మోస్ట్ అఫెక్టెడ్ పర్సన్‌ని..


Sun,November 25, 2018 02:50 AM

love
నాకేమైనా అయితే, నేను పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు. అది నా లైఫ్‌లో నువ్వు అనుకున్నా. కానీ నువ్వేం చేశావు? సంస్కారం గురించి మాట్లాడి అంతిమ సంస్కారాలకు
పంపినంత పనిచేశావు. అయినా ఈ తప్పు నీది కాదు. తరతరాల నుంచి తీసుకొస్తున్న మనుషులది.ప్రేమకు కులమేంటి? అయినా ఎవరో సృష్టించిన కులాలు, మతాలు వాళ్ల పిచ్చికాకపోతే.. గువ్వా గోరింకల్లాంటి మనల్ని వేరు చేసిన ఈ మతాలు సాధించేది ఏంటి?

నేను పుట్టినప్పుడు అమ్మఒడిలో పాలు తాగుతూ కింద పడిపోయానంటా. అయినా అప్పుడు నాకు ఏమీ కాలేదు. అలా కొన్ని నెలల తరువాత మంచం మీద దొర్లుతూ దొర్లుతూ కిందపడిపోయానంటా అయినా నాకేమీ కాలేదు. ఆ తరువాత బుడి బుడి నడకలు వేస్తూ కిందపడిపోయానంటా అయినా నాకేమీ కాలేదు. ఆ తరువాత స్కూల్‌లో ఆగస్ట్ 15 కోసం ఆటల పోటీల్లో పరుగు పందెంలో పరిగెడుతూ కింద పడిపోయానంటా. అయినా అప్పుడేమీ కాలేదు. ఆ తరువాత ఓ రోజు బైక్ రైడింగ్ చేస్తూ కింద పడిపోయా ఏమీ కాలేదు.. ఇలా నా జీవితంలో చాలాసార్లు కిందపడ్డా. చిన్న చిన్న దెబ్బలు, కాళ్ళు చేతులు విరగడం, తల పగలడం లాంటివి జరిగినా తిరిగి నిలబడ్డా. ఇలాంటి అనుభవాలతో నేను నేర్చుకొన్నది ఒక్కటే, భవిష్యత్తులో తిరిగి కింద పడొద్దు అని. గట్టిగా నిర్ణయించుకున్నా. అలా కొన్ని సంవత్సరాలు సాఫీగా సాగుతున్న తరుణంలో అది 2007, సూర్యాపేటలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నా. సరిగ్గా అలాంటి రోజుల్లో నేను ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయా. మొట్ట మొదటిసారిగా తిరిగి లేవలేకపోయాను. ఆ నొప్పి భరించలేకపోయా. నా జీవితంలో అనుభవించిన నొప్పులు అన్నీ ఒక ఎత్తయితే.. ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాక అనుభవించిన నొప్పులు ఒక ఎత్తు. అవి అట్లాంటి, ఇట్లాంటి నొప్పులు కావు. చదువలేకపోవడం, ప్రతీ క్షణం ఆ అమ్మాయి గురించే ఆలోచనా. వేరో ప్రపంచం లేకుండా పోయింది. మా కాలేజ్ గల్లీలోనే ఆమె కాలేజ్ ఉండడంతో తనని దూరంగా ఉండి చూస్తూ ఉండేవాడిని. గతంలో చాలాసార్లు కిందపడ్డానని చెప్పానుకదా.. ఆ గాయాలకు, నొప్పులకు తగ్గట్టు దవాఖానాల్లో ఉన్న మందులు నయం చేశాయి. కానీ ఈ అమ్మాయి ప్రేమలో పడ్డాక ఆ నొప్పులు తగ్గాలంటే ఒకటే మార్గం. ఆ అమ్మాయి నన్ను చూడాలి, నవ్వాలి, మాట్లాడాలి. నా మనసును, నా ప్రేమను అర్థం చేసుకొని జీవితాంతం నాతో ఉండిపోవాలి. ఇలా అయితే తప్ప ఆ నొప్పులు తగ్గవు. అలా రోజులు గడుస్తున్నా కొద్ది తెలిసి వచ్చింది.

తనతో పరిచయం ఎలా అవ్వాలి? ఎలా నాలో ఉన్న ఇష్టాన్ని, ప్రేమను తనతో చెప్పాలి. చెప్పాలన్న ఆశ, ఏమైనా అంటుందేమోనన్న భయంతోనే ఆమె వెంట దగ్గర దగ్గర 6 నెలలు తిరిగాను. కానీ, ఏ రోజు ఆమె నా వైపు చూడలేదు. రోజు రోజుకి నాలో ఉన్న ప్రేమ ఫీలింగ్స్ నన్ను చంపేస్తున్నాయి. భరించి భరించి తట్టుకోలేక ధైర్యం చేసి నా మనసులో ఉన్నా మాటను.. తనతో పంచుకోవాలనుకుంటున్న ప్రేమను I love you అంటూ ప్రపోజ్ చేశాను. నా ఇష్టాన్ని చెప్పాను. అందుకు ఆమె నా వైపు నవ్వుతూ చూసింది. అది గమనించిన నాకు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం వేసింది. అలా ఆమె మాట్లాడడం స్టార్ట్ చేయడంతో, నొప్పి పూర్తిగా తగ్గిన ఫీలింగ్ కలిగింది. సరిగ్గా అప్పుడే ఆమె నాతో నువ్వు ఎవరో నాకు తెలియదు. ఎలాంటి వాడివో అసలే తెలియదు. చూడడానికి ఒక మంచి అబ్బాయిలా ఉన్నావు. కానీ నీ పైన నాకు ప్రేమ కలుగాలంటే ఒక సంవత్సరం పాటూ నాతో టచ్‌లో ఉండు. అప్పుడప్పుడు కనపడుతూ ఉండు. వీలైతే వచ్చి మాట్లాడు. అలా కొంతకాలం గడిచాక చూద్దాం అని చెప్పి వెళ్లిపోయింది. అందుకు నేను హ్యాపీ అయ్యాను. అలా నా మనసుకు నచ్చిన అమ్మాయితో డీల్ కుదిరింది. తను నేను చదువుతున్న కాలేజ్ దాటి ఆమె కాలేజీకి వెళ్లాల్సి ఉంటుంది. అలా కాలేజీ దగ్గర వెయిట్ చేయడం అలవాటు అయింది. కొన్ని సార్లు తనని చూడడం, మాట్లాడడం, నేను Miss అయ్యేవాణ్ణి. కాలం గిర్రున తిరిగింది. గడిచిన కాలానికి జ్ఞాపకాలు మిగులుతున్నాయి. కానీ తను మాత్రం నా సొంతం అవడం లేదు. నేను తనని ఎంతలా ప్రేమిస్తున్నానో అర్థమవ్వాలని ఒక్కరోజు మిస్సవ్వకుండా తన కంట పడేవాణ్ణి. తనకి ఎదురుపడేవాణ్ణి. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. పండుగలు, సండేలు, ప్రిపరేషన్ హలీడేస్‌లు, ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్ అంటూ సంవత్సరం గిర్రున తిరిగి కరిగిపోయింది.. నేను తనని ప్రపోజ్ చేసిన టైమ్, డేట్ బాగా గుర్తుకు పెట్టుకున్నా. సరిగ్గా అదే రోజు తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఐ లవ్ యూ చెప్పాను. అందుకు ఆమె చిరాకు పడింది. ఇబ్బందిగా ఫీల్ అయింది. ఆ విషయాన్ని గమనించి విస్తుపోయాను.

ఇంతకీ నీ పేరు ఏంటి! మీ ఊరు పేరు ఏంటి! మీ నాన్న పేరు ఏంటి! మీ అమ్మ పేరు ఏంటి! మీ ఫ్యామిలీలో ఎంతమంది? మీ కులం, మతం, జాతి, గోత్రం, గ్రహబలం, రాశి ఏంటి అంటూ నన్ను రకరకాల ప్రశ్నలు వేసింది. అన్నింటికీ సమాధానం చెప్పాను. సమాధానాలు ఒక పేపర్ పైన రాసుకొని వెళ్ళిపోయింది. రేపు, మళ్ళీ ఇక్కడే కలుద్దాం అని చెప్పింది. నాకేం అర్థం కాలేదు. కొంపదీసి నన్ను ప్రేమించు, పెళ్ళి చేసుకో, సినిమా షికార్లకు రమ్మని నన్ను రోజు వేధిస్తున్నాడు అని పోలీస్ స్టేషన్లో కేసు పెడుతుందా, మా ఇంటికి లెటర్ రాస్తుందా? అని భయపడ్డాను. ఆ రోజు రాత్రి మొత్తం పిచ్చి పిచ్చి ఆలోచనలతో నిద్ర కూడా పట్టలేదు. తెల్లారింది.. తన కోసం హడావిడిగా రెడీ అయి వెళ్ళాను. అర్ధగంటటెదురు చూశాను. వస్తుందా? రాదా? అని. అలా టెన్షన్ పడుతున్న నన్ను హ్యాపీ చేయడానికి తను వచ్చింది. అనుకున్నా.. సరాసరి నా దగ్గరికి వచ్చి నీకు నాకు మ్యాచ్ అవ్వదు కులం, మతం, గోత్రాలు, గ్రహబలాలు, రాశులు లాంటివి సెట్ అవ్వడం లేదు. నేను పెళ్ళి చేసుకోబోయే అబ్బాయికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. నీకు అందులో ఏ ఒక్కటీ లేవు. మాది పలానా కుటుంబం. నాకు కులం, మతం, గోత్రంలాంటివి ప్రాణంతో సమానమని ఏవేవో చెప్పి నా మనసును, ప్రేమను ముక్కలు ముక్కలుగా చేసింది. ఆమె అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తుకు వస్తాయి. నన్ను, నా ప్రేమను తక్కువ కులం, జాతి, మతం అంటూ నడి రోడ్డుపైన అరటి తొక్కను తొక్కినట్టు వెళ్ళిపోయింది. తిరిగి తన గురించి ఆలోచించడం మానేశాను. ఆ ప్రేమ నొప్పుల తగ్గడానికి చాలా కాలం పట్టింది. కానీ అప్పుడు నేను తనతో ఏమీ చెప్పలేకపోయా. నాలో ఉన్నా బాధను చూపించలేకపోయా.

కానీ ఒక్క విషయం తనకు చెప్పాలనుకుంటున్నా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనని చూడలేదు. కలువలేదు. బహుశా కలువకపోవచ్చు. కానీ మా ప్రేమను చంపింది మాత్రం మాయదారి మతం. కసాయి కులం. మనం పీలుస్తున్న గాలి, మనం తింటున్న అన్నం, మనం ఉంటున్న భూమి, మన అవసరాలకు ఉపయోగపడుతున్న ప్రకృతి, అందులో భాగమైన దేనికి కులం, మతం లేదు. మరి మనుషులకు ఎందుకు? నీ ప్రేమను పొందే అర్హత నాకు లేకపోవచ్చు. కానీ అది నా కులానికి, మతానికి అని నన్ను చిన్న చూపు చేసిన నీకు, నీ ప్రేమకు ప్రేమించే హక్కు లేదు. అన్ని మతాల,కులాల మనుషులు తయారు చేసుకున్న ఈ దేశంలో, మరెందరో మహానుభావులు కలలుగన్న ఈ భారతదేశంలో నీకు బతికే హక్కు లేదని నా అభిప్రాయం.
ఏ మతమైతే మన ప్రేమను చంపేసిందో, ఏ కులమైతే నా ప్రేమను నాకు కాకుండా చేసిందో అదే ప్రేమను పొందలేనేమో కానీ నా ప్రేమికులకు అండగా ఉండడానికి ప్రయత్నిస్తాను. నువ్వు ఇంత పెద్ద తప్పు చేసినా.. క్షమాగుణం కలవాడిని కాబట్టి నిన్నెప్పటికీ నన్నుగా, నాలో సగంగా భావిస్తా. గౌరవిస్తా. ప్రేమిస్తా.

- నీ మహాధర్

587
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles