యక్ష ప్రశ్నలు


Sun,November 25, 2018 01:57 AM

Konga-and-Pandavas
ప్రశ్నలు వేయడమే జ్ఞానమని వేదాలు చెప్పాయి. ఆలోచన కలిగిన ప్రశ్న అనితరసాధ్యమైన సమాధానాన్ని అన్వేషించడానికి సాధనంగా మారుతుంది. ప్రశ్న లేనిదే ఆలోచన పుట్టదు, అన్వేషణ జరుగదు. అద్భుత ఆవిష్కరణలు సమాధాన రూపంతో ప్రపంచానికి దారిచూపవు. జీవితంలో అడుగడుగునా లక్ష ప్రశ్నలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా మనలోని మేధస్సు సమాధానాల రూపంలో సాంత్వన చేకూరుస్తూనే ఉంటుంది. అదే జీవితానికి అర్థం చెబుతూ, లోకరీతిని ఉదహరిస్తూ, ధర్మానికి నిర్వచనమిస్తే, విలువలకు ప్రతిరూపమిస్తూ, విధానాలకు రూపకల్పన చేస్తూ వాస్తవికతను పరిచయం చేసిన యక్ష ప్రశ్నలు ధర్మరాజు ద్వారా ప్రపంచానికి ఎలా సమాధానం చెప్పాయనే ఈ కథ ప్రశార్థకమని భావించే జీవితానికి అసలు సిసలైన సమాధానంగా నిలుస్తుంది.

బాధపడకు, నేను ఒక యక్షున్ని. నేనొక కొంగరూపంలో ఈ కొలనులో ఉంటాను. ఈ కొలను నాదే. నేను కొన్ని ప్రశ్నలడుగుతాను, నీవు జవాబు చెప్పు, ఒకవేళ నీవు చెప్పకుండానే నీటిని తాగితే నువ్వుకూడా నీ తమ్ముళ్ళలానే మృత్యువాత పడతావు అంటుంది.

వనవాసంలో భాగంగా పాండవులూ, ద్రౌపది తృణబిందుని ఆశ్రమానికి చేరుకున్నారు. ఒక బ్రాహ్మణుని యజ్ఞ వస్తువును జింక ఒకటి నోటకరుచుకొని అడవిలోకి పరుగులు తీసింది. అతను ఆ వస్తువును తెచ్చిపెట్టమని పాండవులను కోరగా వారు ఐదుగురూ ద్రౌపదిని ఆశ్రమంలోనే ఉంచి, జింకను వెంబడిస్తూ చాలాదూరం వెళతారు. అలసిపోయిన పాండవులకు చాలాదాహం వేస్తుంది. ధర్మజుడు నకులునితో దగ్గరలో ఏమైనా కొలనుందేమో కాస్త చెట్టెక్కి చూడమంటాడు. నకులుడు చెట్టెక్కి చూసి చాలా దగ్గరగానే చిన్న మడుగు ఒకటి కనిపిస్తుందని చెబుతాడు. ధర్మజుడు నకులా! వెంటనే నీవు అక్కడికెళ్ళి కాస్త నీటిని తాగి, మాకూ కొంత నీటిని తీసుకురమ్మని పురమాయిస్తాడు. నకులుడు చెట్టుదిగి ఆ సరస్సు దగ్గరకెళతాడు. నకులుడు దాహంతో నీటిని తాగుబోతుండగా ఆగు! అన్న స్వరం వినిపించింది. ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి తర్వాత దాహం తీర్చుకో అనే మాటలూ వినిపించాయి.

కానీ విపరీతమైన దాహంతో నకులుడా మాటలు పట్టించుకోక నీటిని తాగేస్తాడు. నీళ్ళు తాగిన వెంటనే స్పృహ కోల్పోయి నేలకొరుగుతాడు. నకులుడు ఇంకా రాలేదనీ, అతన్ని వెదుకమనీ, కాస్త తాగేందుకు నీటిని తెమ్మని సహదేవున్ని పంపిస్తాడు ధర్మరాజు. సరుస్సు దగ్గర విగత జీవిలా పడి ఉన్న నకులున్ని చూసి దుఃఖించిన సహదేవుని గొంతు మరింత ఆరిపోయింది. సరస్సులోని నీరు తాగబోతుంటే ఆగుముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్న మాటలను లెక్కచేయక కొలనులోని నీటిని తాగి నకులునిలానే మృతుడై పడిపోతాడు. తరువాత అర్జునుడూ, భీముడూ నీటిని తెచ్చే పనిమీద, సోదరులను వెదికే పనిమీద ధర్మరాజుచే పంపబడి కొలను నీరు తాగి విగతులైనారు.తన నలుగురు తమ్ముళ్ళూ ఎంతకూ రాకపోయే సరికి ధర్మరాజే స్వయంగా బయలుదేరాడు. సరస్సుదగ్గర విగత జీవులై పడివున్న సోదరులను చూసి హృదయం ద్రవించి విలపిస్తున్న ధర్మజునితో, ఆ స్వరం బాధపడకు, నేను ఒక యక్షున్ని. నేనొక కొంగరూపంలో ఈ కొలనులో ఉంటాను. ఈ కొలను నాదే. నేను కొన్ని ప్రశ్నలడుగుతాను, నీవు జవాబు చెప్పు, ఒకవేళ నీవు చెప్పకుండానే నీటిని తాగితే నువ్వుకూడా నీ తమ్ముళ్ళలానే మృత్యువాత పడతావు అంటుంది.
సోదరుల స్థితిని చూసిన ధర్మజుడు యక్షుని స్వరాన్ని నిర్లక్ష్యం చేయక యక్షప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి సిద్ధపడుతాడు. ఆ స్వరంతో ప్రశ్నలనడగమంటాడు ధర్మజుడు.

- ఏ శక్తి వల్ల సూర్యుడు ప్రతి నిత్యం ప్రకాశిస్తాడు?
- సత్యసంధత గల ధర్మమనే శక్తి వల్లే.
- ప్రాణం ఆపదలో ఉన్నప్పుడు మనిషిని రక్షించే శక్తేది?
- ధైర్యం.
- ఏ శాస్ర్తాలను అధ్యయనం చేస్తే మనిషి విజ్ఞుడవుతాడు?
- ఏ శాస్ర్తాల వల్లా కాదు. గొప్పవారి సహచర్యం, లోకజ్ఞానం వల్ల.
- భూమికంటే భారమైంది ఏది?
- నవమాసాలూ మోసి బిడ్డను కనే తల్లి.
- ఆకాశానికన్నా ఉన్నతమైందేది?
- తండ్రి హృదయం.

- గాలికంటే వేగమైందేది?
- మనస్సు.
- బతికే ఉన్నా చచ్చినవాడితో సమానమైనవారెవరు?
- తాను మాత్రమే తింటూ, ఆకలితో ఉన్నవాడికి పెట్టనివాడు.
- గడ్డిపరక కంటే తేలికైనదేది?
- బాధాదగ్ద హృదయం.
- బాటసారికి చుట్టమెవరు?
- భార్య.
- చనిపోయినవారిని అనుసరించేది?
- ధర్మం.
- మనిషి దేనిని విడిచిపెడితే లోకంలో ప్రేమించబడుతాడు?
- గర్వం.

- దుఃఖం రాకూడదంటే ఏం వదిలేయాలి?
- కోపం.
- మనిషి ఆనందంగా బతుకాలంటే వదిలేయాల్సిందేమిటి?
- అన్నీ నాకే కావాలనే కోరిక.
- లోకంలో చిత్రమైనదేది?
- సృష్టే ఒక విచిత్రం.
- లోకంలో ఆశ్చర్యకరమైనదేంటి?
- ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ మరణం అనివార్యం అని తెలిసినా మనం ఎప్పుడూ మరణించమని భావిస్తామో అదెంతో ఆశ్చర్యకరం.
- ధర్మమార్గాన్ని ఎలా తెలుసుకోవాలి?
- వాదం చేత ఏదీ తేలదు. సిద్ధాంతాలూ, శాస్ర్తాలూ ఒకదాన్ని మరొకటి వ్యతిరేకిస్తుంటాయి. మనుషుల్లో ఏ ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఉండరు. అందుకనే గొప్పవారు నడిచిన మార్గమే సరైన దారి. అదే సనాతన ధర్మం.
ఇలా యక్షుని ప్రశ్నలన్నింటికీ గొప్ప సమాధానం చెప్పిన ధర్మజుని ప్రవృత్తి తన నలుగురు సోదరులనూ బతికించింది. ఈ యక్ష ప్రశ్నలు ధర్మజుని ద్వారా జీవిత విశిష్టతనూ, అసలైన ధర్మాన్నీ ప్రపంచానికి సమాధానమిచ్చాయి. జీవితానికి అర్థం చెప్పాయి.

-ఇట్టేడు అర్కనందనా దేవి

320
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles