మాలిక్ మక్బూల్ ఎవరంటే?


Sun,December 3, 2017 02:02 AM

ఓరుగల్లులో అతడొక మంత్రి. అటు తర్వాత ఢిల్లీ దర్బారులో ప్రధానమంత్రి. కాకతీయుల వద్ద నేర్చిన పరిపాలనా పాఠాలను సుల్తానుల దగ్గర ప్రదర్శించి ప్రశంసలు పొందినవాడు. కాకతీయుల్లా వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందడమే కాదు, ఆర్థికంగా పురోగతీ సాధించవచ్చునన్న విశ్వాసంతో అలాంటి పనులు ఎప్పుడూ చేయని సుల్తానులతో వాటిని చేయించినవాడు. అతడే ఖాన్ ఎ జహాన్ తిలంగాణీ.. అలియాస్ మాలిక్ మక్బూల్ తెలంగాణీ ఉరఫ్ నాగయ గన్నయ.ప్రముఖ తెలుగు కవి మారన తన మార్కాండేయ పురాణంలో ప్రతాపరుద్రుడికి సేవలందించిన కొందరు అధికారుల గురించి పేర్కొన్నాడు. వారిలో నాగయ గన్నయ ఒక ముఖ్యాధికారి. గొప్ప కవి, పండిత పోషకుడు అయిన గన్నయకే మారన తన పురాణ గ్రంథాన్ని అంకితమిచ్చాడననది చరిత్ర. దాది నాగయ గన్నయకే గన్నయ నాయుడు అనే పేరుతో పాటు యుగంధరుడు అనే బిరుదు కూడా ఉంది. కాకతీయ సామ్రాజ్యపు చివరి రాజు ప్రతాపరుద్రుడి వద్ద ఇతడు దుర్గపాలకుడిగా, కోశాధికారిగా, సర్వసైన్యాధ్యక్షుడిగా, మహామంత్రిగా పనిచేశాడు. కాకతీయ సామ్రాజ్యంపై జరిగిన ముస్లింల దండయాత్రల్ని తన వీరోచిత పోరాట పటిమతో తిప్పికొట్టిన ధీశాలి గన్నమ నాయుడు. ఓటమి సమయంలో తురుష్కులతో సంధి కోసం ప్రతాపరుద్రుని తరపున మాట ముచ్చటకు పోయింది ఇతడే. నాగయ గన్నయ ఒక మహావీరుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు. ఇతడు గణపతి దేవుని దగ్గర, ఆ తర్వాత రాణీ రుద్రమదేవి వద్ద సేనాధిపతిగా పనిచేశాడు. వీరిది దుర్జయ వంశం. ఈ ఇంటి పేరుగల సేనానులు కాకతీయ చక్రవర్తుల వద్ద ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. క్రీ.శ. 1323లో ఓటమి తర్వాత కాకతీయ మహా చక్రవర్తి ప్రతాపరుద్రుడు, అతని కటకపాలుడు గన్నమ నాయుడు సహా పలువురు సేనాధిపతులు తుగ్లక్‌కి బందీలయ్యారు. వీరిని ఓరుగల్లులోనే ఉంచితే ప్రమాదమని భావించిన తుగ్లక్.. తన విశ్వాసపాత్రులైన ఖాదిర్ ఖాన్, ఖ్వాజా హాజీల నేతృత్వంలో వారిని ఢిల్లీకి తరలించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఆ ఆదేశాల మేరకు వారిని ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ప్రతాపరుద్రుడు ఆత్మబలిదానం చేసుకున్నాడు. గన్నయ నాయకుడు, మరికొందరు సేనానులు మాత్రమే ఢిల్లీకి బందీలుగా వెళ్లారు.
MalikMaqbool-tomb

ఢిల్లీకి చేరిన తర్వాత గన్నయ నాయునికి మరణమో.. మతమార్పిడినో.. ఈ రెండింట్లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చింది. ఆ కాలంలో మరణం అంటే బతికి ఉండగానే చర్మం ఒలిచి, తలను నరికి కోట గుమ్మానికి వేలాడదీసేవారు. ఇది ఢిల్లీ సుల్తానుల రివాజు. ఆ రెంటిలో గన్నయ నాయుడు మాతమార్పిడినే ఎంచుకున్నాడు. ఫలితంగానే తన పేరును మాలిక్ మక్బూల్‌గా మార్చుకున్నాడు. నాగయ ఎంచుకున్న మార్గాన్ని ప్రశంసిస్తూ ఢిల్లీ సుల్తాను ఉలుఘ్ ఖాన్ అలియాస్ మహమ్మద్ బీన్ తుగ్లక్ మాలిక్ మక్బూల్‌గా నాగయను పంజాబ్ పాలకునిగా పంపాడు.ప్రతాపరుద్రుని మరణానంతరం మహమ్మద్ బీన్ తుగ్లక్ ఓరుగల్లును మాలిక్ బుర్హానుద్దీన్ ఆధీనంలో ఉంచాడు. ఇతడు అప్పటికే దౌలతాబాద్ అధిపతిగా ఉన్నాడు. ఇక్కడ తెలంగాణ గడ్డపై కాకతీయుల అనంతరం ఓరుగల్లు విముక్తి పోరాటం మొదలైంది. దీనికి ముసునూరి నాయకులు నాయకత్వం వహించారు. ఇది సహించని తుగ్లక్ పెద్ద సైన్యంతో ఓరుగల్లు పైకి వచ్చాడు. అతనితో పాటు మాలిక్ మక్బూల్‌ను కూడా తోడ్కొని వచ్చాడు. ఓరుగల్లుకు చేరుకోగానే సుల్తానుకు అంటువ్యాధి సోకింది. దీంతో అతడు భయపడిపోయాడు. తూర్పు తెలంగాణకు మక్బూల్‌ను అధిపతిని చేసి తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయాడు. ముసునూరి నాయకుల్లో ప్రోలయ నాయకుని తర్వాత కాపయ నాయకుడు పోరాటాన్ని ఉధృతం చేశాడు. క్రీ.శ. 1336లో కాపయ నాయకుడు మక్బూల్‌ను ఓరుగల్లు నుంచి తరిమివేసి కోటను జయించాడు. తాను నడిచిన నేలే.. తాను చూసిన మనుషులే! కానీ ఇప్పుడతడు నాగయ కాదు.. మాలిక్ మక్బూల్. తానున్నది ఓరుగల్లులోనే కానీ.. అతడు ఓరుగల్లు వైపు కాదు.. ఢిల్లీ దర్బారు వైపు! ఓటమి అంగీకరించి మాలిక్ మక్బూల్ తిరిగి ఢిల్లీ దర్బారులో చేరాడు. సుల్తానుకు నమ్మిన బంటుగా ఉంటూ, పలు విజయాలు సాధించి పెట్టాడు. గుజరాత్, సింధు ప్రాంతాల్లో జరిగిన యుద్ధ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అంతులేని సంపదను తీసుకొచ్చి సుల్తానుకు అప్పగించాడు. అలా సుల్తాను మెప్పు పొందాడు మక్బూల్.
(మిగిలిన భాగం వచ్చేవారం)
MalikMaqbool-tomb1

1124
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles