మృత్యుంజయుల క్లబ్


Sun,September 9, 2018 02:00 AM

Crime
ఆ ముసలావిడని ఎవరైనా ఎందుకు చంపుతారు అన్నది నాకు ఆశ్చర్యంగా ఉంది. మొదట్లో మేమూ అదే ఇబ్బందిని ఎదుర్కొన్నాం. సరైన కారణం లేదు. ఆవిడ గది నిండా రక్తపు చిందులు పడ్డాయి.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

16-9-18 కెప్టెన్ లియోఫోల్ తన పక్కన కూర్చున్న సార్జెంట్ ఫ్లెచర్ని అడిగాడు. మృత్యుంజయుల క్లబ్ ఎక్కడుందో తెలుసా? అది సముద్రపు ఒడ్డున ఉన్న ఓల్డ్ ఏజ్ హోం కదా? అవును. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. అక్కడో హత్య జరిగింది. ఇద్దరూ వెంటనే బయలుదేరారు.
అది చెట్ల మధ్య గల ఓ పాత భవంతి. అక్కడ ఓల్డ్ ఏజ్ హోంని ఆరంభించిన ఏడాదికి దాని గురించి, దాన్ని స్థాపించిన డాక్టర్ రేమండ్ గురించి ఓ దినపత్రికలో రాసింది లియోఫోల్ చదివాడు. మరణించకుండా అమరులుగా జీవించాలని ప్రయత్నించే ఓ బృందం వారు అక్కడ నివసిస్తున్నారు. డాక్టర్ రేమండ్ చేసే రహస్య చికిత్స ద్వారా తాము శాశ్వతంగా జీవిస్తామని వాళ్ళు నమ్ముతున్నారు.
ఐతే వారిలోని ఒకరు అలా జీవించలేదు. లియోఫోల్ నవ్వుతూ చెప్పాడు.
అలా జీవించని వ్యక్తి మిసెస్ పీచ్‌ట్రీ శవాన్ని ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు శ్రద్ధగా పరిశీలించారు. ఆవిడ ముడుతలు పడ్డ మొహం ప్రశాంతంగా కనిపించింది. మంచం మీద పడుకున్న ఆవిడ ఛాతీలోంచి గుండెలోకి ఓ పొడుగాటి సర్జికల్ కత్తి దిగింది. ఆవిడ చీరె మీద, గోడల మీద, నేల మీద మంచం పక్కన పరిచిన మురికి తెల్లటి రగ్గు మీద ఎర్రటి రక్తపు చిందులు కనిపించాయి.
నిన్న రాత్రి ఎప్పటిలా మిసెస్ పీచ్‌ట్రీ పడుకుంది. ఈ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి కిందకి రాకపోతే నర్స్ మోర్గాన్ ఆవిడ గదికి వచ్చి ఈ శవాన్ని చూసింది. డాక్టర్ రేమండ్ వివరించాడు.
యూనిఫాంలోని ఎర్రటి బుగ్గలు గల అందమైన సన్నటి నర్స్‌ని చూసి ఆయన అడిగాడు. అంతేనా? ఇంకేమైనా చెప్తావా?
ఇంకేం చెప్పడానికి లేదన్నట్లుగా మోర్గాన్ తల అడ్డంగా ఊపింది. హత్య జరిగాక జరిగే తతంగం కోసం పోలీసులు, ఫొటోగ్రాఫర్లు, డాక్టర్, వేలిముద్రల నిపుణులు వచ్చారు. వాళ్ళు తమ పనులని ఆరంభించాక లియోఫోల్ డాక్టర్ రేమండ్‌ని ప్రశ్నించడానికి ఆయన ఆఫీస్ గదిలోకి ఫ్లెచర్తో సహా వెళ్ళాడు.

చాలాబాధాకరం. వీళ్ళు మరణం నుంచి తప్పించుకోవాలని ఇక్కడికి వచ్చారు. కానీఅది వీళ్ళని వెంటాడింది. డాక్టర్ రేమండ్ చెప్పాడు.
లియోఫోల్ ఆ గదిలో గోడలకి ఉన్న రోగుల రంగురంగుల చార్టులని, ఫైలింగ్ కేబినెట్‌ని చూసి అడిగాడు. ఎక్కడా మీ మెడికల్ డిగ్రీ గోడకి వేలాడుతూ కనపడడం లేదు?
నేను మెడికల్ డాక్టర్ ని కాను. ఆస్ట్రియాలో మెటా ఫిజిక్స్‌లో డాక్టర్ డిగ్రీ చేశాను. ఐనా నాకు దేహానికి వచ్చే రోగాల గురించి క్షుణ్ణంగా తెలుసు. నా పరిశోధనల్లో మానవ దేహం మరణం లేకుండా శాశ్వతంగా జీవించగలదని, సహజ పరిస్థితుల్లో అన్ని మారు వేషాల్లో వచ్చే మరణాన్ని తేలిగ్గా లొంగతీసుకోవచ్చని తేలింది.
ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మిసెస్ పీచ్ ట్రీతో కలిసి ఇరవై ఏడు మంది సభ్యులు ఉన్నారు. సభ్యులంటే మీ ఉద్దేశం రోగులనా?
అవును. వాళ్ళు ఇందులో చేరగానే మృత్యుంజయుల క్లబ్‌లో సభ్యులు అవుతారు. వాళ్ళంతా శాశ్వత సభ్యులుగా కొనసాగొచ్చు. కాకపోతే మధ్యలో ముగ్గురు కుటుంబ ఒత్తిళ్ల వల్ల వెళ్ళిపోయారు. వాళ్ళు చెల్లించే డబ్బు వారి అమరత్వంతో పోలిస్తే చాలా తక్కువ.

ఇంతదాకా ఇక్కడ మరణాలు సంభవించలేదా? లేదు. ఇవాళ్టిదే మొదటిది. హింసాత్మక మరణాలకి నా బాధ్యత ఉండదు. మిసెస్ పీచ్ ట్రీకి శత్రువులు ఉన్నారా? లేరు. శాశ్వతంగా జీవించే ఇక్కడి సమాజంలో ఎవరితో ఎవరూ శత్రుత్వాన్ని పెట్టుకోరు. ఐతే ఇది బయటి వారి పనా? అదే నాకు చిత్రంగా ఉంది. ఇక్కడి వారెవరూ ఆ పని చేసుండరు. బయటి నించి ఎవరైనా వచ్చిన సూచనలు కూడా లేవు. ఆవిడ మంచం పక్కన ఉన్న బటన్ నొక్కితే వెంటనే నర్స్ వస్తుంది. ఆవిడ ఆ బటన్ నొక్కలేదంటే కొత్త వాళ్లు రాలేదని అనుకోవచ్చు.
ఆవిడ కుటుంబ సభ్యుల గురించి చెప్పండి.
ఎవరూ లేరు. భర్త మరణించాడు. పిల్లలు లేరు.
మీ సభ్యులంతా ధనవంతులేనా?.
బీదవాళ్లు ఎక్కువకాలం బతుకాలని అనుకోరు.
****

కెప్టెన్ లియోఫోల్డ్‌కి మర్నాడు పోస్ట్‌మార్టం రిపోర్ట్ అందింది. కత్తి సరిగ్గా గుండెల్లో దిగింది. తెల్లవారుఝామున నాలుగు ప్రాంతంలో మరణించింది. ఆవిడ ఒంటి మీద రక్కులు, గాయాలు లాంటివి లేవు కాబట్టి ఎదురుతిరుగకుండా మరణించింది.
ఫ్లెచర్ దినపత్రికలో వచ్చిన కొన్ని వార్తలని లియోఫోల్డ్‌కి చూపించాడు. డాక్టర్ రేమండ్ మీద రాసిన విమర్శలే అవన్నీ. శాశ్వతంగా జీవించడమనే ఆశ చూపించి ఆయన అమాయకులని వంచిస్తున్నాడని, విటమిన్స్ ఇస్తూ రాత్రుళ్ళు మతపరమైన బోధనలు చేస్తుంటాడని, అతనికి ఆ రాష్ట్రంలో వైద్యం ప్రాక్టీస్ చేసే లైసెన్స్ లేదని, అప్పుడప్పుడూ సభ్యులకి రక్తమార్పిడి చేస్తుంటాడని, దాదాపు పాతికమంది సభ్యులు ఆయన మీద ఎలాంటి ఫిర్యాదు చేయకపోగా ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు డాక్టర్ రేమండ్‌ని అరెస్ట్ చేయడం సాధ్యం కావడం లేదని అందులో ఉంది. అయితే కొందరు పాఠకులు డాక్టర్ రేమండ్ తన సభ్యులకి జీవించే ఆశ ఇస్తున్నాడని, అది మంచి పనని ఉత్తరాలు రాశారు. సభ్యుల మధ్య వాదనలు కానీ, పోట్లాటలు కానీ ఎన్నడూ ఉండకపోవడాన్ని వాళ్లు గొప్పతనంగా భావించారు.
అజాత శత్రువైన మిసెస్ పీచ్ ట్రీని ఎవరైనా ఎందుకు చంపారో ఎంత చర్చించినా డిటెక్టివ్‌లు ఇద్దరికీ కొరుకుడు పడలేదు. బల్ల మీది టెలిఫోన్ మోగింది. కెప్టెన్ లియోఫోల్డ్ రిసీవర్ అందుకున్నాడు. అది పోలీస్ డాక్టర్ నుంచి.
****

కిటికీలోంచి బయటకి చూసే డాక్టర్ రేమండ్‌కి బయట పోలీస్ కారు ఆగడం, అందులోంచి ఇద్దరు పోలీసాఫీసర్లు దిగడం కనిపించింది. వాళ్లు అతని గదిలోకి వచ్చాక వాళ్లని విష్ చేసి అడిగాడు.
మీ పరిశోధన ఎంత దాకా వచ్చింది?
పూర్తయిందని అనుకుంటున్నాం కెప్టెన్ లియోఫోల్డ్ చెప్పాడు.
ఆ ముసలావిడని ఎవరైనా ఎందుకు చంపుతారు అన్నది నాకు ఆశ్చర్యంగా ఉంది.
మొదట్లో మేమూ అదే ఇబ్బందిని ఎదుర్కొన్నాం. సరైన కారణం లేదు. ఆవిడ గది నిండా రక్తం చిందులు పడ్డాయి. అవునా?నిజానికి చాలా ఎక్కువ రక్తం చిందింది. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు.మిసెస్ పీచ్‌ట్రీని ఎవరూ చంపలేదు డాక్టర్. హత్య జరుగలేదు.
మరి ఆవిడ గుండెల్లో దిగిన కత్తి మాటేమిటి?
మీరే ఆ కత్తిని ఆవిడ గుండెల్లో గుచ్చారు డాక్టర్ రేమండ్. అదీ ఆవిడ గుండె ఆగి సహజ మరణం పొందిన కొద్దిసేపటికి. కొద్ది క్షణాల మౌనం తర్వాత డాక్టర్ రేమండ్ చెప్పాడు.
అది రుజువు చేయడం కష్టమవుతుందనుకుంటాను?

కాదు.. నేనా రక్తం గురించి ఆలోచించాక అంత కష్టం కాలేదు. ఆవిడ దేహంలో ఒకటే గాయం ఉంది. ఆ గాయంలో ఇంకా కత్తి దిగే ఉంది. ఆ పరిస్థితుల్లో బయటకి రక్తం ఎక్కువగా కారే అవకాశం లేదు ఆ కత్తిని బయటకి తీసేదాకా. ఏది ఏమైనా ఆ గాయానికి ఆ గదిలో అంత రక్తం చిందించాల్సిన అవసరం లేదు. కాబట్టి అది హతురాలి రక్తం కాకపోవచ్చు అనుకున్నాను. మీరు మీ సభ్యులకి తరచు రక్తమార్పిడి చేస్తుంటారని విన్నాను. మీరు అందుకోసం సేకరించి ఉంచిన రక్తపు సీసాలోని రక్తం ఉపయోగించబడిందని ఊహించాను.
నాకా అవసరం ఏమిటి? డాక్టర్ రేమండ్ ప్రశ్నించాడు.
ఎందుకంటే మీరు మెడికల్ డాక్టర్ కాదు కాబట్టి. ఆవిడకి హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఎలాగో మీకు ఫోన్ చేసింది. మీరు వేగంగా వచ్చినా, ఆలస్యమై అప్పటికే ఆవిడ పోయింది. మీ సభ్యుల్లోని మొదటి మరణం. మీరు అందుకు తీవ్రంగా స్పందించి, వెంటనే సర్జికల్ కత్తిని తెచ్చి ఆవిడ గుండెలో గుచ్చారు. అందువల్ల ఆవిడది సహజమరణం అని ఎవరికీ తెలీదు. ఎవరో హత్య చేసి చంపారని అంతా నమ్ముతారు. మీ గౌరవం, మీ మీద నమ్మకం చెక్కుచెదురకూడదని మీరీ పని చేశారు. ఆవిడ మరణించిన కొద్ది నిమిషాలకి గుండెలో దిగిన కత్తి వల్ల పోస్ట్‌మార్టంలో ఆ సంగతి తెలీదని అనుకున్నారు. కొంత దాకా మీ ఊహ కరెక్టే. కాని ఆ గాయం నించి చాలా తక్కువ రక్తం రావడంతో మీరు భయపడ్డారు. శవాల నించి రక్తం కారదన్న సంగతి మీకు గుర్తొచ్చి ఉంటుంది. దాంతో ఆవిడ గ్రూప్ బ్లడ్ ఉన్న సీసా తెచ్చి రక్తాన్ని ఆవిడ చీరె మీద, గోడ మీద, చుట్టుపక్కలా చల్లారు. నిజమైన డాక్టర్‌కి ఆ పరిస్థితుల్లో రక్తం అంత వేగంగా చిమ్మదని తేలిగ్గా తెలిసిపోతుంది. పోలీస్ డాక్టర్ ఈ విషయం తెలుసుకున్నాడా? డాక్టర్ రేమండ్ బలహీనంగా అడిగాడు. అవును. గుండెలో రక్తప్రసరణ ఆగాక కత్తి దిగిందని ఆయన పరీక్షలో తేలింది. అది చెప్పాక ఎవరైనా శవం గుండెలో ఎందుకు కత్తి గుచ్చుతారని మేం చర్చించుకున్నాం. దాంతో మాకు అసలు రహస్యం తేలిగ్గా బోధపడింది. సహజమరణం కన్నా హింసాత్మక మరణం మంచిదని మీరా క్షణంలో నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. మిగిలిన సభ్యుల్లో ఒకరు హంతకులు అనే భయంతో మీ సంఘంలో అంతా పూర్వంలా ఉండరని, చాలామంది ప్రాణభయంతో వెళ్ళిపోతారని ఆలోచించకుండా మీరీ ఘాతుకం చేశారు.

డాక్టర్ రేమండ్ తల వంచుకున్నాడు.
అమాయకులని చేసి శాశ్వత జీవితం అనే ఆశ పెట్టడం మంచిది కాదు డాక్టర్. వాళ్ళకి మంచి చేస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో కానీ అది చెడు చేయడమే అవుతుంది. వారిలో ఇంకొకరు సహజంగా మరణించక మానరు. అప్పుడైనా మీరు మోసగాళ్ళని వారికి తెలుస్తుంది. మనిషికి శాశ్వత జీవితం ఉంటుందా? ఉండదా? అన్నది వేదాంతపరమైన ప్రశ్న. దాని జోలికి నేను వెళ్ళను. నేను పోలీస్ ఆఫీసర్ని మాత్రమే. రెండో వారు మరణిస్తే మీరేం చేయదలచుకున్నారు?
వాళ్ళు శాశ్వతంగా జీవిస్తారని నేను నమ్మాను. కాని ఆవిడ మరణించడం చూశాక నాకు పిచ్చెక్కినట్టయింది. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోకూడదన్న ఒక్కటే ఆలోచన ఆ క్షణంలో నాకు కలిగింది.
మీరు నా వెంట హెడ్ క్వార్టర్స్‌కి రావాలి డాక్టర్ రేమండ్. మీ మీద ఏం నేరం ఆపాదించాలి అన్నది నిర్ణయించడానికి నాకు కొంత సమయం పడుతుంది. మృత్యుంజయుల క్లబ్‌కి ఇక భవిష్యత్ లేదన్న నిజానికి మీరు రాజీ పడక తప్పదు. కెప్టెన్ లియోఫోల్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
(ఎడ్వర్డ్ డి హాక్ కథకి స్వేచ్ఛానువాదం)

మనిషికి శాశ్వత జీవితం ఉంటుందా? ఉండదా? అన్నది వేదాంతపరమైన ప్రశ్న. దాని జోలికి నేను వెళ్ళను. నేను పోలీస్ ఆఫీసర్ని మాత్రమే. రెండో వారు మరణిస్తే మీరేం చేయదలచుకున్నారు?
వాళ్ళు శాశ్వతంగా జీవిస్తారని నేను నమ్మాను.

422
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles