మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అన్నాబర్న్స్


Sun,November 4, 2018 03:32 AM

Milkman
ఉత్తర ఐర్లాండ్ రచయిత్రి అన్నాబర్న్స్ ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక మ్యాన్ బుకర్ బహుమతిని గెలుచుకున్నారు. ఆమె కలం నుంచి ప్రాణం పోసుకున్న మిల్క్‌మ్యాన్ నవలకు ఈ గౌరవం దక్కింది. ఇరవయోశతాబ్దంలో తీవ్ర రాజకీయ సంక్షోభంతో ఉత్తర ఐర్లాండ్ అతలాకుతలమైన తరుణంలో ఓ యువతి నిజజీవితంలో చోటు చేసుకున్న పరిస్థితులకు ఈ నవల అక్షరరూపం కల్పించింది. కాగా ఈ గౌరవం దక్కించుకున్న తొలి ఉత్తర ఐర్లాండ్ మహిళ అన్నాబర్న్స్.

- మధుకర్ వైద్యుల

అన్నాబర్న్స్ 1967లో ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్‌లో జన్మించింది. ఆర్డోయ్న్‌లోని క్యాథలిక్ జిల్లాలో పెరిగారు. తన ఉన్న త విద్యను స్థానిక జెమాస్ హైస్కూల్‌లో 1987లో పూర్తి చేశారు. అనంతరం ఆమె లండన్ వెళ్లిపోయారు. 2014 నుంచి లండన్‌లోని దక్షిణ ఇంగ్లిష్ తీరంలో గల తూర్పు సస్సెక్స్‌లో నివసిస్తున్నారు.

మూడు నవలలు

అన్నాబర్న్స్ అప్పటికే రెండు నవలలు, ఒక దీర్ఘ నవల రాసి ఉన్నారు. వాటిలో నోబోన్స్ ఒకటి. ఐర్లాండ్ సమస్యల వలయంలో ఉన్న సమయంలో బెల్ఫాస్ట్‌లో నివసించే ఒక బాలిక జీవితం ఎలా ఉంటుందనే దృక్కోణం లో ఈ నవల సాగుతుంది. ఉత్తర ఐర్లాండ్‌లోని సమస్యలను వివరించడంలో ఈ నవల ఎంతగానో దోహదపడింది. ముఖ్యంగా ఉత్తర ఐర్లాండ్ సాహిత్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేసిందీ నవల. ముఖ్యంగా బెల్ఫాస్ట్ ప్రజల రోజువారీ భాషలో సాగడం ఈ నవల ప్రత్యేకత. ఈ నవలకుగాను 2001లో యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్ ఉత్తమ ప్రాంతీయ నవలల పోటీలో రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ వారి హెల్టి స్మారక పురస్కారం దక్కింది. అలాగే ఇదే నవలకు 2002లో ఆరెంజ్ బహుమతి కూడా దక్కి ంది. ఇక 2007లో ఆమె లిటిల్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో మరో నవల రాశారు. ఇక ఈ ఏడా దే మిల్క్‌మ్యాన్ పుస్తకాన్ని రాశారు.

మిల్క్‌మ్యాన్ కథనం

1970ల ప్రాంతంలో ఉత్తర ఐర్లాండ్‌లోని ఒకానొక పట్టణంలో జరిగిన కథ మిల్‌మ్యాన్. రాజకీయ సంక్షోభిత సమయంలో యవ్వనపు తొలినాళ్లలో ఉన్న యువతికీ, పెండ్లయిన మధ్యవయస్కుడికీ మధ్య ప్రణయబంధాన్ని కథావస్తువుగా ఈ నవల సాగింది. ఉత్తర ఐర్లాండ్‌లోని ఒకానొక నగరంలో క్యాథలిక్కులు, ప్రొటెస్టంట్ల మధ్య హింస ప్రజ్వరిల్లిన సమయంలో జరిగిన పరిణామాలను ఆమె తన నవలలో చిత్రీకరించారు. యుక్తవయసులోకి ప్రవేశిస్తున్న అమ్మాయి ఓ యుద్ధక్షేత్రం లాంటి నగరంలో ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నదనే విషయాన్ని అన్నాబర్న్స్ అద్భుతంగా పుస్తకరూపంలోకి మలిచారు.

ప్రపంచానికి వర్తించేలా..

స్త్రీ, పురుష సంబంధాలు, వాటిలోని ఆక్రమణలు, అణచివేతలు, అస్తిత్వం కోసం చేసే ప్రతిఘటనలు ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా మనకు ఒకే రీతిగా కనిపిస్తాయి. 18 యేండ్ల అమ్మాయికి, 42 యేండ్ల మిల్క్‌మ్యాన్‌కు మధ్య జరిగిన అనేకానేక సంఘటనల సమాహారమీ నవల. కథ అంతా అమ్మాయి దృక్కోణం నుంచి నడుస్తూ ఉంటుంది. అతడికి మిల్క్‌మ్యాన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలియదు. కానీ, నిజానికి అతడు పాల వ్యాపారి కాదు. అలాగని పాలు పోయడు. నిజానికి అతడు పారా మిలటరీ దళాలలో పని చేస్తాడు. ఈ అమ్మాయిని అతను కుటుంబ బంధాలు, సామాజిక ఒత్తిడి, రాజకీయ విధేయతలను ఆయుధాలుగా చేసుకొని ఎలా లైంగిక దోపిడీ చేశాడో అక్షరబద్దం చేశారు అన్నాబర్న్స్. ఉత్తర ఐర్లాండ్‌లో ఆ కాలంలో ఉధృతంగా ఉన్న రోమన్, క్యాథలిక్‌ల ఘర్షణలు, మతం, స్త్రీల జీవితంలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో మిల్క్‌మ్యాన్ కథనం వివరిస్తుంది. నిజానికి వలసలుగా ఉన్న అనేక దేశాల్లో ఇటువంటి పరిస్థితులే మన కళ్లముందు కదలాడుతాయి.

తొలి ఐరిష్ మహిళ

ఆంగ్ల సాహిత్యంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా బుకర్‌ను భావిస్తారు. మ్యాన్‌బుకర్ ప్రైజ్ 49 యేండ్ల ప్రస్తానంలో ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఉత్తర ఐరిష్ మహిళగా అన్నా గుర్తింపు పొందారు. బుకర్ ప్రైజ్ గెలుచుకున్న 17వ మహిళగా ఆమె నిలిచారు.

కాంప్రమైజ్ కాను

ఈ నవలను తీసుకురావడంలో నేను అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నాకు అవార్డు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. నేను నా రీతిలో రాయడంలో కాంప్రమైజ్ కాను. భవిష్యత్‌లో నా నవల మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందని నమ్ముతున్నాను. నా నవల మీ టూ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఆ ఉద్యమానికి నా రచన ప్రేరణనిస్తే మాత్రం నేను గర్వంగా ఫీలవుతాను.

ప్రశంసల వర్షం

ఈ నవలలోని ప్రతీ అక్షరం ఆ యువతి నిజ జీవితగాథను కళ్లెదుట సాక్షాత్కరింప చేస్తుందని న్యాయనిర్ణేతల బృందం సారథి ఆంథోనీ అప్పియా ఉద్ఘాటించారు. ఇలాంటి రచనను మునుపెన్నడూ మేం చదువలేదని ఆమె కితాబిచ్చారు. ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు అన్నా రాశారని కమిటీ ప్రశంసలు కురిపించింది. విజేతకు ఈ బహుమతి కింద సుమారు ఈ అవార్డు కింద 52,500 పౌండ్ల (రూ.50.85లక్షల) నగదును అందచేశారు. డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ కెమిల్లా.. రచయిత్రికి ట్రోఫీని అందచేశారు. మ్యాన్‌బుకర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ల్యూక్ ఎల్లిస్ నగదు బహుమతి చెక్కును ప్రదానం చేశారు.

252
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles