మార్జాలానికి మహాభోగం!


Sat,March 23, 2019 09:59 PM

లక్షాధికారి కావాలంటే సంవత్సరాల తరబడి శ్రమించాల్సిన రోజులువి. డబ్బు సంపాందించేందుకు కొందరు నిజాయితీగా కష్టపడుతుంటే.. మరికొంతమంది అడ్డదారులు తొక్కుతుంటారు. అలాంటిది ఓ పిల్లి.. రాత్రికి రాత్రే వేల కోట్లకు యజమాని అయింది. అంతేకాదు. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతమైన జంతువుగా రికార్డు కూడా సాధించింది. వెండి పాత్రల్లోనే తిని, తాగి.. పట్టు పరుపులపై శయనిస్తున్న ఆ మార్జాల మహా వైభోగం మీ కోసం..!

ఫ్యాషన్ ప్రపంచానికి ఐకాన్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ డిజైనర్ కార్ల్ లాగర్ ఫెల్డ్ (85) మీకు తెలుసా? ఆయన ఇటీవలే అనారోగ్యంతో చనిపోయారు కూడా. అయితే ఆయన మరణం.. ఓ పిల్లికి వరంగా మారింది. ఆయన మరణానికి.. పిల్లి వరానికి సంబంధం ఏంటని ఆశ్చర్యపోకండి. ఆయన ప్రేమతో పెంచుకున్న పిల్లి.. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనికురాలిగా మారింది. కారణం.. ఆ పిల్లికి ఆయన సగం ఆస్తిని రాసివ్వడమే. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. జర్మనీకి చెందిన ఐకానిక్ ష్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ ఫెల్డ్ బర్మన్ జాతికి చెందిన ఓ పిల్లిని ఇష్టంగా పెంచుకున్నాడు. దానికి చౌపెట్టీ అని పేరు పెట్టాడు. 2001లో ఫ్రెంచ్ మోడల్ బాప్ టిస్టి గియాబికొని దగ్గర్నుంచి ఈ పిల్లిని ఆయన ఇష్టపడి తెచ్చుకున్నాడు. దీనికి ప్రత్యేకంగా ఒక బాడీగార్డును, కొంతమంది పనివాళ్లను కూడా నియమించాడు. కార్ల్ లాగర్ వద్ద ఈ పిల్లికి రాజభోగాలు అందాయి. ఎనిమిదేళ్ల వయసున్న ఈ పిల్లి వెండి పల్లెంలోనే ఆహారం తీసుకుంటుంది. వెండి గిన్నెల్లోనే తాగుతుంది. అంతేకాదండోయ్.. ప్రపంచంలోనే బాగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్ వస్తువులనే దీనికి వాడతారు. ఈ పిల్లి ధరించే దుస్తుల ధర కూడా భారీగా ఉంటుంది. మరి అంతటి వైభవం అనుభవించింది ఈ పిల్లి.
Carle-lagerfeld

పిల్లికి సగం ఆస్తి!


కార్ల్‌కు చౌపెట్టీ అంటే చచ్చేంత ప్రేమ. ఎప్పుడూ ఈ పిల్లితోనే తిరిగేవాడు. చట్టం అనుమతిస్తే తన పెంపుడు పిల్లిని పెండ్లి కూడా చేసుకుంటానని పలుసార్లు మీడియాకు చెప్పాడు కూడా. చౌపెట్టీ ధనవంతురాలు అంటూ కార్ల్ తరుచూ చెప్తుండేవాడు. ఎందుకో అప్పుడు ఫ్యాషన్ ప్రపంచానికి అర్థం కాలేదు. తాను చనిపోయిన తర్వాత చౌపెట్టీ ఏకాకి కాకూడని, కేవలం దాని బాగోగుల కోసం తన మొత్తం ఆస్తి 28 వేల కోట్లలో సగభాగం చౌపెట్టీకి అందిస్తానని గతంలో కార్ల్ ప్రకటించాడు. ఆ విషయాన్ని అప్పుడంతా పెద్దగా పట్టించుకోలేదు. అది నిజమే.. కార్ల్ అందుకు సంబంధించిన దస్తావేజులు అన్నీ ఎప్పుడో పూర్తి చేశాడు. అయితే.. ఇటీవల అనారోగ్యంతో కార్ల్ చనిపోవడంతో ఆయన ఆస్తిలో సగభాగం అంటే.. 14 వేల కోట్ల రూపాయలు పిల్లికి చెందాయి. దీంతో ప్రపంచంలోనే అంత్యంత ధనికురాలైన పిల్లిగా చౌపెట్టీ నిలిచింది. ఈ ధనవంతురాలైన పిల్లి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. పిల్లినైనా కాకపోతిని అంటూ కొందరు సరదాగా సెటైర్లు వేస్తున్నారు.

ప్రకటనల్లో అలరించిన చౌపెట్టీ


ఎప్పుడూ నల్ల రంగు దుస్తుల్లో, నల్ల కళ్లద్దాలు పెట్టుకొని, పోనీటెయిల్‌తో కన్పించే కార్ల్.. 1980లో పూర్తి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు. ఆయనకు ఫ్యాషన్ రంగమంటే ప్రాణం. నిత్యం వినూత్నతనే కోరుకుంటాడు కార్ల్. అలాంటి వ్యక్తి దగ్గర పెరిగిన చౌపెట్టీ కూడా తక్కువేం కాదు. కార్ల్‌కు సంబంధించిన ప్రకటనలు, పలు కాస్మోటిక్ బ్రాండ్స్ ప్రకటనల్లో ఈ పిల్లి కనిపించింది. అందమైన మోడళ్లు ఫొటోలకు ఫోజులిచ్చేందుకు చౌపెట్టీని వాడేవారు. అలా ఆ పిల్లికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. చౌపెట్టీకి ఇన్ స్టాగ్రామ్‌లో ఖాతా కూడా ఉంది. దీనికి 3 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. చౌపెట్టీకి సంబంధించిన అన్ని విషయాలను కార్ల్ తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేవాడు. దీంతో సోషల్ మీడియాలో చౌపెట్టీకి తెగ క్రేజ్ వచ్చేసింది.

చౌపెట్టీ గురించి పుస్తకం


చౌపెట్టీపై కార్ల్ లాగర్‌ఫెల్డ్‌కు ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పలేనిది. చౌపెట్టీపై ది ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఎ హై ైఫ్లెయింగ్ ఫ్యాషన్ క్యాట్ అనే పుస్తకాన్ని కార్ల్ రాశాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు దానిపై ఆయనకు ఎంతో ప్రేమ ఉందని. ఈ పిల్లి రాయల్ లైఫ్ చూసిన వారంతా ఈర్ష్యపడేవారు. అలాంటి లైఫ్‌ైస్టెల్ చౌపెట్టీది. కార్ల్ మృతి ఆయన కుమార్తెకు, చౌపెట్టీకి తీరని లోటును మిగిల్చింది. తన మరణాంతరం పిల్లి బాగోగుల గురించి ఆలోచించిన కార్ల్ సున్నిత మనసు తెలిసి చాలామంది హ్యాట్సాఫ్ చెబుతున్నారిప్పుడు. ఆ పిల్లి గార్డియన్ల దగ్గర భద్రంగా ఉందిప్పుడు. మరి ఆ పిల్లి తదనాంతరం ఈ ఆస్తి ఎవరికి చెందుతుందో వేచి చూడాలి. ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది అనే సామెతను ఈ పిల్లి మార్చేసినట్టే ఉంది కదా!

384
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles