ముందుమాట ఇచ్చోటనే గదా!


Sun,July 31, 2016 01:19 AM

గత ఇరవై సంవత్సరాలుగా పెద్ది రామారావు సాంస్కక్షుతిక రంగంలో వివిధ స్థాయిల్లో కృషి చేస్తున్నాడు. దశాబ్ద కాలంలో వివిధ సందర్భాల్లో రాసిన 34 వ్యాసాలను ఆయన యవనిక పేరుతో సంపుటీకరించాడు. తెలుగు నాటక స్థితిగతులను అత్యంత విమర్శనాత్మకంగా వివరిస్తుందీ పుస్తకం.

imageమొత్తం తెలుగు నాటకాన్నే కొత్త బాణీలో ఆడించాలని రెండు దశాబ్దాలుగా రామారావు చేస్తున్న అల్లరికీ, ఆగానికీ సాక్షం ఈ ‘యవనిక’.
‘‘నేను డైలాగు మాత్ర విభవనైయున్నాను’’ అని దీనంగా దేబిరిస్తున్న తెలుగు నాటకాన్ని ‘‘నిజముగా నీవద్ద ఏమియును లేదా’’ అని గద్దించి నిలదీస్తుందీ పుస్తకం.
ఓ యాభై యేళ్ళ క్రితపు యువతరపు ఊపుని పడికట్టు ఫార్ములాలుగా మార్చి వాటి కాపీల కాపీల కాపీలుగా నడుస్తున్న నాటక ప్రయోగాల్ని నిర్మొహమాటంగా ఛీకొట్టి కొత్త ప్రయత్నాల్ని ఆహ్వానిస్తుందీ పుస్తకం.

ఆటనీ, పాటనీ, రంగుల రంగ విన్యాసాన్నీ ఈసడించుకుని, సమకాలికత పేరున తన ‘‘సందేశాలు’’, ‘‘వాక్శుద్ధీ’’ మాత్రమే నిత్యమని సంభావించి తన మోహంలో తాను పడిపోయిన మధ్య తరగతి సాంఘిక నాటకం అందులోంచి బైటికి రాలేదు. మారుతున్న తెలుగు సమాజం పెంచి పోషించిన సాహిత్యానికీ, సాంస్కక్షుతిక రూపాలకీ దూరంగా తను గీసుకున్న గిరిలో నిలబడిపోయింది ఎక్కువ శాతం తెలుగు నాటకం.

ఇట్లాంటి నాటక రంగంలో ఎందుకు తిప్పలు పడటం? హాయిగా కవిత్వమో, కథలో రాసుకుంటే సంతృప్తీ, కీర్తితో బాటు నీ బాధనీ, పెనుగులాటనీ అర్థం చేసుకునే, పంచుకునే పదిమంది సహృదయులు దొరకవచ్చు. సినిమాల్లోకో, టీవీలోకో పోతే పేరుతోబాటు డబ్బులు కూడా దక్కవచ్చు.
వాటన్నిటిలో అడుగుపెట్టి కూడా మళ్ళీ నాటకంలోకే వచ్చి కలబడడం రామారావు మొండితనానికి నిదర్శనం. అలా చేయడానికి సమాజపు భవిష్యత్తు మీద బోలెడంత ఆశావాదం, మనుషుల మీద చాలా నమ్మకం, నాటకం పట్ల వల్లమాలిన ప్రేమా ఉండాలి. ఇవన్నీ రామారావు దగ్గర వున్నాయని ఈ వ్యాసాలు చదివితే అర్థమవుతుంది.

అందుకే అతను విమర్శించేటప్పుడు, మెచ్చుకునేటప్పుడూ కూడా పెద్దా, చిన్నా చూడడు. అందులో వ్యక్తిగతమేమి వుండదు. ఆయన ఏ సంస్థ కోసం అరవ చాకిరీ చేశాడో దాన్ని నిర్మొహమాటంగా తిట్టినా, గరిమెళ్ళ రామ్మూర్తి నిస్వార్థ సేవ గురించి గద్గదంగా రాయడం ఒక ఉదాహరణ.

ఈ మధ్య కాలంలో రామారావు రాసిన పద్యనాటక మహానటుల జ్ఞాపకాలు చాలామందికి కన్నీళ్ళు తెప్పించాయి. విడిగా చదివితే అవి అందమైన జ్ఞాపకాల నోస్టాల్జియాలాగే అనిపించవచ్చు. ఈ సంకలనంలో వాటి అంతరార్థం బయటపడుతుంది. నాటకం అనేది ఎంత లోతైన, గాఢమైన అనుభూతిని ఇవ్వగలదో ఈ వ్యాసాలు గుర్తుచేస్తాయి. ఆ అనుభవపు దరిదాపులకైనా చేరడానికి మన నాటకాలు కనీస ప్రయత్నమైనా చేస్తున్నాయా అనే ప్రశ్నను లేవనెత్తుతాయి. బహశా ఇన్నేళ్ళ వ్యాసాలతో, ప్రయత్నాలతో పెద్ది రామారావు వెదుకుతున్నది నాటకానికి మాత్రమే వున్న ఈ అద్భుత శక్తిని ఉర్రూతలూగించే ఆ అనుభవాన్ని, కనిపిస్తున్న, వినిపిస్తున్న దానికి అతీతంగా మనకే తెలియని మనలోని ప్రపంచాలని వెలిగించే ఆ ఇంద్రజాలాన్ని.
‘‘ఇచ్చోటనే గదా...’’

యవనిక: డా.పెద్ది రామారావు నాటక వ్యాసాలు. ప్రచురణ ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ టెక్నాలజీ. వెల రూ. 200. ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.

- రాజీవ్ వెలిచేటి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.

772
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles