నుంచి వార్తలను సేకరించి ప్రజలకు చేరవేస్తుంది. ఇది దేశంలోని పలు ప్రాంతీయ భాషలో వార్తలను అందిస్తున్నది. ఇందులో ప్రధానమైనవి లైవ్‌టీవీ, లైవ్ క్రికెట్/ఫుట్‌బాల్ కవరేజీ, లోకల్ న్యూస్ పేపర్ల వార్తలు. దీనిని 50,000,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

గూగుల్ న్యూస్ : ఈ యాప్ కూడా కొన్ని న్యూస్ ఏజెన్సీలు, ప్రధాన వార్తాసంస్థల వార్తలను తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు చేరవేస్తుంది. వీటితోపాటుగా గూగుల్‌కు సంబంధించిన పలు కొత్త విషయాలు, చర్చలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది వినియోగదారుల ఇష్టాల మేరకే వార్తలను అందిస్తుంది. ఇదో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. దీనిని 1,000,000,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

ఫస్ట్ పోస్ట్ : ఇందులో కూడా జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు తెలుసు కోవచ్చు. అన్ని కేటగిరీల వార్తలను, వీడియోలను అందిస్తుంది. లైవ్‌టీవీ, ఆఫ్‌లైన్ రీడింగ్, కస్టమ్ రీడింగ్ ముఖ్యమైనవి. దీనిని 500,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

బిజినెస్ ఇన్‌సైడర్: అంతర్జాతీయంగా జరుగుతున్న బిజినెస్‌పై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తుంటుంది ఈ యాప్. విశ్వసనీయమైన బిజినెస్ న్యూస్ ఇందులో దొరుకుతున్నాయి. వీటితో పాటుగా జాతీయ, అంతర్జాతీయంగా అన్ని రకాల వార్తలను అందిస్తున్నది. దీనిని 1,000,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

నమస్తే తెలంగాణ : తెలంగాణ ఉద్యమ గొంతుక నమస్తే తెలంగాణ పత్రిక. ఇది ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ అన్ని వర్గాల ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్నది. నమస్తే తెలంగాణ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలను చేరవేస్తూ.. లక్షకు పైగా ఇన్‌స్టాల్స్‌ను సొంతం చేసుకున్నది. ఈ యాప్‌లో తాజా అప్‌డేట్స్, వీడియో, ఆడియో స్ట్రీమ్, ఫొటో సదుపాయాలున్నాయి. ఈ యాప్ నుంచి వార్తలను మెయిల్స్, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు.
swiggy

ఫుడ్ యాప్స్..

స్విగ్గీ ః ఇది ఆండ్రాయిడ్, యాపిల్ వెర్షన్లలో అందుబాటులో ఉన్నది. ఈ యాప్ నిర్వాహకులు స్థానిక హోటళ్లు, రెస్టారెంట్లు, ఫేమస్ ఫుడ్ తయారీ దారులతో టై అప్ అయి ఉంటారు. దీని ద్వారా మనకు కావాల్సిన, నచ్చిన లోకల్‌ఫుడ్‌ను మనమే బుక్ చేసుకోవచ్చు. డెలివరీ బాయ్ వచ్చేవరకూ జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది. ఆఫర్స్ ఉంటాయి. క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది. 10,000,000+ దీనిని ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

జొమాటో: అతికొద్ది కాలంలో ఎక్కువ పేరు సంపాదించుకున్నది జొమాటో యాప్. తన వినియోగదారుల కోసం భారీగా ఆఫర్లు ప్రకటించింది. దీనిని 25 దేశాల్లో నిర్వహిస్తున్నారు. వీరు కూడా స్థానిక రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి మనం బుక్ చేసుకున్న ఆహారాన్ని మన ఇంటి వరకూ తీసుకొస్తారు. డెలివరీ బాయ్ ఎంత దూరం వచ్చాడో కూడా ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది 10,000,000+ ఇన్‌స్టాల్స్ సొంతం చేసుకున్నది.

ఉబర్ ఈట్స్ : ఈ యాప్‌ను ఉబర్ క్యాబ్స్ సంస్థ నిర్వహిస్తున్నది. దీంట్లోనూ అన్ని సదుపాయాలున్నాయి. దీనిని 10,000,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు. 1000కిపైగా ప్రధాన నగరాల్లో దీనిని నిర్వహిస్తున్నారు.

ఫుడ్ పాండా : ఇది దాదాపు 40వేల రెస్టారెంట్లతో టై అప్ అయి ఉన్నది. దాదాపు 43 దేశాల్లో ఫుడ్‌పాండా సేవలు అందుతున్నాయి. ఈ యాప్‌లోనూ అన్ని సదుపాయాలున్నాయి. ఇదీ 10,000,000+ ఇన్‌స్టాల్స్ సొంతం చేసుకున్నది.

డొమినోస్ ః దీని ద్వారా డొమినోస్ ఫుడ్ మాత్రమే వినియోగదారుడికి చేరవేస్తారు. ఫోన్ చేసి కూడా మనకు కావాల్సిన పిజ్జా, డ్రింక్స్, ఇతర స్నాక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ సంస్థ కూడా తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీగానే ఆఫర్లు ప్రకటిస్తున్నది. 10,000,000+ ఇన్‌స్టాల్స్ సొంతం చేసుకున్నది.
Money-Tap

లోన్ యాప్స్..

మనీటాప్ ః ఈ యాప్ ద్వారా రూ.3వేల నుంచి రూ.5 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చు. మీరు తీసుకున్న డబ్బులో.. అవసరాలు తీరగా మిగిలిన డబ్బుకు ఎలాంటి వడ్డీ ఉండదు. దీనిని 1,000,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

రూపీలిండ్ : దీంట్లో 10వేల నుంచి రూ.లక్ష లోన్ పొందవచ్చు. వ్యక్తిగత వివరాలు ఆన్‌లైన్‌లో సమర్పిస్తే.. కేవలం నిమిషాల్లోనే డబ్బు మీ అకౌంట్‌లో జమ అవుతుంది. ఈ యాప్‌ని 10,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

ఫ్లెక్స్‌శాలరీ : దీని ద్వారా 10 వేల నుంచి 2 లక్షల వరకూ రుణాన్ని పొందవచ్చు. మీ సాలరీ అకౌంట్ నుంచి డబ్బులు తిరిగి తీసుకుంటుంది. దీనినే ఈసీఎస్(ఎలక్ట్రికల్ క్లియరింగ్ సిస్టమ్) అంటారు. దీనిని 100,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

మనీ వ్యూవ్ : ఇందులో 10 వేల నుంచి రూ.5 లక్షల లోన్ తీసుకోవచ్చు. డబ్బులు 3 నుంచి 36 నెలల్లో చెల్లించాలి. పూర్తి వివరాలు ఇస్తే సరి. దీనిని 5,000,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

క్రెడిఫేబుల్ : ఈ యాప్ ద్వారా లక్ష నుంచి రూ.5 లక్షల రుణం పొందవచ్చు. ఈ యాప్ నుంచి రుణం పొందేవారి ఆదాయం మూడు లక్షలకు మించి ఉండాలి. 5,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.
HEALTH

హెల్త్ యాప్స్..

క్రెడిహెల్త్ : వైద్యుల అపాయింట్‌మెంట్, పరీక్షల తేదీలను నేరుగా యాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే మీకు కావాల్సిన మందులు ఆర్డర్ చేసుకోవచ్చు. దీనిని 50,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

ప్రాక్టో : ఇందులోనూ ఆన్‌లైన్‌లో డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. మీ హెల్త్ రికార్డును భద్రపరిచి మీ ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. ఈ యాప్ ద్వారా మందులు, పరీక్షల తేదీలను బుక్ చేసుకోవచ్చు. దీనిని 1,000,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

పోర్టియా : ఆన్‌లైన్ వేదికగా నిపుణులైన పలు విభాగాల డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు, నర్సులను రోగి వద్దకే పంపే సరికొత్త యాప్ ఇది. ఇంటి వద్దనే ల్యాబ్ పరీక్షలు చేయించుకోవచ్చు. మనకు కావల్సిన వైద్య పరికరాలను అద్దెకు తీసుకునే వెసులుబాటూ ఉన్నది. ఈ యాప్‌ను 10,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

4. హెల్తీఫై మీ : బరువు తగ్గాలన్నా, పెరుగాలన్నా ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుపుతుంది. ఈ యాప్‌ను 5,000,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

ఫిట్‌నెట్ : ఈ యాప్‌లో 200లకు పైగా వ్యాయమ పద్ధతులున్నాయి. చిత్రాలు, వీడియోల సాయంతో మీ ఫిట్‌నెస్‌ను పెంచుతుంది. దీనిని 5,000,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.
Amazon

షాపింగ్ యాప్స్..

అమెజాన్ : ఆన్‌లైన్ షాపింగ్ రంగంలో అమెజాన్ దూసుకెళ్తున్నది. అమెజాన్‌లో దొరకని వస్తువంటూ లేదు. మనిషికి, ఇంటికి, ఆఫీస్‌కు కావాల్సిన ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని, వివరాలు నమోదు చేసుకొని, మీకు కావల్సిన వస్తువులను ఆర్డర్ చేసుకోవడమే. ఒకవేళ మీకు నచ్చకపోతే ఆ వస్తువును రీప్లేస్‌మెంట్ చేసుకునే వెసులుబాటూ ఉన్నది. అమెజాన్ వ్యాలెట్‌లో డబ్బులు దాచుకోవచ్చు. ఇందులో 17కోట్ల నాణ్యమైన వస్తువులను విక్రయిస్తున్నారు. అమెజాన్ యాప్‌ని 100,000,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

ఫ్ల్లిప్‌కార్ట్ : ఫ్లిప్‌కార్ట్‌లో కూడా దొరుకని వస్తువంటూ ఉండదు. ఈ యాప్‌లో కూడా అమెజాన్‌లో ఉన్న ఫీచర్స్ ఉన్నాయి. ప్రతి పండుగలకు ఇది భారీగా ఆఫర్లు పెట్టి.. వినియోగదారులను ఆకట్టుకుంటున్నది. ఈ యాప్‌ను 100,000,000+ మందికి పైగా ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

పేటియంమాల్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ పేరు సంపాదించింది పేటీఎం. అప్పటి నుంచి ఆన్‌లైన్ షాపింగ్‌లో దూసుకెళ్తున్నది. పేటీఎం మాల్‌లోనూ ఎన్నో రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌ను 10,000,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

టాటా క్లిక్ : ఈ యాప్‌లోనూ అన్ని రకాల బ్రాండ్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, వెయ్యికి పైగా ఫ్యాషన్ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లో కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉన్నది. టాటా క్లిక్ యాప్‌ని 5,000,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

స్నాప్‌డీల్ : వెబ్ కంటే సరికొత్త హంగులుతో రూపొందుకున్నది స్నాప్‌డీల్ యాప్. ఇందులోనూ టాప్ బ్రాండ్స్‌కు సంబంధించిన పలు రకాల వస్తువులు, ఫర్నీచర్, మొబైల్స్, గృహోపకరణాలు, దుస్తులు అందుబాటులో ఉన్నాయి. ఇది 50,000,000+ డౌన్‌లోడ్లు సొంతం చేసుకున్నది.
PUBG

గేమింగ్ యాప్స్..

పబ్జీ : ప్లేయర్ అనౌన్స్ బాటిల్‌గ్రౌండ్స్(పీయూబీజీ) ప్రస్తుతం ట్రెండింగ్‌లో గేమింగ్ యాప్. వందమంది యుద్ధవీరులు ఓ ద్వీపంలో తలపడుతుంటారు. గెలిచినవారు ద్వీపాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రత్యర్థులను చంపడానికి ఫ్రెండ్స్‌ను యాడ్ చేసుకొని జట్టుగా పోరాడొచ్చు. ఇది కేవలం ఒక గేమ్ మాత్రమే కాదు.. ఓ యుద్ధం. ఇది 2 జీబీ కంటే ఎక్కువ ర్యామ్ ఉన్న ఫోన్లలోనే పనిచేస్తుంది. దీనిని ఇప్పటి వరకు 100,000,000+ మందికి డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఇన్ఫినిటీ హోప్స్ : సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ ఆట కొనసాగుతుంది. అత్యవసర సమయాల్లో మీ ఫ్రెండ్స్‌తో ఒక బృందంగా ఏర్పడొచ్చు. రోజువారీ వివరాలు నమోదు చేయడం ద్వారా రివార్డ్స్ పొందవచ్చు. దీనిని 5,000,000+ మంది ఇన్‌స్టాల్ చేశారు.

షాడోగన్ లెజెండ్స్ : భూమిని ఆక్రమించేందుకు వచ్చే గ్రహాంతర వాసుల్ని అంతమొందించడమే ఈ గేమ్. దీనిలో మీ ముగ్గురు స్నేహితులతో జట్టు కట్టవచ్చు. దీనిని 1,000,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

క్లాష్ రాయల్ : రాజులతో కొన్ని తెగలు/వంశాలు చేసే యుద్ధం నేపథ్యంలో ఈ ఆట సాగుతుంది. మీరూ సొంతంగా ఓ తెగను తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లోకి వచ్చిన కొద్దికాలంలోనే ఎక్కువ డౌన్‌లోడ్స్ సాధించిన యాప్‌గా గుర్తింపుపొందింది. దీనిని 100,000,000+మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

హెచ్‌క్యూ ట్రివియా : ఇందులో 12 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. కేవలం 10 సెకెన్లలోనే సరైన సమాధానం చెప్పి 5వేల యూఎస్ డాలర్లు సంపాదించవచ్చు. ఆదివారం సాయంత్రం 25వేల యూస్ డాలర్లు పొందొచ్చు. ఇది 5,000,000+ ఇన్‌స్టాల్స్ సొంతం చేసుకుంది.
Urban-clap

హోమ్ డిమాండ్ సర్వీసెస్ యాప్స్..

అర్బన్‌క్లాప్ : ఇంట్లో చిన్న రిపేర్లు, ఆయా రకాల పనులు చేయడానికి నిపుణులైన వర్కర్లు ఇందులో అందుబాటులో ఉంటారు. నిపుణులైన బ్యూటీషియన్లతో ఇంటి వద్దనే అందాన్ని మెరుగుపర్చుకోవచ్చు. పనిని బట్టి సర్వీస్ చార్జీ ఉంటుంది. దీనిని 1,000,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

హౌస్‌జాయ్ : ఇంటి శుభ్రం నుంచి పెస్ట్ కంట్రోల్, కార్పెంటర్ వర్క్, హోం బ్యూటీ వంటి ఇతర పనులూ చేస్తారు. పనిని బట్టి సర్వీస్ చార్జీ ఉంటుంది. 1,000,000+ మంది దీనిని ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

లోకల్ ఓయ్ : యాప్, వెబ్‌సైట్ ద్వారా కాల్ చేస్తే వెంటనే వచ్చిన మీకు కావాల్సిన పనిని చేసి పోతారు. పనిని బట్టి సర్వీస్ చార్జెస్ ఉంటాయి. 1,000,000+ మంది దీనిని ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

అర్బన్‌ప్రో : ఇంటి దగ్గరే పిల్లలకు ట్యూషన్లు, డాన్స్, మ్యూజిక్, వివిధ భాషలు, పలు కోర్సులు నేర్పేందుకు శిక్షకులను ఈ యాప్ అందిస్తుంది. మీరూ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. దీని ఇన్‌స్టాల్స్ 100,000+.

హెల్పర్ : ఇల్లు శుభ్రం నుంచి గృహోపకరణాల రిపేర్ వరకూ ఏ పనికైనా పనివారిని బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా 22 వేల మంది నిపుణులైన పనివారు రిజిస్టర్ అయ్యారు. దీనిని 50,000+ మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు.
home1

మరికొన్ని సోషల్, ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్

షేర్‌చాట్, స్మూలీ, డబ్‌స్మాష్, టిక్‌టాక్, సమోస, రోపోసో, మ్యూజికల్లీ, 4ఫన్, బుక్‌మై షో, ఫొటో-వీడియో ఎడిటింగ్ యాప్స్ యూత్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇందుల్లో పాటలు పాడొచ్చు, స్పూఫ్ వీడియోలు చేసి ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు. వీటితోపాటుగా కేవలం వాట్సాప్ స్టేటస్ కోసం కొన్ని యాప్‌లు ఈ మధ్యకాలంలో వెలిశాయి. వీడియోలు, ఫొటోలు నచ్చినట్టు మార్చుకునేందుకు అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక హాట్‌స్టార్ యాప్‌లో టీవీల్లో వచ్చే లైవ్ కార్యక్రమాలను కూడా వీక్షించవచ్చు.

- 2008 జూలై నుంచి జనవరి 2017 వరకూ 2.2 మిలియన్ యాప్స్ గూగుల్ ప్లేలో లాంచ్ అయ్యాయి.
- ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి 2.1 మిలియన్ ఆండ్రాయిడ్ యాప్స్ గూగుల్ ప్లేలో అందుబాటులో ఉన్నాయి.
- ఈ ఏడాది త్రైమాసికానికి ఆపిల్ యాప్ స్టోర్‌లో 2 మిలియన్ల వరకూ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
- 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 2.7 బిలియన్ ఉండొచ్చని నిపుణుల అంచనా.
- 2017లో మన దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 340 మిలియన్లు. ఈ ఏడాది పెరిగిన శాతం 28.
- 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 3.02 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా. ఇది భూమి మొత్తం జనాభాలో మూడో వంతు.
- మన దేశంలో నెలకు 150 కోట్ల గిగాబైట్లకు పైగా డేటాను వినియోగిస్తున్నారు.

- డప్పు రవి, సెల్: 9951243487

507
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles