మా అరుణ స్టూడియో.. అందరికీ ఓ సెంటిమెంట్!


Sun,August 5, 2018 02:02 AM

srisailam
ఒక్క ఫొటో వేలమందిని కదిలిస్తుంది. వేలసార్లు గుర్తు చేసుకునేలా చేస్తుంది. మన కళ్లముందే ఉన్నట్లు కనిపిస్తుంది. అలాంటి ఫొటోలకు అడ్డా.. అరుణ స్టూడియో. ఈ స్టూడియో కెమెరా పడితే ముఖచిత్రాలు మారిపోతాయి. అక్కడ ఫొటోషూట్ చేయాలనే సెంటిమెంట్ ఏర్పడుతుంది. అలా ఎంతోమంది మనసులను గెలిచిందిఅరుణ స్టూడియో.దాని యజమానినిమ్మల సతీశ్. తొమ్మిదోతరగతిలోనే కెమెరా పట్టి..శాఖోపశాఖలుగా విస్తరించి అరుణ స్టూడియోస్ బ్రాండ్ ఏర్పరచుకున్న సతీశ్ నిమ్మల సక్సెస్ స్టోరీయే ఈవారం ప్రస్థానం.

దాయి శ్రీశైలం
సెల్: 8096677035

మాది మిర్యాలగూడ. మా నాన్నగారు నిమ్మల పాండురంగయ్య. అమ్మగారు అరుణ. మిర్యాలగూడలోనే ఇంటర్ ఫస్టియర్ వరకు చదువుకున్నాను. మేం నలుగురం అన్నదమ్ములం. మోహన్, శ్రీనివాస్, కల్యాణ్ మా సోదరులు. మా ఆవిడ పేరు మంజుల. మాకిద్దరు పిల్లలు. అబ్బాయి పేరు సన్నిహిత్. అమ్మాయి పేరు సంహిత.

చిన్నప్పట్నుంచే ఆసక్తి: నాకు చిన్నప్పట్నుంచే ఫొటోలంటే ఆసక్తి. ప్రతీ వస్తువును, మనిషినీ ఫొటో కోణంలో చూసేవాడిని. ఒక్కోసారి ఎవ్వరికీ చెప్పకుండా ఒక్కడినే పంట పొలాల్లోకి, ప్రకృతితో కూడిన పరిసరాల్లోకి వెళ్లి వాటిని ఫొటో యాంగిల్‌లో చూసేవాడిని. ఎన్నటికైనా మంచి ఫొటోగ్రాఫర్ కావాలి అనుకునేవాడిని.

అదే ఫస్ట్ ఔట్‌డోర్: ఒకసారి సమీప తండాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియగానే ఒక పోలీస్ కానిస్టేబుల్ స్టూడియోకు వచ్చాడు. అప్పుడు స్టూడియోలో నేనొక్కడినే ఉన్నాను. సతీష్ వెళ్తావా అన్నాడాయన. ఫొటోలు అంటే ఆసక్తే కానీ.. ఆత్మహత్య ఫొటో తీయాలా? అనిపించింది. కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుందనే ఆలోచనతో వెళ్తానని చెప్పాను. ఆ రైతు ఫొటోనే నా ఫస్ట్ ఔట్‌డోర్ వర్క్. అప్పటివరకు ప్రకృతిని పరిశీలించాను. దానిని ఆస్వాదించి నా మైండ్‌లో క్యాప్చర్ చేశాను. కానీ బయటకు వెళ్లి తీయలేదు.

భలే తీశావన్నారు: బెనర్జీగారు నా పని తీరును చూసి చాలా చక్కగా తీస్తున్నావే అని ప్రోత్సహించారు. చూస్తుండగానే తొమ్మిదో తరగతి అయిపోయింది. ఆ రోజుల్లో పదో తరగతి అంటే చాలా ప్రాధాన్యం ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనూ నేను నా చదువుకన్నా ఫొటోగ్రఫీనే ఎక్కువగా ప్రేమించాను. అయినా టెన్త్‌లో మంచి మార్కులే సాధించి అమ్మానాన్నల దృష్టిలో మల్టీ టాలెంటెడ్‌గా ముద్రపడిపోయాను. ఇంటర్‌లో జాయిన్ అయినా కూడా ఫొటోగ్రఫీని మాత్రం వదల్లేదు.

హైదరాబాద్ షిఫ్ట్: మేం మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. ఇంటర్ సెకండియర్ ఫలక్‌నుమా జూనియర్ కాలేజీలో చదివాను. అప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి రెడ్డి కాలేజీ హాస్టల్ దగ్గర రూమ్‌లో ఉండేవాడిని. ఫ్రీలాన్స్‌గా ఫొటో షూట్స్ చేస్తూ ఉండేవాడిని. అదే సమయంలో రిలయన్స్ స్టూడియో ఓనర్ జాన్ సురేశ్ గారితో పరిచయం ఏర్పడింది. అక్కడే పార్ట్‌టైమ్ ఫొటోగ్రాఫర్‌గా చేరాను. ఆ సమయంలో మణిరత్నం గీతాంజలి సినిమా హవా కొనసాగుతున్నది. పీసీ శ్రీరామ్‌గారి ఫొటోగ్రఫీ నాలోని మరో కోణాన్ని వెలికి తీసింది. ఒక రకంగా అదే నాకు ఇన్సిపిరేషన్ అనుకోవచ్చు. అందరూ సూర్యుడి ఎదురుగా నిలబడి ఫొటో తీస్తుంటారు. కానీ పీసీ శ్రీరామ్ ఇన్సిపిరేషన్ వల్ల నేను సూర్యుడి వెనకాల నిలబడి చాలా యాంగిల్స్‌లో ఫొటోలు తీశాను. అవి నచ్చడంతో రెడ్డి కాలేజీలో ఏ ప్రోగ్రామ్ జరిగినా నాకు అప్పగించేవారు. చాలామంది నాతో ఫొటో తీయించుకోవాలని నేరుగా రూమ్‌కు కూడా వచ్చేవాళ్లు.

అరుణ స్టూడియో స్థాపన: ఫొటోగ్రఫీలో కొత్త ధోరణులను ఫాలో అవుతూ యువతను ఆకట్టుకుంటున్న నాకు హైదరాబాద్‌లో మంచి పట్టు దొరికింది. ఈ క్రమంలో స్టూడియో ఏర్పాటు చేద్దామనే ఆలోచన వచ్చింది. సోదరులం డిస్కషన్ చేశాం. మాకు మొదట్నుంచి సెంటర్‌గా మారిన నారాయణగూడ సమీపంలోనే స్టూడియో స్థాపించాలనుకొని బర్కత్‌పురాలో ఒక ఫ్లాట్‌ను కిరాయికి తీసుకొని 1992 అగస్ట్‌లో అరుణ స్టూడియోను ప్రారంభించాం. మా అమ్మగారి పేరుమీద ఈ స్టూడియో పెట్టాం. అరుణ అంటే ఒక బ్రాండ్ ఏర్పరుచుకోగలిగాం.

ప్రచార చిత్రాల రూపకల్పన: ఒకసారి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిగారు స్టూడియోకు వచ్చి ఫొటోలు తీయమన్నారు. రెండ్రోజుల తర్వాత బ్యానర్స్.. పోస్టర్స్ డిజైన్ చేసి డెలివరీ చేశాం. పోస్టర్స్‌ను పంచిపెడితే.. వాటిని అందరూ ఇళ్లల్లో పెట్టుకున్నారట. ఇది స్వయంగా దామోదర్‌రెడ్డిగారే ఎన్నికల్లో గెలిచాక చెప్పారు. తమ్మీ.. నీ దగ్గర ఫొటో తీసుకుంటే ఎవరికైనా విజయం ఖాయం పో అన్నారు. అది ఆ నోటా.. ఈ నోటా అందరికీ తెలిసి నాయకులంతా అరుణ స్టూడియోను ఎంచుకోవడం ప్రారంభించారు.

ఉపాధి కేంద్రం: ఒక చిన్నగదిలో ప్రారంభమైన అరుణ స్టూడియో ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించింది. నా పరిధిలోనే తొమ్మిది బ్రాంచ్‌లు ఉన్నాయి. వంద మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ఫొటోగ్రఫీపై అభిరుచి ఉన్నవాళ్లందరికీ అరుణ శిక్షణకేంద్రం లాంటిది. వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. నా కోసం కాకుండా వాళ్లకోసమైనా పని చేయాల్సిన అవసరం ఏర్పడింది.
srisailam2
హరితహారంలో భాగం: ముఖ్యమంత్రిగారు చేపట్టిన హరితహారంలో భాగమయ్యాను. నా దగ్గరకు వచ్చే కస్టమర్లకు విధిగా పారిజాతం వృక్షాన్ని గిఫ్ట్‌గా ఇస్తూ మొక్కలు నాటండి అనే సందేశాన్నిస్తున్నాం. చిన్నారులు ఈవెంట్స్ చేసుకునే వేదికగా అరుణ స్టూడియో మారిపోయింది. ప్రతీ శ్రీకృష్ణాష్టమికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందర్నీ అందంగా ఫొటోలు తీస్తాం.

తెలంగాణ ఉద్యమంలో..

నా ఫొటోగ్రఫీ వృత్తిలో తెలంగాణ ఉద్యమకాలం చాలా ముఖ్యమైనది. మన ప్రాంత చిరకాల కోరికైన స్వరాష్ట్రం కోసం ఎవరికి తోచిన రీతిలో వారు నినదించారు. ఉద్యమ తీవ్రతను ప్రతిబింబించే అనేక ఫొటోలు తీశాను. నేను తీసిన సకలజనుల సమ్మె, నిజాంకాలేజీ బహిరంగ సభ ఫొటోలు ఉద్యమ ఆకాంక్షను తెలియజేశాయి. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌గారు నా పనితీరును పలు సందర్భాల్లో మెచ్చుకున్నారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిగారు, శ్రీనివాస్‌రెడ్డిగారు ఇలా అందరితో కలిసి ఉద్యమ ఫొటోలు తీసి నావంతుగా ఉద్యమంలో పనిచేశాను.

మొదటి అవకాశం..

అప్పుడు నేను తొమ్మిదో తరగతి. బెనర్జీ అని మా సోదరుడు నిమ్మల రాజు దోస్తు ఉండేవాడు. అతనిది మిర్యాలగూడలో నవీన్ స్టూడియో ఉండేది. అక్కడకు నేను రోజూ వెళ్తుండేవాడిని. ఊహల్లో ఫొటోలు మాత్రమే తీస్తున్న నాకు వాస్తవ దృశ్యాలను బంధించేందుకు ఒక వేదిక దొరికింది. అదే నవీన్ స్టూడియో. నేను రెగ్యులర్‌గా అక్కడకు వెళ్తుండేవాడిని. ఇంకా ఏవైనా సెలవులు దొరికాయా అంటే అదే నా ఠికానాగా మారిపోయేది. నవీన్ స్టూడియోకు వెళ్తూ నా అభిరుచికి తగిన ఆలోచనలు చేస్తూ స్టూడియోలో జరిగే ఫొటో షూట్స్ గురించి అవగాహన ఏర్పరచుకున్నాను. అక్కడే నాకు తొలిసారిగా ఫొటో తీసే అవకాశం లభించింది. బెనర్జీగారి సూచనల మేరకు ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాను.

సెంటిమెంట్ స్టూడియో: రాజకీయ నాయకుల ప్రచార చిత్రాలు ఫొటోషూట్‌కు అరుణ కేంద్రమైంది. మా పనితీరు నచ్చి పక్క రాష్ర్టాల నుంచి కూడా ఫొటో తీయించుకోవడానికి వచ్చేవాళ్లు. ఒక రకంగా ఇది సెంటిమెంట్ స్టూడియోగా మారిపోయింది. ఇక్కడ ఫొటో తీసుకుంటే పెళ్లిళ్లు అవుతాయనే అభిప్రాయానికొచ్చారు కస్టమర్లు. దీంతో ఎప్పుడు చూసినా మా స్టూడియో పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు.. అబ్బాయిలతో నిండి ఉండేది. కస్టమర్ల గురించి మేం అంత కేర్ తీసుకునేవాళ్లం. వాళ్లను అందంగా కెమెరాల్లో బంధించి వారికే ఆశ్చర్యాన్ని కలిగించేవాళ్లం.
srisailam3

మరిచిపోలేని ప్రశంస..

నేను ఇన్ని రకాల ఫొటోలు తీయడం ఒకెత్తు.. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి ఫొటోలు తీయడం ఒకెత్తు. కేసీఆర్‌గారి బంధువు చందుగారు మాకు పరిచయం. ఆయన ద్వారా కేసీఆర్‌గారిని కలిశాను. వాళ్ల కుటుంబం ఫొటోలు ఉద్యమకాలం నుంచి నేనే తీస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకు ఉన్న కేసీఆర్‌గారి ప్రతీ ముఖచిత్రం నా కెమెరాలో బంధించిందే. నా ఫొటోలు నచ్చి ముఖ్యమంత్రిగారు సతీష్ తీసిన ఫొటోలు తెప్పించండి అంటారట. అది విన్నప్పుడల్లా నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే నేను సంపాదించడం కోసం ఈ వృత్తిలోకి రాలేదు. ప్రేమతో వచ్చాను. ప్రశంసలే అవార్డులుగా భావిస్తాను. నేను తీసిన ఫొటోను, రూపొందించిన క్యాలెండర్‌ను ముఖ్యమంత్రిగారికి ఇస్తే బాగా తీస్తావ్ సతీశ్ అన్నారు. ఐటీ మినిస్టర్ కేటీఆర్‌గారు, కవితగారు నా పనిని మెచ్చు కున్నారు. ఇలాంటివి వింటుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది.

723
Tags

More News

VIRAL NEWS